న్యూఢిల్లీ: లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు ట్రయల్ కోర్టు మంజూరు చేసిన బెయిల్ ఆదేశాలను ఢిల్లీ హైకోర్టు నిలిపివేయడంపై 150 మంది న్యాయవాదులు ఆందోళన వ్యక్తం చేశారు. కోర్టులు ఆచరిస్తున్న అసాధారణ పద్ధతులపై జోక్యం చేసుకోవాలని కోరుతూ భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) డీవై చంద్రచూడ్‌కు లేఖ రాశారు.
లిక్కర్ కేసులో కేజ్రీవాల్‌కు రౌస్ అవెన్యూ కోర్టు మంజూరు చేసిన బెయిల్ ఆర్డర్ ఉత్తర్వులు ఆప్‌లోడ్ చేయడానికి ముందే ఢిల్లీ హైకోర్టులో ఈడీ ఎలా సవాల్ చేసింది?, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సుధీర్ కుమార్ జైన్ ఈడీ సవాల్‌పై ఎలా విచారణ చేపట్టి ఆర్డర్‌ను హోల్డ్‌లో ఉంచారు? బెయిల్ అమలును ఎలా నిలిపివేశారు? అని ప్రశ్నించారు. భారత న్యాయవ్యవస్థ చరిత్రలో ఇలాంటివి ఎప్పుడూ చూడలేదని, ఇది న్యాయవాదుల్లో తీవ్ర ఆందోళన రేకెత్తించిందని 9 పేజీల లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.
అదే విధంగా న్యాయవాదుల సమర్పణలను న్యాయమూర్తులు తమ ఆదేశాలలో రికార్డ్ చేయడం లేదని న్యాయవాదులు ఆరోపించారు. ఇది కోర్టు చరిత్రలో మొదటిసారి అని, ఇది చాలా అసాధారణమైనదని పేర్కొన్నారు. దీనిని సరిదిద్దాల్సిన అవసరం ఉందన్నారు. విచారణ సమయంలో చేసిన సమర్పణలను న్యాయవాదుల ముందు, కేసు వాయిదా వేయడానికి ముందు రికార్డ్ చేయాలని ఆదేశాలు జారీ చేయవలసిందిగా అభ్యర్ధించారు.
బెయిల్ మంజూరులో జాప్యం గురించి ప్రస్తావిస్తూ.. ‘ముఖ్యంగా ఈడీ, సీబీఐకు సంబంధించిన కేసుల్లో న్యాయమూర్తులు ఎక్కువ వ్యవధిలో విచారణ తేదీలు ఇస్తారు. బెయిల్ విషయాలను త్వరగా పరిష్కరించరు. న్యాయ సూత్రాలకు, రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛ హామీకి ఇది విరుద్ధం.
ఈ దేశ ప్రజలు ఎంతో ఆశతో, విశ్వాసంతో న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్నారు. ఈ నమ్మకాన్ని న్యాయవ్యవస్థ, న్యాయ సంఘం సమర్థించాల్సిన అవసరం ఉంది. ఈ క్రమంలోనే మా ఆందోళనలను మీతో పంచుకుంటున్నాం. వీటిని త్వరగా సరిదిద్దుతారని ఆశిస్తున్నాం.’ అని లేఖలో ప్రస్తావించారు.
Comments
Please login to add a commentAdd a comment