
వాషింగ్టన్: భారత్, చైనా విషయంలో అమెరికా మరో సంచలన ప్రకటన జారీ చేసింది. రష్యాతో వ్యాపార సంబంధాలు కొనసాగిస్తే భారత్, చైనాలపై 500 శాతం సుంకాలు విధిస్తామని హెచ్చరించింది. దీంతో, అగ్రరాజ్యం అమెరికా తీరు తీవ్ర చర్చకు దారి తీసింది. ఇక, ఇటీవలే భారత్‌తో బిగ్ డీల్ ఉంటుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇక, తాజాగా ఇలా మాట మార్చడం గమనార్హం.
రిపబ్లికన్ సెనేటర్ లిండ్సే గ్రాహం తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. రష్యా, ఉక్రెయిన్ మధ్య పరిస్థితులను గమనిస్తున్నాం. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసే దేశాలపై తప్పకుండా చర్చలు ఉంటాయి. ఉక్రెయిన్‌కు సాయం చేయని దేశాల ఉత్పత్తులపై 500 శాతం సుంకం విధిస్తాం. రష్యా నుంచి చమురును భారత్, చైనాలు 70శాతం కొనుగోలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా ఈ రెండు దేశాలపై సుంకం విధించే అంశం పరిశీలిస్తున్నామని అన్నారు. ఇదే సమయంలో ఆగస్టులో బిల్లు ప్రవేశపెట్టే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. ఈ బిల్లుపై ట్రంప్ కూడా ఓకే చెప్పారని వెల్లడించారు.
అయితే, ఉక్రెయిన్‌తో యుద్ధం విషయంలో రష్యా కాల్పులు విరమణకు అంగీకరించలేదు. ట్రంప్ సూచనలు, హెచ్చరికలను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ లెక్క చేయలేదు. దీంతో, రష్యాను అమెరికా టార్గెట్ చేసింది. రష్యాను ఆర్థికంగా ఇబ్బందులకు గురిచేసే యూఎస్ ప్రయత్నాల్లో ఇది ఒకటిగా తెలుస్తోంది. ఈ బిల్లు అమల్లోకి వస్తే.. రష్యా నుంచి పెద్దమొత్తంలో ముడి చమురు కొనుగోలు చేస్తున్న భారత్, చైనాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇది మన ఔషధాలు, వస్త్రాలు వంటి ఎగుమతులపై ప్రభావం పడుతుంది. ఇక, ఉక్రెయిన్‌కు మద్దతు ఇచ్చే దేశాల కోసం లిండ్సే మరో ఒప్పందాన్ని ప్రతిపాదించనున్నట్లు తెలుస్తోంది.
ట్రంప్ బిగ్ డీల్ ప్రకటన..
ఇదిలా ఉండగా.. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవలే భారత్‌తో బిగ్ డీల్ ఉండనున్నట్టు తెలిపారు. త్వరలోనే భారత్‌తో ఒప్పందం కుదుర్చుకోనున్నాం. అది ఒక కొత్త డీల్ అవుతుంది. ప్రస్తుతం భారత్ ఇంకా దాన్ని అంగీకరించలేదు. వాళ్లు డీల్‌కు ఒప్పుకుంటే తక్కువ సుంకాలు విధించేలా ఒప్పందం కుదురుతుందని అన్నారు. జూలై తొమ్మిదో తేదీ నాటికి వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవాలని ఇరు దేశాలు ప్రయత్నిస్తున్నాయి. దీనిపై చర్చలు సైతం జరుగుతున్నట్టు తెలుస్తోంది.