ట్రంప్‌ ద్వంద్వ ప్రమాణాలు | Sakshi Editorial On Donald Trump Double standards | Sakshi
Sakshi News home page

ట్రంప్‌ ద్వంద్వ ప్రమాణాలు

Published Fri, Mar 21 2025 4:42 AM | Last Updated on Fri, Mar 21 2025 5:24 AM

Sakshi Editorial On Donald Trump Double standards

ద్విపాత్రాభినయం చేసే హీరోల సినిమాలకు ఒకప్పుడు జనాదరణ బాగుండేది. ఇద్దరూ ఒకరే అని తెలిసినా రెండు వేషాలతో మెప్పించే తీరు చూసి జనం ముచ్చటపడేవారు. ప్రపంచ యవనికపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ అలాంటి పాత్రల్లోనే జీవిస్తున్నారు. యూరప్‌లో శాంతిమంత్రం పఠిస్తారు. రష్యా–ఉక్రెయిన్‌లు రాజీ పడాలంటారు. అందుకు షరతులు పెట్టిన ఉక్రెయిన్‌ అధ్యక్షుడు జెలెన్‌స్కీని గెంటేసినంత పనిచేస్తారు. 

పశ్చిమాసియాలో ఇరాన్‌కు స్నేహ హస్తం అందిస్తారు. గాజాలో మారణహోమానికి ఇజ్రాయెల్‌ను ప్రోత్సహిస్తారు. యెమెన్‌లో వైమానిక దాడులకు తానే ఆదేశాలిస్తారు. ఒక అగ్రరాజ్యాధినేత ఏకకాలంలో ఇన్ని వైరుద్ధ్యాలు ప్రదర్శించటం గతంలో ఎప్పుడూ లేదేమో! ఒకపక్క జెలెన్‌స్కీ మూడో ప్రపంచయుద్ధ ప్రమాదాన్ని తెచ్చిపెడుతున్నారని ఆరోపించిన ట్రంప్‌... వేరొకచోట అదే ప్రమాదానికి దారితీసే పోకడలకు ఎందుకు పాల్పడుతున్నారో అనూహ్యం. 

తన అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో ఉక్రెయిన్, గాజాల్లో శాంతి సాధిస్తానని పదే పదే ట్రంప్‌ చెప్పారు. కానీ దాని అర్థం ఇదా అని అమెరికా పౌరులే ఆశ్చర్యపోతున్నారు. రష్యా– ఉక్రెయిన్‌ లడాయి మూడేళ్లపాటు ఎడతెరిపి లేకుండా ఎందుకు కొనసాగిందో అందరికీ తెలుసు. జో బైడెన్‌ ఏలుబడిలోని అమెరికా... యూరప్‌ దేశాలతో చేతులు కలిపి ఉక్రెయిన్‌ ద్వారా రష్యాను చికాకుపరిచి, ఆ వంకన నాటోను తూర్పున విస్తరించే ప్రయత్న పర్యవసానమే ఆ యుద్ధం.

రష్యా–ఉక్రెయిన్‌ల విషయంలోనే ట్రంప్‌ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారు. తన కాల్పుల విరమణ ప్రతిపాదనకు జెలెన్‌స్కీ షరతులు పెట్టడాన్ని ఏమాత్రం సహించలేని ట్రంప్‌... అదే రకంగా వ్యవహరించిన పుతిన్‌తో సౌమ్యంగా ఉంటున్నారు. జెలెన్‌స్కీ తమ భద్రతకు గ్యారెంటీ ఇవ్వాలన్నారు. దురాక్రమించిన ప్రాంతాలను తిరిగి ఇప్పించాలని కోరారు. నాటో సభ్యత్వం కావా లని అడిగారు. కానీ పుతిన్‌ అసలు కాల్పుల విరమణకే అంగీకరించలేదు. 

మూడు రోజులక్రితం మళ్లీ రెండోసారి మాట్లాడాక పరిమిత కాల్పుల విరమణకు ఒప్పుకున్నారు. పరస్పరం ఇంధన గ్రిడ్‌ల పైనా, ఇతర మౌలిక సదుపాయాలపైనా దాడులు చేసుకోవద్దన్నది ఆయన ప్రతిపాదన. ఉక్రెయిన్‌ ఏం చేయాలో ట్రంప్, పుతిన్‌లు నిర్ణయించారు. నల్లసముద్ర ప్రాంతంలో ఇరు నావికాదళాల దాడుల నిలిపివేతపై కూడా ఒక అంగీకారానికొచ్చాక శాంతి చర్చలు మొదలవు తాయంటున్నారు. 

ఇవన్నీ గమనిస్తూ కూడా తమ సార్వభౌమత్వం విషయంలో రాజీపడేదేలేదని ఇప్పటికీ జెలెన్‌స్కీ బడాయి పోతున్నారు. ఉక్రెయిన్‌ భూభాగంలోని క్రిమియాను రష్యా 2014లో ఆక్రమించగా, 2022లో యుద్ధం మొదలయ్యాక తూర్పు ఉక్రెయిన్‌లోని మరో నాలుగు ప్రాంతాల్లో భూభాగాన్ని సైతం అది సొంతం చేసుకుంది. మొత్తానికి ఉక్రెయిన్‌లోని అయిదోవంతు భూభాగం రష్యా అధీనంలో ఉంది. ఇందులో అంగుళం భూమిని కూడా వదలబోనని పుతిన్‌ పదే పదే చెబుతున్నారు. 

పశ్చిమాసియాలో ట్రంప్‌ కనీసం ఈమాత్రం కూడా చేయటంలేదు. తమ బందీలను హమాస్‌ మిలిటెంట్లు విడుదల చేయలేదన్న సాకుతో గాజాలో ట్రంప్‌ అండతోనే ఇజ్రాయెల్‌ నరమేధం సాగి స్తోంది. మొన్న మంగళవారం వైమానిక దాడుల్లో 413 మంది పౌరులను హతమార్చగా గురువారం ఇజ్రాయెల్‌ సైన్యం నేరుగా విరుచుకుపడి 70 మందికి పైగా పౌరులను కాల్చిచంపింది. 

ఈ దాడుల తర్వాత ఇజ్రాయెల్‌ ఉపయోగించిన భాష కూడా అభ్యంతరకరంగా ఉంది. తమ బందీలను హమాస్‌ విడిచిపెట్టేవరకూ దాడులు తప్పవని, ఆ సంస్థకు ఆశ్రయం కల్పించినంతకాలమూ సాధా రణ పౌరులు కనీవినీ ఎరుగని రక్తపాతం చవిచూడాల్సివస్తుందని రక్షణ మంత్రి ఇజ్రాయెల్‌ కట్జ్‌ హెచ్చరించారు. బందీల అప్పగింత ప్రక్రియ పూర్తయ్యాక గాజా పౌరులను ప్రపంచంలో కోరుకున్న ప్రాంతాలకు  తరలిస్తారట. లేనట్టయితే భారీ వినాశనం తప్పదట. 

యెమెన్‌లో సైతం ట్రంప్‌ తీరుతెన్నులు అలాగే ఉన్నాయి. గతవారం ఆ దేశంలో హౌతీ మిలి టెంట్ల స్థావరాలుగా భావిస్తున్న ప్రాంతాల్లో 40 వైమానిక దాడులు జరిపించారు. గాజా వాసులను ఇజ్రాయెల్‌ బెదిరిస్తున్న మాదిరే హౌతీలనూ, వారికి మద్దతిస్తున్నదని భావిస్తున్న ఇరాన్‌నూ ట్రంప్‌ హెచ్చరించారు. 

ఇరాన్‌పై నేరుగా యుద్ధం చేసే అవసరాన్ని తప్పించుకోవటానికీ, ఆ దేశాన్ని అణు చర్చలకు ఒప్పించటానికీ హౌతీలపై విరుచుకుపడటమే మార్గమని ఆయన భావిస్తున్నట్టు కనబడు తోంది. కానీ హౌతీలు సులభంగా లొంగివచ్చే రకం కాదు. వారు ఎర్ర సముద్రంలో మాటుగాసి అంతర్జాతీయ నౌకా రవాణాను అడ్డుకుంటున్న మాట వాస్తవమే అయినా వారితో చర్చించి సమస్య పరిష్కారానికి ప్రయత్నించటమే తెలివైన పని. గాజాలో ఇజ్రాయెల్‌ దాడులను ట్రంప్‌ ఆపగలిగితే హౌతీలను చర్చలకు ఒప్పించటం సులభం.

అమెరికాలో వివిధ సంస్థలు నిర్వహించిన సర్వేల్లో తన రేటింగ్‌ శరవేగంగా పడిపోయిన వైనం ట్రంప్‌ గమనించాలి. మిత్రదేశాలపై సైతం సుంకాల మోత మోగించటం, ఉపాధి కల్పనకు సంబంధించి తీసుకుంటున్న చర్యలు పెద్దగా ఫలించకపోవటం ఇందుకు తక్షణ కారణం కావొచ్చుగానీ... యూరప్‌లో అరకొర శాంతి యత్నాలు, ఇజ్రాయెల్‌లో సాగుతున్న నరమేధం, హౌతీలను అదుపు చేయలేకపోవటం వంటివి కూడా ఆయనపై మరింత వ్యతిరేకత తీసుకొచ్చే అవకాశం ఉంది. అటు ఇజ్రాయెల్‌ ప్రధాని నెతన్యాహూ పలుకుబడి సైతం క్షీణిస్తోంది. అందువల్లే చిత్తశుద్ధితో శాంతికి యత్నించటమే ట్రంప్‌ ముందున్న ఏకైక మార్గం. అప్పుడే ఇంటా బయటా అన్నీ చక్కబడతాయి. లేనట్టయితే మున్ముందు సమస్యలు మరింత ఉగ్రరూపం దాలుస్తాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement