ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు ఉదంతంపై అంతర్జాతీయంగా వచ్చిపడుతున్న వ్యాఖ్యానాలు, విమర్శలు ఇప్పట్లో ఆగేలా లేవు. తాజాగా ఐక్యరాజ్యసమితి ప్రకటనతో ఈ సంగతి రుజువవుతోంది. మొదట జర్మనీ, ఆ తర్వాత అమెరికా చేసిన వ్యాఖ్యానాలపై మన దేశం ప్రతిస్పందిస్తుండగానే ఐక్యరాజ్యసమితి అధికార ప్రతినిధి సైతం కేజ్రీవాల్ కేసులో నిష్పక్షపాతంగా, పారదర్శ కంగా వ్యవహరించాలని సూచించటం సాధారణ విషయం కాదు. పైగా ఢిల్లీలోని అమెరికా దౌత్య వేత్త గ్లోరియా బెర్బేనాను విదేశాంగ శాఖ కార్యాలయానికి పిలిపించి మన అసంతృప్తిని, అభ్యంత రాన్ని తెలియజేసి 24 గంటలు గడవకుండానే రెండోసారి కూడా కేజ్రీవాల్ కేసులో అమెరికా ఆందో ళన వ్యక్తం చేసింది.
దాంతోపాటు కాంగ్రెస్ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేయటాన్ని కూడా ప్రస్తా వించింది. ఇక అంతర్జాతీయ మానవహక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ ప్రకటన సరేసరి. అన్ని టికీ అతీతమని భావించుకునేవారు సైతం అనుకోకుండా వచ్చిపడే పొగడ్తలకు లోలోన సంతోషపడకుండా వుండలేరు. అలాగే విమర్శలొచ్చినప్పుడూ, తప్పును ఎత్తిచూపినప్పుడూ పౌరుషం పొడుచు కురావటం కూడా సహజం. పాశ్చాత్య దేశాలు అవసరార్థమో, అనివార్య పరిస్థితుల్లోనో మన దేశాన్ని ప్రశంసలతో ముంచెత్తిన ఉదంతాలు కోకొల్లలు.
అయితే వాటినుంచి వచ్చే విమర్శలు అలా కాదు. అవి అరుదే కావొచ్చుగానీ ఆలోచించదగినవి. ఇందిరాగాంధీ దేశంలో ఆత్యయిక పరిస్థితి ప్రకటించి దేశాన్నే జైలుగా మార్చినప్పుడు అంతర్జాతీయంగా తీవ్ర విమర్శలు చెలరేగాయి. అనంతరకాలంలో మేధావులనూ, పౌరహక్కుల సంస్థల నేతలనూ అరెస్టు చేసిన సందర్భాల్లో పాశ్చాత్య ప్రపంచంస్పందించకపోలేదుగానీ... ఇప్పుడు కేజ్రీవాల్ అరెస్టుపై వెలువడుతున్న స్పందన తీవ్రత అధికం.
ప్రజాస్వామ్యబద్ధంగా జరిగే ఎన్నికల ద్వారా ఏర్పడే ప్రభుత్వాలకూ, అవి ప్రాతినిధ్యంవహించే రాజ్యాలకూ అంతర్జాతీయంగా ఆమోదనీయత, విశ్వసనీయత వుంటాయి. అయితే అస మ్మతి విషయంలో వాటి వైఖరి ఎలావుందన్నదాన్నిబట్టి ఆ ప్రభుత్వాల నైతిక స్థితి నిర్ణయమవుతుంది. దాన్ని పొందాలంటే సంయమనం పాటించటం, విమర్శలను హుందాగా స్వీకరించటం, పాలనలో పారదర్శకంగా వుండటం అవసరమవుతాయి. అగ్రరాజ్యాలు అన్నాయని కాదుగానీ, మన దేశంలో అంతా సవ్యంగానే వున్నదని భావించగలమా? కేజ్రీవాల్ అరెస్టు వ్యవహారమే తీసుకుంటే దాదాపు రెండేళ్లనుంచి మద్యం కుంభకోణం గురించీ, అందులో కేజ్రీవాల్‌తోపాటు ఢిల్లీ ఉప ముఖ్య మంత్రి మనీశ్ సిసోడియా పేరు వినిపిస్తూనే వుంది.
కానీ తనను తక్షణం విడుదల చేయాలన్న కేజ్రీ వాల్ వాదనకు జవాబిచ్చేందుకు మూడు వారాల వ్యవధి కావాలని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) న్యాయస్థానాన్ని కోరటం ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆయన వాదనను పూర్వపక్షం చేసే పకడ్బందీ ఆధారాలు ఆ సంస్థ వద్ద ఉంటే వాటిని న్యాయస్థానం ముందుంచి ఈ కారణాల రీత్యా కేజ్రీవాల్ వాదన చెల్లదని వెనువెంటనే చెప్పలేని స్థితిలో వుండటం ఈడీ తీరుతెన్నులపై అనుమా నాలు రేకెత్తించదా? ఆమధ్య మనీశ్ సిసోడియా విషయంలోనూ ఇలాగే జరిగింది. ఆయనపై అప్రూవర్‌లు ఇచ్చిన ప్రకటనలు మినహా తమ వద్ద వేరే ఆధారాల్లేవని సుప్రీంకోర్టు ముందే ఆసంస్థ అంగీకరించింది. ఇప్పుడు కేజ్రీవాల్ ఆ అంశంపైనే నిలదీస్తున్నారు. ఒక ముఖ్యమంత్రిపై ఎవరో ఆరోపణలు చేస్తే కేవలం వాటి ఆధారంగా అరెస్టు చేయటం సబబేనా అని న్యాయస్థానం ముందు వినిపించిన వాదనల్లో ఆయన ప్రశ్నించారు.
దేనికైనా సమయం, సందర్భం చూసుకోవాలంటారు. ఒకపక్క సార్వత్రిక ఎన్నికలు ముంగిట్లో వున్నాయి. అన్ని పార్టీలూ తమ తమ సత్తా చాటేందుకు పొత్తులు ఖరారు చేసుకుని వ్యూహరచనలో మునిగాయి. ఇలాంటి సమయంలో విపక్ష కూటమి అధినేతను అరెస్టు చేయటం విమర్శలకు ఆస్కారమిస్తుందని తెలియనంత అమాయకత్వంలో ఈడీ వున్నదంటే నమ్మలేం. మరో మూడు నాలుగు నెలలు ఆగితే ఇందులో కొంపమునిగేది ఏముందన్న ప్రశ్నకు ఆ సంస్థ దగ్గర జవాబులేదు. నేరం నిరూపణయ్యేవరకూ నిందితుడు నిర్దోషేనని న్యాయ శాస్త్రం చెబుతుంది. అలాగే అసాధారణ పరిస్థితుల్లో తప్ప నిందితులను జైలుకు పంపరాదని ఇటీవల సైతం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ కింది కోర్టులకు హితవు పలికారు.
పౌరులకు రాజ్యాంగం కల్పించే ఈ రక్షణలను విస్మరించటం, నీరు కార్చటం బాహాటంగా కనిపిస్తుంటే విమర్శలు రావా? మన దేశంలో ఇప్పటికీ ఇతర వ్యవస్థలతో పోలిస్తే న్యాయవ్యవస్థకు విశ్వసనీయత అధికం. దాన్ని మరింత పెంచేలా ప్రభుత్వ విభాగాల వ్యవహారశైలి వుండాలి. దానికి విఘాతం కలిగితే పాలకపక్షం సంగతలావుంచి దేశ పరువుప్రతిష్ఠలకే భంగం వాటిల్లుతుంది. అమెరికా రెండోసారి కూడా అన్నదనో, జర్మనీ విమర్శించిందనో, ఐక్యరాజ్యసమితి సైతం మాట్లాడిందనో కాదు... చట్టం ముందు పౌరులంతా సమానమన్న రాజ్యాంగస్ఫూర్తికి అనుగుణంగా వ్యవహరిస్తున్నామా లేదా అన్న అంశంలో ఆత్మవిమర్శ చేసుకోక తప్పదు.
సహ ప్రజాస్వామిక దేశాల అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకోవటం విషయంలో బాధ్యతతో మెలగాలనీ, దాన్ని విస్మరించటం సరికాదనీ మన విదేశాంగ శాఖ హితవు పలికింది. కానీ మానవహక్కుల ఉల్లంఘనల అంశంలో మనం కూడా వేరే దేశాల తీరుతెన్నులను విమర్శించిన సందర్భాలున్నాయని గుర్తించాలి. మనం అన్ని విషయాల్లోనూ సక్రమంగానే వున్నామన్న భావన ఇంటా బయటా కలగజేయటం ప్రభుత్వ బాధ్యత. దానికి భిన్నమైన పరిస్థితులుంటే అవి ఎందుకు తలెత్తాయో సమీక్షించుకోవటం అవసరం.
Comments
Please login to add a commentAdd a comment