
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా ఇజ్రాయెల్-గాజా యుద్ధంపై ఆసక్తిరక ప్రకటన చేశారు. ఇరాన్ మద్దతు కలిగిన హమాస్ ఉగ్రవాదులు.. గాజాలో ఇజ్రాయెల్‌తో 60 రోజుల కాల్పుల విరమణకు తుది ప్రతిపాదనకు అంగీకరించాలని కోరారు. దీనికి సంబంధించిన పత్రాలను ఖతార్- ఈజిప్ట్‌కు మధ్యవర్తిత్వం వహించే అధికారులు అందిస్తారని తెలిపారు.
ట్రంప్ తన సోషల్ మీడియా పోస్ట్‌లో తమ ప్రతినిధులు గాజా విషయమై ఇజ్రాయెల్ అధికారులతో సుదీర్ఘమైన సమావేశాన్ని నిర్వహించారని తెలిపారు. అమెరికా ప్రత్యేక రాయబారి స్టీవ్ విట్‌కాఫ్, విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ తదితరులు ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు సీనియర్ సలహాదారు రాన్ డెర్మెర్‌తో సమావేశమయ్యారని సమాచారం. కాగా 60 రోజుల కాల్పుల విరమణను ఖరారు చేసేందుకు రూపొందించిన షరతులను ఇజ్రాయెల్ అంగీకరించిందని, తాము ఈ యుద్ధాన్ని ముగించడానికి అన్ని పార్టీలతో కలిసి పని చేస్తామని ట్రంప్ పేర్కొన్నారు. ఖతార్, ఈజిప్ట్ ప్రతినిధులు హమాస్‌కు ఈ తుది ప్రతిపాదనను అందజేస్తారని ట్రంప్ పేర్కొన్నారు.
మిడిల్ ఈస్ట్‌లో మంచి జరిగేందుకు హమాస్ ఈ ఒప్పందాన్ని అంగీకరిస్తుందని భావిస్తున్నానని, దీనికి సమ్మతించని పక్షంలో పరిస్థితులు మరింత దిగజారవచ్చని ట్రంప్ వ్యాఖ్యానించారు. గాజాలో ఇజ్రాయెల్.. హమాస్ ఉగ్రవాదుల మధ్య బందీల విడుదల కోసం ఈ కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిందని ట్రంప్ పేర్కొన్నారు. ఇజ్రాయెల్ తెలిపిన వివరాల ప్రకారం 2023 అక్టోబర్ 7న హమాస్ ఉగ్రవాదులు ఇజ్రాయెల్‌పై దాడి చేసి 1,200 మందిని హత్యచేసి, 251 మందిని బందీలుగా పట్టకున్న దరమిల గాజాలో యుద్ధం ప్రారంభమైంది.
ఇది కూడా చదవండి: ‘పహల్గామ్’ ముష్కరులపై తక్షణ చర్యలకు ‘క్వాడ్’ డిమాండ్