
ఎన్నికైన ప్రభుత్వాలను బేఖాతరు చేస్తూ తరచు ఇబ్బందులు సృష్టించే గవర్నర్లకిది శరాఘాతం. శాసనసభ ఆమోదించిన పది బిల్లులపై ఆమోదముద్ర వేయకుండా, రాష్ట్రపతి పరిశీలనకు పంపకుండా దీర్ఘకాలం పెండింగ్‌లో పెట్టిన తమిళనాడు గవర్నర్ ఆర్‌ఎన్ రవి తీరును తప్పుబట్టడమేకాక ఆ బిల్లులన్నీ ఆమోదించినట్టుగా భావిస్తూ సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం వెలువరించిన తీర్పు అసాధారణమైనది.
రాజ్యాంగంలోని 142వ అధికరణ కింద తనకు దఖలు పడిన విశేషాధి కారాలను వినియోగించుకుని సుప్రీంకోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. తాము ఎన్నికైన ప్రభుత్వాల కన్నా అధికులమని భావించటం, వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ప్రభుత్వాలను ఇరకాటంలో పెట్టడం చాన్నాళ్లుగా కొందరు గవర్నర్లలో కనిపిస్తున్న ధోరణి. తనముందుకొచ్చే ఈ మాదిరి కేసులపై విచారిస్తున్నప్పుడూ లేదా తీర్పు వెలువరించినప్పుడూ ఈ ప్రవర్తన సరికాదని సుప్రీంకోర్టు చెబుతూనే వచ్చింది.
వేరే రాష్ట్రాలకు సంబంధించి తీర్పు వచ్చినప్పుడైనా తమ అధికారాలేమిటో, పరిమితు లేమిటో తెలుసుకుని మెలగటం, ప్రవర్తనను సవరించుకోవటం విజ్ఞత అనిపించుకుంటుంది. కానీ అదెక్కడా కనబడటం లేదు. అలాగని గవర్నర్లంతా ఈమాదిరిగానే ఉంటున్నారని అనుకోనవసరం లేదు. కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ ఒకే పార్టీ అధికారంలో వున్నచోట ఎలాంటి సమస్యలూ కన బడవు. వ్యక్తులుగా హుందాతనాన్ని ప్రదర్శించే గవర్నర్లు విపక్ష ప్రభుత్వాల ఏలుబడిలోని రాష్ట్రాల్లో సాఫీగా పనిచేసుకుపోతున్నారు. ఎటొచ్చీ కొందరు గవర్నర్లు మాత్రం వింత పోకడలు పోతున్నారు.
తమిళనాడు శాసనసభ ఆమోదించి గవర్నర్ రవి వద్ద పెండింగ్‌లో వున్న పది బిల్లుల్లో జనవరి 2020 నాటిది కూడా ఉందంటే ఆశ్చర్యం కలుగుతుంది. అంతేకాదు... ఈ బిల్లుల్లో చాలాభాగం ఒకసారి అసెంబ్లీలో ఆమోదం పొంది గవర్నర్ తిరస్కారానికి గురై రెండోసారి అసెంబ్లీ ఆమోదం పొంది వచ్చినవి. రాజ్యాంగ నిబంధన ప్రకారం ఒక బిల్లు తన సంతకం కోసం వచ్చినప్పుడు గవర్నర్ దాన్ని ఆమోదించటమో, తిరస్కరించటమో, రాష్ట్రపతి పరిశీలనకు పంపడమో చేయాలి.
అంతేతప్ప నెలల తరబడి తొక్కిపెట్టి వుంచ కూడదు. ఈ సంగతిని రెండేళ్లనాడు పంజాబ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పు వెలువరిస్తూ సుప్రీంకోర్టు తెలియజేసింది. అక్కడి గవర్నర్ ఏకంగా 12 బిల్లుల్ని దీర్ఘకాలం పెండింగ్‌లో ఉంచారు. తన ఆమోదముద్ర కోసం వచ్చిన బిల్లుపై ‘సాధ్యమైనంత త్వరగా’ గవర్నర్ నిర్ణయం తీసుకోవాలని, పునఃపరిశీలన అవసరమని భావిస్తే ఆ సంగతి తెలియజేయాలని అప్పటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం స్పష్టం చేసింది.
రాజ్యాంగంలోని 200వ అధికరణ సైతం ఈ సంగతే చెబుతోంది. బిల్లు సక్రమంగా లేదని, స్పష్టత కొరవడిందని లేదా రాజ్యాంగ నిబంధనలను అతిక్రమిస్తోందని గవర్నర్ భావిస్తే దాన్ని తిప్పిపంపొచ్చు. గవర్నర్ ఇచ్చిన సలహాను అంగీకరించి బిల్లుకు సవరణలు చేయటమా లేక య«థాతథంగా దాన్నే మరోసారి ఆమోదించి పంపటమా అనేది శాసనసభ ఇష్టమని ఆ అధికరణ తేటతెల్లం చేస్తోంది. రెండోసారి వచ్చిన బిల్లును గవర్నర్ ఆమోదించి తీరాలని లేదా రాష్ట్రపతి పరిశీలనకు పంపాలని చెబుతోంది. నిబంధనలుఇంత స్పష్టంగా ఉన్నప్పుడు రవి ఇష్టానుసారం ప్రవర్తించటం అనుచితం.
పంజాబ్ కేసులో ఇచ్చిన తీర్పును గవర్నర్లు బేఖాతరు చేస్తున్నారని గమనించటం వల్లే... ఆమోదం కోరుతూ తమ వద్దకొచ్చిన బిల్లు విషయంలో గవర్నర్లు ఎలా మెలగాలో తాజా తీర్పులో సుప్రీంకోర్టు ధర్మాసనం నిర్దేశించాల్సి వచ్చింది. రాష్ట్రపతి పరిశీలనకు పంపదల్చుకున్న బిల్లుల్ని గరిష్ఠంగా మూడు నెలలు మించి తమవద్ద ఉంచుకోరాదని, పునఃపరిశీలనకొచ్చిన బిల్లునైతే వెంటనే ఆమోదించాలని లేదా గరిష్ఠంగా నెల రోజుల్లోపల సమ్మతి తెలపాలని ధర్మాసనం తెలిపింది.
తొలిసారి వచ్చిన బిల్లుకూ, రెండోసారి పంపిన బిల్లుకూ వ్యత్యాసం ఉన్నపక్షంలో మాత్రమే ఇందుకు మినహాయింపు వుంటుంది. ప్రజాస్వామ్యంలో ప్రజలెన్నుకున్న ప్రభుత్వాలకు అధికారాలుండాలి. కానీ ఆ ప్రభుత్వాలపట్ల ఏర్పర్చుకున్న అభిప్రాయంతో ఈ అధికారాలకు అవరోధాలు కల్పించాలని చూడటం రాజ్యాంగ ధిక్కరణ అవుతుందని గవర్నర్లు గ్రహించటం లేదు. అరుణాచల్‌ప్రదేశ్ అసెంబ్లీ కేసులో 2016లో ఇచ్చిన తీర్పులో ఈ సంగతిని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
తన ఆమోదం కోసం వచ్చిన బిల్లులపై ‘సాధ్యమైనంత త్వరగా’ నిర్ణయం తీసుకోవాలని పంజాబ్ కేసు విషయంలో సుప్రీంకోర్టు చెప్పినప్పుడే రవి అప్రమత్తమై తన పరిమితులను గుర్తెరిగి వుంటే తాజా తీర్పులో నిర్దిష్ట గడువు నిర్దేశించాల్సిన అవసరం ఉండేది కాదు. తమ ప్రవర్తనవల్ల రాజ్యాంగ పదవికుండే ఔన్నత్యాన్ని పలచన చేస్తున్నామని గవర్నర్లు ఇకనైనా గుర్తెరగాలి. కేంద్రంలో రాష్ట్రపతి మాదిరే రాష్ట్రాల్లో గవర్నర్లు కూడా రాజ్యాంగానికి అనుగుణంగా కొన్ని అధికారాలు, బాధ్య తలు కలిగివుంటారు.
కానీ రాష్ట్రపతి తరహాలో వారు ఎన్నిక కారు. కేంద్ర కేబినెట్ సలహా మేరకు రాష్ట్రపతి వారిని నియమిస్తారు. రాజకీయ నాయకులు గవర్నర్లు కావటంవల్లే సమస్యలొస్తున్నాయని సుప్రీంకోర్టు భావించి భిన్నరంగాల్లో నిపుణులైనవారిని ఈ పదవికి ఎంపిక చేయాలని గతంలో సూచించింది. కానీ కేంద్రంలోని పాలకులకు నచ్చినవారే ఈ కోటాలో ఎంపికవుతారు గనుక ఆ నిపు ణులు రాజకీయాలకు అతీతంగా ఏమీవుండరు. రాజకీయంగా గవర్నర్లకు ఎలాంటి అభిప్రాయా లున్నా రాజ్యాంగ పదవిలో ఉంటున్నవారిగా అందుకు అనుగుణంగా మెలగటం నేర్చుకోవాలి. పదే పదే న్యాయస్థానాలతో చెప్పించుకోవటం మర్యాద కాదని తెలుసుకోవాలి.