Israel
-
గాజా.. చెదిరిన స్వప్నం!
పదిహేను నెలల భీకర యుద్ధం ధాటికి అంధకారమయమైన గాజా స్ట్రిప్ వీధుల్లో ఎట్టకేలకు శాంతిరేఖలు ప్రసరించినా యుద్ధంలో జరిగిన విధ్వంసఛాయలు తొలగిపోలేదు. హమాస్, ఇజ్రాయెల్ మధ్య కుదిరిన తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందంతో ఎట్టకేలకు తుపాకుల మోత, క్షిపణుల దాడులు ఆగిపోయాయి. అయినాసరే అశాంతి నిశ్శబ్దం రాజ్యమేలుతూనే ఉంది. మిస్సైల్స్ దాడుల్లో ధ్వంసమైన తమ ఇళ్లను వెతుక్కుంటూ వస్తున్న పాలస్తీనియన్లకు ఏ వీధిలో చూసినా మృతదేహాలే స్వాగతం పలుకుతూ నాటి మారణహోమాన్ని గుర్తుకు తెస్తున్నాయి. గాజా స్ట్రిప్‌పై వేల టన్నుల పేలుడుపదార్ధాలను కుమ్మరించిన ఇజ్రాయెల్ పాలస్తీనియన్ల జనవాసాలను దాదాపు శ్మశానాలుగా మార్చేసింది. స్వస్థలాలకు కాలినడకన, గుర్రపు బళ్లలో చేరుకుంటున్న స్థానికులకు ఎటుచూసినా వర్ణణాతీత వేదనా దృశ్యాలే కనిపిస్తున్నాయి. లక్షలాది మంది ప్రజల ఇళ్లు ధ్వంసమయ్యాయి. వాటికింద స్థానికుల జ్ఞాపకాలతో పాటు కలలు కూలిపోయాయి. కొందరు ఆత్మియులను పోగొట్టుకుంటే.. మరికొందరు సర్వస్వాన్ని కోల్పోయారు. ప్రతి ముఖం మీదా విషాద చారికలే. కుప్పకూలిన వ్యవస్థలు గాజా స్ట్రిప్ అంతటా ప్రజారోగ్య వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయింది. ఇజ్రాయెల్ జరిపిన వైమానిక దాడుల్లో సగం ఆస్పత్రులు ధ్వంసమయ్యాయి. మిగిలినవి సైతం పాక్షింకంగానే పని చేస్తున్నాయి. వాటిల్లోనూ సాధారణ సూదిమందు, బ్యాండేజీ, కాటన్ వంటి వాటినీ అత్యంత జాగ్రత్తగా, పొదుపుగా వాడుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. వైద్యారోగ్య సంస్థలను మళ్లీ పునర్నిర్మించాల్సి ఉంది. రోడ్లు, మౌలిక సదుపాయాల పరిస్థితి మరీ అధ్వాన్నం. శిథిలాల తొలగించాక ఏర్పడిన కాలిబాటే ఇప్పడు అక్కడ రోడ్డుగా ఉపయోగపడుతోంది. సొంతిళ్లు బాంబుదాడిలో ధ్వంసమయ్యాక శరణార్థి శిబిరాల్లో తలదాచుకున్నాసరే పాలస్తీనియన్లను ఇజ్రాయెల్ వైమానిక బలగాలు వదిలేయలేదు. క్యాంప్‌లపై బాంబుల వర్షం కురిపించడంతో కళ్లముందే కుటుంబసభ్యులను కోల్పోయిన వారు ఇప్పుడు ఎంతో మానసిక వేదనను అనుభవిస్తున్నారు.యుద్ధభయం వారిని ఇంకా వెన్నాడుతోంది. మానసిక సమస్యలతో సతమతమవుతున్న వారిని పట్టించుకున్న నాథుడే లేడు. యుద్ధం ఆగాక సహాయక, అన్వేషణా బృందాలు అవిశ్రాంతంగా కష్టపడుతూ మరో శ్రామికయుద్ధం చేస్తున్నాయి. శిథిలాల కింద మృతదేహాల నుంచి వెలువడుతున్న దుర్వాసన మధ్యే వాళ్లు శిథిలా తొలగింపు పనులు చేస్తున్నారు. ‘‘వీధిని చక్కదిద్దేందుకు ఏ వీధిలోకి వెళ్లినా మృతదేహాలే కనిపిస్తున్నాయి. కూలిపోయిన భవనాల కింద చాలా మంది చిక్కుకుని ఉండొచ్చు’’అని గాజా సిటీలోని 24 ఏళ్ల సివిల్ డిఫెన్స్ కార్మికుడు అబ్దుల్లా అల్ మజ్దలావి చెప్పారు. ‘నా కుటుంబం శిథిలాల కింద కూరుకుపోయింది, దయచేసి త్వరగా రండి’’అంటూ కాల్పుల విరమణ తర్వాత కూడా స్థానికుల నుంచి తమకు నిరంతరాయంగా ఫోన్‌కాల్స్ వస్తున్నాయ ని సహాయక ఏజెన్సీ తెలిపింది. పునర్నిర్మాణానికి చాలా సమయం ధ్వంసమైన పాలస్తీనా భూభాగంలో పునర్నిర్మాణ ప్రక్రియకు చాలా సమయం పడుతుందని గాజాలోని ఐక్యరాజ్యసమితి పాలస్తీనా శరణార్థి సంస్థ ఉన్వ్రా తాత్కాలిక డైరెక్టర్ సామ్ రోజ్ తెలిపారు. ‘‘గాజాలో ఆవాస వ్యవస్థ దాదాపు తుడిచిపెట్టుకుపోయింది. మళ్లీ కుటుంబాలు, కమ్యూనిటీలను పునర్నిర్మించాల్సిన అవసరం ఉంది. సహాయక చర్యలు మరింత పెరుగుతాయని ఆశిస్తున్నాం’’అని ఆయన పేర్కొన్నారు.ప్రజల అత్యవసర అవసరాలను తీర్చడానికి, గాజా ప్రజారోగ్య వ్యవస్థను మళ్లీ గాడిన పెట్టేందుకు తొలి 60 రోజుల ప్రణాళిక ఉందని, వేలాది మంది జీవితాన్ని మార్చేసిన గాయాలను మాన్పేందుకు సిద్ధమవుతున్నామని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రాంతీయ డైరెక్టర్ హనన్ బాల్కీ ప్రకటించారు. ఈ ప్రణాళికలో భాగంగా గాజా స్ప్రిప్లో ఆస్పత్రులకు మరమ్మత్తు చేయడం, దాడుల్లో తీవ్రంగా ప్రభావితమైన ప్రాంతాల్లో తాత్కాలిక క్లినిక్‌లను ఏర్పాటు చేయడం, ప్రజల్లో పోషకాహార లోపాన్ని పరిష్కరించడం, అంటువ్యాధులు ప్రబలకుండా చూడటం వంటి వాటిపై ప్రధానంగా దృష్టిసారిస్తున్నామని బాల్కీ వెల్లడించారు. – సాక్షి, నేషనల్ డెస్క్అణువణువునా విధ్వంసంయుద్ధం దాదాపు 20 లక్షల మంది పాలస్తీనియన్లను నిరాశ్రయులను చేసింది. ఇజ్రాయెల్ దాడుల్లో దాదాపు 46,900 మంది ప్రాణాలు కోల్పోయారు. 1,10,700 మంది గాయపడ్డారు. మృతుల్లో ఎక్కువ మంది మహిళలు, పిల్లలు ఉన్నారు. తమ సిబ్బందిలో 48 శాతం మంది ఇక ఈ ఘర్షణల బాధితులున్నారని, కొందరు మరణించగా, మరికొందరు గాయపడ్డారని, ఇంకొందరు నిర్బంధంలో ఉన్నారని గాజా సివిల్ డిఫెన్స్ ఏజెన్సీ తెలిపింది. గాజాలోని 85 శాతం వాహనాలు ధ్వంసమయ్యాయి. తమ 17 కార్యాలయాలు దెబ్బతిన్నాయని గాజా సివిల్ డిఫెన్స్ తెలిపింది.ఆదివారం కాల్పుల విరమణ ప్రారంభం కావడంతో స్థానికుల ముఖాల్లో ఆనందం వచ్చిచేరినా క్షేత్రస్థాయిలో పరిస్థితులను చూస్తే ఉన్న ఆ కాస్త ఆనందం కూరా ఆవిరయ్యే దుస్థితి దాపురించింది. గాజా అంతటా 60శాతం నిర్మాణాలు పూర్తిగా నేలమట్టమయ్యాయని ఐక్యరాజ్యసమితి గతంలో అంచనా వేసింది. చాలా ఆలస్యంగా కుదిరిన శాంతి ఒప్పందం అమలయ్యే నాటికి మరింతగా దాడులు జరగడంతో నేలమట్టమైన నిర్మాణాల సంఖ్య మరింత పెరిగింది. కూలిన ఇళ్ల కింద 10,000కు పైగా మృతదేహాలు ఉండొచ్చని ఏజెన్సీ అంచనావేస్తోంది.నెమ్మదిగా మొదలైన సాయం కాల్పులు ఇరువైపులా ఆగిపోవడంతో సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. ఇజ్రాయెల్ దాడుల నుంచి ఎలాగోలా తప్పించుకుని, గాయాలపాలుకాని స్థానికులు సైతం సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. శిథిలాల కింద మృతులను అన్నింటినీ తొలగించడానికి కనీసం వంద రోజులు సమయం పడుతుందని అన్వేషణా బృందాలు అంచనావేస్తున్నాయి. శిథిలాల తొలగింపునకు అవసరమైన బుల్డోజర్లు ఇతర పరికరాల కొరత తీవ్రంగా ఉంది. దీంతో వెలికితీత మరింత ఆలస్యమయ్యే అవకాశముంది. దాడుల ధాటికి అన్ని వాణిజ్య సముదాయాలు మూతపడటంతో పని దొరకడం కూడా కష్టంగా ఉంది.స్థానికులకు ఆదాయం కాదు కదా ఆశ్రయం కూడా లేకపోవడంతో గాజాలో బతకడం కూడా పెద్ద అస్తిత్వ పోరాటంగా తయారైంది. కాల్పుల విరమణ జరిగిన వెంటనే ఆహారం, నిత్యావసర వస్తువులు, ఔషధాలను మానవతా సంఘాలు అందించడం మొదలెట్టాయి. ఒక్క ఆదివారం రోజే 630 లారీల నిండా సరకులు గాజాలోకి ప్రవేశించాయి. సోమవారం మరో 915 లారీలు గాజాలోకి వెళ్లాయని ఐక్యరాజ్యసమితి తెలిపింది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి చూస్తే ఇంతటి భారీ స్థాయిలో మానవతా సాయం అందడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. -
ఇజ్రాయెల్ చెర నుంచి 90 మంది విడుదల
రమల్లా(వెస్ట్ బ్యాంక్): ఇజ్రాయెల్– హమాస్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం అమలవుతోంది. హమాస్ ముందుగా ముగ్గురు ఇజ్రాయెల్ బందీలను విడుదల చేయడం తెలిసిందే. దీంతో తమ జైళ్లలోని వెస్ట్ బ్యాంక్‌కు చెందిన 90 మంది మహిళలు, చిన్నారులకు సోమవారం ఇజ్రాయెల్ స్వేచ్ఛనిచ్చింది. రెడ్ క్రాస్‌కు చెందిన బస్సుల్లో వచ్చిన వీరికి వెస్ట్ బ్యాంక్‌లోని రమల్లాలో కుటుంబసభ్యులు, బంధువులు, ఆత్మియులు ఘనంగా స్వాగతం పలికారు. ఒక్కసారిగా అందరిలోనూ ఆనందం వెల్లివిరిసింది. వారిని కొందరు భుజాలపైకి ఎత్తుకోగా మరికొందరు నినాదాలు, ఈలలతో సంతోషం వ్యక్తం చేశారు. ఇంకొందరు ఫతా, హమాస్, పాలస్తీనా ఇస్లామిక్ జిహాద్, ఇతర సాయుధ గ్రూపుల జెండాలు పట్టుకుని గుమికూడారు. వేడుకలు చేసుకోవద్దంటూ ఇజ్రాయెల్ బలగాలు చేసిన హెచ్చరికలను వారెవరూ పట్టించుకోలేదు. సోమవారం రమల్లాకు చేరుకున్న వారిలో 69 మంది మహిళలు, 21 మంది టీనేజీ బాలురు ఉన్నారు. వీరిలో 12 ఏళ్ల బాలుడు సైతం ఉన్నాడు. ఒప్పందం మొదటి విడతలో హమాస్ 33 మంది బందీలను 42 రోజుల్లో విడుదల చేయాల్సి ఉంది. అదే సమయంలో, ఇజ్రాయెల్ వెయ్యి నుంచి రెండు వేల మంది ఖైదీలను విడిచి పెట్టాల్సి ఉంటుంది. -
పాలస్తీనా ఖైదీలను విడిచిపెట్టిన ఇజ్రాయెల్
టెల్అవీవ్:కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిన తర్వాత ఇటు ఇజ్రాయెల్ , అటు హమాస్ ఒప్పందం అమలు దిశగా వేగంగా చర్యలు తీసుకుంటున్నాయి. ఒప్పదంలో భాగంగా ఇజ్రాయెల్ తాజాగా 90 మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేసింది. ఇప్పటికే హమాస్ తన వద్ద బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ పౌరుల్లో నుంచి ముగ్గురిని విడుదల చేసింది.అనంతరం ఇజ్రాయెల్ 90 మంది పాలస్తీనా ఖైదీలను విడిచిపెట్టింది. ఇజ్రాయెల్,హమాస్ మధ్య తాజాగా కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందంతో పదిహేను నెలల భీకర యుద్ధానికి తాత్కాలికంగా తెర పడింది. ఇజ్రాయెల్,హమాస్ మధ్య విరమణ ఒప్పందం ఆదివారం ఉదయం అమల్లోకి వచ్చింది.ఆరు వారాల్లో హమాస్ 33 మంది బందీలను, ఇజ్రాయెల్ దాదాపు 2వేల మంది పాలస్తీనా ఖైదీలను విడుదల చేయనున్నాయి. మరోవైపు కాల్పుల విరమణ ఒప్పందాన్ని నెతన్యాహూ ప్రభుత్వంలో భాగస్వామి ఓజ్మా యేహూదిత్ పార్టీ తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రభుత్వం నుంచి ఆ పార్టీ వైదొలగింది. పార్టీకి చెందిన ముగ్గురు నేతలు ఇప్పటికే తమ మంత్రి పదవులకు రాజీనామా చేశారు.2023 అక్టోబర్ 7న పాలస్తీనాకు చెందిన హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌లోకి చొరబడి 1200 మందిని చంపారు.కొంత మందిని తమ వెంట బందీలుగా తీసుకెళ్లారు.దీనికి ప్రతిగా ఇజ్రాయెల్ గాజాపై భీకర దాడులకు దిగింది. ఈ దాడుల్లో ఇప్పటివరకు 47 వేల మంది దాకా మరణించినట్లు సమాచారం. తాజా కాల్పుల విరమణతో గాజాలో శాంతి నెలకొనే అవకాశాలున్నాయి. -
గాజా ఒప్పందం ఆలస్యం!.. హమాస్‌కు ఇజ్రాయెల్ వార్నింగ్!
జెరుసలేం : గాజాలో శాంతి ఒప్పందం వేళ ఇజ్రాయెల్ సైన్యం హమాస్‌కు హెచ్చరికలు జారీ చేసింది. ఇచ్చిన మాటకు కట్టుబడడం లేదని, అందుకే తాము గాజాపై దాడుల్ని కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేసింది. ఈ సందర్భంగా ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి, రియర్ అడ్మిరల్ డేనియల్ హగారి మాట్లాడుతూ..హమాస్ చెరలో బంధీలుగా ఉన్న 33 మంది బంధీల జాబితా విడుదల కాలేదు. బంధీల జాబితా మాకు చేరే వరకు కాల్పులు కొనసాగుతాయని చెప్పారు.ఆదివారం ఉదయం నాటికి కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా తన వద్ద ఉన్న బంధీల జాబితాను విడుదల చేయాలి. కానీ అలా చేయలేదు. ఒప్పందానికి విరుద్ధంగా వ్యవహరిస్తోంది. హమాస్ ఇచ్చిన మాటకు కట్టుబడే వరకు కాల్పుల విరమణ అమలులోకి రాదు అని’ హగరీ చెప్పారంటూ ఓ ఇజ్రాయెల్ సైన్య అధికారి వెల్లడించినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలుగులోకి వచ్చాయి. అంతకు ముందు, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సైతం కాల్పుల విరమణపై కీలక వ్యాఖ్యలు చేశారు. బంధీల జాబితా విడుదల చేయనంత వరకు సైనిక దాడులు కొనసాగుతాయని, ఆ తర్వాత జరిగే పరిణామాలకు తాము బాధ్యులం కాదని సూచించారు. గాజాలో శాంతిపదిహేను నెలలుగా రక్తమోడుతున్న గాజాలో శాంతి నెలకొంది. గత బుధవారం అమెరికా, ఈజిప్టు, ఖతార్ మధ్య వర్తిత్వంతో ఇజ్రాయెల్ హమాస్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదరింది. ఒప్పందంలో భాగంగా.. స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం 8.30 గంటలకు కాల్పుల విమరణ ఒప్పందం అమల్లోకి వచ్చింది. కానీ సాంకేతిక అంశాల్ని కారణంగా చూపిస్తూ బంధీల జాబితాను విడుదల చేయడంలో జాప్యం చేసింది. కాగా, కాల్పుల విరమణ ఒప్పందంలో భాగంగా హమాస్ చెరలో ఉన్న 33 మంది బంధీలను విడుదల చేయాలి. ప్రతిఫలంగా ప్రస్తుతం జైళ్లలో మగ్గుతున్న దాదాపు 2,000 మంది పాలస్తీనియన్లను కూడా ఇజ్రాయెల్ విడుదల చేయనుంది. -
ఇవాల్టి నుంచి కాల్పుల మిరమణ ఒప్పందం అమలు
-
గాజా ఒప్పందం వేళ ట్విస్ట్!.. నెతన్యాహూ కీలక వ్యాఖ్యలు
గాజా శాంతి ఒప్పందం వేళ.. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ కీలక వ్యాఖ్యలు చేశారు. సరైన ఫ్రేమ్‌వర్క్ లేకుండా ఒప్పందం ముందుకు సాగదని.. అవసరమైతే మళ్లీ యుద్ధానికి దిగుతామని సంచలన వ్యాఖ్యలు అన్నారాయన. కాల్పుల విరమణ ఒప్పందం తొలి దశ ఇవాళ్టి నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే అంతకంటే కొన్ని గంటల ముందు.. నెతన్యాహూ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం గమనార్హం.‘‘సరైన ఫ్రేమ్ వర్క్ లేకుండా ఒప్పందంలో ముందుకు వెళ్లలేం. తమ దగ్గర ఉన్న బంధీల జాబితాను హమాస్ విడుదల చేయాలి. వాళ్లలో ఎవరెవరిని ఎప్పుడెప్పుడు విడుదల చేస్తారో స్పష్టత ఇవ్వాలి. అప్పుడే మేం ఒప్పందం ప్రకారం ముందుకు వెళ్తాం. ఇందులో ఎలాంటి ఉల్లంఘనలు జరిగినా.. మేం సహించబోం. తదుపరి పరిణామాలకు హమాసే బాధ్యత వహించాల్సి ఉంటుంది’’ అని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు(Benjamin Netanyahu) తెలియజేశారు. హమాస్‌పై పూర్తిస్థాయి విజయం సాధిస్తేనే గాజా యుద్ధాన్ని(Gaza War) విరమిస్తామని.. అప్పటి వరకు పోరు ఆపే ప్రసక్తే లేదని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు గతంలో అనేక సందర్భాల్లో బహిరంగంగా ప్రకటిస్తూ వచ్చిన సంగతి తెలిసిందే. మరోవైపు.. తాజాగా బంధీల జాబితా ఇవ్వాలంటూ ఆయన మెలిక పెట్టారు. దీంతో ఇవాళ్టి నుంచి ఒప్పందం అమలు అవుతుందా? అనే అనుమానాలు నెలకొంటున్నాయి.స్థానిక కాలమానం ప్రకారం ఆదివారం ఉదయం నుంచి హమాస్, ఇజ్రాయెల్ మధ్య ఆరు వారాలపాటు కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి రావాల్సి ఉంది. ఇజ్రాయెల్ కారాగారాల్లో మగ్గిపోతున్న పాలస్తీనియన్లు, పాలస్తీనా రాజకీయ పార్టీల నేతలను ఈ 42 రోజుల్లోపు ఇజ్రాయెల్ అధికారులు విడిచిపెట్టనున్నారు. మరోవైపు 2023 అక్టోబర్ ఏడున ఇజ్రాయెల్ శివారు గ్రామాలపై దాడిచేసి కిడ్నాప్ చేసి బందీలుగా ఎత్తుకెళ్లిన వారిలో కొందరిని హమాస్ విడిచి పెట్టాల్సి ఉంది. హమాస్ చెరలోని 460 రోజులకు పైగా బందీలుగా ఉన్నారన్నమాట!.హమాస్ చెరలో ఉన్న 98 బంధీల్లో.. 33 మందిని విడిచి పెట్టడంప్రతిగా.. తమ జైళ్లలో మగ్గుతున్న 2000 మంది పాలస్తీనియన్లను ఇజ్రాయెల్ విడిచిపెట్టడంపదిహేను నెలలుగా రక్తమోడుతున్న గాజాలో బాంబుల మోత.. క్షిపణుల విధ్వంసం.. తుపాకుల అలజడి ఈ శాంతి ఒప్పందంతో ఆగనుంది. దోహా వేదికగా.. అమెరికా, ఈజిప్టు, ఖతార్ మధ్యవర్తిత్వంతో ఇజ్రాయెల్హమాస్ మధ్య గత బుధవారం కాల్పుల విరమణ ఒప్పందం కుదరడంతో గాజా ఊపిరి పీల్చుకుంది. వాస్తవానికి ఇజ్రాయెల్ ప్రధాని ఎన్నడూ కాల్పుల విరమణ ఒప్పందానికి అంతగా ఆసక్తి చూపలేదు. యుద్ధం కొనసాగించడానికి మొగ్గు చూపుతూ.. ఏదో కారణంతో చర్చల ప్రక్రియను పక్కదోవ పట్టించే ప్రయత్నాలే చేస్తూ వచ్చారు. అయితే.. గతేడాది మే నెలలో బైడెన్ ప్రభుత్వం కాల్పుల విరమణకు సంబంధించి కొన్ని ప్రతిపాదనలు చేసింది. వాటికి హమాస్ సానుకూలంగా స్పందించింది. దీంతో అప్పుడే గాజాలో శాంతి నెలకొంటుందని అంతా భావించారు. కానీ, నెతన్యాహు మాత్రం ఆ ప్రతిపాదనలను తీవ్రంగా వ్యతిరేకించారు. ముఖ్యంగా గాజా నుంచి ఇజ్రాయెల్ దళాలను పూర్తిగా ఉపసంహరించడానికి అంగీకరించలేదు. కానీ, ఇప్పుడు కుదిరిన ఒప్పందంలోనూ రెండో దశలో గాజా నుంచి ఇజ్రాయెల్ దళాల ఉపసంహరణ నిబంధన ఉంది. అందుకే ఒప్పందంలో తొలి దశ అమలైనా, రెండో దశకు ఇజ్రాయెల్ అంగీకారం తెలుపుతుందా? లేదా? అన్నది కీలకం కానుంది.ఇదీ చదవండి: కెనడా ప్రధాని రేసులో చంద్ర ఆర్య -
Israel-Hamas: గాజా ఒప్పందానికి ఇజ్రాయెల్ కేబినెట్ ఆమోదం
జెరూసలెం: ఇజ్రాయెల్-హమాస్(Hamas) మధ్య కాల్పుల విరమణ, బందీల విడుదల ఒప్పందానికి ఇజ్రాయెల్ కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో, గాజా(Gaza)లో శాంతి నెలకొనే అవకాశం ఉంది. ఇక, ఈ ఒప్పందం ఆదివారం నుంచి అమల్లోకి రానుంది. ఒప్పందానికి మార్గం సుగమం చేయాలని కేబినెట్‌కు ప్రభుత్వం సిఫార్సు చేసినట్లు ప్రధాని నెతన్యాహు(Benjamin Netanyahu) కార్యాలయం వెల్లడించింది. ఈ క్రమంలో కాల్పుల విరమణకు సంబంధించి ఎదురైన ఆటంకాలు తొలగిపోయాయని హమాస్ పేర్కొంది.ఇజ్రాయెల్-హమాస్(Israel) మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అమెరికా, ఈజిప్టు, ఖతార్ మధ్యవర్తిత్వంతో బుధవారం కుదిరిన మూడు దశల కాల్పుల విరమణ, బందీల విడుదల ఒప్పందానికి ఇజ్రాయెల్ కేబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో, ఆదివారం నుంచి ఒప్పందం అమలులోకి రానుంది. ఈ మేరకు బందీలను విడుదల చేసే ప్రణాళికను ప్రభుత్వం ఆమోదించిందని మంత్రివర్గం ఓటింగ్ నిర్వహించిన తర్వాత నెతన్యాహు కార్యాలయం శనివారం తెల్లవారుజామున తెలిపింది.ఇదే సమయంలో అన్ని రాజకీయ, భద్రతాపరమైన, మానవతా అంశాలను సమీక్షించి, యుద్ధం లక్ష్యాలను సాధించడానికి ఇది ప్రయోజనకరమని అర్థం చేసుకున్నామని పేర్కొంది. బందీల కుటుంబాలకు ఇప్పటికే సమాచారం ఇచ్చినట్లు ప్రధాని కార్యాలయం వెల్లడించింది. ఆదివారం నుండి విడుదల చేయబోయే 95 మంది పాలస్తీనియన్ల జాబితాను న్యాయ మంత్రిత్వ శాఖ ప్రచురించింది. వారిలో 69 మంది మహిళలు, 16 మంది పురుషులు మరియు 10 మంది మైనర్లు ఉన్నారు. తర్వాత పూర్తిస్థాయిలో యుద్ధాన్ని ముగించే దిశగా చర్యలు తీసుకోనున్నారు. మరోవైపు.. కాల్పుల విరమణ ప్రారంభం కాకముందే గాజా ప్రజలు స్వదేశానికి తిరిగి రావడానికి సిద్ధమవుతున్నారు.Israel’s security cabinet has accepted the ceasefire deal with Hamas which is due to come into force on Sunday. The approval comes after an unexpected delay because pf far-right members of the Israeli government. pic.twitter.com/ZgWNmQRAKU— Channel 4 News (@Channel4News) January 17, 2025 -
కాల్పుల విరమణకు సై
జెరూసలేం: గాజాలో కాల్పుల విరమణపై సందిగ్ధత తొలగిపోయింది. కాల్పుల విరమణకు హమాస్–ఇజ్రాయెల్ మధ్య కుదిరిన ఒప్పందం అమలు దిశగా మరో అడుగు ముందుకు పడింది. ఈ ఒప్పందాన్ని ఆమోదించాలంటూ ఇజ్రాయెల్ సెక్యూరిటీ కేబినెట్ శుక్రవారం సిఫార్సు చేసింది. దీంతో ఈ ఒప్పందం ఫుల్ కేబినెట్ ఆఫ్ మినిస్టర్స్ కోర్టులోకి చేరింది. మంత్రివర్గం ఆమోదముద్ర వేస్తే గాజాలో కాల్పుల విరమణ ఒప్పందం ఆదివారం నుంచి అమల్లోకి వస్తుంది. 15 నెలలుగా కొనసాగుతున్న సంక్షోభానికి తెరపడనుంది. హమాస్ మిలిటెంట్ల చెరలో ఉన్న ఇజ్రాయెల్ బందీలు విడుదల కానున్నారు. వారంతా స్వదేశానికి చేరుకుంటారు. కాల్పుల విరమణ కోసం ఖతార్, అమెరికా మధ్యవర్తిగా వ్యవహరించాయి. హమాస్‌తోపాటు ఇజ్రాయెల్‌పై ఒత్తిడి తెచ్చి ఎట్టకేలకు ఒప్పించాయి. గాజాలో దాడులకు స్వస్తిపలకడానికి ఇజ్రాయెల్, బందీలను విడుదల చేయడానికి హమాస్ అంగీకరించాయి. అయితే, ఒప్పందం కుదిరిన కొన్ని గంటల వ్యవధిలోనే ఇజ్రాయెల్ సైన్యం గాజాపై బాంబుల వర్షం కురిపించింది. కనీసం 72 మంది పాలస్తీనా పౌరులు మరణించారు. ఒప్పందం అటకెక్కినట్లేనన్న ప్రచారం ఊపందుకుంది. గాజా ప్రజలు, బందీల కుటుంబ సభ్యుల్లో ఉత్కంఠ నెలకొంది. ఒప్పందాన్ని అమోదించాలంటూ ఇజ్రాయెల్ సెక్యూరిటీ కేబినెట్ సిఫార్సు చేయడంతో వారంతా ఊపిరి పీల్చుకున్నారు. -
ఒప్పందంపై ఇజ్రాయెల్, హమాస్ సంతకాలు.. దోహా వేదికగా ఘట్టం
టెల్ అవీవ్: కాల్పుల విమరణ ఒప్పందంపై ఎట్టకేలకు ఉత్కంఠ వీడింది. ఇజ్రాయెల్, హమాస్‌ల మధ్య సయోధ్య కుదరడంతో ఒప్పందంపై ఇరువర్గాలు సంతకాలు చేశాయి. దోహ ఈ ఘట్టానికి వేదికైంది. కాల్పుల విరమణ ఒప్పందానికి అడ్డంకిగా మారిన చిక్కులను మధ్యవర్తులు తొలగించినట్లుగా తెలుస్తోంది.ఈ మేరకు గాజా(Gaza)లో ఉన్న బంధీల విడుదలకు ఒప్పందం కుదిరినట్లు ఇజ్రాయెల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అమెరికా, ఖతార్ మధ్యవర్తిత్వంతో బుధవారం ఇజ్రాయెల్హమాస్ మధ్య కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన సంగతి తెలిసిందే. ఒకవైపు హమాస్ చివరి నిమిషంలో కొర్రీలు వేస్తోందంటూ ఇజ్రాయెల్ మండిపింది. ఆపై కాసేపటికే తమకూ కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని గురువారం ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. దీంతో ఒప్పందంపై ఉత్కంఠ నెలకొంది. అయితే మధ్యవర్తుల తాజా దౌత్యంతో ఈ ఉత్కంఠకు తెర పడింది. ఒప్పందం చివరి దశకు చేరిన విషయాన్ని తాజాగా ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కార్యాలయం ధ్రువీకరించింది. ఈ ఒప్పందంపై తొలుత ఇజ్రాయెల్ వార్ కేబినెట్ చర్చించి ఆమోద ముద్ర వేస్తుంది. అయితే శనివారం వరకు కేబినెట్ ఆమోద ముద్ర పడకపోవచ్చని సమాచారం. ఆదివారం నుంచి ఇరు వర్గాల మధ్య డీల్ అమల్లోకి వస్తుందంటూ ఖతార్ ప్రధాని ప్రకటించిన సంగతి తెలిసిందే. -
యుద్ధ విషాద గీతం.. గాజా కన్నీటి గాథ
-
గాజాలో శాంతి సాధ్యమేనా!
బాంబుల మోత ఆగుతుందంటే... తుపాకులు మౌనం పాటిస్తాయంటే... క్షిపణుల జాడ కనబడదంటే... ఇనుప డేగల గర్జనలు వినబడవంటే... నిత్యం మృత్యువు వికటాట్టహాసం చేస్తున్నచోట హర్షాతిరేకాలు వ్యక్తం కావటం సహజమే. అందుకే 15 నెలలుపైగా... అంటే 467 రోజులుగా రాత్రింబగళ్లు ప్రాణభయంతో కంటి మీద కునుకు లేకుండా గడిపిన గాజా ప్రజానీకం వీధుల్లోకొచ్చి పండుగ చేసుకున్నారు. అటు హమాస్ చెరలో మగ్గుతున్నవారి కుటుంబసభ్యులు సైతం ఆనందో త్సాహాలతో ఉన్నారు. ఇజ్రాయెల్–మిలిటెంట్ సంస్థ హమాస్‌ల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని మధ్యవర్తులుగా వ్యవహరించిన అమెరికా, ఖతార్ ప్రతినిధులు బుధవారం రాత్రి ప్రకటించగానే ప్రపంచం, ప్రత్యేకించి పశ్చిమాసియా ఊపిరి పీల్చుకున్నాయి. ‘నేను దేశాధ్యక్షపదవి స్వీకరించబోయే జనవరి 20 నాటికి బందీలకు స్వేచ్ఛ లభించకపోతే సర్వనాశనం ఖాయమ’ని అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ పక్షం రోజుల నాడు ప్రకటించారు. ‘నా హెచ్చరిక ఫలించబట్టే కాల్పుల విరమణ ఒప్పందం సాకారమైంద’ని ఇప్పుడు ఆయన అంటుంటే... ‘నా అనుభవంలోనే అత్యంత కఠినమైన ఈ చర్చల ప్రక్రియను మొత్తానికి సుఖాంతం చేయగలిగాన’ని ప్రస్తుత అధ్య క్షుడు జో బైడెన్ చెబుతున్నారు. ఈ ఘనత ఎవరి ఖాతాలో పడాలన్నది తేలకముందే ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహూ మొండికేస్తున్నారు. తొలుత ఒప్పందాన్ని స్వాగతించిన ఆయనే ఇంకా తేలాల్సినవి ఉన్నాయంటున్నారు. ఒప్పందంపై ఆమోదముద్ర వేసేందుకు నిర్వహించాల్సిన కేబినెట్ సమావేశాన్ని నిలిపివేశారు. ఈలోగా నిన్న, ఇవాళ గాజాపై ఇజ్రాయెల్ సాగించిన బాంబు దాడుల్లో 19మంది పిల్లలు సహా 80 మంది చనిపోయారు. కాల్పుల విరమణ ఒప్పందం అమలవుతుందా లేదా, ఈ ప్రాంతంలో తాత్కాలికంగానైనా శాంతి నెలకొంటుందా అన్న అంశంలో సందిగ్ధత ఏర్పడింది. సుదీర్ఘకాలం ఘర్షణలతో అట్టుడికినచోట సాధారణ పరిస్థితులు ఏర్పడటం అంత సులభమేమీ కాదు. అందునా ఇజ్రాయెల్‌తో వైరమంటే మామూలుగా ఉండదు.ఇజ్రాయెల్ భూభాగంలోకి హమాస్ మిలిటెంట్లు చొరబడి 2023 అక్టోబర్ 7న విచ్చలవిడిగా కాల్పులు జరిపి 1,200 మంది పౌరులను హతమార్చటంతో పాటు, 251 మందిని బందీలుగా తీసు కెళ్లటంతో ఇదంతా మొదలైంది. హమాస్ మతిమాలిన చర్య తర్వాత ఇజ్రాయెల్ క్షిపణులు, బాంబులతో గాజా, వెస్ట్‌బ్యాంక్‌లపై సాగించిన దాడుల పర్యవసానంగా ఇంతవరకూ కొందరు హమాస్ కీలకనేతలతో పాటు 46,700 మంది పౌరులు చనిపోయారు. ఇందులో అత్యధికులు పిల్లలు, మహి ళలే. ఇతరులు నిత్యం చావుబతుకుల మధ్య రోజులు వెళ్లదీస్తున్నారు. ఇజ్రాయెల్ సైన్యం జారవిడిచే కరపత్రాలు సూచించిన విధంగా ఎటు పొమ్మంటే అటు వలసపోతూ అష్టకష్టాలు పడుతున్నారు.తిండీ, నీళ్లూ కరువై, అంతంతమాత్రం వైద్య సదుపాయాలతో జీవచ్ఛవాల్లా బతుకుతున్నారు. ఒక్కోటి 42 రోజులు (ఆరు వారాలు)ఉండే మూడు దశల కాల్పుల విరమణ ఒప్పందం సజావుగా అమలవుతుందా, మధ్యలో తలెత్తగల సమస్యలేమిటి అన్న ప్రశ్నలకు ఎవరి దగ్గరా సమాధానాల్లేవు. హమాస్ చెరలో ఇంకా 94 మంది బందీలు మిగిలారని, వారిలో 34మంది మరణించివుండొచ్చని ఇజ్రాయెల్ అంచనా. తొలి దశ అమల్లోవుండగా గాజా స్ట్రిప్ నుంచి ఇజ్రాయెల్ దళాలు వైదొలగాలి. ఆ తర్వాత పాలస్తీనా ఖైదీల విడుదలకు బదులుగా 33 మంది బందీలను హమాస్ విడుదల చేస్తుంది. ఒకసారంటూ ఒప్పందం అమలు మొదలైతే ఇరువైపులా ఉన్న బందీలను దశలవారీగా విడుదల చేస్తారు. గాజాకు భారీయెత్తున సాయం అందటం ప్రారంభమవుతుంది. ఒప్పందం ప్రకారం తొలి దశ కొనసాగుతున్న దశలోనే ఇజ్రాయెల్ రెండోదశ కోసం హమాస్‌తో చర్చించటం మొదలెట్టాలి. రెండో దశకల్లా బందీలతోపాటు దాడుల సందర్భంగా హమాస్‌కు చిక్కిన ఇజ్రాయెల్ ఆడ, మగ సైనికులు పూర్తిగా విడుదలవుతారన్నది అంచనా. అప్పుడు మొదలుకొని తొలి దశలో వున్న తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం శాశ్వత కాల్పుల విరమణగా మారుతుంది. మూడో దశ అంతా పునర్నిర్మాణంపై కేంద్రీకరిస్తారు. హమాస్ బందీలుగా ఉంటూ మరణించినవారి మృత దేహాలను అప్పగించాలి. కేవలం మొదటి దశకు మాత్రమే ప్రస్తుత ఒప్పందం పరిమితమనీ... కొత్తగా చర్చలు జరిగాకే రెండు, మూడు దశలకు సంబంధించి తుది నిర్ణయం ఉంటుందనీ ఇప్పటికే నెతన్యాహూ ప్రకటించారు. తొలి దశ పూర్తయ్యాక మళ్లీ యుద్ధం తప్పదన్న హామీ ఇవ్వకపోతే తమ ఆరుగురు మంత్రులూ తప్పుకుంటారని తీవ్ర మితవాదపక్ష నాయకుడు, జాతీయ భద్రతా మంత్రి బెన్గివర్ హెచ్చరించటం తీసిపారేయదగ్గది కాదు. లెబనాన్‌లోని హిజ్బొల్లాతో ఉన్న రెండు నెలల కాల్పుల విరమణ ఒప్పందం ప్రస్తుతం అంతంతమాత్రంగానే ఉంది. అక్కడ ఇరువైపులా కాల్పులు జరగని రోజంటూ లేదు. ఆ ఒప్పందం కూడా ఈనెల 26తో ముగుస్తుంది. ఇప్పుడు హమాస్‌తో కుదిరిన ఒప్పందం గతి కూడా అలాగే ఉంటుందా అన్నది ప్రశ్నార్థకం.సిరియాలో అసద్ నిష్క్రమణ, ఉక్రెయిన్ యుద్ధంలో రష్యా నిమగ్నమైవుండటం, ఇరాన్ బల హీనపడటం, ట్రంప్ ఆగమనం వంటి పరిణామాలతో హమాస్‌లో పునరాలోచన మొదలయ్యాకే ఈ ఒప్పందానికి అంగీకరించింది. ఎనిమిదినెలల నాడు దాదాపు ఇవే షరతులు ప్రతిపాదిస్తే ఆ సంస్థ తిరస్కరించటం గమనార్హం. మొత్తానికి పశ్చిమాసియా తెరిపిన పడటానికి అన్ని పక్షాలూ చిత్తశుద్ధి ప్రదర్శించటం అవసరం. దాడులతో ఎవరినీ అణిచేయలేమని ఇన్నాళ్ల చేదు అనుభవాల తర్వాతైనా ఇజ్రాయెల్ గుర్తిస్తే మంచిది. ఎన్ని లోటుపాట్లున్నా ఘర్షణలు అంతరించాలి. శాంతి చిగురించాలి. -
గాజా ఒప్పందం.. ఆఖరి నిమిషంలో కొర్రీలు!
ఇజ్రాయెల్-హమాస్ కాల్పుల విరమణ ఒప్పందం విషయంలో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ ఒప్పందం ఆదివారం నుంచి అమలులోకి వస్తుందని ఖతార్ ప్రధాని షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్ రహ్మాన్ అల్‌థానీ ఘనంగా ప్రకటించడం తెలిసిందే. అయితే ఆఖరి నిమిషయంలో ఇటు ఇజ్రాయెల్.. అటు హమాస్‌లు ఒక అడుగు వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. కాల్పుల విరమణ(Ceasefire Deal) ఒప్పందానికి ఆమోదం తెలిపేందుకు తమ కేబినెట్ సమావేశం ప్రస్తుతానికి జరగట్లేదని ఇజ్రాయెల్ ప్రకటించింది. అందుకు హమాస్ చివరి నిమిషంలో పెట్టిన కొర్రీలే కారణమని ఆరోపించింది. ఒప్పందం తుది ముసాయిదాపై ఇంకా కసరత్తు జరుగుతోందని ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం ప్రకటించిన కాసేపటికే ఈ పరిణామం చోటు చేసుకోవడం గమనార్హం. దీంతో తర్వాత ఏం జరగబోతోందా? అనే ఉత్కంఠ నెలకొంది.చివరి నిమిషంలో హమాస్(Hamas) ఉగ్రసంస్థ ఒప్పందంలో మార్పులు సూచించడమే అందుకు కారణమని ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం ప్రకటించింది. అయితే ఆ కారణం ఏంటన్నదానిపై మాత్రం ఇంకా స్పష్టత ఇవ్వలేదు. మరోవైపు.. హమాస్ మాత్రం మధ్యవర్తులు తెచ్చిన ఒప్పందానికి కట్టుబడి ఉన్నామని చెబుతోంది. ఇజ్రాయెల్ తాజాగా చేస్తున్న ఆరోపణలపై మాత్రం స్పందించకపోవడం గమనార్హం. పదిహేను నెలలుగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలుకుతూ ఇజ్రాయెల్-హమాస్‌లు ఓ అంగీకారానికి వచ్చినట్లు మధ్యవర్తిత్వం వహిస్తున్న ప్రతినిధులు బుధవారం ప్రకటించారు. ఖతార్ ఈ ఒప్పందానికి మధ్యవర్తిత్వం వహించింది. తొలి ఫేజ్‌లో భాగంగా.. గాజాలో తాము బంధీలుగా ఉంచిన 33 మందిని హమాస్ విడుదల చేయాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా మొదట ఇద్దరు అమెరికన్లను విడుదల చేస్తారు. దానికి ప్రతిగా తమ దేశ జైళ్లలో మగ్గుతున్న పాలస్తీనా బంధీలను ఇజ్రాయెల్ విడుదల చేయాలి. ఇదీ చదవండి: గాజా శాంతి ఒప్పందం ఘనత ఎవరిదంటే..అయితే.. ఆ ప్రకటన వెలువడిన కొన్ని గంటల్లోనే ఇజ్రాయెల్ (Israel) గాజాపై తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ప్రకటన వెలువడినప్పటి నుంచి జరిగిన దాడుల్లో 71 మంది మరణించినట్లు గాజా సివిల్ ఎమర్జెన్సీ సర్వీస్ వెల్లడించింది. పైగా ఈ చర్యలతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారని, పదుల సంఖ్యలో భవనాలు కుప్పకూలగా.. మరికొందరికి గాయాలైనట్లు ఒక ప్రకటనలో పేర్కొంది. దీంతో ఈ ఆదివారం(జనవరి 19) నుంచి మొదలుకావాల్సిన ఒప్పందం అమలుపై నీలినీడలు కమ్ముకునే అవకాశం లేకపోలేదు.అక్టోబరు 7, 2023న సరిహద్దులు దాటి ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించి 1200 మంది ఇజ్రాయెల్ పౌరులను హతమార్చి, 250 మందిని బందీలుగా చేసుకోవడం ద్వారా హమాస్ మధ్య ఆసియాలో యుద్ధానికి బీజం వేసింది. హమాస్‌కు మద్దతుగా హెజ్బొల్లా, హూతీ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పై దాడులకు దిగాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పరస్పర క్షిపణి దాడులకు పాల్పడ్డాయి. 15 నెలల యుద్ధంలో 46 వేల మంది పాలస్తీనియన్లు ఇజ్రాయెల్ దాడుల్లో మృతి చెందారు. ఈ యుద్ధాన్ని నివారించడానికి ప్రపంచ దేశాలు కృషి చేస్తూ వచ్చాయి. అటు అమెరికా.. ఇటు ఈజిప్ట్,ఖతారులు కొన్ని నెలలుగా కాల్పుల విరమణ చర్చలు జరుపుతూ వచ్చాయి.ఖతార్ ప్రధాని షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్ రహ్మాన్ అల్‌థానీ టెలివిజన్ ముఖంగా చేసిన ప్రకటనతో.. పాలస్తీనాలో సంబురాలు జరిగాయి. ఇటు గాజా సరిహద్దులో శరణార్థ శిబిరాల్లో ఉన్నవాళ్లు సైతం హర్షం వ్యక్తం చేశారు. ఇకనైనా మానవతా ధృక్పథంతో ముందకు సాగాలని, గాజా కోలుకునేందుకు అవసరమైన సాయం కోసం ఒప్పందంపై ఇరువర్గాలు సంతకాలు చేయాలని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ విజ్ఞప్తి చేస్తున్నారు. మరోవైపు.. గాజా శాంతి ఒప్పందం ఓ కొలిక్కి వచ్చిందన్న పరిణామంపై భారత్ సహా పలుదేశాలు స్వాగతించాయి. -
హమాస్-ఇజ్రాయెల్ ఒప్పందం, ఆ ఘనత ఎవరికంటే..
ఇజ్రాయెల్-హమాస్ మధ్య శాంతి ఒప్పందం ఓ కొలిక్కి రావడంపై అమెరికాకు కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బంధీలను విడిచిపెట్టడంతో(Gaza hostage release) పాటు కాల్పుల విమరణ ఒప్పందానికి సిద్ధపడడంతో ఇరువర్గాలను ట్రంప్ మెచ్చుకున్నారు. అయితే.. మరో ఐదు రోజుల్లో ఆయన వైట్‌హౌజ్‌లో అడుగుపెట్టబోతున్న సంగతి తెలిసింది. ఈలోపే గాజా యుద్ధం ముగింపు దిశగా అడుగు పడడాన్ని ఆయన తన విజయంగా అభివర్ణించుకుంటున్నారు.‘‘కిందటి ఏడాది నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మేం చారిత్రక విజయం సాధించాం. ఆ ఫలితమే ఈ కాల్పుల విరమణ ఒప్పందం అని తన ట్రూత్ సోషల్‌లో ఓ పోస్ట్ ఉంచారు. నిబద్ధతతో కూడిన తన పరిపాలన.. శాంతి, సామరస్యంతో ప్రపంచానికి శక్తివంతమైన సంకేతాలను పంపిందని విశ్వసిస్తున్నట్లు చెబుతున్నారాయన. ఇజ్రాయెల్ సహా మా మిత్రపక్షాలతో మేం(అమెరికా) సత్సంబంధాలు కొనసాగిస్తాం. అలాగే.. గాజాను మళ్లీ ఉగ్రవాదులకు స్వర్గధామంగా మార్చబోం అని ఆయన రాసుకొచ్చారు.తాజాగా హమాస్‌కు ట్రంప్ సీరియస్ వార్నింగ్ ఇచ్చారు. తాను అధ్యక్ష బాధ్యతలు చేపట్టకముందే హమాస్ ఉగ్రవాద సంస్థ (Hamas-led militants) చెరలో ఉన్న బందీలను విడిచిపెట్టాలని స్పష్టం చేశారు. లేనిపక్షంలో తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. తాను అధ్యక్ష బాధ్యతలు చేపట్టేసరికి బందీలు తిరిగి రాకపోతే పశ్చిమాసియాలో ఆకస్మిక దాడులు జరుగుతాయని హెచ్చరించారు.కాగా, హమాస్‌కు ట్రంప్ ఇలా సీరియస్ వార్నింగ్ ఇవ్వడం ఇదేమీ మొదటిసారి కాదు. గతేడాది డిసెంబర్లో కూడా తీవ్రంగా హెచ్చరించారు.పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు చల్లార్చేందుకు అమెరికా సహా పలు దేశాలు నిర్విర్వామంగా కృషి చేస్తూ వస్తున్నాయి. గాజా శాంతి స్థాపనకు మధ్యవర్తిత్వం వహించిన ఈజిప్ట్, ఖతార్‌ల పాత్ర గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. అయితే ఆ టైంలో(కిందటి ఏడాది మే చివర్లో) ఇజ్రాయెల్, హమాస్ మధ్య ఉద్రిక్తతలను చల్లార్చే దిశగా అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కొత్త ఒప్పంద ప్రతిపాదనను తీసుకొచ్చారు. బందీల విడుదలతోపాటు కాల్పుల విరమణకు అందులో పిలుపునిచ్చారు. ఖతార్ ద్వారా హమాస్‌కు సైతం ఆ ఒప్పందం చేరవేశారు. ఇక గత కొన్ని వారాలుగా ఎడతెగక సాగిన చర్చలు, దఫదఫాలుగా బందీల విడుదలకు హమాస్ అంగీకరించడం, తమ కారాగారాల్లో మగ్గుతున్న వందలమంది పాలస్తీనియన్లను విడిచిపెట్టేందుకు ఇజ్రాయెల్ తలూపడం వంటి పరిణామాలు ఒప్పందం కుదిరేందుకు దోహదం చేశాయి.బైడెన్ ప్రతిపాదించిన ఒప్పందం ఇదే..మొదటి దశఇది ఆరు వారాలు కొనసాగుతుంది. ఇందులో ఇజ్రాయెల్-హామాస్ బలగాలు పూర్తిస్థాయిలో కాల్పుల విరమణను పాటించాలి. గాజాలోని జనాలు ఉండే ప్రాంతాల నుంచి ఇజ్రాయెల్ బలగాలు వెనుదిరగాలి. వందల మంది పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేయాలి. ప్రతిగా మహిళలు, వృద్ధులు సహా పలువురు బందీలను హమాస్ అప్పగించాలి.రెండో దశసైనికులు సహా సజీవ ఇజ్రాయెలీ బందీలందరినీ హమాస్ విడిచిపెట్టాలి. గాజా నుంచి ఇజ్రాయెల్ బలగాలు పూర్తిగా వెనక్కి వచ్చేయాలి.మూడో దశగాజాలో పునర్నిర్మాణ పనులు భారీస్థాయిలో ప్రారంభమవుతాయి. బందీలుగా ఉన్నప్పుడు ప్రాణాలు కోల్పోయినవారి అవశేషాలను వారి కుటుంబసభ్యులకు అప్పగించాలి.అయితే.. బైడెన్ ప్రతిపాదించిన ఒప్పంద సూత్రాలకే ఇరు వర్గాలు అంగీకరించాయా? లేదంటే అందులో ఏమైనా మార్పులు జరిగాయా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది. మధ్యవర్తులు చెబుతున్న సమాచారం ప్రకారం.. తొలి దశలో యుద్ధం నిలిపివేతపై చర్చలను ప్రారంభించడంతో పాటు, ఆరు వారాల పాటు కాల్పుల విరమణ పాటించాలి. హమాస్ చెరలో బందీలుగా ఉన్న సుమారు 100 మందిలో 33 మందిని ఈ సమయంలో విడిచిపెట్టాలి’’ అని ఉన్నట్లు తెలుస్తోంది.ఇదిలా ఉంటే.. ప్రపంచమంతా ఎన్నాళ్లుగానో ఎదురు చూస్తున్న గాజా కాల్పుల విరమణ ఒప్పందం ఎట్టకేలకు కుదిరింది. ఖతార్ రాజధాని దోహా ఇందుకు వేదికైంది. 15 నెలలుగా కొనసాగుతున్న యుద్ధానికి ముగింపు పలుకుతూ బుధవారం ఇజ్రాయెల్-హమాస్‌లు ఓ అంగీకారానికి వచ్చినట్లు మధ్యవర్తులుగా వ్యవహరిస్తున్న ప్రతినిధులు ధృవీకరించారు. ఈ ఒప్పందంపై గురువారం ప్రకటన చేసేందుకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సన్నద్ధమవుతున్నారు.ఖతార్ పాత్ర ప్రత్యేకం.. కాల్పుల విరమణ ఒప్పందానికి అమెరికా, ఖతార్, ఈజిప్టులు మధ్యవర్తిత్వం వహించాయి. ఈక్రమంలో రెండుసార్లు కాల్పుల విరమణపై చర్చలు జరగ్గా అవి ఫలించలేదు. అయితే గాజాలో శాంతి స్థాపన కోసం ఖతార్ చేసిన మధ్యవర్తిత్వ ప్రయత్నాలు మొదటి నుంచి ఆసక్తికరంగా సాగాయి. 2012 నుంచి దోహాలో హమాస్ తన కార్యకలాపాలను నిర్వహిస్తోంది. దీంతో పశ్చిమాసియా ఉద్రిక్తతలను చల్లార్చే ప్రయత్నాల్లో ఖతార్ కీలకంగా వ్యవహరిస్తుందని తొలి నుంచి చర్చ నడుస్తోంది. అందుకు తగ్గట్లే ఖతార్ ఈ చర్చల్లో ముందుకు వెళ్లింది కూడా. అయితే ఒకానొక దశలో అమెరికా ప్రతిపాదించిన ఒప్పందంపై హమాస్ వెనక్కి తగ్గింది. దీంతో మధ్యవర్తిత్వం వహించే ప్రయత్నాలను ఖతార్ నిలిపివేసిందన్న కథనాలు చక్కర్లు కొట్టాయి. అయితే ఖతార్ వాటిని ఖండించింది. అదే సమయంలో దోహాలో హమాస్ కార్యకలాపాలను బహిష్కరించాలని అమెరికా ఇచ్చిన పిలుపును కూడా ఖతార్ పక్కన పెట్టి మరీ చర్చలకు ముందుకు తీసుకెళ్లి పురోగతి సాధించింది ఖతార్. గాజా బాధ్యత ఎవరిది?తాజా ఒప్పందంపై పలు అనుమానాలు నెలకొన్నాయి. ఈ ఒప్పందం ఇజ్రాయెల్-హమాస్ మధ్య యుద్ధానికి శాశ్వత ముగింపు పలుకుతుందా? అనే ప్రశ్న తలెత్తుతోంది. ఇజ్రాయెల్ బలగాలు గాజా నుంచి పూర్తిగా వెనక్కుమళ్లుతాయా?.. లేకుంటే పాక్షికంగానే జరుగుతుందా?. భవిష్యత్తులో కాల్పుల విరమణ ఉల్లంఘన జరగకుండా ఉంటుందా? అన్నింటికి మించి.. యుద్ధంతో నాశనమైన గాజా ప్రాంతాన్ని ఎవరు పాలిస్తారు? దాని పునర్నిర్మాణానికి ఎవరు బాధ్యత తీసుకుంటారు అనే ప్రశ్నలపై స్పష్టత రావాల్సి ఉంది.ఒకవైపు కాల్పుల విరమణ ప్రతిపాదనకు అంగీకరించినట్లు హమాస్ తెలిపింది. అయితే ఒప్పందం తుది ముసాయిదాపై ఇంకా కసరత్తు జరుగుతోందని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు కార్యాలయం పేర్కొంది. మరోవైపు తాజా ఒడంబడికకు నెతన్యాహు క్యాబినెట్ ఆమోదం తెలపాల్సి ఉంది. కొద్ది రోజుల్లోనే ఈ లాంఛనం పూర్తికావచ్చని భావిస్తున్నారు. ఒప్పందం ఆదివారం నుంచి అమలులోకి వస్తుందని మధ్యవర్తిత్వం వహించిన ఖతార్ ప్రధాని షేక్ మహమ్మద్ బిన్ అబ్దుల్ రహ్మాన్ అల్‌థానీ ప్రకటించారు.అక్టోబరు 7, 2023న సరిహద్దులు దాటి ఇజ్రాయెల్‌లో ప్రవేశించి 1200 మంది ఆ దేశ పౌరులను హతమార్చి, 250 మందిని బందీలుగా చేసుకోవడం ద్వారా హమాస్ మధ్య ఆసియాలో యుద్ధానికి బీజం వేసింది. హమాస్‌కు మద్దతుగా హెజ్బొల్లా, హూతీ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పై దాడులకు దిగాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య పరస్పర క్షిపణి దాడులకు పాల్పడ్డాయి. 46 వేల మంది పాలస్తీనియన్లు ఇజ్రాయెల్ దాడుల్లో మృతి చెందారు.తాజా పరిణామం గాజాలో నిరాశ్రయులైన వేలమంది తిరిగి కోలుకోవడానికి, ఆ ప్రాంతానికి పెద్ద ఎత్తున మానవతా సహాయం అందడానికి ఉపకరించనుంది. -
గాజాలో శాంతి.. ఇజ్రాయెల్, హమాస్ కీలక అంగీకారం
దోహా: యుద్ధం, మానవీయ సంక్షోభంతో 15 నెలలుగా అట్టుడుకుతున్న గాజా(Gaza)కు ఊరట కలిగించే పరిణామం చోటుచేసుకుంది. మరోసారి తాత్కాలికంగా కాల్పుల విరమణకు ఇజ్రాయెల్(Israel), హమాస్(Hamas) అంగీకరించాయి. ఖతార్ రాజధాని దోహాలో వారాల తరబడి జరిగిన చర్చల అనంతరం బుధవారం ఎట్టకేలకు ఈ మేరకు ఒప్పందం కుదిరింది. ఇందులో భాగంగా కనీసం ఆరు వారాల పాటు యుద్ధానికి విరామం ప్రకటిస్తారు.ఇక, యుద్ధానికి పూర్తిగా తెర దించే దిశగా చర్చలను ముమ్మరం చేస్తారు. అంతేగాక హమాస్ తన వద్ద వంద మంది ఇజ్రాయెల్ బందీల్లో కనీసం 30 మందికి పైగా విడతలవారీగా వదిలేయనుంది. బదులుగా వందలాది మంది పాలస్తీనా ఖైదీలను ఇజ్రాయెల్ విడుదల చేస్తుంది. దాంతోపాటు గాజాలో నిర్వాసితులైన వేలాది మంది స్వస్థలాలకు తిరిగి వెళ్లేందుకు అనుమతిస్తుంది. అంతేగాక గాజాకు కొద్ది నెలలుగా పూర్తిగా నిలిపేసిన అంతర్జాతీయ మానవతా సాయాన్ని పూర్తిస్థాయిలో అనుమతిస్తుంది. ఈ మేరకు ఇరు వర్గాలూ అంగీకరించినట్టు చర్చల్లో పాల్గొన్న ముగ్గురు అమెరికా ఉన్నతాధికారులు, హమాస్ ప్రతినిధి తెలిపారు. దీనిపై దోహా త్వరలో అధికారికంగా ప్రకటన చేస్తుందని చెప్పారు.ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం మాత్రం ఒప్పందం విధివిధానాలు ఇంకా ఖరారు కావాల్సి ఉందని చెప్పుకొచ్చింది. ఆ తర్వాత దానికి కేబినెట్ ఆమోదముద్ర పడాల్సి ఉంటుందని పేర్కొంది. తాను ప్రమాణస్వీకారం చేసే లోపే గాజాలో యుద్ధానికి ముగింపు పలకాలంటూ అమెరికా కాబోయే అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హమాస్‌కు ఇటీవలే అల్టిమేటమివ్వడం తెలిసిందే. లేదంటే తీవ్ర చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. మరోవైపు గాజాపై మంగళవారం ఇజ్రాయెల్ దాడుల్లో ఇద్దరు మహిళలు, నలుగురు పిల్లలతో సహా 18 మంది మరణించారు. Israel and Hamas have reached a landmark agreement to cease hostilities in Gaza and exchange Israeli hostages for Palestinian prisoners.This breakthrough comes after months of intense negotiations facilitated by Egyptian and Qatari mediators,with the support of the United States. pic.twitter.com/EtPZK69F48— Unfunny Media (@Unfunny_Media) January 16, 2025 -
బాహుబలి రోబో...రోజుకు 8 టన్నుల పండ్లు చకా చకా!
బత్తాయి చెట్ల నుంచి పండ్లు కోసే రోబోని ఇజ్రేలుకు చెందిన కంపెనీ నానోవెల్ రూపొందించింది. దీనికి వివిధ ఎత్తుల్లో 6 రోబోటిక్ చేతుల్ని అమర్చారు. తోట మధ్యలో వెళ్తూ చెట్టు కొమ్మలకు తగినంత సైజు పెరిగిన, పక్వానికి వచ్చి రంగు మారిన పండ్లను కృత్రిమ మేధతో గుర్తించి కోసేలా దీన్ని రూపొందించారు. వాక్యూమ్ టెక్నాలజీతో పండును పట్టుకొని, తొడిమెను కత్తిరిస్తుంది. చేతిలోకి వచ్చిన పండు కన్వేయర్ బెల్ట్ ద్వారా బుట్ట లోకి చేరుతుంది. ఈ పనులన్నీ రోబో తనంతట తానే చేసేస్తుంది. దూరం నుంచి చూస్తే చిన్న చక్రాలున్న షెడ్డు మాదిరిగా కనిపించే ఈ రోబో.. ప్రస్తుతం ఒక ట్రాక్టర్ లాక్కెళ్తూ ఉంటే పండ్లను కోస్తుంది. మున్ముందు ట్రాక్టర్ అవసరం లేకుండా తనంతట తానే కదిలి వెళ్లేలా దీన్ని మెరుగు పరచనున్నట్లు నానోవెల్ కంపెనీ ప్రకటించింది. అమెరికాలోని కాలిఫోర్నియా ప్రాంతంలో భారీ బత్తాయి తోటల యజమానులను కోత కూలీల కొరత వేధిస్తోంది. ఈ రోబో వారికి ఊరటనిస్తుందని నానోవెల్ ఆశిస్తోంది. కాలిఫోర్నియా సిట్రస్ రీసెర్చ్ బోర్డుతో ఒప్పందం చేసుకున్న ఈ కంపెనీ బత్తాయిలు కోసే ఈ రోబో పనితీరును కాలిఫోర్నియా బత్తాయి, నారింజ తోటల్లో పరీక్షంచబోతున్నది. అక్కడి భారీ కమతాల్లో సాగయ్యే సిట్రస్ పండ్ల తోటల అవసరాలకు అనుగుణంగా ఈ రోబోకు అవసరమైన మార్పులు చేర్పులు చేయబోతున్నారు. ఈ సంవత్సరం సెప్టెంబర్‌లో లండన్‌లో జరిగే వరల్డ్ అగ్రి–టెక్ ఇన్నోవేషన్ సమ్మిట్‌లో కూడా ఈ రోబోను ప్రదర్శించబోతున్నామని నానోవెల్ సీఈవో ఇసాక్ మేజర్ చెప్పారు. భారీ తోటల్లో పండ్ల కోత కూలీల కొరతను ఎదుర్కొంటున్న అమెరికా, స్పెయిన్, ఇటలీ తదితర దేశాల్లో ఈ భారీ రోబోకు ఆదరణ బాగుంటుందని భావిస్తున్నామన్నారు. అంటే, సమీప భవిష్యత్తులో భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనూ ఇటువంటి రోబోలు రాబోతున్నాయి. పండ్లను కోయటంతో పాటు మిగిలిన కాయలు ఎన్ని ఎప్పటికి కోతకు వస్తాయి? తోటలో చెట్ల స్థితిగతులపై కూడా గణాంకాలను ఈ రోబో సేకరించటం వల్ల తోట యజమానులకు వెసులుబాటు కలుగుతుంది. ఆరు రోబోటిక్ చేతులతో ఏకకాలంలో పనిచేసే ఈ భారీ రోబో గంటకు బుట్ట (400 కిలోల) ఆరెంజ్‌లను కోయగలదు. రాత్రీ పగలు తేడా లేకుండా 24 గంటల్లో 20 బుట్టల (8 టన్నులు) పండ్లు కోయగలదు. అందువల్ల దీన్ని ‘బాహుబలి రోబో’ అనొచ్చు! ఇక ధర ఎంతో.. అంటారా? అది కూడా భారీగానే ఉంటుంది మరి! -
ఇజ్రాయెల్ టీనేజర్ బందీ వీడియో...విడుదల చేసిన హమాస్
జెరూసలేం: ఏడాదికి పైగా బందీగా ఉన్న 19 ఏళ్ల ఇజ్రాయెల్ సైనికురాలి వీడియోను హమాస్ విడుదల చేసింది. మూడున్నర నిమిషాల నిడివి ఉన్న వీడియోలో అల్బాగ్ హిబ్రూ భాషలో మాట్లాడారు. తనను 450 రోజులకు పైగా నిర్బంధించారని, ఇజ్రాయెల్తనను, ఇతర బందీలను మరిచిపోయిందని వ్యాఖ్యానించారు. ఇప్పుడు తన వయసు 19 ఏళ్లని, కానీ ఇప్పుడు జీవితం మొత్తం తన కళ్లముందుందని చెప్పారు. వీడియో తమ గుండెను ముక్కలు చేసిందని అల్బాగ్ తల్లిదండ్రులు పేర్కొన్నారు. కూతురు వీడియో చూసిన అనంతరం వారు ఓ వీడియో ప్రకటన చేశారు. తమ కూతురు తీవ్ర మానసిక క్షోభను అనుభవించినట్లు కనిపిస్తోందన్నారు. ఆమె క్షేమంగా విడుదలయ్యేలా చూడాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమిన్ నెతన్యాహుకు విజ్ఞప్తి చేశారు. బందీల కుటుంబాల నుంచి తీవ్ర ఒత్తిడి రావడంతో అల్బాగ్ కుటుంబ ప్రకటనపై ప్రధాని స్పందించారు. బం«దీలను స్వదేశానికి రప్పించేందుకు తమ ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేస్తోందని చెప్పారు. బందీలకు హాని తలపెట్టే సాహసం చేసే వారిని వదిలిపెట్టబోమని హెచ్చరించారు. కుటుంబం అనుమతితో... సాధారణంగా కుటుంబ సభ్యుల అంగీకారం లేకుండా హమాస్ విడుదల చేసే బందీల ఫొటోలు, వీడియోలను ఇజ్రాయెల్ మీడియా ప్రచురించదు. వీడియోను విడుదల చేయడానికి అల్ బాగ్ కుటుంబం తొలుత నిరాకరించినా.. తరువాత అంగీకరించింది. బందీల ఫొటోలు, వీడియోలను హమాస్ ప్రచురించడాన్ని ఇజ్రాయెల్ గతంలో ఖండించింది. "Liri, if you're hearing us, tell the others that all the families are moving heaven and earth. We will fight until all hostages are returned"Eli and Shira Albag , Liri Albag's Parents, called the Prime Minister and Defense Minister, after watching her video from captivity,… pic.twitter.com/Y9xAh47W7O— Bring Them Home Now (@bringhomenow) January 4, 2025హమాస్ చెరలో 96 మంది.. ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి సమయంలో 250 మందిని బందీలుగా గాజాకు తరలించారు. వారిలో కొందరిని రక్షించారు. 34 మంది మరణించారు. ప్రస్తుతం హమాస్ చెరలో 96 మంది మిగిలారు. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్)లో నిఘా సైనికురాలిగా ఉన్న లిరీ అల్బాగ్ను గాజా సరిహద్దులోని నహల్ ఓజ్ సైనిక స్థావరంలో ఉండగా హమాస్ ఉగ్రవాదులు పట్టుకున్నారు. ఆమెతో పాటు మరో ఆరుగురిని సైతం బంధించారు. వీరిలో ఒకరిని రక్షించగా, మరొకరు హత్యకు గురయ్యారు. అల్బాగ్తోపాటు నలుగురు బందీలుగా మిగిలారు. చర్చల నేపథ్యంలో వీడియో.. ఖతార్‌లో ఇజ్రాయెల్, హమాస్‌ల మధ్య ఏడాదిన్నరగా సాగుతున్న యుద్ధాన్ని ఆపేందుకు కాల్పుల విరమణ చర్చలు పునఃప్రారంభమయ్యాయి. చర్చల్లో మధ్యవర్తులుగా ఖతార్, ఈజిప్‌్ట, అమెరికాలు ఉన్నాయి. ఒప్పందం కోసం నెలల తరబడిగా చేస్తున్న ప్రయత్నాలు ఇంతవరకు ఎలాంటి పురోగతి సాధించలేదు. తాజాగా శుక్రవారం నుంచి గాజాపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో 70 మంది మృతి చెందారు. ఈ నేపథ్యంలో హమాస్ లిరీ వీడియోను విడుదల చేసింది. ఇదీ చదవండి: గాజాలో ఇళ్లపై ఇజ్రాయెల్ దాడులు -
గాజాలో ఇళ్లపై ఇజ్రాయెల్ దాడులు..70 మంది మృతి
గాజా: పాలస్తీనాలోని గాజాలో తాజాగా ఇజ్రాయెల్(Israel) జరిపిన దాడుల్లో70 మంది మృత్యువాత పడ్డారు. ఈ విషయాన్ని పాలస్తీనా ఆరోగ్య శాఖ తెలిపింది. రెండు ఇళ్లపై జరిగిన బాంబు దాడుల్లో 17 మంది దాకా మరణించారు.‘తెల్లవారుజామున రెండు గంటలకు ఒక్కసారిగా పెద్ద శబ్దం వచ్చింది. 14,15 మంది దాకా నివసించే మా పక్కనున్న ఇంటిపై దాడి జరిగింది. ఆ ఇంట్లోని వారిలో ఎక్కువ మంది మహిళలు, పిల్లలు’అని పొరుగున ఉండేవారు తెలిపారు. ఈ దాడిపై ఇజ్రాయెల్ మిలిటరీ స్పందించలేదు.మరోవైపు గాజా(Gaza)లో కాల్పుల విరమణపై ఇజ్రాయెల్, హమాస్ మధ్య ఒప్పందానికి మళ్లీ ప్రయత్నాలు మొదలయ్యాయి. ఖతార్ మధ్యవర్తిత్వం వహిస్తున్న ఈ చర్చలకు అమెరికా ప్రభుత్వ సహకారం ఉంది. బందీల విడుదలకు ఒప్పుకోవాలని హమాస్‌ను మధ్యవర్తులు కోరుతున్నారు. అప్పుడే కాల్పుల విరమణ చేస్తామని ఇజ్రాయెల్ స్పష్టం చేస్తోంది. -
ఇజ్రాయెల్ డ్రోన్ దాడి.. హమాస్ టాప్ కమాండర్ హతం
టెల్అవీవ్:తమ దేశంపై 2023 అక్టోబర్ 7వ తేదీన జరిగిన దాడుల వెనుక కీలకంగా వ్యవహరించిన హమాస్ కమాండర్ అల్హదీసబాను అంతమొందించినట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. గాజాలోని ఖాన్ యూనిస్‌లో శరణార్థులు సహాయం పొందుతున్న ప్రాంతంలో సబాను గుర్తించామని,డ్రోన్ దాడితో అతడిని హతమార్చినట్లు ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్(ఐడీఎఫ్) వెల్లడించింది.2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌లోని ఇ కిబ్జట్ నిర్ ఓజ్‌లో హమాస్ జరిపిన దాడిలో అబ్ద్ అల్ హదీ సబా కీలక సూత్రధారని తెలిపింది. యూదులు టార్గెట్‌గా అల్హదీసబా దాడులు చేశాడని పేర్కొంది. సబా నేతృత్వంలో డజన్ల కొద్ది మందిని కిడ్నాప్ చేయడంతో పాటు హత్య చేశారని ఆరోపించింది. ఇప్పటికే హమాస్ అగ్ర నేతలు పలువురిని ఇజ్రాయెల్ హతమార్చిన విషయం తెలిసిందే.కాగా, 2023 అక్టోబర్ 7న ఇజ్రాయెల్‌పై హమాస్ మిలిటెంట్లు మెరుపు దాడి చేశారు. ఈ దాడిలో వందల కొద్ది ఇజ్రాయెల్ పౌరులు మృతిచెందారు. పలువురిని హమాస్ తన వెంట బందీలుగా తీసుకువెళ్లింది. దీనికి ప్రతీకారంగా గాజాపై ఇజ్రాయెల్ ఇప్పటివరకు చేసిన దాడుల్లో 45 వేల మంది వరకు ప్రాణాలు కోల్పోయారు.ఇదీ చదవండి: మమ్మల్ని ఎవరూ అడ్డుకోలేరు:జిన్‌పింగ్ హెచ్చరిక -
నెతన్యాహుకు శస్త్ర చికిత్స..డాక్టర్ల కీలక ప్రకటన
టెల్అవీవ్:ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు(75) మూత్రనాళ ఇన్ఫెక్షన్కు శస్త్ర చికిత్స చేయించుకున్నారు. ఈ విషయాన్ని జెరూసలెంలోని హడస్సా మెడికల్ సెంటర్ వైద్యులు వెల్లడించారు. సర్జరీ విజయవంతంగా జరిగిందని, నెతన్యాహుకు క్యాన్సర్ సోకలేదని తెలిపారు. నెతన్యాహు అండర్‌గ్రౌండ్ చికిత్సా కేంద్రంలో కోలుకుంటున్నారని ఆయన కార్యాలయం వెల్లడించింది.ఈ అండర్‌గ్రౌండ్ చికిత్సా కేంద్రం మిసైల్ దాడుల నుంచి నెతన్యాహుకు రక్షణ కల్పిస్తుంది. నెతన్యాహుకు సర్జరీ కారణంగా ఇజ్రాయెల్ న్యాయశాఖ మంత్రి యారివ్లెవిన్ ప్రస్తుతం దేశ తాత్కిలిక ప్రధానమంత్రిగా వ్యవహరిస్తున్నారు.నెతన్యాహు కోలుకోవడానికి మరికొన్ని వారాలు పడుతుందని అధికారులు తెలిపారు. ఓ వైపు హమాస్‌తో కాల్పుల విరమణచర్చలు మరోవైపు యెమెన్ నుంచి హౌతి రెబెల్స్ దాడులు చేస్తున్న నేపథ్యంలో నెతన్యాహు ఆరోగ్య సమస్యలతో బాధపడుతుండడం అక్కడి ప్రజల్లో కొంతమేర ఆందోళన కలిగిస్తోంది.ఇదీ చదవండి: ఇంజినీర్ సుచిర్ బాలాజీ మృతి.. మస్క్ కీలక ట్వీట్ -
ఈ ఏడాది.. పిల్లల పాలిట పెనుశాపమే!
పిల్లల పాలిట చరిత్రలో ఎన్నడూ లేనంతటి దారుణ సంవత్సరంగా నిలిచింది 2024. యుద్ధాలు, ఘర్షణల కారణంగా ప్రపంచవ్యాప్తంగా బాలలు భారీ సంఖ్యలో నిరాశ్రయులయ్యారు. ఏకంగా 47.3 కోట్ల మంది బాలలు సంఘర్షణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ఆరుగురిలో ఒకరి కంటే ఎక్కువ మంది కల్లోల ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ఒకప్పుడు పేదరికం, కరువు, వంటివాటితో అల్లాడే పిల్లలు ఇప్పుడు ఘర్షణల్లో సమిధలవుతున్నారు. చదువు మాట అటుంచి వారికి పోషకాహారమే గగనమైపోయింది! గాజా, సూడాన్, ఉక్రెయిన్ సహా ప్రపంచవ్యాప్తంగా ఘర్షణలతో బాలలు విపరీతంగా సతమతమవుతున్నట్టు ఐరాస బాలల సంస్థ యునిసెఫ్ తాజాగా పేర్కొంది. గాజాపై ఇజ్రాయెల్ దాడుల్లో 15 నెలల్లో కనీసం 17,492 మంది బాలలు మరణించినట్లు తెలిపింది...! మునుపెన్నడూ లేనంతంగా ఎక్కువ మంది పిల్లలు సంఘర్షణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. బలవంతంగా నిరాశ్రయులవుతున్నారు. ఘర్షణలో మరణిస్తున్న, గాయపడుతున్న పిల్లల సంఖ్య పెరిగింది. పాఠశాలలపై బాంబుల వర్షం కురుస్తోంది. ఇళ్లు ధ్వంసమయ్యాయి. కుటుంబాలు చిన్నాభిన్నమయ్యాయి. భద్రత మాట పక్కకు పెడితే.. ప్రాథమిక అవసరాలు తీర్చుకునే అవకాశమూ ఉండటం లేదు. వాళ్లు ఆడుకోవడం, నేర్చుకోవడం ఎప్పుడో మరిచారు. ఈ యుద్ధాలు పిల్లల హక్కులను హరిస్తున్నాయి. ఇక, ప్రాణాలను కాపాడే వ్యాక్సిన్లు, పోషకాహారం విలాసంగా మారాయి. ‘‘ప్రపంచంలో అనియంత్రిత యుద్ధాలకు ఒక తరం పిల్లలు బలవుతున్నారు. యుద్ధ ప్రాంతాల్లోని పిల్లలు మనుగడ కోసం పోరాటమే చేస్తున్నారు. దానికి తమ బాల్యాన్ని పణంగా పెడుతున్నారు. సర్వహక్కులు కోల్పోతున్నారు. ఇది దారుణం’’ అని యునిసెఫ్ డైరెక్ట్ కేథరిన్ రస్సెల్ వాపోయారు. గణాంకాలు చెబుతున్న విషాదాలు.. యునిసెఫ్ నివేదిక ప్రకారం ప్రపంచ జనాభాలో పిల్లలు 30 శాతం ఉన్నారు. వారిలో 47.3 కోట్ల మంది యుద్ధ ప్రభావింత ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ప్రతి ఆరుగురిలో ఒకరు సంఘర్షణ ప్రభావిత ప్రాంతాల్లో నివసిస్తున్నారని అంతర్జాతీయ ఏజెన్సీ తెలిపింది. 1990లలో సుమారు 10 శాతం మంది బాలలు సంఘర్షణ ప్రాంతాల్లో ఉండగా ఇప్పుడది ఏకంగా రెట్టింపుకు, అంటే 19 శాతానికి పెరిగింది. ఈ యుద్ధాల కారణంగా 2023 చివరి నాటికి 4.7 కోట్ల మంది పిల్లలు నిర్వాసితులయ్యారు. 2024లో హై తీ, లెబనాన్, మయన్మార్, పాల స్తీనా, సూడాన్ నుంచి అత్యధికంగా శరణార్థులుగా వెళ్లారు. ప్రపంచ శరణార్థుల జనాభాలో సుమారు 40 శాతం బాలలే. ఆయా దేశాల్లో నిర్వాసితులయినవారిలో బాలలు 49 శాతమున్నారు. 2023 నుంచి ఇప్పటిదాకా 22,557 మంది పిల్లలపై రికార్డు స్థాయిలో 32,990కు పైగా తీవ్రమైన హక్కుల ఉల్లంఘనలు జరిగాయి. ముఖ్యంగా బాలికల పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. సంఘర్షణ ప్రాంతాల్లో అత్యాచారాలు, లైంగిక హింస పెచ్చరిల్లాయి. ప్రమాదకర స్థాయిలో యుద్ధ ప్రభావిత ప్రాంతాల్లో విద్యకు తీవ్ర అంతరాయం కలిగింది. సంఘర్షణ ప్రభావిత దేశాలలో 52 మిలియన్లకు పైగా పిల్లలు పాఠశాలకు దూరంగా ఉన్నారు. విద్యా మౌలిక సదుపాయాల విధ్వంసం, పాఠశాలల సమీపంలో అభద్రతా భావం వల్ల ఈ ప్రాంతాల్లో పరిస్థితులు మరింత దిగజారాయి. ఈ పిల్లల్లో పోషకాహార లోపం కూడా ప్రమాదకర స్థాయికి పెరిగింది. యుద్ధం పిల్లల ఆరోగ్యంపైనా తీవ్ర ప్రభావం చూపుతోంది. యుద్ధాలు జరుగుతున్న దేశాల్లోని పిల్లల్లో 40శాతం మంది టీకాలు అందడం లేదు. వారి మానసిక ఆరోగ్యంపైనా తీవ్ర ప్రభావం పడుతోంది. హింస, విధ్వంసం, కుటుంబ సభ్యులను కోల్పోవడం వల్ల పిల్లల్లో నిరాశ పెరిగింది. పిల్లల్లో ఆగ్రహావేశాలు పెరిగాయి. విచారం, భయం వంటి వాటితో బాధపడుతున్నారు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
ఇజ్రాయెల్ బాంబు దాడి.. త్రుటిలో తప్పించుకున్న WHO చీఫ్ గుటేరస్
యెమెన్: పలు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధ ప్రభావం ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధానోమ్ గ్యాబ్రియాసిస్(Tedros Adhanom Ghebreyesus)పై చూపించింది. బాంబు దాడి నుంచి ఆయన తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. ఈ షాకింగ్ ఘటన యెమెన్ దేశంలో చోటుచేసుకుంది. ఇజ్రాయెల్ వైమానిక దాడి నుంచి ఆయన అదృష్టవశాత్తు తప్పించుకున్నారు. ఈ ప్రమాదంలో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.వివరాల ప్రకారం.. ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధానోమ్ గురువారం యెమెన్ దేశంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఐక్యరాజ్యసమితికి చెందిన ఉద్యోగులతో కలిసి ఖైదీల విడుదల, యెమెన్‌లో పరిస్థితులపై చర్చించేందుకు అక్కడికి వెళ్లారు. చర్చల అనంతరం ఆయన యెమెన్ నుంచి బయలుదేరుతున్న క్రమంలో వైమానిక బాంబు దాడి జరిగింది. సనాలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆరోగ్య సంస్థకు చెందిన అధికారులు వేచి ఉన్న సమయంలో బాంబు దాడి జరిగింది. ఈ ప్రమాదంలో టెడ్రోస్ తృటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకోగా.. ఇద్దరు మృతిచెందారు. ఇక, ఈ దాడిని ఐక్యరాజ్యసమితి సైతం తీవ్రంగా ఖండించింది.అనంతరం, ఈ దాడి ఘటనపై టెడ్రోస్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. టెడ్రోస్ ట్విట్టర్లో..‘ఐక్యరాజ్యసమితికి చెందిన ఉద్యోగులతో కలిసి ఖైదీల విడుదలపై చర్చలు, యెమెన్‌లో ఆరోగ్యం, మానవతా పరిస్థితులను అంచనా వేసేందుకు అక్కడికి వెళ్లాం. ఖైదీలను తక్షణమే విడుదల చేయాలని మేము పిలుపునిచ్చాం. సనాలో విమానం ఎక్కేందుకు వేచిఉండగా బాంబు దాడి జరిగింది. ఈ దాడిలో ఇద్దరు మృతి చెందినట్లు సమాచారం. విమానంలోని ఓ సిబ్బంది గాయాలపాలయ్యారు. ఘటన జరిగిన ప్రాంతానికి, మాకు కొన్ని మీటర్ల దూరం మాత్రమే ఉంది. ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు సంతాపం తెలియచేస్తున్నాం’ అని కామెంట్స్ చేశారు.Our mission to negotiate the release of @UN staff detainees and to assess the health and humanitarian situation in #Yemen concluded today. We continue to call for the detainees' immediate release.As we were about to board our flight from Sana’a, about two hours ago, the airport… pic.twitter.com/riZayWHkvf— Tedros Adhanom Ghebreyesus (@DrTedros) December 26, 2024ఈ దాడిని ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ (Antonio Guterres) ఖండించారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ..‘ఇటీవల యెమెన్, ఇజ్రాయెల్‌ల మధ్య దాడులు తీవ్రతరం అయ్యాయి. సనా అంతర్జాతీయ విమనాశ్రయంతో సహా ఎర్రసముద్రం, ఓడరేవులు, యెమెన్‌లో పవర్ స్టేషన్లపై వైమానిక దాడులు ఆందోళనకరంగా ఉన్నాయి’ అని పేర్కొన్నారు. ఈ సందర్భంగా అంతర్జాతీయ చట్టాలను గౌరవించాలన్నారు. పౌరులు, కార్మికులే లక్ష్యంగా దాడులు చేయకూడదన్నారు. మరోవైపు. యెమెన్‌లోని సనా విమానాశ్రయం, ఇతర నౌకాశ్రయాలపై, పలు విద్యుత్కేంద్రాలపై గురువారం ఇజ్రాయెల్ (Israel) వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో పలువురు మృతి చెందారు. Israeli terrorism spreads to Yemen 🇾🇪🇮🇱Innocent civilians are forced to flee after Israel targets the airport in Sanaa. Israel's record of attacking unarmed women and children continues unabated. pic.twitter.com/DcnALJN8Nh— Robert Carter (@Bob_cart124) December 26, 2024 -
ఇజ్రాయెల్ సంచలన ప్రకటన.. ఇరాన్, సిరియా వార్నింగ్
టెహరాన్: ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య మరోసారి యుద్ధ వాతావరణం నెలకొంది. హమాస్ నేత ఇస్మాయిల్ హనియా మీద తామే దాడిచేసి అంతమొందించినట్లు ఇజ్రాయెల్ అధికారికంగా ప్రకటించడంతో ఇరాన్ ఘాటుగా స్పందించింది. హనియాను చంపడం హేయమైన ఉగ్రవాద చర్యగా ఇరాన్ వ్యాఖ్యానించింది.తాజాగా హమాస్ నేత ఇస్మాయిల్ హనియాను తాము అంతమొందించినట్టు ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ తెలిపారు. హూతీలపై కూడా ఇదే విధంగా దాడి చేస్తామని హెచ్చరించారు. ఇటీవలి కాలంలో హూతీ ఉగ్రవాదులు- ఇజ్రాయెల్‌పై భారీగా క్షిపణులు ప్రయోగిస్తున్నారు. వారికి ఇదే మా హెచ్చరిక. ఇప్పటికే హమాస్, హెజ్బొల్లాలను ఓడించాం. ఇరాన్ రక్షణ, ఉత్పత్తి వ్యవస్థలను నాశనం చేశాం. సిరియాలో బషర్ అల్ అసద్ పాలనను పడగొట్టాం. హనియా, సిన్వర్, నస్రల్లాలను హతమార్చాం. ఇక హూతీలను తుదముట్టిస్తాం అని కామెంట్స్ చేశారు.దీంతో, కాట్జ్ వ్యాఖ్యలపై ఇరాన్ స్పందించింది. ఈ క్రమంలో ఐక్యరాజ్యసమితిలోని ఇరాన్ అంబాసిడర్ అమీర్ సయీద్ ఇరవాని మాట్లాడుతూ.. హనియాను ఇజ్రాయెల్ చంపడం హేయమైన ఉగ్రవాద చర్య కిందికి వస్తుంది. ఇజ్రాయెల్ ఉగ్ర పాలన ప్రాంతీయ, అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పుగా మారుతోందని తీవ్ర విమర్శలు చేశారు. ఇదే సమయంలో ఇజ్రాయెల్‌పై ప్రతీకార దాడులు చేయడంలో తప్పు ఏమీ లేదని కామెంట్స్ చేశారు.ఇదిలా ఉండగా.. ఇజ్రాయెల్ వ్యాఖ్యలపై తాజాగా సిరియా కూడా స్పందించింది. ఈ సందర్బంగా తమ దేశంలో గందరగోళం సృష్టించవద్దని సిరియా నూతన విదేశాంగశాఖ మంత్రి అసద్ హసన్ అల్-షిబానీ.. ఇరాన్‌ను హెచ్చరించారు. ఇదే సమయంలో సిరియా ప్రజల ఆకాంక్షను గౌరవించాలి అంటూ ట్విట్టర్ వేదికగా తెలిపారు.ఇక, గాజాలో కాల్పుల విరమణ కోసం హమాస్ చర్చల ప్రయత్నాలకు హనీయే నాయకత్వం వహించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈ ఏడాది జూలై 31న టెహ్రాన్‌లోని గెస్ట్‌హౌస్‌లో హనీయేను ఇజ్రాయెల్ దళాలు హతమార్చాయి. అలాగే, సెప్టెంబరు 27న, ఇజ్రాయెల్ హెజ్బొల్లా చీఫ్ హసన్ నస్రల్లాను బీరూట్ బాంబు దాడిలో హతమార్చింది. దీని తర్వాత అక్టోబరు 16న గాజాలో హనీయే వారసుడు యాహ్యా సిన్వార్ హత్య జరిగింది. -
చిన్నారులను కూడా వదలని కర్కశత్వం
-
హమాస్ చీఫ్ హత్య..ఇజ్రాయెల్ కీలక ప్రకటన
టెల్అవీవ్:హమాస్ ముఖ్య నేత ఇస్మాయిల్ హనియే ఈ ఏడాది జులైలో హత్యకు గురైన విషయం తెలిసింది. హనియేను తామే అంతం చేశామని ఇజ్రాయెల్ తాజాగా ధ్రువీకరించింది. ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇటీవల కాలంలో యెమెన్‌కు చెందిన హౌతీ ఉగ్రవాద గ్రూపు ఇజ్రాయెల్‌పై క్షిపణులు ప్రయోగిస్తుంది.ఈ క్రమంలో వారికి ఓ స్పష్టమైన సందేశం అందించాలనుకుంటున్నా. హమాస్, హెజ్బొల్లాలను ఓడించాం. వారి మౌలిక సదుపాయాలను దెబ్బతీయడంతో పాటు హనియా, సిన్వర్, నస్రల్లాలను హతమార్చాం. ఇరాన్ రక్షణ,ఉత్పత్తి వ్యవస్థలను నాశనం చేశాం.సిరియాలో బషర్ అల్ అసద్ పాలనను పడగొట్టాం. హౌతీలకు కూడా గట్టి దెబ్బ తప్పదు’ అని కాట్జ్ హెచ్చరించారు.ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లో జులైలో జరిగిన ఆ దేశ నూతన అధ్యక్షుడి ప్రమాణస్వీకారంలో పాల్గొన్న హనియా హత్యకు గురైన విషయం తెలిసిందే. పథకం ప్రకారమే ఇజ్రాయెలే ఈ పని చేసిందని ఇరాన్ అప్పుడే ఆరోపించింది.అయితే అప్పట్లో ఇజ్రాయెల్ దీనిపై ఎలాంటి ప్రకటన చేయలేదు.తాజాగా ఈవిషయాన్ని ధ్రువీకరించింది. మరోవైపు గాజాలో యుద్ధం మొదలైనప్పటినుంచి హౌతీలు ఇజ్రాయెల్‌పై క్షిపణి దాడులకు పాల్పడుతున్నారు. వీరికి ఇరాన్ మద్దతిస్తూ వస్తోంది. తాము పాలస్తీనియన్లకు సంఘీభావంగా వ్యవహరిస్తున్నామని హౌతీ రెబెల్స్ పేర్కొంటున్నారు. -
గాజాలో మరణాలు 45 వేలు
డెయిర్ అల్–బలాహ్: గాజాలో ఇజ్రాయెల్ ఆర్మి–హమాస్ సాయుధ శ్రేణుల మధ్య 14 నెలలుగా సాగుతున్న పోరులో మృతి చెందిన పాలస్తీనియన్ల సంఖ్య 45 వేలకు చేరుకుంది. గత 24 గంటల్లో ఇజ్రాయెల్ దాడుల్లో అల్ జజీరా జర్నలిస్ట్ సహా 52 మంది ప్రాణాలు కోల్పోయినట్లు పాలస్తీనా అధికారులు తెలిపారు. మృతుల్లో మహిళలు, చిన్నారులు సగానికి పైగానే ఉంటారన్నారు. వీరిలో హమాస్ సాయుధులు, సాధారణ పౌరుల సంఖ్యను స్పష్టంగా చెప్పలేమని కూడా పేర్కొన్నారు. ఇప్పటి వరకు 17 వేల మంది మిలిటెంట్లను చంపినట్లు చెప్పుకుంటున్న ఇజ్రాయెల్ మిలటరీ ఇందుకు తగ్గ ఆధారాలను మాత్రం చూపడం లేదు. హమాస్, ఇజ్రాయెల్ ఆర్మీ మధ్య జరిగిన పోరులో 45,028 మంది అసువులు బాయగా 1,06,962 మంది క్షతగాత్రులుగా మిగిలారని సోమవారం పాలస్తీనా ఆరోగ్య శాఖ తెలిపింది. సహాయక సిబ్బంది సైతం చేరుకోలేని స్థితిలో ఇప్పటికీ వందలాదిగా మృతదేహాలు శిథిలాల కిందే ఉన్నాయని, వీటిని కూడా పరిగణనలోకి తీసుకుంటే మరణాలు మరింతగా పెరిగే అవకాశముందని చెప్పింది. యుద్ధానికి ముందు గాజాలో 23 లక్షల మంది పాలస్తీనియన్లలో కనీసం 2 శాతం మంది చనిపోయి ఉంటారని అంచనా వేసింది. అయితే, మిలిటెంట్లే లక్ష్యంగా తాము దాడులు చేపడుతున్నట్లు ఇజ్రాయెల్ ఆర్మీ అంటోంది. జనావాసాల మధ్యనే మిలిటెంట్ల స్థావరాలు ఉండటం వల్లే సాధారణ పౌరులు ప్రాణాలు కోల్పోతున్నారని చెబుతోంది. మృతుల్లో అల్ జజీరా టీవీ జర్నలిస్ట్ ఖాన్‌యూనిస్ నగరంలోని ఓ నివాసంపై ఇజ్రాయెల్ ఆర్మీ జరిగిన దాడిలో నలుగురు చనిపోయారని నాసర్ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. వీరిలో ఒకరు గాజాకు చెందిన అల్ జజీరా టీవీ ప్రతినిధి అహ్మద్ బకెర్ అల్–లౌహ్(39)కాగా, ముగ్గురు పౌర రక్షణ సిబ్బందివీరిలో ఒకరు అని తెలిపాయి. అంతకుముందు జరిగిన బాంబు దాడిలో గాయపడిన కుటుంబాన్ని రక్షించేందుకు ప్రయత్నిస్తుండగా జరిగిన దాడిలో బకెర్ ప్రాణాలు కోల్పోయారని అల్ జజీరా తెలిపింది. అదేవిధంగా, గాజా నగరంలోని షిజైయా ప్రాంతంలోని ఓ నివాసం భవనంపై ఇజ్రాయెల్ ఆర్మీ జరిపిన దాడిలో ఒకే కుటుంబంలోని నలుగురు సహా 10 మంది మృతి చెందారు. ఖాన్ యూనిస్ నగరంలో శరణార్థులు తలదాచుకుంటున్న పాఠశాల భవనంపై జరిగిన మరో దాడిలో ఆరుగురు చిన్నారులు, ఇద్దరు మహిళలు సహా 13 మంది చనిపోయారని నాసర్ ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. ఇంటర్నేషనల్ ఫెడరేషన్ ఫర్ జర్నలిస్ట్స్ వెల్లడించిన వివరాల ప్రకారం..ఈ ఏడాదిలో ఇప్పటి వరకు విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన జర్నలిస్టులు 105 మంది కాగా, వీరి సగం మంది గాజాలోనే ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఇజ్రాయెల్ భూభాగంపై మెరుపు దాడి చేసి వందల సంఖ్యలో పౌరులను హమాస్ శ్రేణులు అపహరించుకుపోవడంతో 2023 అక్టోబర్ 7న యుద్ధం మొదలవడం తెలిసిందే. ఈ పోరులో 55 మంది పాలస్తీనా మీడియా సిబ్బంది సహా మొత్తం 138 మంది చనిపోయినట్లు ఈ సంస్థ పేర్కొంది. అయితే, జర్నలిస్టుల ముసుగులో హమాస్ శ్రేణులు కార్యకలాపాలు సాగిస్తున్నాయని ఇజ్రాయెల్ ఆర్మీ వాదిస్తోంది.