
కీవ్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump)తో జరిగిన వాగ్వాదంపై ఉక్రెయిన్ అధినేత జెలెన్‌స్కీ మరోసారి స్పందించారు. ట్రంప్‌తో సంవాదం జరగడం నిజంగా విచారకరమని జెలెన్‌స్కీ చెప్పారు. విభేదాలు సరి చేసుకోవడానికి ఇదే సరైన సమయమని భావిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఆయన తాజాగా ‘ఎక్స్’లో పోస్టుచేశారు.
ఈ సందర్భంగా ట్రంప్‌తో చర్చలు జరగాల్సిన విధంగా జరగలేదని జెలెన్‌స్కీ అంగీకరించారు. ఉక్రెయిన్–అమెరికా మధ్య భవిష్యత్తులో పరస్పర సహకారం, కమ్యూనికేషన్ నిర్మాణాత్మకంగా ఉండేలా జాగ్రత్తపడతామని వెల్లడించారు. అమెరికా కోరుతున్న అరుదైన ఖనిజాలు అందించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు. దీనిపై ఒప్పందం కుదుర్చుకోవడానికి తమకు అభ్యంతరం లేదన్నారు. అయితే, ఉక్రెయిన్‌కు అందించే సైనిక సాయాన్ని నిలిపివేస్తున్నట్లు అమెరికా ప్రకటించిన కొన్ని గంటల్లోనే జెలెన్‌స్కీ (Volodymyr Zelenskyy) నుంచి ఈ స్పందన వచ్చింది.
ఇదే సమయంలో యుద్ధాన్ని ముగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని జెలెన్‌స్కీ పేర్కొన్నారు. తొలిదశలో ఖైదీల విడుదలతో పాటు క్షిపణులు, దీర్ఘ శ్రేణి డ్రోన్లు, ఇంధన వనరులు, ఇతర మౌలిక సదుపాయాలపై బాంబు దాడులపై నిషేధం వంటి వాటికి రష్యా అంగీకరిస్తే తదుపరి దశల ద్వారా ముందుకు వెళ్లాలని అనుకుంటున్నామన్నారు. బలమైన తుది ఒప్పందం కోసం అమెరికాతో కలిసి పని చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు.
అమెరికా ఇచ్చిందెంత?
2022 జనవరి నుంచి 2024 డిసెంబర్ ఉక్రెయిన్‌కు 300 బిలియన్ డాలర్లకుపైగా సాయం అందించినట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ స్వయంగా ప్రకటించారు. యూరప్ దేశాలు మాత్రం 100 బిలియన్ డాలర్లే ఇచ్చాయని అన్నారు. కానీ, ఆమెరికా ఇచ్చింది 182.8 బిలియన్ డాలర్లేనని సాక్షాత్తూ ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. అయితే, అందులో నిజం లేదని, అమెరికా నుంచి ఉక్రెయిన్‌కు అందిన సాయం 119.7 బిలియన్ డాలర్లు మాత్రమేనని జర్మనీకి చెందిన కీల్ ఇన్‌స్టిట్యూట్ స్పష్టంచేసింది.
పుతిన్‌ను నిలువరించేది ఖనిజాల ఒప్పందం మాత్రమే: వాన్స్
రష్యా అధ్యక్షుడు పుతిన్ దురాక్రమణ ప్రయత్నాలను నిలువరించగలిగేది యూఎస్– ఉక్రెయిన్ మధ్య కీలక ఖనిజాల ఒప్పందం మాత్రమేనని అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ పేర్కొన్నారు. ఇది మాత్రమే ఆచరణ సాధ్యమైన పరిష్కారమన్నారు. యుద్ధం ముగిశాక బ్రిటన్, ఫ్రాన్స్‌ల సారథ్యంలో ఏర్పాటయ్యే అంతర్జాతీయ బలగాలతో ఉక్రెయిన్‌కు ఎటువంటి భద్రతా ఉండదని వ్యాఖ్యానించారు. ఫాక్స్ న్యూస్ చానెల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వాన్స్.. గత 30, 40 ఏళ్లుగా ఎలాంటి యుద్ధాలు చేయని ఏవో కొన్ని దేశాలకు చెందిన 20 వేల బలగాల కంటే అమెరికాతో కీలక ఖనిజాల ఒప్పందం కుదుర్చుకుంటే ఉక్రెయిన్‌కు మెరుగైన భద్రత లభిస్తుందని చెప్పారు. భద్రతకు గ్యారెంటీ కావాలన్నా, రష్యా అధ్యక్షుడు పుతిన్ మరోసారి ఆక్రమించుకోరాదనుకున్నా ఉక్రెయిన్‌కు అమెరికా మాత్రమే ఆ గ్యారంటీ ఇస్తుందని తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment