
ట్రంప్: పాలన రెండవ నెలలో ప్రవేశించే సరికే ఇన్నిన్ని అనుభవాలు గడించటం మరెవరి విషయంలోనూ జరిగి ఉండదు.
విశ్లేషణ
ఆయుధ బలం, ఆర్థిక బలంతో ఏదైనా సాగించవచ్చునన్నట్లు వ్యవహరిస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు, అదంత తేలిక కాదని నెల రోజులు తిరిగేసరికి అర్థమవుతుండాలి! అమెరికన్లతోపాటు వారి అనుయాయ పశ్చిమ దేశాలను, మొత్తం ప్రపంచాన్ని ఉక్కిరిబిక్కిరి చేస్తూ సాగుతున్న ఆయన చర్య లను, అందుకు ఎదురవుతున్న ప్రతిఘటన లను బట్టి ఈ అభిప్రాయం కలుగుతున్నది.
అధ్యక్షుని ప్రకటనలను, చర్యలను రెండు విధాలుగా విభజించాలి. అంతర్గతమైనవి, విదేశాంగపరమైనవి. అంతర్గతంగా అన్నీ ఇప్పటికి తను కోరుకున్న విధంగానే జరిగిపోతున్నాయి. కొన్ని చర్యల వల్ల తమ వ్యవసాయ, పారిశ్రామిక, సర్వీస్ రంగాలపైన, గృహావస రాలపైన, సామాజిక సంబంధాలపైన ప్రభావాలు మొదలైనా, నిర సనలు మంద్ర స్థాయిలోనే ఉన్నాయి.
ప్రతిపక్షమైన డెమోక్రాట్లలో చలనమే లేదు. ట్రంప్‌కు అడ్డుపడటమంటూ ఏమైనా జరిగితే అది కోర్టుల స్టే ఉత్తర్వుల వల్లనే. నష్టపోతున్న వారిలో ట్రంప్ ‘మేక్ అమెరికా గ్రేట్ అగైన్’ (మాగా), ‘అమెరికా ఫస్ట్’ నినాదాలకు ఆకర్షితులై భారీగా ఓటు చేసిన తరగతుల వారు కూడా ఉన్నారనీ, వారికి ఇప్పటికే పనులూ, ఫెడరల్ ఉద్యోగాలు పోతుండటం, ధరల పెరుగు దల వంటి సమస్యలు ఎదురవుతున్నాయనీ వార్తలు చెప్తున్నాయి. ఆ వర్గాల నుంచి వ్యతిరేకత పెరిగితే తప్ప ట్రంప్ తన అంతర్గత విధా నాలను సవరించుకోకపోవచ్చు.
బయటి నిరసనలు
అంతర్గతంగా ఎట్లున్నా, బయటి ప్రపంచానికి విదేశాంగ విధానాలే ప్రధానమవుతాయి. విదేశాంగ విధానాలకు మూలం ఆంతరంగిక పరిస్థితులు, ప్రయోజనాలతో ఉండటం నిజమే అయినా, బయటివారికి ప్రత్యక్ష అనుభవంలోకి వచ్చేది ముఖ్యమవుతుంది. ఆ విధంగా చూసినపుడు ఈ 40 రోజులలో కనిపిస్తున్నది ఏమిటి?
ట్రంప్ మొదట చేసిన భౌగోళిక సంబంధమైన ప్రకటనలు పనామా కాలువ స్వాధీనం, గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరు గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మార్చటం, గ్రీన్‌ల్యాండ్ ఆక్రమణ, కెనడాను ఆర్థిక ఒత్తిడితో అమె రికాలో విలీనం చేసి 51వ రాష్ట్రంగా మార్చటం. ఈ అంశాలలో జరి గిందేమిటి? పనామా బలహీన దేశం. అయినా వారి కాలువను స్వాధీనపరచుకోలేక పోయారు.
కానీ ఆ కాలువ ద్వారా ప్రయాణించే అమెరికన్ నౌకలపై సుంకాల రద్దుకు అంగీకరించారన్నది అమెరికా చేసిన ప్రకటన. అది నిజం కాదన్నది పనామా ప్రభుత్వ ఖండన. కాలువపై చైనా నియంత్రణ ఉందన్నది ట్రంప్ ఆరోపణ కాగా, అది నిజం కాదని అక్కడి ప్రభుత్వం వెల్లడించింది. కాకపోతే అమెరికా ఒత్తిడిని తట్టుకోలేక చైనా నిర్వహిస్తున్న బెల్ట్ అండ్ రోడ్ ప్రాజెక్టు నుంచి పనామా ఉపసంహరించుకున్నది. ఆ ప్రాజెక్టులో చేరిన మొట్ట మొదటి లాటిన్ అమెరికన్ దేశం పనామాయే.
అదే ప్రాంతపు మెక్సికో, తమ గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును గల్ఫ్ ఆఫ్ అమెరికాగా మార్చటాన్ని బలంగా తిరస్కరించింది. ఐక్యరాజ్య సమితి గుర్తించింది కూడా పాత పేరునే. ఇపుడు ట్రంప్ కొత్త పేరు పెట్టి ఉత్తర్వులు జారీ చేసినా, యూరోపియన్ దేశాలు సైతం ఆమో దించటం లేదు. మెక్సికో ఆర్థికంగా అమెరికాపై ఎంత ఆధారపడినా ట్రంప్ నిర్ణయాన్ని ప్రతిఘటిస్తున్నది. ఆయన ఏమీ చేయలేక మౌనం వహించారు. గ్రీన్‌ల్యాండ్ మరొక బలహీన దేశం. కానీ డెన్మార్క్ పరిధిలో స్వయంప్రతిపత్తి గలది.
ట్రంప్‌కు కావలసింది అక్కడి విస్తారమైన వనరులు. ఆ ప్రాంతం కీలక ప్రదేశంలో ఉన్నందున తమ రక్షణ వ్యూహాలకు అవసరం. కానీ అమెరికాకు అమ్మకం అయేందుకు గ్రీన్‌ల్యాండ్, డెన్మార్క్ సమ్మతించలేదు. డెన్మార్క్ యూరప్ దేశమైనందున మొత్తం యూరప్ కూడా తీవ్రంగా వ్యతిరేకించింది. గ్రీన్‌ల్యాండ్‌లో ఇప్పటికే అమెరికా సైనిక స్థావరాలు ఉన్నందున వాటి విస్తర ణకు, సహజ వనరులపై ఒప్పందాలకు మాత్రం గ్రీన్‌ల్యాండ్ రాజీ పడుతున్న సూచనలున్నాయి. యూరప్ మద్దతు లేనట్లయితే ఆ చిన్న దేశంపై ట్రంప్‌దే రాజ్యమయ్యేది.
అమెరికాకు సరిహద్దున ఉండటమేగాక అన్నివిధాలైన సన్నిహిత సంబంధాలు ఉన్నప్పటికీ, ట్రంప్ అంటున్న 51వ రాష్ట్రపు మాటను కెనడా ఛీత్కరిస్తున్నది. 25 శాతం సుంకాలకు బెదరక అదే స్థాయిలో ఎదురు సుంకాలు ప్రకటించింది. ప్రజలలో జాతీయాభిమానం ఎగసి రాగా వారు అమెరికన్ ఉత్పత్తుల కొనుగోలును తగ్గించి వేస్తున్నట్లు కథనాలు వెలువడుతున్నాయి. బలమైన మద్దతుగల గ్రీన్‌ల్యాండ్ వలెనే, స్వయంగా బలమైన కెనడా విషయంలోనూ ట్రంప్ స్వేచ్ఛా ధోరణి నెరవేరటం లేదన్నమాట.
బుల్‌డోజర్ పథకం సాగేనా?
ఇంచుమించు ఇటువంటిదే గాజా విషయం. పాలస్తీనా, ఇజ్రాయెల్ రెండు స్వతంత్ర దేశాలు కావాలన్న అమెరికా విధానంలో నిజాయితీ లేకున్నా నోటి మాటగా అంటూ వస్తూ, ఇపుడు తిరిగి అధికారానికి వచ్చినాక దానిని అకస్మాత్తుగా వదలివేసిన ట్రంప్, గాజాను తామే ఆక్రమించి బీచ్ రిసార్టుగా మారుస్తామన్నారు. ఆ రియల్ ఎస్టేట్ మాటను పాలస్తీనియన్లే గాక మొత్తం అరబ్ రాజ్యాలు, యూరోపియన్ యూనియన్, తక్కిన ప్రపంచం, ఐక్యరాజ్యసమితి వెంటనే కొట్టివేశాయి.
అయినప్పటికీ తన పంతం వీడని ట్రంప్, తమపై బాగా ఆధారపడి ఉన్న ఈజిప్టు, జోర్డాన్‌లను ఒత్తిడి చేసి గాజా ప్రజలను, బహుశా తర్వాత వెస్ట్ బ్యాంక్ పాల స్తీనియన్లను కూడా ఆ దేశాలకు తరలించేందుకు గట్టి ప్రయత్నాలే చేశారు. కానీ ఆయన ఎంతో ఆశలు పెట్టుకున్న ఈజిప్ట్, జోర్డాన్‌ల సొంత ఆలోచనలు ఏవైనా అక్కడి ప్రజాభిప్రాయానికి, తక్కిన అరబ్ ప్రపంచం ఆగ్రహానికి భయపడి అందుకు అంగీకరించలేదు. కీలకమైన పాత్ర వహించే సౌదీ అరేబియా వెంటనే తిరస్కరించగా, ఆ తర్వాత అరబ్ విదేశాంగ మంత్రులు, గల్ఫ్ కో ఆర్డినేషన్ కౌన్సిల్ సమావేశమై అదే వైఖరి తీసుకున్నారు.
దానితో, తాము చెప్పిన దానికన్న మెరుగైన ప్రతిపాదన ఉంటే సూచించాలని అరబ్ దేశాలను అమెరికా విదేశాంగ మంత్రి మార్క్ రూబియో ఇపుడు కోరు తున్నారు. గాజా ప్రజలు తమ మాతృభూమిలోనే నివసించే విధంగా పునర్నిర్మాణ పథకాన్ని, పాలస్తీనా స్వతంత్ర దేశ పథకాన్ని అరబ్ దేశాలు ఇంచుమించు రూపొందించాయి. ఆ విధంగా అమెరికా అధ్యక్షుని బుల్‌డోజర్ ఉధృతి అక్కడ సాగబోవటం లేదు. ఈ పరి ణామాల దరిమిలా, తాము, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌ను ధ్వంసం చేయటం, లొంగ దీసుకోవటం జరగవచ్చునా అన్నది వేచి చూడ వలసిన ప్రశ్న అవుతున్నది.
ఉక్రెయిన్ విషయంలో ట్రంప్ చేస్తున్నదేమిటో రోజూ వార్తలు వెలువడుతున్నాయి. తాము, యూరప్ కలిసి ఉక్రెయిన్‌ను మూడేళ్లుగా నిలబెట్టలేక పోవటంతో, వ్యక్తిగతంగా వ్యాపార ధోరణి గల ట్రంప్ ఇప్పుడు రెండువైపుల నుంచి ప్రయోజనాలు పొందే వ్యూహం వైపు మారారు. ఉక్రెయిన్‌ను, యూరప్‌ను దారికి తెచ్చుకుని ఉక్రెయిన్‌లోని లోహాలు, ఖనిజాలను సంపాదించటం; బలమైన రష్యాతో ఆర్థిక, ఇతర సంబంధాల మెరుగుదల.
ఎటూ గెలవలేని యుద్ధంలో ఆ విధంగా ఉక్రెయిన్, యూరప్, తనను కాదని చేయగలిగింది కూడా లేని బలహీనులు కావటం వల్ల వారిని దారికి తేగలుగుతున్నారు. దీనినిబట్టి అర్థమయే దేమిటి? పనామా, కెనడా, గాజా, ఉక్రెయిన్, యూరప్ వంటివి వేర్వేరు విధాలైన కేసులు. మొత్తం మీద తన పాలన రెండవ నెలలో ప్రవేశించే సరికే అమెరికా అధ్యక్షుడు ఇన్నిన్ని అనుభవాలు గడించటం బహుశా మరెవరి విషయంలోనూ జరిగి ఉండదు. ఆయనతో ప్రపంచ అనుభవాలు కూడా అటువంటివే.
టంకశాల అశోక్
వ్యాసకర్త సీనియర్ సంపాదకుడు
Comments
Please login to add a commentAdd a comment