
టిబెటన్ ఆధ్మాత్మిక గురువు దలైలామా(Dalai Lama) సంచలన ప్రకటన చేశారు. తన తదనంతరమూ ‘దలైలామా’ పదవీ సంప్రదాయం మనుగడలో కొనసాగుతుందని తెలిపారాయన. మరణానంతరం కూడా దలైలామా పదవి కొనసాగుతుందని.. ఈ ఎంపిక ప్రక్రియలో చైనా ప్రమేయం ఎట్టిపరిస్థితుల్లో ఉండబోదని కుండబద్ధలు కొట్టారాయన.
దలైలామా పదవి 600 సంవత్సరాలుగా కొనసాగుతున్న బౌద్ధ సంప్రదాయం. తదుపరి దలైలామా ఎంపిక కోసం చైనా కుతంత్రాలు చేస్తోంది. అయితే తన మరణానంతరం బౌద్ధ మతాధిపతిని ఎంచుకునే బాధ్యతను గాడెన్ ఫోడ్రాంగ్ ట్రస్ట్(Gaden Phodrang Trust) అనే సంస్థకు ఆయన అప్పగించారు. ఈ ట్రస్ట్‌ను దలైలామానే 2015లో స్థాపించారు. ఇది భవిష్యత్ దలైలామాను గుర్తించే అధికారిక సంస్థగా వ్యవహరిస్తుందని బుధవారం ఒక ప్రకటనలో స్పష్టం చేశారాయన. అంతేకాదు.. తన వారసత్వం కొనసాగాలని 14 ఏళ్లుగా టిబెట్, హిమాలయ, మంగోలియా, రష్యా, చైనా మద్దతుదారుల నుంచి అభ్యర్థనలు వస్తూనే ఉన్నాయని వెల్లడించారాయన.
Statement Affirming the Continuation of the Institution of Dalai Lama
(Translated from the original Tibetan)
On 24 September 2011, at a meeting of the heads of Tibetan spiritual traditions, I made a statement to fellow Tibetans in and outside Tibet, followers of Tibetan… pic.twitter.com/VqtBUH9yDm— Dalai Lama (@DalaiLama) July 2, 2025
అయితే టిబెట్‌పై ఆధిపత్యం చెలాయిస్తున్న చైనా ప్రభుత్వం గోల్డెన్ అర్న్ అనే పద్ధతిలో తమకు అనుకూల వ్యక్తిని దలైలామాగా నియమించాలని భావిస్తోంది. ఈ ప్రయత్నాన్ని తాజాగా దలైలామా ఖండించారు. ధర్మాన్ని నమ్మని కమ్యూనిస్టులు పునర్జన్మ వ్యవస్థలో జోక్యం చేసుకోవడం అనుచితం అని వ్యాఖ్యానించారాయన. తద్వారా తన వారసత్వాన్ని ఆధ్యాత్మిక సంప్రదాయాల ప్రకారం కొనసాగించాలన్న సంకల్పాన్ని వ్యక్తపరిచారు. తన 90వ పుట్టినరోజు కంటే నాలుగు రోజుల ముందుగానే(జులై 6న) దలైలామా తాజా ప్రకటన చేయడం చైనా ప్రభుత్వానికి గట్టి సవాలుగా మారింది.
చైనా రియాక్షన్ ఇది
దలైలామా ప్రకటనపై చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ బుధవారం స్పందించింది. "దలైలామా, పాంచెన్ లామా, ఇతర ప్రముఖ బౌద్ధ గురువుల ఎంపిక తప్పనిసరిగా 'గోల్డెన్ అర్న్' పద్ధతిలో.. అదీ కేంద్ర ప్రభుత్వ ఆమోదంతోనే జరగాలి అని ఆ శాఖ ప్రతినిధి మావో నింగ్ తెలిపారు. ఈ పద్ధతి 18వ శతాబ్దంలో చింగ్ వంశాధిపతి ప్రవేశపెట్టిన విధానమని పేర్కొన్న ఆమె.. చైనా ప్రభుత్వం మత స్వేచ్ఛకు కట్టుబడి ఉందని, అలాగని మత సంబంధిత వ్యవహారాలపై నియంత్రణలు, బౌద్ధ గురువుల నియామకాల కోసం ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి అని మావో నింగ్ గుర్తు చేస్తున్నారు.
ప్రస్తుత దలైలామా అసలు పేరు టెన్జిన్ గ్యాట్సో(89).. 14వ దలైలామా. ఈయన 1935లో టిబెట్‌లోని టాక్సేర్ గ్రామంలో జన్మించారు. 1940లో 14వ దలైలామాగా గుర్తింపు పొందారు. టిబెట్‌లో లాసా బౌద్ధ యాత్రికులకు అత్యంత పవిత్రమైన ప్రాంతం. ఆ ప్రాంతం కేంద్రంగా దలైలామా బౌద్ధ మత ప్రచారం, ఇతర కార్యకలాపాలు నిర్వహించేవారు. 1950లో చైనా టిబెట్‌ను ఆక్రమించింది. అయితే 1959లో ఆ ఆక్రమణకు వ్యతిరేకంగా లాసాలో తిరుగుబాటు జరగ్గా.. చైనా దానిని అణచివేసింది.
అంతేకాదు ప్రపంచమంతా ఇప్పుడు శాంతికాముడిగా భావించే దలైలామాను.. అప్పట్లో వేర్పాటువాదిగా, తిరుగుబాటుదారుడిగా చైనా ముద్ర వేసింది. దీంతో ఆయన భారత్‌లోని ధర్మశాలకు వచ్చి ఆశ్రయం పొందుతున్నారు. అప్పటి నుంచి చైనా టిబెట్ సంబంధాల్లో లాసా ఓ కీలక రాజకీయ కేంద్రంగా కొనసాగుతోంది. ఇక.. టిబెటన్ బౌద్ధులు మాత్రం, పారంపరిక పద్ధతుల ప్రకారమే దలైలామా ఎంపిక జరగాలని కోరుకుంటున్నారు. కానీ..
టిబెట్ చైనా స్వభూమిగా పేర్కొంటూ.. దలైలామా ఎంపికపై తమకే హక్కు ఉందని డ్రాగన్ వాదిస్తోంది. మరోవైపు దలైలామా వ్యవహారంలో చైనా జోక్యాన్ని అగ్రరాజ్యం అమెరికా సైతం ఖండిస్తూ వస్తోంది. దలైలామా ఎంపికపై చైనాకు ఎలాంటి హక్కు లేదు అని చెబుతోంది. 2020లో అమెరికా అంతర్జాతీయ మత స్వేచ్ఛ రాయబారి శామ్యూల్ డీ బ్రౌన్‌బ్యాక్.. ధర్మశాలలో టిబెటన్ శరణార్థులతో సమావేశమై, ఈ విషయాన్ని పునరుద్ఘాటించారు. అంతేకాదు.. చైనా జోక్యాన్ని ఖండిస్తూ అమెరికా కాంగ్రెస్ 2020లో "టిబెట్ పాలసీ అండ్ సపోర్ట్ యాక్ట్" అనే చట్టాన్ని ఆమోదించింది. ఈ చట్టం ప్రకారం.. చైనా జోక్యం లేకుండా దలైలామా ఎంపిక జరగాలి. ఒకవేళ ఈ ప్రక్రియలో గనుక చైనా అధికార యంత్రాంగం జోక్యం చేసుకుంటే వాళ్లపై ఆంక్షలు విధించవచ్చు.