Ukraine
-
పశ్చిమ దేశాలకు రష్యా న్యూక్లియర్ వార్నింగ్
-
కలకలం.. ఉక్రెయిన్‌పై ఖండాంతర బాలిస్టిక్ క్షిపణితో రష్యా దాడి!
కీవ్: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం తారా స్థాయికి చేరుకుంది. ఉక్రెయిన్‌పై 5వేల కిలోమీటర్ల పరిధిలోని శత్రు లక్ష్యాలను తుదముట్టించగల ఖండాంతర క్షిపణిని రష్యా ప్రయోగించింది. ఇదే విషయాన్ని ఉక్రెయిన్ ఎయిర్‌ఫోర్స్ నిర్ధారించింది.గురువారం తెల్లవారుజామున జరిగిన దాడిలో డ్నిప్రో నగరాన్ని క్షిపణి లక్ష్యంగా చేసుకున్నట్లు వైమానిక దళం తెలిపింది. 2022లో యుద్ధం ప్రారంభమైన తర్వాత రష్యా ఈ ఆయుధాన్ని మోహరించడం ఇదే తొలిసారి అని ఏఎఫ్‌పీ మీడియా సంస్థ వెల్లడించింది. ఖండాంతర క్షిపణలు వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించగలవు. అత్యధికంగా ఆ మిస్సైళ్లు 5వేల కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తాయి. అయితే తాజా అటాక్ సమయంలో.. ఆరు కేహెచ్-101 క్రూయిజ్ మిస్సైళ్లను కూల్చివేసినట్లు ఉక్రెయిన్ మిలిటరీ పేర్కొన్నది. డిప్రో సిటీపై జరిగిన దాడిలో భారీ నష్టం సంభవించింది. పలు భవనాలు కూలిపోయాయి. అనేక మంది గాయపడ్డారు. -
ఉక్రెయిన్‌కు బైడెన్ భారీ ఆఫర్.. ట్రంప్ సమర్థిస్తారా?
వాషింగ్టన్: రష్యా-ఉక్రెయిన్ మధ్య భీకర పోరు జరుగుతున్న వేళ ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. రష్యా దాడుల కారణంగా తీవ్రంగా నష్టపోయిన ఉక్రెయిన్‌కు అమెరికా ఆర్థికంగా బాసటగా నిలిచేందుకు అడుగులు వేస్తోంది. ఉక్రెయిన్‌కు ఇచ్చిన 4.7 బిలియన్ డాలర్లను (రూ.3.96 లక్షల కోట్లు) మాఫీ చేయడానికి బైడెన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలుస్తోంది.ఉక్రెయిన్-రష్యా మధ్య దాదాపు రెండున్నరేళ్లుగా యుద్ధం కొనసాగుతోంది. రష్యా దాడుల కారణంగా ఉక్రెయిన్‌లో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. వేల సంఖ్యలో ఉక్రెయిన్‌వాసులు దేశం విడిచివెళ్లారు. రష్యా దాడులు ప్రారంభమైన నాటి నుంచి ఉక్రెయిన్‌కు అగ్ర రాజ్యం అమెరికా అండగా నిలిచింది. బైడెస్ ప్రభుత్వం జెలెన్ స్కీకి ఆర్థికంగా, ఆయుధాల విషయంలోనూ సాయం అందజేసింది.ఇక, తాజాగా అధ్యక్షుడు బైడెన్.. ఉక్రెయిన్ విషయంలో మరో కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఉక్రెయిన్‌కు అందజేసిన 4.7 బిలియన్ డాలర్లను (రూ.3.96 లక్షల కోట్లు) మాఫీ చేయడానికి బైడెన్ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని తెలిపిన అమెరికా విదేశాంగశాఖ అధికార ప్రతినిధి మాథ్యూ మిల్లర్ వెల్లడించారు. బైడెన్ తన పదవి నుంచి దిగేపోయే ముందే రష్యాతో పోరాడుతున్న ఉక్రెయిన్‌కు తాము చేయాల్సినంత సాయం చేసి వెళ్తామని ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆర్థిక సాయం అందించే దిశగా బైడెన్ ప్లాన్ చేస్తున్నారు. అయితే, బైడెన్ నిర్ణయం పట్ల డొనాల్డ్ ట్రంప్ ఎలా స్పందిస్తారనే ఉత్కంఠ నెలకొంది. The Biden Administration has moved to forgive $4.7 billion of US 🇺🇸 loans provided to Ukraine 🇺🇦 says State Department Spokesperson Matthew MillerThese loans were approved as part of a $60.8 billion package for Ukraine this April. Great news for Ukraine this week from US pic.twitter.com/hbob3Ixvji— Ukraine Battle Map (@ukraine_map) November 20, 2024 -
Russia-Ukraine war: రష్యా సైన్యానికి ల్యాండ్ మైన్స్‌తో అడ్డుకట్ట!
కీవ్: యుద్ధంలో రష్యాను పూర్తిస్థాయిలో కట్టడి చేయడమే లక్ష్యంగా ఉక్రెయిన్‌కు అమెరికా అండదండలు అందిస్తోంది. అమెరికా అందజేసిన లాంగ్రేంజ్ క్షిపణులను రష్యాపై ప్రయోగించడానికి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నుంచి ఇప్పటికే అనుమతి లభించింది. దీంతో రష్యా భూభాగంలో సుదూర ప్రాంతంలో ఉన్న లక్ష్యాలపై సులువుగా దాడులు ఉక్రెయిన్‌కు అవకాశం లభించింది. అమెరికా మరో శుభవార్త చెప్పింది. తాము సరఫరా చేసిన యాంటీ పర్సనల్ ల్యాండ్ మైన్స్ ఉపయోగించానికి ఉక్రెయిన్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇవ్వనున్నట్లు అమెరికా రక్షణ శాఖ మంత్రి లాయిడ్ అస్టిన్ ప్రకటించారు. ఆయన బుధవారం లావోస్‌లో మీడియాతో మాట్లాడారు. యుద్ధంలో రష్యా సైన్యం వ్యూహం మార్చేస్తుండడంతో ఉక్రెయినవైపు నుంచి కూడా వ్యూహం మార్చక తప్పడం లేదని అన్నారు. రష్యా పదాతి దళాలు మున్ముందుకు చొచ్చుకొస్తున్నాయని చెప్పారు. ఆయా దళాలను నిలువరించాలంటే యాంటీ పర్సనల్ ల్యాండ్ మైన్స్ ఉపయోగించాల్సి ఉంటుందని వెల్లడించారు. ఈ ల్యాండ్ మైన్స్ పెద్దగా ప్రమాదకరం, ప్రాణాంతకం కాదని లాడిన్ అస్టిన్ వివరణ ఇచ్చారు. శత్రు సైన్యం కదలికలను నియంత్రించడానికి ఇవి దోహదపతాయని చెప్పారు. -
ఉక్రెయిన్ను రష్యా ఏం చేయబోతోంది.? ఖాళీ అవుతున్న ఎంబసీలు
కీవ్: రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఏ మలుపు తిరుగుతుందోనని ప్రపంచ దేశాల్లో భయాందోళనలు మొదలయ్యాయి. ఉక్రెయిన్‌పై రష్యా మున్ముందు ఎలాంటి దాడులు చేస్తుందోనని పలు దేశాలు అప్రమత్తమవుతున్నాయి.ఉక్రెయిన్ రాజధాని కీవ్‌లో రాయబార కార్యాలయాన్ని మూసేసిన అమెరికా బాటలోనే పలు దేశాలు కూడా నడుస్తున్నాయి.ఇటలీ ,గ్రీస్,స్పెయిన్లు కూడా కీవ్‌లోని తమ ఎంబసీలను తాత్కాలికంగా మూసివేసినట్లు తెలుస్తోంది. కీవ్‌లోని తమ ఎంబసీపై రష్యా భారీ వైమానిక దాడులకు పాల్పడే అవకాశం ఉందనే సమాచారం అందడంతో వెంటనే దానిని అమెరికా తాత్కాలికంగా మూసివేసింది. నవంబర్ 20న దాడి జరగబోతోందని తమకు అందిన కచ్చితమైన సమాచారంతోనే ఎంబసీ ఖాళీ చేసినట్లు అమెరికా వెల్లడించింది. ఈ క్రమంలోనే ఇటలీ, గ్రీస్, స్పెయిన్లు తమ ఎంబసీలను తాత్కాలికంగా మూసివేశాయి.కాగా,రష్యా అణ్వాయుధాల వినియోగానికి అనుమతించే నిబంధనలను మరింత సరళతరం చేసే కీలక ఫైల్‌పై రష్యా అధ్యక్షుడు పుతిన్ తాజాగా సంతకం చేసిన సంగతి తెలిసిందే.అణ్వాయుధాలు కలిగి ఉన్న దేశం సాయంతో ఏ దేశమైనా తమపై దాడి చేస్తే దాన్ని సంయుక్త దాడిగానే రష్యా పరిగణించనుంది. -
ఉక్రెయిన్‌లో అమెరికా ఎంబసీ మూసివేత
కీవ్ : రష్యాతో యుద్ధంతో ఉక్రెయిన్‌లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఫలితంగా ఉక్రెయిన్‌లో అమెరికా రాయబార కార్యాలయాన్ని (ఎంబసీ) తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు వైట్ హౌస్ ప్రతినిధులు వెల్లడించారు.ఇటీవల అమెరికా ఏటీఏసీఎంఎస్ క్షిపణులను ఉక్రెయిన్‌కు సరఫరా చేసింది. ఆ క్షిపణులను ఉక్రెయిన్.. శత్రుదేశంపై ప్రయోగించింది. అయితే, ఉక్రెయిన్ క్షిపణుల దాడికి ప్రతీకారం తీర్చుకునేందుకు రష్యా సిద్ధమైంది. కీవ్‌పై ఊహించని విధంగా వైమానిక దాడులు చేసేందుకు ప్రయత్నాలు ముమ్మురం చేస్తున్నట్లు అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలకు సమాచారం అందింది. వెంటనే ఉక్రెయిన్‌లో తమ ఎంబసీని మూస్తువేస్తున్నట్లు ఎంబసీ కార్యాలయం అధికారికంగా ప్రకటించింది. ఎంబీసీలో పనిచేసే ఉద్యోగులు సురక్షితంగా ఉండేలా చూసుకోవాలని సూచించింది. దీంతో పాటు ఉక్రెయిన్‌లో ఉన్న అమెరికన్ పౌరులు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని విజ్ఞప్తి చేసింది. అమెరికా అందించిన ఏటీఏసీఎంఎస్ క్షిపణులను ఉక్రెయిన్ రష్యాపై ప్రయోగించింది. ఈ దాడులపై రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ స్పందించారు. ఉక్రెయిన్‌కు తగిన విధంగా బదులిస్తామని హెచ్చరించారు. గత నెలలో ఉత్తర కొరియా అందిస్తున్న క్షిపణలతో దాడులు చేస్తామని స్పష్టం చేశారు. -
ఆ మహా విపత్తుకు... 1,000 రోజులు!
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధానికి సోమవారంతో అక్షరాలా వెయ్యి రోజులు నిండాయి. ఎక్కడ చూసినా శిథిలమైన భవనాలు. వాటికింద నలిగి ముక్కలైన జ్ఞాపకాలు. కమ్ముకున్న బూడిద, పొగ చూరిన గ్రామాలు. లక్షల్లో ప్రాణనష్టం. లెక్కకు కూడా అందనంత ఆస్తి నష్టం. ఉక్రెయిన్ ఏకంగా నాలుగో వంతు జనాభాను కోల్పోయింది. వెరసి ఈ యుద్ధం 21వ శతాబ్దపు మహా విషాదంగా మారింది. నానాటికీ విస్తరిస్తున్న యుద్ధ మేఘాలు ప్రపంచ దేశాలన్నింటినీ భయపెడుతున్నాయి.రావణకాష్టంలా... 2022 ఫ్రిబవరి 24. ఉక్రెయిన్‌పై రష్యా ఆకస్మికంగా దాడికి దిగిన రోజు. నాటినుంచి రావణకాష్టాన్ని తలపిస్తూ యుద్ధం కొనసాగుతూనే ఉంది. అంతులేని ప్రాణ, ఆస్తి నష్టాన్ని కలిగిస్తూనే ఉంది. ఇప్పటిదాకా కనీసం 80,000 మందికి పైగా ఉక్రెయిన్ సైనికులు మరణించినట్టు వాల్‌స్ట్రీట్ జర్నల్ నివేదిక అంచనా వేసింది. మరో 400,000 మందికి పైగా గాయాపడ్డట్టు పేర్కొంది. రష్యా అయితే ఏకంగా 2 లక్షల మంది సైనికులను కోల్పోయిందని సమాచారం. లక్షలాది మంది గాయపడ్డారని చెబుతున్నారు. ఐరాస మానవ హక్కుల మిషన్ గణాంకాల ప్రకారం గత ఆగస్టు 31 నాటికి ఉక్రెయిన్‌లో 11,743 మంది సామాన్య పౌరులు మరణించారు. 24 వేల మందికి పైగా గాయపడ్డారు. అయితే వాస్తవ గణాంకాలు చాలా ఎక్కువగా ఉంటాయని ఐరాస అధికారులే అంటున్నారు. ఉక్రెయిన్‌లో జననాల రేటు కూడా రెండేళ్లుగా మూడో వంతుకు పడిపోయింది. ఏకంగా 60 లక్షల మంది ఉక్రెయిన్‌వాసులు శరణార్థులుగా విదేశాల్లో తలదాచుకుంటున్నారు.చిరకాలంగా రష్యా కన్ను 1991లో సోవియట్ యూనియన్ విచి్ఛన్నమయ్యే దాకా ఉక్రెయిన్ రష్యన్ సామ్రాజ్యంలో భాగంగానే ఉండేది. కనుక దాన్ని తిరిగి రష్యా సమాఖ్యలో విలీనం చేయడమే లక్ష్యమని ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఎన్నోసార్లు చెప్పారు. స్లావిక్, ఆర్థోడాక్స్ క్రైస్తవులైన ఉక్రెయిన్ ప్రజలు వాస్తవానికి రష్యన్లేనన్నది ఆయన వాదన. డొనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైనందున యుద్ధానికి త్వరలో తెర పడవచ్చన్న ఆశలు కూడా అడియాసలే అయ్యేలా ఉన్నాయి. అమెరికా అనుమతితో రష్యాపై ఉక్రెయిన్ దీర్ఘశ్రేణి క్షిపణులతో దాడి చేయడంతో తాజాగా ఉద్రిక్తతలు తారస్థాయికి చేరాయి. ట్రంప్ బాధ్యతలు స్వీకరించేందుకు ఇంకా రెండు నెలల గడువుంది. ఆలోగా పరిణామాలు మరింతగా విషమిస్తాయా? పరిణామాలు మూడో ప్రపంచ యుద్ధం దిశగా సాగుతాయా? ఇప్పుడు సర్వత్రా ఆందోళన రేకెత్తిస్తున్న ప్రశ్నలివి.ఆర్థిక వ్యవస్థ పతనం.. యుద్ధం దెబ్బకు ఉక్రెయిన్ ఆర్థిక వ్యవస్థ దాదాపుగా పతనమైంది. 2023లో స్వల్పంగా పుంజుకున్నా, రాయిటర్స్, ప్రపంచ బ్యాంక్, యూరోపియన్ కమిషన్, ఐరాస, ఉక్రెయిన్ ప్రభుత్వ అంచనాల ప్రకారం యుద్ధ నష్టం 2023 చివరికే ఏకంగా 152 బిలియన్ డాలర్ల స్థాయికి చేరింది. రష్యా దాడుల్లో దేశ మౌలిక సదుపాయాలన్నీ నేలమట్టమయ్యాయి. విద్యుత్ తదితర రంగాలు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. పునర్నిర్మాణ, పునరుద్ధరణ పనులకు కనీసం 500 బిలియన్ డాలర్లు కావాలని ప్రపంచ బ్యాంకు, ఉక్రెయిన్ ప్రభుత్వం అంచనా వేశాయి. దీనిముందు పాశ్చాత్య దేశాల నుంచి అందిన 100 బిలియన్ డాలర్లకు పై చిలుకు ఆర్థిక సాయం ఏ మూలకూ చాలని పరిస్థితి. పైగా అందులో అత్యధిక మొత్తం యుద్ధ అవసరాలపైనే వెచి్చంచాల్సి వస్తోంది. యుద్ధం వల్ల ఉక్రెయిన్‌కు సగటున రోజుకు 14 కోట్ల డాలర్ల చొప్పున నష్టం వాటిల్లుతున్నట్టు అంచనా. ఆహార ధాన్యాల ఎగుమతిదారుల్లో ఉక్రెయిన్ ముందు వరుసలో ఉంటుంది. యుద్ధం దెబ్బకు అక్కడి నుంచి ఎగుమతులు నిలిచిపోవడం అంతర్జాతీయంగా ఆహార సంక్షోభాన్ని తీవ్రతరం చేసింది. -
కమ్ముకొస్తున్న అణుమేఘాలు. శరవేగంగా నాటకీయ పరిణామాలు. రష్యాపైకి ఉక్రెయిన్ దీర్ఘశ్రేణి క్షిపణులు.. ఇంకా ఇతర అప్డేట్స్
-
బైడెన్ గ్రీన్‌సిగ్నల్..రష్యాపైకి దూసుకెళ్లిన క్షిపణులు
కీవ్: అమెరికా తయారీ లాంగ్రేంజ్ క్షిపణులు వాడేందుకు అధ్యక్షుడు బైడెన్ అనుమతివ్వగానే ఉక్రెయిన్ వాటి వాడకాన్ని మొదలు పెట్టింది. అమెరికా తయారీ లాంగ్రేంజ్ ఆర్మీ ట్యాక్టికల్(ఏటీఏసీఎంఎస్) మిసైల్‌ను మంగళవారం(నవంబర్ 19) రష్యా భూభాగంపైకి ఉక్రెయిన్ ప్రయోగించినట్లు సమాచారం. ఈమేరకు ఉక్రెయిన్ మీడియా కథనాలు ప్రచురించింది.రష్యా,ఉక్రెయిన్ సరిహద్దులో ఉన్న రష్యాలోని కరాచేవ్ నగరంలోని మిలిటరీ స్థావరాలపై ఉక్రెయిన్ దాడి చేసినట్లు కథనాల సారాంశం. అమెరికా కంపెనీ లాక్హిడ్ మార్టిన్ తయారు చేసిన ఏటీఏసీఎంఎస్ లాంగ్రేంజ్ క్షిపణులు సుదూర ప్రాంతాల్లోని లక్ష్యాలను సులభంగా చేధించగలవు. చాలా ఎత్తు నుంచి వెళ్లి లక్ష్యాలను తాకడం వీటి ప్రత్యేకత. ఈ క్షిపణులతో రష్యాలోని ఎంత దూర ప్రాంతంపై అయినా ఉక్రెయిన్ దాడులు చేసే వీలుంది.రష్యాపై లాంగ్రేంజ్ మిసైల్స్‌ను వాడేందుకు ఉక్రెయిన్ ఎప్పటినుంచో అమెరికాను అనుమతి అడుగుతోంది. అయితే బైడెన్ తన అధ్యక్ష పదవీ కాలం ముగియనుందనగా తాజాగా అందుకు అనుమతిచ్చారు. అయితే ఉక్రెయిన్ క్షిపణి దాడిపై రష్యా ఎలా ప్రతిస్పందిస్తుందనేదానిపై ఉత్కంఠ నెలకొంది. యుద్ధం ఏ మలుపు తిరుగుందోనని ప్రపంచదేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఉక్రెయిన్ మిసైళ్ల దాడి నిజమే: ధృవీకరించిన రష్యాతమ దేశంపైకి ఉక్రెయిన్ ఆరు అమెరికా తయారీ లాంగ్రేంజ్ క్షిపణులు ప్రయోగించినందని రష్యా మిలిటరీ వెల్లడించినట్లు రష్యా మీడియా తెలిపింది. ఆరు మిసైళ్లలో ఐదింటిని రష్యా ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ అడ్డుకోగా ఒక మిసైల్‌ను ధ్వంసం చేసింది.ధ్వంసమైన మిసైల్‌కు సంబంధించిన శకలాలు పడడంతో కరాచేవ్ నగరంలోని మిలిటరీ స్థావరంలో మంటలు లేచాయి. అయితే ఈ దాడిలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని రష్యా మిలిటరీ తెలిపింది. ఇదీ చదవండి: రష్యాపై భీకర దాడులకు బైడెన్ పచ్చజెండా -
అణ్వాయుధాల వాడకంపై పుతిన్ సంచలన నిర్ణయం
మాస్కో:ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం తీవ్రమవనుందా.. వెయ్యి రోజుల నుంచి రెండు దేశాల మధ్య జరుగుతున్న యుద్ధం ఇక ముందు కొత్త మలుపు తిరగనుందా.. రెండు దేశాల యుద్ధం మరో ప్రపంచ యుద్ధంగా మారనుందా..అంటే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు పరిశీలిస్తే అవుననే తెలుస్తోంది.తాజాగా రష్యా అణుబాంబుల వినియోగానికి అనుమతించే నిబంధనలను మరింత సరళతరం చేసే ఫైల్‌పై రష్యా అధ్యక్షుడు పుతిన్ తాజాగా సంతకం చేశారు. అణుబాంబులు కలిగి ఉన్న దేశం సాయంతో ఏ దేశమైనా తమపై దాడి చేస్తే..దాన్ని ఆ రెండు దేశాలు కలిసి దాడిగానే రష్యా పరిగణించనుంది. ఇలాంటి సందర్భాల్లో అణ్వాయుధాలు లేని దేశంపైనా రష్యా దాడి చేయనుంది.తాము అందజేసే లాంగ్రేంజ్ క్షిపణులను రష్యాపై ప్రయోగించేందుకు ఉక్రెయిన్‌కు అమెరికా అనుమతించిన నేపథ్యంలో అణ్వాయుధాలపై పుతిన్ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.ఉక్రెయిన్‌కు మద్దతుగా రష్యాపై ఒకవేళ పశ్చిమదేశాలు నేరుగా దాడి చేస్తే వాటిపై అణ్వాయుధాలు వాడటానికి వీలుగా నిబంధనలు సవరించినట్లు సమాచారం. -
రష్యాపై భీకర దాడులకు బైడెన్ పచ్చజెండా
బ్రెజీలియా: ఉక్రెయిన్–రష్యా మధ్య యుద్ధం మరింత ముదిరే సూచనలు కనిపిస్తున్నాయి. ఉత్తర కొరియా నుంచి వేలాది మంది సైనికులను రష్యా దిగుమతి చేసుకుంటోంది. వారిని ఉక్రెయిన్ సరిహద్దుల్లో మోహరిస్తోంది. ఉక్రెయిన్‌పై భీకర దాడులకు ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. దీనికి విరుగుడుగా ఉక్రెయిన్, దాని మిత్రపక్షాలు కొత్త వ్యూహానికి తెరతీశాయి. ఉక్రెయిన్‌కు అందజేసిన లాంగ్రేంజ్ మిస్సైళ్ల వాడకంపై ఇప్పటిదాకా ఉన్న పరిమితులను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సడలించారు. రష్యా భూభాగంలోకి మరింత ముందుకు చొచ్చుకెళ్లి దాడులు చేసేందుకు తాజాగా అనుమతి ఇచ్చారు.అమెరికా అధికార వర్గాలు ఈ విషయం వెల్లడించాయి. బైడెన్ నుంచి అనుమతి రావడంతో ఆర్మీ టాక్టికల్ మిస్సైల్ సిస్టమ్(ఏటీఏసీఎం)ను రష్యాపై ప్రయోగించేందుకు ఆస్కారం ఏర్పడింది. దీనివల్ల రష్యాకు భారీగా నష్టం వాటిల్లే్ల అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఉక్రెయిన్–రష్యా యుద్ధానికి ముగింపు పలుకుతానని అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ట్రంప్ ప్రత్యర్థి అయిన జో బైడెన్ యుద్ధాన్ని మరింత ఉధృతం చేసే దిశగా నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆదివారం దేశ ప్రజలను ఉద్దేశించి మాట్లాడారు. శత్రుదేశంపై కేవలం మాటలతో దాడులు చేయలేమంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేశారు. కొన్ని విషయాలు నోటితో చెప్పలేమని, క్షిపణులే మాట్లాడుతాయని పేర్కొన్నారు. అమెరికా సహా పశ్చిమదేశాలు ఇచ్చిన కీలక ఆయుధాలను రష్యాపై ప్రయోగించడానికి అనుమతి ఇవ్వాలంటూ జో బైడెన్‌పై కొన్ని నెలలుగా ఒత్తిడి వచ్చింది. ఆ ఒత్తిడికి తలొగ్గి ఆయన అనుమతి ఇచ్చినట్లు తెలుస్తోంది. అదే సమయంలో డొనాల్డ్ ట్రంప్‌ను ఇరుకున పెట్టాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం.అగ్నికి బైడెన్ ఆజ్యం పోస్తున్నారు: రష్యాఅమెరికా సరఫరా చేసిన దీర్ఘశ్రేణి క్షిపణులను రష్యాపై ప్రయోగించడానికి అధ్యక్షుడు జో బైడెన్ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వడంపై రష్యా అధికార వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. అగ్నికి ఆజ్యం పోస్తున్నారంటూ బైడెన్‌పై మండిపడ్డాయి. తమను రెచ్చగొట్టే చర్యలు మానుకో వాలని హెచ్చరించాయి. అయితే, ఈ వ్యవహారంపై రష్యా అధినేత పుతిన్ ఇంకా స్పందించలేదు. -
ఉక్రెయిన్ పవర్‌గ్రిడ్‌పై రష్యా దాడులు.. టార్గెట్ అదేనా..?
కీవ్:ఉక్రెయిన్ రాజధాని కీవ్ సహా పలు ప్రాంతాలపై ఆదివారం(నవంబర్ 17) రష్యా భారీ దాడులు చేసింది. శీతాకాలం వస్తుండడంతో ఉక్రెయిన్‌కు కీలకమైన పవర్ గ్రిడ్‌ను లక్ష్యంగా చేసుకొని క్షిపణులతో దాడులు చేసింది. ఉక్రెయిన్‌పై ఆగస్టు నుంచి ఇప్పటి వరకు జరిగిన అతిపెద్ద దాడి ఇదే కావడం గమనార్హం. ఈ దాడిలో ఉక్రెయిన్ పవర్‌గ్రిడ్ తీవ్రంగా దెబ్బతిన్నట్లు చెబుతున్నారు. దీంతో కీవ్ సహా పలు జిల్లాలు,నగరాలకు విద్యుత్తు సరఫరా నిలిచిపోయినట్లు తెలుస్తోంది. దేశ విద్యుత్తు సరఫరా,ఉత్పత్తి వ్యవస్థలపై దాడులు జరుగుతున్నాయని ఉక్రెయిన్ ఎనర్జీ మంత్రి గెర్మన్ వెల్లడించారు. మరోవైపు రాజధాని కీవ్‌లో భారీగా పేలుళ్లు జరిగాయి.ఇక్కడి సిటీ సెంటర్‌ను లక్ష్యంగా చేసుకొని దాడులు చేసినట్లు తెలుస్తోంది. ఆస్తి ప్రాణ నష్ట వివరాలు ఇంకా తెలియరాలేదు. చాలా రోజుల తర్వాత రష్యా తాజాగా ఉక్రెయిన్‌పై భారీ దాడులకు దిగడంతో సరిహద్దుల్లోని పోలండ్ పూర్తిగా అప్రమత్తమైంది. రష్యా, ఉక్రెయిన్లలో శీతాకాలం అత్యంత తీవ్రంగా ఉంటుంది.ఈ సీజన్లో ఇళ్లలో వేడి కోసం విద్యుత్తు,గ్యాస్ వంటి వాటిని వాడతారు.విద్యుత్ సరఫరాలో గనుక అంతరాయం ఏర్పడితే చలికి తట్టుకోలేక ఉక్రెయిన్‌లో చాలా మంది ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుందనే ఉద్దేశంతోనే రష్యా పవర్‌గ్రిడ్‌ను లక్ష్యంగా చేసుకుందనే అనుమానాలున్నాయి. -
ఉక్రెయిన్‌పై 60 మిసైళ్లతో రష్యా భీకర దాడి
కీవ్: ఉక్రెయిన్‌పై రష్యా భారీ వైమానిక దాడి చేసింది. రాజధాని కీవ్‌పై ఈ దాడి జరిగింది. ఈ దాడిలో రష్యా 60 క్షిపణులను ప్రయోగించింది. ఉక్రెయిన్‌పై ఇప్పటివరకు రష్యా జరిపిన దాడుల్లో ఇదే అతిపెద్దదిగా చెబుతున్నారు. ఈ దాడుల సమయంలో కీవ్ ప్రజలు తమ ప్రాణాలను కాపాడుకునేందుకు బంకర్లలో తలదాచుకున్నారు. గత కొద్దిరోజులుగా ఉక్రెయిన్‌పై రష్యా తరచూ దాడులు చేస్తూ వస్తోంది.కీవ్ లోనే కాకుండా మరికొన్ని చోట్ల కూడా రష్యా దాడులు చేసింది. ఈ దాడులకు ఇరాన్ నుంచి తీసుకువచ్చిన డ్రోన్లను రష్యా వినియోగించినట్లు సమాచారం. కీవ్‌లోని ప్రజలు ఇంకా బంకర్లలోనే ఉన్నారని, వైమానిక దాడులు కొనసాగుతున్నంత కాలం వారు బంకుల్లోనే ఉండాలని ఉక్రెయిన్ అధికారులు వారికి సూచించినట్లు తెలుస్తోంది.మరోవైపు రష్యా-ఉక్రెయిన్ యుద్ధంలో జరిగిన ప్రాణనష్టంపై అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విచారం వ్యక్తం చేవారు. ఈ యుద్ధాన్నిశాంతింపజేయడంపై దృష్టి పెడతామని ట్రంప్ తెలిపారు. పశ్చిమాసియాలో శాంతి నెలకొనేందుకు తమ ప్రభుత్వం కృషి చేస్తుందని ట్రంప్ పేర్కొన్నారు. ఇది కూడా చదవండి: సుదూర శ్రేణి హైపర్సోనిక్ క్షిపణి ప్రయోగం విజయవంతం -
షాకిస్తున్న ట్రంప్ ఎంపికలు!
అమెరికాలో డోనాల్డ్ ట్రంప్ రెండోసారి ఏలుబడి ఎలా ఉండబోతున్నదన్న చర్చలు ఒకపక్క సాగుతుండగా ఆయన తన టీం సభ్యుల పేర్లను వరసబెట్టి ప్రకటిస్తున్నారు. ఆ పేర్లు కొందర్ని ఆశ్చర్యపరుస్తుంటే, మరికొందర్ని దిగ్భ్రాంతిలో ముంచెత్తుతున్నాయి. తొలి బోణీ స్పేస్ ఎక్స్, టెస్లా సంస్థల అధిపతి ఎలాన్ మస్క్ కాగా, ఆయనతోపాటు వరసగా వివేక్ రామస్వామి, తులసీ గబార్డ్, మార్కో రుబియో, మాట్ గెట్జ్ వంటివారు కీలక పదవుల్లో కుదురుకోబోతున్నారని తేలింది. వీళ్లంతా వ్యాపారవేత్తలు, ఐశ్వర్యవంతులు... అన్నిటికన్నా మించి ‘వెలుపలివారు’ అయినందువల్ల తన ప్రభుత్వం సమర్థవంతమైన కార్పొరేట్ దిగ్గజంగా వెలిగిపోతుందని ట్రంప్ భావిస్తున్నట్టు కనబడు తోంది. వాజ్‌పేయి ప్రధానిగా ఉన్నప్పుడు అరుణ్ శౌరి ఆధ్వర్యంలో పెట్టుబడుల ఉపసంహరణ శాఖ ఉండేది. దాని పని నష్టజాతక పబ్లిక్ రంగ సంస్థలను ప్రైవేటుపరం చేయటం. ఆ క్రమంలో సవ్యంగా నడుస్తున్న సంస్థలు సైతం ప్రైవేటుకు దక్కాయన్న విమర్శలుండేవి. ఇప్పుడు ఎలాన్ మస్క్, వివేక్ రామస్వామిలతో ట్రంప్ అటువంటి పనే చేయించబోతున్నారు. మస్క్ ఆధ్వర్యంలో ప్రభుత్వ సామర్థ్య విభాగం(డీఓజీఈ) ఏర్పడుతుంది. దానికి వివేక్ ‘వెలుపలి సలహాదారు’గాఉంటారు. వచ్చే ఏడాది జూలైకల్లా ప్రభుత్వ వ్యయంలో 2 లక్షల కోట్ల డాలర్లు కోత పెట్టడమే ధ్యేయంగా వీరిద్దరూ నిర్ణయాలు తీసుకుంటారు. ప్రభుత్వోద్యోగుల సంఖ్య అపరిమితంగా ఉన్న దనీ, ఇందులో భారీగా కోతపెట్టడంతోపాటు ఉద్యోగాలన్నీ తాత్కాలిక ప్రాతిపదికనే ఉండటం అవసరమనీ తొలి ఏలుబడిలోనే ట్రంప్ తరచు చెప్పేవారు. అయితే సహచరుల హెచ్చరికతోముందడుగేయ లేకపోయారు. అందుకే కావొచ్చు... గతానుభవం లేనివారినే ఎంచుకున్నారు. అయితే ట్రంప్–మస్క్‌ల సఖ్యత ఎంతకాలం నిలుస్తుందన్నది అనుమానమే. ప్రభుత్వోద్యోగుల పని తీరుపై ట్రంప్, మస్క్‌లకు ఏకాభిప్రాయం ఉంది. అయితే కార్పొరేట్ సంస్థలు అన్యాయంగా సిబ్బందిని తొలగిస్తున్నాయన్న ట్రంప్ అభిప్రాయానికి మస్క్ వ్యతిరేకం. కార్మిక హక్కులు కాలరాయడాన్ని నిరసిస్తూ ప్రచారపర్వంలో చేసిన ప్రసంగాల వల్ల పలు కార్మిక సంఘాలు ట్రంప్‌కు అనుకూలంగా మారాయి. ఆయన విజయానికి దోహదపడిన అనేక అంశాల్లో ఇదొకటి. మస్క్ విష యానికొస్తే ఆయన ట్విట్టర్ (ఎక్స్)లోనూ, అంతకుముందు టెస్లాలోనూ భారీ యెత్తున ఉద్యోగులకు ఉద్వాసన పలికారు. దానిపై జాతీయ కార్మిక సంబంధాల బోర్డులో కేసులు కూడా నడుస్తున్నాయి. ఇక చైనాపై మస్క్‌కున్న ప్రేమ ఎవరికీ తెలియంది కాదు. 2020లో షాంఘైలో టెస్లా విద్యుత్ కార్ల కర్మాగారం మొదలయ్యాక ఒక్క చైనాలోనే మస్క్ ఆరు లక్షల కార్లు విక్రయించారు.పర్యావరణ పరిరక్షణ పేరిట పెట్రోల్, డీజిల్ కార్లకు బదులు విద్యుత్ కార్లు తీసుకురావటం పెద్ద కుట్రని ట్రంప్ అభిప్రాయం. దానికితోడు ఆయనకు చైనాపై ఉన్న వ్యతిరేకత మస్క్ వ్యాపార ప్రయోజనాలను దెబ్బతీసే ప్రమాదం ఉంటుంది. విదేశాంగమంత్రిగా ఎంపిక చేసుకున్న మార్కో రుబియో చైనాకు తీవ్ర వ్యతిరేకి, ఇజ్రాయెల్ అనుకూలుడు.ట్రంప్ హయాంలో వేధింపులు దండిగా ఉంటాయని అటార్నీ జనరల్‌గా మాట్ గెట్జ్ ఎంపిక వెల్లడిస్తోంది. తన ప్రత్యర్థి కమలా హ్యారిస్ మొదలుకొని ప్రతినిధుల సభ మాజీ స్పీకర్ నాన్సీ పెలోసీ, 2021 నాటి మూకదాడి కేసు విచారణలో ప్రముఖపాత్ర పోషించిన లిజ్ షెనీ వరకూ చాలామందిపై ఆయన ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్నారు. అందుకే మైనర్లతో లైంగిక కార్యకలా పాలు, మాదకద్రవ్యాల వినియోగంవంటి ఆరోపణలున్నా ఉద్దేశపూర్వకంగా గెట్జ్‌ను ట్రంప్ ఎంపిక చేశారు. ట్రంప్‌పై నేరారోపణలు ముసురుకొని కేసులు వచ్చిపడిన తరుణంలో ఆయన వెనకదృఢంగా నిలబడటం గెట్జ్కున్న ఏకైక అర్హత. రిపబ్లికన్లలోనే వ్యతిరేకత వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ ఎంపిక సెనేట్‌లో గట్టెక్కుతుందా అన్న సందేహాలున్నాయి. అమెరికా త్రివిధ దళాధిపతుల కమిటీ చైర్మన్‌తో సహా సైనిక జనరళ్లను తొలగించాలని కోరే ఫాక్స్ న్యూస్ ప్రెజెంటర్ హెగ్సెత్ను రక్షణ మంత్రిగా ఎంపిక చేయడం కూడా అత్యధికులకు మింగుడుపడటం లేదు. వైవిధ్యత పేరిట సైన్యంలో మైనారిటీ వర్గాలకూ, స్త్రీలకూ ప్రాధాన్యత పెరగటాన్ని చాలాకాలంగా హెగ్సెత్ ప్రశ్నిస్తు న్నారు. గతంలో సైన్యంలో పని చేసిన హెగ్సెత్వల్ల ప్రభుత్వంతో సైన్యానికి ఘర్షణ తప్పదని అనేకుల అంచనా. ఇక సైన్యంలో లెఫ్టినెంట్ కల్నల్‌గా పనిచేసిన తులసి గబార్డ్ వెనిజులా, సిరియా, ఉక్రెయిన్, రష్యా వ్యవహారాల్లో అమెరికా విధానాలు తప్పని అంటారు. ఆమెకు ఏకంగా 18 నిఘా సంస్థల కార్యకలాపాలను పర్యవేక్షించే నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ బాధ్యతలు అప్పజెప్పటాన్ని ఎవరూ జీర్ణించుకోలేక పోతున్నారు. ట్రంప్ ఏలుబడిలో వలసదారులను శ్వేతజాతి దురహంకారం బెడదతో సహా అనేకం చుట్టు ముడతాయి. దానికితోడు వీసా సమస్యలు, ఉద్యోగాల కోత తప్పవు. ఇక ‘అమెరికా ఫస్ట్’ అమలైతే వాణిజ్యయుద్ధం ఏ స్థాయిలో ఉంటుందో తెలుసు గనుక చైనాతో సహా అనేక దేశాలు ఆత్మరక్షణ విధానాలకు సిద్ధపడుతున్నాయి. డాలర్ దూకుడు అంచనాతో అమెరికా మార్కెట్లు వెలిగిపోతుంటే విదేశీ మార్కెట్లు వెలవెలబోతున్నాయి. ట్రంప్ టీంలో మార్కో రుబియో, హెగ్సెత్, ఉపాధ్యక్షుడు కాబోతున్న జేడీ వాన్స్తోసహా అందరూ ఉక్రెయిన్ యుద్ధం ఆపటమే తమ తొలి లక్ష్యమని ఇప్పటికే ప్రకటించారు గనుక ఉక్రెయిన్ అధినేత జెలెన్స్కీకి గత్యంతరం లేదు. నాటో దేశాలు ట్రంప్తోగతంలో ఉన్న అనుభవం వల్ల ఇప్పటికే దిక్కుతోచక ఉన్నాయి. మొత్తానికి ట్రంప్ రాకతో ఇంటా బయటా యధాతథ స్థితి తలకిందులు కాబోతోంది. -
రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ట్రంప్ ఫోన్‌కాల్
-
ఉక్రెయిన్ యుద్ధం తీవ్రతరమవుతున్న వేళ.. అనూహ్య పరిణామం
వాషింగ్టన్: రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధానికి ముగింపు ఎప్పుడు? ఈ ప్రశ్నకు సమాధానం ఎవరికీ తెలియడంలేదు. అయితే పలు దేశాలు ఈ యుద్ధాన్ని నియంత్రించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ఈ జాబితాలో భారత్ కూడా ఉంది. తాజాగా అమెరికా నూతన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఇందుకోసం ప్రయత్నాలు మొదలుపెట్టారు.వాషింగ్టన్ పోస్ట్ తెలిపిన వివరాల ప్రకారం డొనాల్డ్ ట్రంప్ రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఫోన్ చేసి, ఉక్రెయిన్ యుద్ధంపై చర్చించి తగిన సలహాలు ఇచ్చారని, ఈ యుద్ధాన్ని తీవ్రతరం చేయవద్దని కోరారని తెలుస్తోంది. అలాగే ఐరోపాలో అమెరికాకు ఉన్న బలమైన సైనిక ఉనికి గురించి రష్యాను హెచ్చరించారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు ఉక్రెయిన్‌లో కొనసాగుతున్న వివాదాన్ని పరిష్కరించే మార్గాలపై చర్చించారు. ఉపఖండంలో శాంతిని కొనసాగించే ప్రయత్నాల గురించి కూడా చర్చించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన ట్రంప్‌తో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ.. ఇదివరకే ఫోన్లో మాట్లాడిన సంగతి తెలిసిందే. కాగా ట్రంప్ తాజాగా పుతిన్‌తో సంభాషించడంపై ఉక్రెయిన్ ప్రభుత్వానికి సమాచారం అందించినట్లు వాషింగ్టన్ పోస్ట్ పేర్కొంది. అయితే ఉక్రెయిన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ మాత్రం దీనిని ఖండించింది. ఈ ఫోను సంభాషణ గురించి ఉక్రెయిన్‌కు ఎలాంటి ప్రాథమిక సమాచారం ఇవ్వలేదని, ఇది తప్పుడు రిపోర్టు అని పేర్కొంది. BREAKING: 🇺🇸🇷🇺 President-elect Donald Trump holds phone call with Russia's Vladimir Putin to discuss de-escalating the war in Ukraine. pic.twitter.com/2pDW1vARaE— BRICS News (@BRICSinfo) November 10, 2024మరోవైపు ట్రంప్‌తో ఉక్రెయిన్‌పై చర్చించేందుకు పుతిన్ సిద్ధంగా ఉన్నారని రష్యా ప్రకటించింది. అయితే రష్యా తన డిమాండ్లను మార్చుకోవడానికి సిద్ధంగా ఉందని దీని అర్థం కాదని కూడా రష్యా స్పష్టం చేసింది. కాగా ఇప్పటివరకూ పుతిన్- ట్రంప్ మధ్య జరిగిన ఫోన్ సంభాషణ అధికారికంగా ధృవీకరణ పొందలేదు. స్కై న్యూస్ వంటి ప్రధాన వార్తా నెట్‌వర్క్‌లు కూడా ఈ నివేదికను స్వతంత్రంగా ధృవీకరించలేదు.ఇది కూడా చదవండి: పేజర్ దాడులు మా పనే: ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు -
రష్యాకు ‘అక్టోబర్’ షాక్.. రోజుకు 1500 మంది సైనికుల మృతి!
లండన్: రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభమై.. దాదాపు మూడేళ్లు గడుస్తోంది. అయితే.. ఉక్రెయిన్‌తో యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి అత్యంత దారుణమైన ప్రతిఘటనను అక్టోబర్ నెలలో రష్యా బలగాలు ఎదుర్కొన్నాయని బ్రిటన్ సాయుధ దళాల అధిపతి అన్నారు. అక్టోబర్‌లో రోజుకు సగటున 1,500 మంది రష్యన్ సైనికులు మరణించటం లేదా గాయపడటం జరిగిందని బిట్రన్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ టోనీ రాడాకిన్ తెలిపారు.‘‘రష్యా తన యుద్ధంలో మరణించిన వారి సంఖ్యను వెల్లడించలేదు. అయితే ఫిబ్రవరి 2022లో రష్యా.. ఉక్రెయిన్‌పై పూర్తి స్థాయి దండయాత్రను ప్రారంభించినప్పటి నుండి గత నెలలో అత్యధికంగా సైనికులను కోల్పోయింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ఆశయం కారణంగా సమామరు 7 లక్షమ మంది మరణించటం లేదా గాయపడటం జరిగింది. పుతిన్ ఆశయం కోసం రష్యా ఈ భారీ నష్టం, నొప్పి, బాధ భరించవల్సి వచ్చింది. చాలా తక్కువ భూభాగం కోసం అధిక సైన్యం నష్టపోయింది. రష్యా ప్రభుత్వం.. రక్షణ, భద్రతపై ప్రజా వ్యయంలో 40 శాతానికి పైగా ఖర్చు చేస్తోంది. అధ్యక్షుడు పుతిన్ దేశంపై అధిక భారం వేశారు. ఉక్రెయిన్‌కు బ్రిటన్ మద్దతు ఇస్తునే ఉంటుంది. అది అధ్యక్షుడు పుతిన్ గ్రహించవలసిన సందేశం. ఉక్రేనియన్ అధ్యక్షుడు జెలెన్స్కీకి భరోసా’’ అని అన్నారు.రష్యా దురాక్రమణకు వ్యతిరేకంగా పోరాటంలో ఉక్రెయిన్ బలమైన మద్దతుదారులలో బ్రిటన్ ఒకటి. ఉక్రెయిన్‌కు బిలియన్లకొద్ది పౌండ్లతో సైనిక సహాయంతో పాటు ఆయుధాలు, బలగాలకు శిక్షణను అందిస్తోంది. అమెరికాలో డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైన నేపథ్యంలో ఉక్రెయిన్ యుద్ధ ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడానికి పాశ్చాత్య దేశాల భవిష్యత్తు నిబద్ధత గురించి ఆందోళనలు వ్యక్తం అయ్యాయి. ఈ క్రమంలో బ్రిటన్ ప్రధాన మంత్రి కైర్ స్టార్మర్ ఉక్రెయిన్‌కు మద్దతును మరోసారి ప్రకటించటం గమనార్హం.చదవండి: కెనడాలో టెంపుల్‌పై దాడి.. ఖలిస్తానీ నిరసన నిర్వాహకుడు అరెస్ట్ -
ట్రంప్ మార్కు కనిపించేనా!
దూకుడుకు, ఆశ్చర్యకర నిర్ణయాలకు పెట్టింది పేరైన రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్ రెండోసారి అమెరికా అధ్యక్ష పీఠమెక్కనున్నారు. ఈ పరిణామం అమెరికా మిత్ర దేశాల్లో భయాందోళనలకు, శత్రు రాజ్యాల్లో హర్షాతిరేకాలకు కారణమవుతోంది. అన్ని విషయాల్లోనూ ‘అమెరికా ఫస్ట్’అన్నదే మూల సిద్ధాంతంగా సాగుతానని తేల్చి చెప్పిన ఆయన అదే ప్రాతిపదికన విదేశాంగ విధానాన్ని పునర్నర్మీస్తారా? అదే జరిగితే ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం. గాజాపై ఇజ్రాయెల్ దాడులతో పశ్చిమాసియాలో నెలకొన్న సంక్షోభంపై ఎలాంటి ప్రభావం ఉంటుందనేది ఆసక్తికరం. ఉక్రెయిన్ యుద్ధం నాటో పుట్టి ముంచేనా? రష్యా, ఉక్రెయిన్ మధ్య యుద్ధాన్ని ఒక్క రోజులో ముగించగలనని ఎన్నికల ప్రచారంలో ట్రంప్ పదేపదే చెప్పారు. అదెలా అని మీడియా పదేపదే ప్రశ్నిస్తే ఒక ఒప్పందాన్ని పరిశీలించాల్సి ఉందంటూ సరిపెట్టారు. ఉక్రెయిన్‌కు ఆయుధాల సరఫరాను కొనసాగించాలని, రష్యాతో ఆ దేశం శాంతి చర్చలు జరిపేలా చూస్తూనే షరతులు విధించాలని ట్రంప్ మాజీ జాతీయ భద్రతాధిపతులు ఇటీవల సూచించారు. నాటోలో ఉక్రెయిన్ ప్రవేశాన్ని వీలైనంత ఆలస్యం చేయడం ద్వారా రష్యాను తృప్తి పరచాలని చెప్పుకొచ్చారు. కానీ ట్రంప్ మాత్రం యుద్ధానికి ముగింపు పలకడం, అమెరికా వనరుల వృథాను అరికట్టడమే తన ప్రాథమ్యమని స్పష్టంగా చెబుతున్నారు. ఆ లెక్కన రెండేళ్లకు పైగా ఉక్రెయిన్‌కు బైడెన్ సర్కారు అందిస్తూ వచ్చిన భారీ ఆర్థిక, ఆయుధ సాయాలకు భారీగా కోత పడవచ్చని భావిస్తున్నారు. అంతేగాక యుద్ధాన్ని వీలైనంత త్వరగా ముగించేలా రష్యా, ఉక్రెయిన్ రెండింటిపైనా ట్రంప్ ఒత్తిడి పెంచడం ఖాయంగా కనిపిస్తోంది. స్వదేశంలో ఇమేజీ కోసం కనీసం తక్షణ కాల్పుల విరమణకైనా ఒప్పంచేందుకు ఆయన శాయశక్తులా ప్రయతి్నంచవచ్చు. అందుకోసం అవసరమైతే ఉక్రెయిన్‌కు ఎప్పటికీ నాటో సభ్యత్వం ఇవ్వొద్దన్న రష్యా డిమాండ్‌కు ట్రంప్ అంగీకరించినా ఆశ్చర్యం లేదంటున్నారు. ఇది నాటోలోని యూరప్ సభ్య దేశాలకు రుచించని పరిణామమే. కానీ నాటో కూటమి పట్ల ట్రంప్ తీవ్ర వ్యతిరేకత దృష్ట్యా వాటి అభ్యంతరాలను ఆయన పెద్దగా పట్టించుకోకపోవచ్చు. ఇది అంతిమంగా నాటో భవితవ్యంపైనే తీవ్ర ప్రభావం చూపవచ్చు. నాటో కూటమి రక్షణ వ్యయం తీరుతెన్నుల్లో భారీ మార్పులకు కూడా ట్రంప్ శ్రీకారం చుట్టవచ్చని ఆయన సన్నిహితులు చెబుతున్నారు. కొరుకుడు పడని పశ్చిమాసియా గాజా యుద్ధం, ఇరాన్‌తో ఇజ్రాయెల్ ఘర్షణ, దానిపై హమాస్‌తో పాటు హెజ్»ొల్లా దాడులతో అగి్నగుండంగా మారిన పశ్చిమాసియాలో కూడా శాంతి స్థాపిస్తానని ట్రంప్ వాగ్దానం చేశారు. తాను అధికారంలో ఉంటే ఇజ్రాయెల్‌పై హమాస్ దాడి జరిగేదే కాదని చెప్పుకున్నారు. ఇరాన్‌పై మరిన్ని ఆంక్షలు, ఆ దేశంతో అణు ఒప్పందం రద్దు వంటి చర్యలకు ఆయన దిగవచ్చంటున్నారు. ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో ట్రంప్ సాన్నిహిత్యం అందరికీ తెలిసిందే. కానీ ఇరాన్‌పై ప్రతీకారం, హమాస్, హెజ్»ొల్లా తదితర ఉగ్ర సంస్థల నిర్మూలన విషయంలో నెతన్యాహు మొండిగా ఉన్నారు. దీన్ని వ్యతిరేకించినందుకు రక్షణ మంత్రినే ఇంటికి పంపించారు. కనుక ట్రంప్ ప్రయత్నాలకు నెతన్యాహు ఏ మేరకు సహకరిస్తారన్నది సందేహమే. నిజానికి ట్రంప్ విధానాలే పశ్చిమాసియాలో అస్థిరతకు దారి తీశాయన్నది ఆయన విమర్శకుల వాదన. వాటివల్ల పాలస్తీనియన్లకు తీవ్ర అన్యాయం జరిగిందని వారంటారు. ఇజ్రాయెల్‌తో పాటు పలు అరబ్, ముస్లిం దేశాల మధ్య దౌత్య సంబంధాలను మెరుగు పరిచేందుకు ట్రంప్ చేసిన ప్రయత్నాలు పాలస్తీనాను పూర్తిగా ఏకాకిని చేశాయి. ఇన్ని సంక్లిష్టతల నడుమ గాజా కల్లోలానికి ట్రంప్ చెప్పినట్టుగా తెర దించగలరా అన్నది వేచి చూడాల్సిన విషయమే. చైనా వ్యూహంలోనూ మార్పులు! అమెరికా విదేశాంగ విధానంలో చైనా పట్ల వైఖరి అత్యంత వ్యూహాత్మకమైనది. ఇది ప్రపంచ భద్రత, వాణిజ్యంపైనే ప్రభావం చూపుతుంది. ట్రంప్ అధికారంలో ఉండగా చైనాను ‘వ్యూహాత్మక పోటీదారు’గా పేర్కొన్నారు. పలు చైనా దిగుమతులపై సుంకాలు విధించారు. దాంతో చైనా కూడా అమెరికా దిగుమతులపై సుంకాలు విధించింది. ఈ వివాదాన్ని తగ్గించే ప్రయత్నాలు జరుగుతుండగానే కోవిడ్ వచ్చి పడింది. దాన్ని ‘చైనీస్ వైరస్’గా ట్రంప్ ముద్ర వేయడంతో ద్వైపాక్షిక సంబంధాలు దిగజారాయి. అనంతరం బైడెన్ సర్కారు కూడా చైనాపై ట్రంప్ సుంకాలను కొనసాగించింది. అమెరికాలో నిరుద్యోగం తదిరాలకు చైనా దిగుమతులను కూడా కారణంగా ట్రంప్ ప్రచారం పొడవునా ఆక్షేపించన నేపథ్యంలో వాటిపై సుంకాలను మరింత పెంచవచ్చు. అలాగే చైనా కట్టడే లక్ష్యంగా సైనికంగా, వ్యూహాత్మకంగా అమెరికా అనుసరిస్తున్న ఆసియా విధానంలోనూ మార్పుచేర్పులకు ట్రంప్ తెర తీసే అవకాశముంది. చైనా కట్టడికి దాని పొరుగు దేశాలతో బలమైన భద్రతా భాగస్వామ్యాన్ని కొనసాగించాలన్న బైడెన్ ప్రభుత్వ విధానానికి ఆయన తెర దించినా ఆశ్చర్యం లేదు. అదే జరిగితే భారత్‌కు ఇబ్బందికర పరిణామమే. తైవాన్‌పై చైనా దాష్టీకాన్ని అడ్డుకునేందుకు సైనిక బలాన్ని ఉపయోగించాల్సిన అవసరం లేదని కూడా ట్రంప్ పదేపదే చెప్పారు. కనుక తైవాన్‌కు అమెరికా సైనిక సాయాన్ని కూడా నిలిపేయవచ్చు.– సాక్షి, నేషనల్ డెస్క్ -
ఉక్రెయిన్‌పైకి దూసుకొచ్చిన 100 డ్రోన్లు
కీవ్: రష్యా శనివారం అర్ధరాత్రి నుంచి తమ భూభాగంపైకి 96 డ్రోన్లు, ఒక గైడెడ్ ఎయిర్ మిస్సైల్‌ను ప్రయోగించిందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపించారు. క్షిపణితోపాటు 66 డ్రోన్లను కూల్చివేసినట్లు ఉక్రెయిన్ ఆర్మీ ప్రకటించింది. వేర్వేరు ప్రాంతాలపైకి దూసుకెళ్లిన మరో 27 డ్రోన్లను పనిచేయకుండా జామ్ చేశామని తెలిపింది. ఒక డ్రోన్ బెలారస్ గగనతలంలోకి వెళ్లిందని వివరించింది. ఈ దాడులతో తమకెలాంటి నష్టం వాటిల్లలేదని పేర్కొంది. వారం రోజుల వ్యవధిలో రష్యా కనీసం 900 గైడెడ్ ఏరియల్ బాంబులు, 500 డ్రోన్లు, మరో 30 క్షిపణులను ఉక్రెయిన్‌పైకి ప్రయోగించిందని జెలెన్ స్కీ వివరించారు. తమకు తక్షణమే లాంగ్ రేంజ్ మిస్సైళ్లను ప్రయోగించేందుకు అనుమతివ్వాలని అమెరికా, పశ్చిమ దేశాలను ఆయన కోరారు. డ్రోన్లు, మిస్సైళ్ల తయారీలో కీలకమైన పరికరాలు రష్యాకు అందకుండా ఆంక్షలను మరింత ప్రభావవంతంగా అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.కాగా, ఉక్రెయిన్ తమ మూడు రీజియన్లపైకి ప్రయోగించిన 19 డ్రోన్లను ధ్వంసం చేసినట్లు రష్యా ఆర్మీ ప్రకటించింది. బెల్గొరోడ్ రీజియన్ ఒక వ్యక్తి గాయాలతో చనిపోయాడని పేర్కొంది. -
యుద్ధం మిగిల్చేది పరాజయాన్నే!
ఆధునిక ప్రపంచంలో ఇప్పటి వరకు జరిగిన యుద్ధాలు, అంతర్యుద్ధాల వల్ల మానవాళి మాటలకు అందని నష్టాలను చవిచూసింది. అయినా చరిత్ర నుంచి పాఠాలు నేర్చుకోకుండా తరచూ యుద్ధాల ద్వారానే పలు దేశాలు సమస్యలను పరిష్కరించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. గత రెండేళ్ల నుంచి సాగుతున్న ఉక్రెయిన్–రష్యా యుద్ధం, ఏడాది పైబడిన పాలస్తీనా–ఇజ్రాయెల్ యుద్ధం; తాజాగా లెబనాన్, సిరియా, ఇరాన్‌లకు విస్తరించిన ఇజ్రాయెల్ దాడులు– ప్రతిదాడులు... వెరసి 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తాయేమోనన్న ఆందోళనలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. అటు ఉక్రెయిన్‌లో, ఇటు గాజాలో పసిపిల్లలతో సహా వేలాదిమంది అమాయకులు ఈ రెండు యుద్ధాల వల్ల బలైపోయారు.ఏ యుద్ధంలోనైనా పరాజితులే ఉంటారు తప్ప విజేతలు ఉండరని చెప్పారు ‘యుద్ధము–శాంతి (వార్ అండ్ పీస్)’ అనే తన అద్భుత నవల ద్వారా రష్యన్ మహా రచయిత లియో టాల్‌స్టాయ్. సరిహద్దులు లేని పరస్పర ప్రేమ ఒక్కటే విశ్వశాంతికి మార్గం వేస్తుందని రెండు శతాబ్దాల ముందే చెప్పారాయన.1910లో టాల్‌స్టాయ్ మరణించిన 4 ఏళ్ల తర్వాత 1914 నుంచి 1917 వరకు మొదటి ప్రపంచ యుద్ధం జరిగింది. 3 ఏళ్లపాటు జరిగిన ఈ యుద్ధంలో 85 లక్షల మంది సైనికులు, 1 కోటి 30 లక్షల మంది పౌరులు మరణించారు. ఆ యుద్ధంలో అంగవైకల్యం పొందిన వారి సంఖ్యకు లెక్కేలేదు. ఆ తర్వాత, 1939–45 మధ్య 6 ఏళ్ల పాటు సాగిన రెండో ప్రపంచ యుద్ధంలో 6 కోట్ల మంది ఆశువులు బాశారు. కోట్లాది మంది క్షతగాత్రులయ్యారు. హిరోషిమా, నాగసాకీలపై అమెరికా వేసిన అణుబాంబులు ఆ నగరాలను మరుభూమిగా మార్చాయి.1947 తర్వాత... జరిగిన ఆర్థిక పునర్నిర్మాణం కారణంగా ప్రబల ఆర్థిక, సైనిక శక్తులుగా అవతరించిన అమెరికా, సోవియట్ రష్యాల మధ్య సాగిన ఆధిపత్యపోరు క్రమంగా ప్రచ్ఛన్న యుద్ధంగా మారింది. ప్రపంచంలోని అనేక దేశాలు ఆ అగ్రరాజ్యాల సహాయ సహకారాల మీద ఆధార పడటం వల్ల అనివార్యంగా అవి ఏదో ఒక శిబిరంలో చేరాల్సి వచ్చింది. ఫలితంగా ఆ యా దేశాలు సైతం ఆ ప్రచ్ఛన్నయుద్ధంలో భాగస్వాములై నష్టపోయాయి. 1989లో సోవియట్ యూనియన్ పతనమయ్యేంతవరకు ఆ ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగింది. అంతకుముందే ఇజ్రాయెల్–పాలస్తీనాల మధ్య ఘర్షణలు మొదలై పశ్చిమాసియాలో అశాంతి నెలకొంది. తదుపరి ఇరాన్–ఇరాక్‌ల మధ్య కీచులాటలు కొనసాగాయి. 1962లో ఇండియా–చైనాల మధ్య యుద్ధం, 1972లో ఇండియా–పాక్‌ల మధ్య యుద్ధం, తిరిగి 1999లో ఈ రెండు దేశాల నడుమ కార్గిల్ యుద్ధం, దక్షిణాఫ్రికా ఖండంలోని కొన్ని దేశాల మధ్య అంతర్యుద్ధం... ఇలా చెప్పుకుంటూపోతే అనేక యుద్ధాలు ప్రపంచాన్ని అస్థిరపరిచాయి. ఈ నేపథ్యంలోనే గత రెండేళ్ల నుంచి సాగుతున్న ఉక్రెయిన్–రష్యా (యురేషియా) యుద్ధం, ఏడాది పైబడిన పాలస్తీనా–ఇజ్రాయెల్ (పశ్చిమాసియా) యుద్ధం; తాజాగా లెబనాన్, సిరియా, ఇరాన్‌లకు విస్తరించిన ఇజ్రాయెల్ దాడులు– ప్రతిదాడులు... వెరసి 3వ ప్రపంచ యుద్ధానికి దారితీస్తాయేమోనన్న ఆందోళనలు సర్వత్రా వ్యక్తం అవుతున్నాయి. అటు ఉక్రెయిన్‌లో, ఇటు గాజాలో పసిపిల్లలతోసహా వేలాదిమంది అమాయకులు బలైపోయారు. రెండు ప్రధాన యుద్ధాలలో అపార ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరుగుతున్నా... ఎవ్వరూ తగ్గడం లేదు. ఈ యుద్ధాలను ఆపడానికి ఐక్యరాజ్య సమితి చేసిన అరకొర యత్నాలు ఏమాత్రం ఫలితాలివ్వలేదు. పైగా, ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ తమ దేశంలో పర్యటించరాదని ఇజ్రాయెల్ హుకుం జారీ చేసింది. హెజ్బొల్లా, ఇరాన్, హౌతీల దాడులను ఐక్యరాజ్య సమితి ఖండించలేదన్నది ఇజ్రాయెల్ ఆరోపణ. గతంలో యుద్ధాలకు దిగే దేశాలపై దౌత్యపరమైన ఆంక్షలు విధించేవారు. కానీ, ఇప్పుడు ఆ దశ దాటి పోయింది. మధ్యవర్తిత్వం వహించాల్సిన వారు కూడా ఏదో ఒక కూటమికి వంత పాడటంతో... కనుచూపు మేరలో ఈ యుద్ధాలకు ముగింపు కార్డుపడే పరిస్థితి కనపడటం లేదు. ప్రపంచ దేశాలకు అత్యధిక స్థాయిలో చమురు సరఫరా చేసే గల్ఫ్ కో ఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) సభ్య దేశాలైన సౌదీ అరేబియా, యూఏఈ, బహ్రెయిన్, ఒమన్, కువైట్ దేశాలు మాత్రం తాము అటు ఇజ్రాయెల్‌కు గానీ, ఇటు ఇరాన్‌కు గానీ మద్దతు ఇవ్వకుండా తటస్థంగా ఉంటామని ప్రకటించడం కొంతలో కొంత ఊరట కలిగించే అంశమే.పశ్చిమాసియాలో నెలకొన్న ప్రాంతీయ ఉద్రిక్తతలు, కొనసాగుతున్న యుద్ధం వల్ల భారత్‌కు ఆర్థికంగా అపార నష్టం వాటిల్లే పరిస్థితులు ఉత్పన్నం అయ్యాయి. పశ్చిమాసియా పరిణామాలు భారత్ స్టాక్ మార్కెట్లను ఇప్పటికే ఒడిదుడుకులకు గురి చేస్తున్నాయి. ఎందుకంటే భారత ఇంధన అవసరాలు దాదాపు 80 శాతానికి పైగా దిగుమతుల ద్వారానే తీరుతున్నాయి. ప్రధానంగా ఇరాన్ కనుక తన హోర్ముజ్ జలసంధిని దిగ్బంధనం చేసినట్లయితే ఈ మార్గం ద్వారా చమురు, సహజ వాయువును దిగుమతి చేసుకొంటున్న భారత్ ప్రత్యామ్నాయంగా మరో మార్గాన్ని ఎంచుకోవాలి. అలాగే, సూయిజ్ కాలువ ద్వారా రవాణాను అనుమతించనట్లయితే... చుట్టూ తిరిగి దక్షిణాఫ్రికాలోని కేప్ ఆఫ్ గుడ్ హోప్ ద్వారా చమురును రవాణా చేసి తెచ్చుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల దూరం పెరిగి రవాణా ఖర్చులు తడిసి మోపెడవుతాయి. ఇప్పటికే యెమన్ కేంద్రంగా పనిచేసే హౌతీలు హమాస్‌కు మద్దతుగా సూయిజ్ కాలువ ద్వారా రవాణా అవుతున్న నౌకలపై దాడులు చేస్తున్నారు. ఇది భారత్‌కు ఊహించలేని నష్టాన్ని కలిగిస్తోంది. ఇక, దేశంలో ముడి చమురు ధరలు పెరిగితే, దేశ ఆర్థిక వ్యవస్థ తల్లకిందులవడం ఖాయం. 2014–15 లో బ్యారెల్ ముడిచమురు ధర అత్యధికంగా 140 డాలర్లకు చేరినపుడు దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రమైన ఒత్తిళ్లకు లోనయింది. ప్రçస్తుతం బ్యారెల్ ముడిచమురు 85–90 డాలర్ల మధ్యనే ఉండటం వల్ల... భారత్ స్థిమితంగానే ఉంది. కానీ, మధ్య ప్రాచ్యంలో యుద్ధం కనుక మరింత ముదిరితే జరిగే పరిణామాలు చేదుగానే ఉంటాయి. పొద్దు తిరుగుడు నూనె, పామాయిల్ నూనెలను అత్యధికంగా ఉత్పత్తి చేసే ఉక్రెయిన్‌లో యుద్ధం ప్రారంభమైన తర్వాత ఆ నూనెల ధరలు అమాంతం పెరిగిపోయాయి. ప్రపంచీకరణ వేగం పుంజుకొన్న తర్వాత ప్రతి దేశంలో ఆర్థిక పరిస్థితులు బాహ్య పరిణామాలపై ఆధారపడ్డాయి. అందుకు భారత్ మినహాయింపు కాదు. ఒకప్పుడు ‘రష్యా’తో దౌత్యపరంగా సఖ్యత సాగించిన భారత్... తదనంతర పరిణామాలతో అమెరికాకు సైతం దగ్గరయింది. అమెరికా–చైనాల మధ్య మొదలైన ఆధిపత్య పోరు నేపథ్యంలో భారత్ వ్యూహాత్మకంగా అమెరికాకు మరింత చేరువయింది. రష్యా, అమెరికా... ఈ రెండు అగ్రరాజ్యాలతో సన్నిహిత సంబంధాలు కొనసాగించడం భారత్‌కు మేలు చేసేదే. అయితే, భారత్ తన దౌత్యనీతిలో ఎల్లప్పుడూ తటస్థంగానే కొనసాగుతోంది.యుద్ధాలతో ఏ సమస్యనూ పరిష్కరించలేమని ప్రధాని నరేంద్రమోదీ ఇటీవల తన రష్యా పర్యటనలో అధ్యక్షుడు పుతిన్‌కు స్పష్టం చేయడం ద్వారా భారత్ తన విదేశాంగ విధానాన్ని చాటి చెప్పారు. ముడిచమురుతో సహా పలు వస్తువులను రష్యా నుంచి దిగుమతి చేసుకొంటున్నప్పటికీ... ఉక్రెయిన్‌పై రష్యా చేస్తున్న యుద్ధానికి భారత్ మద్దతు తెలపలేదు. పైగా, ఉక్రెయిన్‌కు నైతిక మద్దతు ప్రకటించింది. విస్తరణ వాదాన్ని సహించబోమని ఒక్క రష్యాకే కాదు.. అరుణాల్ప్రదేశ్ను ఆక్రమించాలని చూస్తున్న చైనాకు కూడా భారత్ పరోక్ష హెచ్చరికలు జారీ చేసింది.నిజానికి, అటు యురేషియాలో, ఇటు పశిమాసియాలో జరుగుతున్న యుద్ధాలను నిలిపివేయడానికి గల మార్గాలను భారత్ తీవ్రంగా అన్వేషిస్తోంది. ప్రస్తుతం ప్రపంచ దేశాలలో అత్యధిక స్థాయిలో ఆర్థికాభివృద్ధి రేటును నమోదు చేస్తున్న భారత్‌కు ఈ అంతర్జాతీయ పరిణామాలు మింగుడు పడనివే. 2047 నాటికి ‘వికసిత్ భారత్’ లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఈ తరుణంలో పశ్చియాసియాలో సాధారణ పరిస్థితులు ఏర్పడేందుకు తనవంతు కృషి చేయడం మినహా భారత్ చేయగలిగింది ఏమీలేదు. లియో టాల్‌స్టాయ్ చెప్పినట్లు పరాజితులుగా మిగిలిపోతారా లేక యుద్ధవిరమణ చేసి విజేతలుగా అవతరిస్తారా అన్నది యుద్ధాల్లో మునిగి ఉన్న దేశాలు, వాటికి మద్దతు ఇస్తున్న దేశాల వైఖరి మీద ఆధారపడి ఉంది. -డా. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లువ్యాసకర్త ఏపీ శాసన మండలి సభ్యులు -
వారి సైన్యాన్ని ఎదుర్కొనేందుకు మిసైల్స్ కావాలి: ఉక్రెయిన్
కీవ్: రష్యాకు మద్దతుగా ఉత్తర కొరియా సైనికులు ఉక్రెయిన్ సరిహద్దుల్లో మోహరించారు. ఈ నేపథ్యంలో రష్యా, ఉత్తర కొరియా సైనిక దాడులను ఎదుర్కొవాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ భావిస్తున్నారు. అందులో భాగంగానే రష్యాపై క్షిపణులను ప్రయోగించేందుకు తమ మిత్రదేశాల నుంచి అనుమతి అవసరమని తెలిపారు. శుక్రవారం సాయంత్రం జెలెన్స్కీ మీడియాతో మాట్లాడారు.‘‘రష్యా ఉక్రెయిన్ భూభాగంలో ఉత్తర కొరియా సైనికులను ప్రతి స్థావరాలు, వారి అన్ని శిబిరాలను మేం గమనిస్తాం. ఈ పరిస్థితుల్లో దాడి చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటే.. మేం రష్యా దాడులకు నివారణగా కచ్చితంగా ప్రతిదాడిచేసే అవకాశం ఉంది. ఉక్రేనియన్లపై దాడి చేయటం కోసం ఉత్తర కొరియా సైన్యం ఎదురు చూస్తోంది. రష్యాకు మద్దతుగా మోహరించిన ఉత్తర కొరియా సేనలను దీటుగా ఎదుర్కోవాలంటే క్షిపణులు ప్రయోగించాలి. అందుకు తమ మిత్ర దేశాల మద్దతు అవసరం ఉంది. మా వద్ద సుదూర లక్ష్యాలను ఛేదించే సౌలభ్యం ఉంటే వారిని అడ్డుకోవడానికి వినియోగిస్తాం’’అని వెల్లడించారు.చదవండి: ప్రపంచంలోనే శక్తిమంతమైన క్షిపణి పరీక్ష.. ఉక్రెయిన్ సరిహద్దుల్లో 8 వేల కొరియా సైనికులు -
అమెరికా కొత్త ఆంక్షలు!
అనుకున్నది సాధించటం కోసం, మాట వినని దేశాలను దారికి తెచ్చుకోవటం కోసం ఆంక్షల అస్త్రాన్ని ప్రయోగించటం అమెరికాకు అలవాటైన విద్య. దాన్ని సహేతుకంగా వినియోగిస్తున్నామా... ఆశించిన ఫలితాలు వస్తున్నాయా దుష్పరిణామాలు పుట్టుకొస్తున్నాయా అనే ఆలోచన దానికి ఎప్పుడూ రాలేదు. ‘ప్రపంచంలో అగ్రజులం, మన మాట చెల్లుబాటు కావాలంతే...’ అన్న పట్టింపే అధికం. ఉక్రెయిన్‌లో రష్యా యుద్ధానికి తోడ్పడుతున్నారని ఆరోపిస్తూ ప్రపంచవ్యాప్తంగా 400 సంస్థలపైనా, వ్యక్తులపైనా ఆంక్షలు విధిస్తున్నట్టు అమెరికా విదేశాంగ శాఖ గురువారం ప్రకటించింది. ఇందులో మన దేశానికి సంబంధించి 19 ప్రైవేటు సంస్థలున్నాయి. ఇంకా ఈ జాబితాలో చైనా, మలేసియా, థాయ్‌లాండ్, తుర్కియే, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) తదితరాలున్నాయి. ఈ దేశాలన్నీ రష్యాకు ఉపకరణాలు, విడిభాగాలు పంపుతున్నాయనీ, వీటితో ఆయుధాలకు పదునుపెట్టుకుని రష్యా ఉక్రెయిన్‌పై దురాక్రమణ యుద్ధం కొనసాగిస్తోందనీ అమెరికా ఆరోపణ. వీటిల్లో ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, విమాన విడిభాగాలూ ఉన్నాయంటున్నది. పరాయి దేశాలపై ఆంక్షలు విధించేందుకు ఏ దేశానికైనా హక్కుంటుంది. కానీ ఆ దేశాలతో ఉన్న స్నేహసంబంధాలూ, ద్వైపాక్షిక ఒప్పందాలూ వగైరా చూసుకోవటం, అంతకుముందు సంబంధిత దేశాలతో చర్చించటం కనీస మర్యాద. అమెరికా ఎప్పుడూ ఈ మర్యాద పాటించిన దాఖలా లేదు.ఎప్పుడూ స్వీయప్రయోజనాలే పరమావధిగా భావించే అమెరికా తన విదేశాంగ విధాన లక్ష్యాలను నెరవేర్చుకోవటానికి ఆంక్షల్ని ఆయుధంగా మలుచుకోవటం పాత కథే. అయితే ఈమధ్యకాలంలో ఇది బాగా ముదిరిందని ఒక అధ్యయనం చెబుతోంది. దాని ప్రకారం మొదటి ప్రపంచయుద్ధానికీ (1914–18), 2000 సంవత్సరానికీ మధ్య అమెరికా 200కు పైగా ఆంక్షలు విధించిందని తేలింది. చిత్రంగా అటు తర్వాత ఈ రెండు దశాబ్దాలపైగా కాలంలో ఈ ఆంక్షలు తొమ్మిదిరెట్లు పెరిగాయని ఆ అధ్యయనం వివరిస్తోంది. అంటే ఎనిమిది దశాబ్దాల కాలంలో అమెరికా విధించిన ఆంక్షల సంఖ్య చాలా స్వల్పం. జాతీయ భద్రత, విదేశాంగ విధానం, ఆర్థికాంశాలు... ఒకటేమిటి అనేకానేక అంశాల విషయంలో ఈ ఆంక్షల జడి పెరిగిపోయింది. క్యూబా, వెనెజులా, ఇరాన్, ఇరాక్ తదితర దేశాలు ఈ ఆంక్షల పర్యవసానాన్ని ఎక్కువగా ఎదుర్కొంటున్నాయి. అసలు అవతలి దేశంనుంచి ఆశిస్తున్నదేమిటో చెప్పకుండానే వీటిని వినియోగించిన సందర్భాలు కూడా ఉన్నాయి. సాఫల్య వైఫల్యాలను అమెరికా గమనంలోకి తీసుకుంటున్నదా లేదా అనే సంశయం కూడా లేకపోలేదు. ఎందుకంటే ఈ మొత్తం ఆంక్షలవల్ల నెరవేరిన ప్రయోజనాలు ఆశించిన లక్ష్యాల్లో 34 శాతం దాటవన్నది ఆ అధ్యయన సారాంశం. ఈ ఆంక్షలు వికటించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఉదాహరణకు ఇరాక్‌లో రసాయన ఆయుధాలున్నాయని ప్రపంచాన్ని నమ్మించి ఆ దేశంపై దండెత్తిన అమెరికా అంతకుముందూ ఆ తర్వాత దాన్ని ఆంక్షల చక్రబంధంలో బంధించింది. అందువల్ల పసిపిల్లలకు పాలడబ్బాలు మొదలుకొని ప్రాణావసరమైన ఔషధాల వరకూ ఎన్నో నిత్యావసరాలు కరువై లక్షలమంది మృత్యువాత పడ్డారు. తాను ఆంక్షలు విధించటంతో సరిపెట్టక మిత్రులైన పాశ్చాత్య దేశాలను కలుపుకోవటం అమెరికా విధానం. అంతా అయినాక, ఇరాక్ పాలకుడు సద్దాం హుస్సేన్ ఉసురు తీశాక అక్కడ రసాయన ఆయుధాలున్నాయనటం పచ్చి అబద్ధమని తేలింది. మరి లక్షలమంది జనం ఉసురు తీసిన పాపం ఎవరిది? ఇరాన్లో సరేసరి... అక్కడ తన అనుకూలుడైన ఇరాన్ షా పదవీ భ్రష్టుడైంది మొదలుకొని ఆంక్షల పరంపర కొనసాగిస్తూనే ఉంది. ఇందువల్ల మన దేశం సైతం ఆర్థికంగా ఎంతో నష్టపోవాల్సి వచ్చింది. అందుకే ఈ అర్థరహిత ఆంక్షల్ని దాటుకుని, నష్టం కనిష్ట స్థాయిలో ఉండేలా తెలివిగా వ్యవహరించే దేశాల సంఖ్య కూడా పెరుగుతూ వస్తోంది. ఉదాహరణకు 2017–2021 మధ్య యూరప్ దేశాలకు రష్యాతో ఉన్న వాణిజ్యం ఉక్రెయిన్ యుద్ధం తర్వాత 5 శాతం తగ్గింది. అదే సమయంలో రష్యాకు ఆర్మేనియా, యూఏఈ, కజఖ్‌స్తాన్, ఉజ్బెకిస్తాన్, హాంకాంగ్‌లతో వాణిజ్యం పెరిగింది. మరోపక్క ఈ దేశాలన్నిటితో యూరప్ దేశాల వాణిజ్యం ఎన్నో రెట్లు పెరిగింది. అంటే రష్యానుంచి కొనుగోలు చేస్తున్న సరుకంతా ఈ దేశాలు యూరప్ దేశాలకు తరలిస్తున్నాయి. ఇక ఆంక్షల ప్రయోజనం ఏం నెరవేరినట్టు? రష్యా నుంచి మన ముడి చమురు దిగుమతులు భారీగా పెరగటం, యూరప్ దేశాలకు శుద్ధిచేసిన చమురునూ, గ్యాస్‌నూ మన దేశం విక్రయించటం ఇటీవలి ముచ్చట.అసలు ఆంక్షల వల్ల ఒరిగేది లేకపోగా నష్టం ఉంటుందని అమెరికా గుర్తించకపోవటం ఆశ్చర్యం కలిగిస్తుంది. భారత్ మిత్రదేశం. అసలే అమెరికాలో స్థిరపడిన ఖలిస్తానీ వేర్పాటువాద నాయకుడు గురుపత్వంత్ సింగ్ పన్నూ హత్యకు కుట్ర విషయంలో ఇటీవల సంబంధాలు దెబ్బతిన్నాయి. అవి మరింత దిగజారేలా ఆంక్షలకు దిగటం నిజంగా ప్రయోజనాన్ని ఆశించా లేక నాలుగురోజుల్లో జరగబోయే అధ్యక్ష ఎన్నికల్లో గొప్పలు చాటుకోవటానికా అన్నది అర్థంకాని విషయం. ఒకపక్క ఉక్రెయిన్‌పై రష్యా దండయాత్రను నిలువరించటం కోసమని తనకు తోచినట్టు చేసుకుపోతున్న అమెరికా... గాజా, వెస్ట్‌బ్యాంక్, లెబనాన్లలో రోజూ వందలమందిని హతమారుస్తున్న ఇజ్రాయెల్ విషయంలో ఎందుకు నోరెత్తటం లేదు? తనవరకూ అమలు చేసుకుంటూ పోతానంటే అమెరికా విధించిన ఆంక్షలపై ఎవరికీ పెద్దగా అభ్యంతరం ఉండదు. కానీ అదే పని అందరూ చేయాలని శాసించటం తెలివితక్కువతనం. ఈ ఇంగితజ్ఞానం అమెరికాకు ఎప్పటికి అలవడుతుందో?! -
ఉక్రెయిన్‌లోకి ఉత్తర కొరియా సైనికులు! అమెరికా వార్నింగ్
న్యూయార్క్: ఉక్రెయిన్‌పై యుద్ధానికి రష్యాకు మద్దతుగా ఉత్తరకోరియా సైనికులు ఉక్రెయిన్‌లోకి ప్రవేశించినట్లు వార్తలు వస్తున్న క్రమంలో అగ్రరాజ్యం అమెరికా తీవ్రంగా స్పందించింది. రష్యాతో పాటు ఉక్రెయిన్‌లో పోరాడేందుకు వెళ్లిన ఉత్తర కొరియా సైనికుల మృతదేహాలు శవాల బ్యాగుల్లో తిరిగి వెళ్తాయని అమెరికా ఉత్తరకొరియాకు వార్నింగ్ ఇచ్చింది.‘‘రష్యాకు మద్దతుగా ఉత్తర కొరియా దళాలు ఉక్రెయిన్‌లోకి ప్రవేశించినట్లయితే.. కచ్చితంగా ఉత్తర కొరియా సైనికుల మృతదేహాలు శవాల బ్యాగుల్లో తిరిగి వెళ్తాయి.కాబట్టి అటువంటి నిర్లక్ష్య, ప్రమాదకరమైన చర్యలకు పాల్పటం ఒకటికి రెండుసార్లు ఆలోచించమని నేను ఉత్తర కొరియా అధ్యక్షడు కిమ్ జోంగ్-ఉన్‌కు సలహా ఇస్తాను’’ అని ఐక్యరాజ్యసమితిలో యూఎస్ డిప్యూటీ రాయబారి రాబర్ట్ వుడ్ అన్నారు.North Korean Troops Who Enter Ukraine Will "Return In Body Bags", Warns US"Should DPRK's troops enter Ukraine in support of Russia, they will surely return in body bags," US deputy ambassador to the UN Robert Wood told the Security Council.https://t.co/HVoaV5LbYo— M. Rowland (@melrow74) October 31, 2024చదవండి: ఉక్రెయిన్‌పై దాడులు.. పుతిన్ దళంలోకి ‘కిమ్’ సైన్యం -
యుద్ధాన్ని ఆపే సత్తా మోదీకి ఉంది : జెలెన్స్కీ
కీవ్: ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికే సత్తా భారత ప్రధాని మోదీకి ఉందని ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ పేర్కొన్నారు. దీని ద్వారా ఆయనకే కాదు, అంతర్జాతీయంగాను భారత్ ప్రతిష్ట పెరుగుతుందన్నారు. టైమ్స్ ఆఫ్ ఇండియాకు జెలెన్స్కీ ఇటీవల ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. ఉక్రెయిన్ సంక్షోభానికి సంబంధించిన పలు విషయాలను ఆయన ప్రస్తావించారు. ప్రధాని మోదీ జోక్యంతో ఉక్రెయిన్, రష్యాల మధ్య ఒప్పందం కుదిరే అవకాశాలున్నాయా అన్న ప్రశ్నకు జెలెన్స్కీ..‘ప్రధాని మోదీ దీనిని నిజం చేయగలవనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇందుకు భారత్‌లోనే చర్చలు జరగొచ్చు. అయితే, యుద్ధం మా గడ్డపై జరుగుతున్నందున మేమిచ్చే షరతులకు లోబడే సంప్రదింపులు జరగాలి’అని పేర్కొన్నారు. ఉక్రెయిన్‌లో శాంతి నెలకొల్పేందుకు ప్రయతి్నస్తానన్న మోదీ ప్రకటనపై జలెన్ స్కీ..మాటలు కాదు, చేతలు అవసరమన్నారు. ‘జనాభాపరంగా, ఆర్థికంగా, పలుకుబడిపరంగా భారత్ పెద్ద దేశం. అలాంటి దేశానికి ప్రధాని అయిన మోదీ..యుద్ధాన్ని ఆపేందుకు ప్రయతి్నస్తామని కేవలం మాటగా చెప్పడం సరికాదు. యుద్ధాన్ని ఆపేందుకు పలుకుబడిని ఉపయోగించాలి. రష్యాను ఆర్థికంగా దెబ్బకొట్టాలి. ఆదేశం నుంచి చౌకగా దొరుకుతున్న చమురును, రక్షణ రంగ ఉత్పత్తులను కొనరాదు. ఫలితంగా ఆ దేశ యుద్ధ సామర్ధ్యం దెబ్బతింటుంది’అని తెలిపారు. యుద్ధం సమయంలో ఎత్తుకుపోయిన మా చిన్నారుల్లో కనీసం వెయ్యి మందినైనా తిరిగి మాకు ఇచ్చేలా మోదీ రష్యాపై తన పలుకుబడిని ఉపయోగించాలన్నారు. తటస్థత అంటే రష్యా వైపు ఉన్నట్టే ‘యుద్ధం జరుగుతున్న సమయంలో తటస్థంగా ఉండటమంటే రష్యా పక్షాన ఉన్నట్లే అర్థం. దురాక్రమణదారు, బాధిత దేశం మధ్య తటస్థత అనేదే ఉండదు. అలా ఉండటమంటే పరోక్షంగా రష్యాకు మద్దతివ్వడమే’అని జెలెన్స్కీ అభిప్రాయపడ్డారు. ‘బ్రిక్స్ శిఖరాగ్రంలో పాల్గొన్న నేతలు కూడా సంక్షోభం సమసేందుకు సహకరిస్తామని చెప్పారు. నా దృష్టిలో అది కూడా మాకంటే రష్యాకే ఎక్కువగా అనుకూలంగా ఉన్నట్లు భావిస్తున్నా’అన్నారు. ‘అంతేకాదు, సౌదీ అరేబియా, బ్రెజిల్ వంటి దేశాల నేతలు రానందున బ్రిక్స్ శిఖరాగ్రం విఫలమైనట్లే లెక్క. ప్రపంచాన్ని పుతిన్ పశి్చమ అనుకూల, బ్రిక్స్ అనుకూల దేశాలుగా విభజించాలనుకుంటున్నారు. అందుకే, బ్రెజిల్, చైనాలు తీసుకువచి్చన శాంతి ప్రతిపాదనలను సైతం తిరస్కరించారు. ఈ పరిణామం చైనా, బ్రెజిల్‌లకు చెంపపెట్టు వంటిది’అని చెప్పారు. -
అదే జరిగితే.. రష్యా బలహీతకు సంకేతం: అమెరికా
న్యూయార్క్: ఉత్తర కొరియాకు చెందిన 3 వేల మంది సైనికులు రష్యాకు వెళ్లి డ్రోన్లు, ఇతర పరికరాలపై శిక్షణ పొందుతున్నారని దక్షిణ కొరియా వ్యాఖ్యలు చేసింది. దక్షిణ కొరియా వ్యాఖ్యల నేపథ్యంలో అమెరికా స్పందించింది. ఉత్తర కొరియాకు సైనికులు ఉక్రెయిన్‌పై పోరాటంలో భాగంగా రష్యా ఆర్మీలో చేరితే సైనిక చట్టాలను ఉల్లంఘించినట్లు అవుతుందని పేర్కొంది. ఉక్రెయిన్‌తో పోరాటాని రష్యా అధ్యక్షుడు పుతిన్.. ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జంగ్ ఉన్ మద్దతు పొందితే అది క్రెమ్లిన్ బలహీనతకు సంకేతమని వైట్ హౌస్ తెలిపింది. అమెరికా జాతీయ భద్రతా మండలి ప్రతినిధి జాన్ కిర్బీ బుధవారం మీడియాతో మాట్లాడారు.‘‘రష్యన్లు, ఉత్తర కొరియన్లు ఇక్కడ ఏమి చేయాలని నిర్ణయించుకుంటారో మేము చూస్తాం. నేను ఇంతకు ముందు చెప్పినట్లుగా ఉత్తర కొరియా సైనికులు ఉక్రెయిన్‌పై పోరాటంలో చేరాలని నిర్ణయించుకుంటే చట్టబద్ధమైన సైనిక లక్ష్యాలుగా మారిపోతాయి. ఈ పరిస్థితులపై నిశితంగా పరిశీలిస్తున్నాం. సైనికులు ఉత్తర కొరియాలోని వోన్సాన్ ప్రాంతం నుంచి రష్యాలోని వ్లాడివోస్టాక్‌కు ఓడలో ప్రయాణించారు. రష్యన్ సైనిక శిక్షణా కేంద్రాలున్న ప్రాంతాలు వెళ్లారు. అయితే.. ఉత్తర కొరియా సైనికులు రష్యన్ మిలిటరీతో కలిసి యుద్ధంలోకి పాల్గొంటాయో లేదో స్పష్టత లేదు. ఉత్తర కొరియా సైనికులు శిక్షణ పూర్తి చేసుకున్న తర్వాత ఉక్రేయిన్ మిలిటరీకి వ్యతిరేకంగా పోరాడేందుకు పశ్చిమ రష్యాకు వెళ్లవచ్చ. ఉక్రెయిన్ ప్రభుత్వానికి కూడా ఈ పరిస్థితి గురించి తెలియజేశాం. ఉత్తర కొరియా సైనికులు ఉక్రెయిన్‌తో యుద్ధంలో పాల్గొంటే.. రష్యాలో పెరుగుతున్న నిరాశ, బలహీనతకు సంకేతం అవుతుంది’’ అని అన్నారు. ఉత్తర కొరియా ఇప్పటివరకు 3వేల మంది సైనికులను రష్యాకు తరలించిందని దక్షిణ కొరియా తెలుపుతోంది. ఇటీవల 1500 మంది సైనికులను ఉత్తర కొరియా రష్యాకు తరలించినట్లు దక్షిణ కొరియా గూఢచర్య సంస్థ(ఎన్ఐఎస్) వెల్లడించింది. మరోవైపు.. రష్యా రాయబారి జార్జి జినోవిచ్తో భేటీ అయిన దక్షిణ కొరియా విదేశాంగ డిప్యూటీ మినిస్టర్ కిమ్ హాంగ్ క్యూన్ ఉత్తర కొరియా బలగాలను పంపడాన్ని ఖండించటం గమనార్హం.చదవండి: హిట్లర్‌ను ప్రస్తావించిన ట్రంప్.. కమలా హారీస్‌కు బిగ్ బూస్ట్