
‘గ్రేట్ డిక్టేటర్’ చిత్రంలో హిట్లర్ పాత్రధారిగా అభినయించిన చార్లీ చాప్లిన్ గ్లోబ్‌తో ఇష్టానుసారం ఆటలాడుకుంటున్న దృశ్యం ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది. కేవలం రెండేళ్లలో మీరు ప్రపంచానికే చండశాసనుడు కావొచ్చని చెప్పిన సలహాదారును... తనకు కాసేపు ఏకాంతం కావాలని బయటకు పంపి ఆ గ్లోబ్‌తో రకరకాల విన్యాసాలు చేస్తాడు. చివరికది మొహమ్మీదే భళ్లున బద్దలుకావటంతో ఆ ముచ్చట ముగుస్తుంది. జాత్యహంకారం తలకెక్కి ప్రపంచాన్ని పాదాక్రాంతం చేసుకోవాలని కలలుగన్న హిట్లర్‌పై అది తిరుగులేని వ్యంగ్యాస్త్రం.
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌కు అలాంటి ఆశలేం లేవుగానీ... వర్తమాన ప్రపంచ ఆర్థిక వ్యవస్థ అమరికను తలకిందులు చేయాలన్న సంకల్పం... అందువల్ల అమెరికా భారీగా లాభపడుతుందన్న మూఢ విశ్వాసం ఆవరించినట్టుంది. పర్యవసా నంగా గత గురువారం నుంచి అంతర్జాతీయ మార్కెట్లన్నీ అధోగతిలో పయనిస్తున్నాయి. ట్రంప్ విధించిన ప్రతిచర్య సుంకాలతో మాంద్యం ముప్పు తప్పదన్న భయం వెన్నాడుతుండగా ప్రధాన ఈక్విటీల విచ్చలవిడి అమ్మకాలతో మార్కెట్లు పతనమవుతున్నాయి.
మన బీఎస్‌ఈ, నిఫ్టీల్లో ఒక్క రోజులో రూ. 14 లక్షల కోట్ల సంపద ఆవిరైందని చెబుతున్నారు. ఆఖరి క్షణంలో స్వల్పంగా కోలుకో వటం వల్ల ఇక్కడితో ఆగింది గానీ రేపన్నరోజు బాగుంటుందన్న భరోసా చాలామందికి లేదు. దేన్నయినా తట్టుకోగల సామర్థ్యమున్న మన ఆర్థిక వ్యవస్థవల్ల త్వరలోనే సాధారణ స్థితి ఏర్పడగల దని చెబుతున్న నిపుణులూ ఉన్నారు. అంతర్జాతీయంగా అయితే ఎక్కడా ఆశారేఖ కనబడటం లేదు.
డాలర్ బలహీనపడటం, చమురు ధరలు పడిపోవటంలాంటి పరిణామాలన్నీ కేవలం మదుపరుల్లో తాత్కాలికంగా అలుముకున్న నిరాశా నిస్పృహల వల్లే అని నమ్మడానికి ఎవరూ సిద్ధంగా లేరు. చిత్రమేమంటే... ఇంత జరుగుతున్నా ఈ సంక్షోభాన్ని తాత్కాలికమైనదిగానే ట్రంప్ పరిగణిస్తు న్నారు. తానిచ్చిన డోస్ పనిచేయటం మొదలెట్టాక అమెరికా ఆర్థిక వ్యవస్థ శరవేగంతో ఎదుగుతుందని విశ్వసిస్తున్నారు.
ఇదంతా చూస్తూ కూడా అధికార రిపబ్లికన్లు నోరెత్తరు. విపక్ష డెమాక్రాట్లూ మౌనంగానే ఉంటారు. సాధారణ ప్రజానీకం ‘హ్యాండ్సాఫ్ ట్రంప్’ అంటూ వేలాదిగా రోడ్లపైకొస్తున్నారు. మొత్తానికి ప్రపంచీకరణ కళ్లముందు కుప్పకూలుతోంది. ఈ ప్రపంచీకరణలో భాగస్వాములు కావటానికి ససేమిరా అన్న వర్ధమాన దేశాల పాలకులను నయానో భయానో దారికి తెచ్చి అక్కడి వనరులన్నిటినీ అమె రికా ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ఎడాపెడా వాడుకున్న అమెరికా... ట్రంప్ ఏలుబడి వచ్చాక దానికి విరుద్ధమైన పోకడలకు పోతోంది.
ఇన్నేళ్లుగా అమెరికాను అన్ని దేశాలూ దోచుకున్నాయని ఎదురు ఆరోపిస్తోంది. గతవారం ‘అమెరికా విముక్తి దినం’ రోజున మిత్రులు, ప్రత్యర్థులన్న విచక్షణ కూడా లేకుండా సుంకాల మోత మోగించేందుకు ట్రంప్ అధ్యక్షుడికి వుండే ‘ఎమర్జెన్సీ’ అధికారాలను వినియోగించుకున్నారు. కేవలం యుద్ధ సమయాల్లో వాడుకోవాల్సిన ఈ అధికారాలను రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా ఏకపక్షంగా ఆయన చేజిక్కించుకున్నా అమెరికన్ కాంగ్రెస్‌గానీ, ఇన్నాళ్లుగా స్వేచ్ఛా వాణిజ్యాన్ని ప్రోత్సహించిన రిపబ్లికన్లు గానీ, బహుళజాతి కార్పొరేషన్లు గానీ నోరెత్తక పోవటం ఆశ్చర్యకరం. కేవలం కెనడాపై విధించిన అదనపు సుంకాలను రద్దు చేయటం వంటి పరిమిత చర్య మినహా సెనేట్ మౌనంగా ఉండిపోయింది.
ఈమాత్రం చర్యను కూడా ట్రంప్ మద్దతుదారులు సహించలేకపోతున్నారు. మాదకద్రవ్య ముఠాలను అదుపు చేయటా నికి విధిస్తున్న సుంకాలను వ్యతిరేకిస్తారా అంటూ బ్లాక్‌మెయిల్‌కు దిగుతున్నారు. ఈ సుంకాల విధింపు గుడ్డెద్దు చేలో పడిన చందాన ఉన్నదని జనాభా పెద్దగాలేని హెర్డ్ అండ్ మెక్‌డోనాల్డ్ ద్వీపాల వంటి అతి చిన్న ప్రాంతాలను సైతం వదలని తీరు గమనిస్తే తెలుస్తుంది.
ప్రపంచంలో అమెరికా స్థానాన్ని కైవసం చేసుకుని, అగ్రగామిగా నిలబడాలని దశాబ్దాలుగా చైనా పథకాలు పన్నుతోంది. ట్రంప్ దాన్ని వేగవంతం చేశారు. సుదీర్ఘకాలం నిర్మించుకున్న అనుబంధం కారణంగా ఇన్నాళ్లూ పాశ్చాత్య ప్రపంచం అమెరికాను సమర్థిస్తూ పోయింది. కెనడా, బ్రిటన్, జర్మనీ, జపాన్, ఆస్ట్రేలియా వంటివన్నీ అమెరికా ఏం చేసినా అది లోకకల్యాణం కోసమే నన్నట్టు వంతపాడాయి. ఇలాంటి అనుకూలతలు లేని కారణంగానే పూర్వపు సోవియెట్ అయినా, ప్రస్తుత రష్యా అయినా, చైనా అయినా దీటుగా నిలబడలేకపోయాయి.
కానీ ట్రంప్ దాన్ని కాస్తా మార్చేశారు. కెనడా కొత్త ప్రధాని మార్క్ కేర్నీ మాటల్లో చెప్పాలంటే ‘అమెరికా ఇక విశ్వసించదగ్గ భాగస్వామి కాద’ని తేలిపోయింది. జర్మనీ చాన్సలర్ కాబోతున్న ఫ్రెడరిక్ మెర్జ్ అయితే ఇంకాస్త ముందుకుపోయారు. అమెరికా నుంచి యూరప్ స్వాతంత్య్రాన్ని సాధించాలని పిలుపు నిచ్చారు. ఇదంతా చివరకు ప్రపంచంలో చైనా పలుకుబడి పెరగడానికి దోహదపడుతుందన్న స్పృహ ట్రంప్‌కు లేకుండా పోయింది. నియమాల ఆధారిత ప్రపంచమే ధ్యేయం అంటూ ఇండో–పసిఫిక్ ప్రాంతంలో చైనాకు వ్యతిరేకంగా క్వాడ్‌ను రూపొందించి అమెరికా మనల్ని అందులో భాగస్వా ముల్ని చేసింది.
సందర్భం వేరు కావొచ్చుగానీ ఆర్థికరంగంలో ఇవాళ అన్ని నియమాలనూ ఉల్లంఘిస్తున్న అమెరికాను క్వాడ్ విషయంలో మనం విశ్వసించవచ్చా అన్న సందేహం కలిగితే ఆశ్చర్యమే ముంది? మౌలికంగా మార్కెట్లు కచ్చితమైన అంచనాల ఆధారంగా ముందుకు కదులుతాయి. మదుపుదార్లు స్వేచ్ఛగా, నిర్భయంగా పెట్టుబడులు పెడతారు. సంపద పోగవుతుంది. కానీ ట్రంప్ చర్యలతో అంతా తలకిందులైంది. ఇక, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కోలుకోవటం ఇప్పట్లో సాధ్యమా?