
పారిస్: అమెరికా అత్యున్నత పరిపాలనా పీఠం శ్వేతసౌధం సాక్షిగా అగ్రరాజ్యాధినేత ట్రంప్‌తో వాగ్వాదంలో తన దేశం తరఫున గట్టిగా వాదించిన ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ తాజాగా అనూహ్యంగా పట్టుసడలించారు. రష్యా దూకుడును అడ్డుకునేందుకు అమెరికా ఇన్నాళ్లూ చేసిన సైనిక, నిఘా సాయాన్ని హఠాత్తుగా నిలిపివేసిన వేళ జెలెన్‌స్కీ వైఖరిలో మార్పు రావడం గమనార్హం.
ఒంటరిగా వచ్చిన జెలెన్‌స్కీ ఆనాడు ట్రంప్, జేడీ వాన్స్‌తో మాటల యుద్ధానికి దిగి దౌత్యమంటలు రాజేసిన నేపథ్యంలో అగ్రనేతల ఆగ్రహావేశాలను చల్లార్చేందుకు ఈసారి ఫ్రాన్స్, బ్రిటన్ అగ్రనేతలు రంగంలోకి దిగుతున్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, బ్రిటన్ ప్రధాన మంత్రి కెయిర్ స్టార్మర్‌లు జెలెన్‌స్కీని అమెరికాను వెంటబెట్టుకుని తీసుకొచ్చి ట్రంప్‌తో సమాలోచనలు జరుపుతారని ఫ్రాన్స్ ప్రభుత్వం ప్రకటించింది. అయితే ఈ భేటీ ఎప్పుడనేది ఇంకా నిర్ధారణకాలేదు. ‘‘ఉక్రెయిన్, అమెరికా సంప్రదింపుల బృందాలు తదుపరి భేటీ కోసం తమ వంతు కృషిచేస్తున్నాయి.
ఈ కృషిలో పురోగతి కనిపిస్తోంది’’ అని గురువారం తెల్లవారు జామున జెలెన్‌స్కీ ఒక ప్రకటనచేశారు. బుధవారం ట్రంప్‌కు జెలెన్‌స్కీ ఒక లేఖ రాయడం, ఆ లేఖాంశాన్ని ట్రంప్ అమెరికా పార్లమెంట్ ఉభయసభల సంయుక్త సమావేశంలో బుధవారం ప్రస్తావించడం తెల్సిందే. ‘‘అమెరికా, ఉక్రెయిన్ మధ్య శాంతి ఒప్పందం కుదిరితే వెంటనే యురోపియన్ సైనిక బలగాలను ఉక్రెయిన్‌కు పంపే వీలుంది. రష్యా దూకుడుకు ఈ బలగాలు అడ్డుకట్టవేస్తాయి. డీల్ కుదిరాక బలగాల మోహరింపుపై వచ్చే వారం పారిస్‌లో ఈయూ దేశాల సైనిక చీఫ్‌లతో చర్చలు జరుపుతాం’’ అని మాక్రాన్ చెప్పారు.
ఆ పరిస్థితి రాకుండా ఉండేందుకే!
అమెరికా, ఉక్రెయిన్‌ల మధ్య శాంతి ఒప్పందం కుదరకపోతే యుద్ధ పరిస్థితులు అనూహ్యంగా తలకిందులవుతాయని యూరోపియన్ యూని యన్ దేశాలు భావిస్తున్నాయి. అమెరికా నుంచి అన్ని రకాల సాయం నిలిచిపోతే, పెద్దన్న అమెరికాను కాదని ఈయూ దేశాలు ఉక్రెయిన్‌కు సాయం చేసే సాహసం చేయకపోతే తుదకు యుద్ధంలో రష్యాదే పైచేయి అవుతుంది. అప్పుడు తప్పని పరిస్థితుల్లో అమెరికాకు బదులు రష్యాతో ఉక్రెయిన్ శాంతి ఒప్పందం చేసుకునే అవకాశముంది. ఆ పరిస్థితి రాకుండా ఉండేందుకు ఉక్రెయిన్‌ను అమెరికాకు దగ్గరచేయాలని ఈయూ దేశాలు తామే పెద్దరికం తీసుకుని జెలెన్‌స్కీని అమెరికా రప్పించి ‘శాంతి, ఖనిజ ఒప్పందం’ కుదిరేలా చేయాలని భావిస్తున్నాయి. అందులోభాగంగా మాక్రాన్, స్టార్మర్ రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment