
‘కర్ర గలవాడిదే బర్రె’ నానుడి ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీకి చాలా ఆలస్యంగా అర్థమైనట్టుంది. మూడేళ్లుగా అరువు తెచ్చుకున్న బలంతో రష్యా సేనలను ఢీకొడుతూ రేపో మాపో విజయం తన దేనన్న భ్రమల్లో బతికిన ఆయన, శాంతి కోసం పదవీత్యాగానికైనా సిద్ధమని తాజాగా ప్రకటించారు. అంతేకాదు... ఉక్రెయిన్‌కు నాటో సభ్యత్వం కావాలట!
జో బైడెన్ హయాంలో ఆయనకు అటు డాలర్లూ, ఇటు మారణాయుధాలూ పుష్కలంగా వచ్చిపడ్డాయి. ఆ కాలంలో ఆయనకు ఎవరన్నా లెక్కలేకుండా పోయింది. నిరుడు ఆగస్టులో ప్రధాని నరేంద్ర మోదీ శాంతి సాధనలో భాగంగా తొలుత రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ను కలిశారు. ఆ తర్వాత ఉక్రెయిన్ వెళ్లి జెలెన్‌స్కీతో చర్చించారు.
మోదీ వచ్చి వెళ్లిన వెంటనే ఆయన్ను హేళన చేస్తూ మాట్లాడారు. నియంతతో చేతులు కలిపి నీతులు బోధిస్తారా అంటూ విరుచుకుపడ్డారు. దౌత్య మర్యాదల్ని అతిక్రమించారు. ఏడాది తిరగకుండా అంతా తలకిందులైంది. అణకువ ఒంటబట్టినట్టుంది. దురుసుగా, కఠినంగా, అవమానకరంగా మాట్లాడుతున్న అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌ను ప్రసన్నం చేసుకోవటానికి నానా పాట్లూ పడుతున్నారు.
అందులో భాగంగానే తాజా ప్రతిపాదనలు చేశారు. వీటిని ట్రంప్ అంగీకరిస్తారని జెలెన్‌స్కీ ఎలా అనుకున్నారో అర్థంకాదు. ‘ఎన్నికల్లేకుండా అధికారం చలాయిస్తున్న నియంత’గా తనను నిందించిన ట్రంప్ పదవీ పరిత్యాగ ప్రకటనల్ని ఖాతరు చేస్తారనుకోవటం, మెచ్చుకోలు మాటలు మాట్లాడుతారనుకోవటం తెలివితక్కువతనం. నాటోకు తిలోదాకాలిచ్చేందుకు సిద్ధపడుతున్న ట్రంప్‌ను ఆ సంస్థ సభ్యత్వం ఇప్పించమనటం మూర్ఖత్వం.
ఈ మూడేళ్ల యుద్ధంలో రష్యాను ఉక్రెయిన్ ముప్పుతిప్పలు పెట్టిన మాట వాస్తవం. అమెరికా, పాశ్చాత్య దేశాలు అందించిన క్షిపణులతో, డ్రోన్‌లతో రష్యా నగరాలపై దాడులు చేసి నష్టపరిచిన ఉదంతాలూ కోకొల్లలు. పర్యవసానంగా నేడో రేపో విజయం ఖాయమని భావించి దురాక్రమణకు దిగిన పుతిన్ అయోమయంలో పడిన సంగతి కూడా నిజం.
ఒకపక్క అమెరికా, పాశ్చాత్య దేశాల ఆర్థిక ఆంక్షలూ, మరోపక్క నేల రాలుతున్న సైనికుల ఉదంతాలూ, ధ్వంసమవుతున్న కీలక సైనిక స్థావరాలూ ఆయనకు కంటిమీద కునుకులేకుండా చేశాయి. ఉత్తర కొరియా నుంచి సైన్యాన్ని తీసుకొచ్చి రణరంగంలో ముందుకు నడిపించినా పెద్దగా ఫలితం దక్కలేదు.
ఇక దీన్నుంచి గౌరవప్రదంగా బయటికి రావాలనుకున్నా అన్ని దారులూ మూసుకు పోయాయి. చివరకు అణ్వాయుధాలనే నమ్ముకోక తప్పదన్న నిర్ణయానికి కూడా వచ్చారని కథనాలు వెలువడ్డాయి. నిజానికి ఆ ఒక్క భయమే అమెరికా, పాశ్చాత్య దేశాలను ముందుకు అడుగేయ నీయలేదు.
మాటలకేం... కోటలు దాటేలా చెప్పారు. ఆచరణలో మాత్రం ఎంతసేపూ ఉక్రెయిన్‌ను ముందుకు తోసి లబ్ధి పొందుదామన్న ధ్యాస తప్ప అమెరికాకు మరేం పట్టలేదు. ఉక్రెయిన్ తీవ్ర నష్టాలు చవిచూసింది. గణనీయంగా భూభాగాన్ని కోల్పోయింది. తిరిగి స్వాధీనం చేసుకున్నవి సైతం అనంతర కాలంలో రష్యా సేనలకు చిక్కాయి. పట్టణాలు, నగరాలు శిథిలమయ్యాయి.
ఒక దశలో సైన్యం చాలటం లేదని యువతీ యువకులకు సైనిక శిక్షణనిచ్చి ఉరికించారు. అయితే అదే మంత ఫలితం ఇవ్వలేదు. మొత్తంగా 3,80,000 మంది ఉక్రెయిన్ పౌరులు, సైనికులు గాయాల పాలయ్యారు. కాళ్లూ చేతులూ పోగొట్టుకున్న సైనికులు లక్షల్లోనే ఉంటారు. 46,000 మంది సైనికులు మరణించగా, వేలాదిమంది ఆచూకీ లేకుండా పోయారు. అనేకులు బందీలుగా చిక్కారు.
ట్రంప్ దృష్టంతా ఉక్రెయిన్ నేలలో నిక్షిప్తమైవున్న అపురూప ఖనిజాలు, ఇతర సహజ వన రులపై ఉంది. మూడేళ్లుగా తాము 50,000 కోట్ల డాలర్లు ఖర్చుచేశామని అమెరికా లెక్కలు చెబు తోంది. కానీ అది 12,000 కోట్ల డాలర్లు మించదని ఉక్రెయిన్ మొత్తుకుంటున్నది. పది తరాల ఉక్రె యిన్ పౌరుల్ని పీల్చిపిప్పిచేసే అమెరికా ఒప్పందం ససేమిరా సమ్మతం కాదన్న జెలెన్‌స్కీ మొర వినే నాథుడే లేడు.
ఇన్నాళ్లూ అమెరికా సలహాతో ఉక్రెయిన్‌కు అన్నివిధాలా అండదండలందించిన పాశ్చాత్య దేశాలు సైతం ట్రంప్‌ను ధిక్కరించదల్చుకుంటే తమతో మాట్లాడొద్దని చెప్పటం ఆయనకు మింగుడుపడటం లేదు. ఒకపక్క అమెరికా రూపొందిస్తున్న ముసాయిదా ఒప్పందం ప్రతిపాదనల్ని పదిరోజులుగా ఉక్రెయిన్ వరసబెట్టి తిరస్కరిస్తుండగానే దాదాపు అంతా పూర్తయిందని, తుది దశ చర్చలు జరుగుతున్నాయని ట్రంప్ అనటం జెలెన్‌స్కీని ఊపిరాడనివ్వటం లేదు.
అమెరికా ప్రతిపాదన ఒప్పుకుంటే చమురు, సహజవాయువు, ఖనిజాలతోపాటు పోర్టులు, ఇతర మౌలిక సదుపాయాల ద్వారా వచ్చే ఆదాయంలో సగం సమర్పించుకోవాలి. తామిచ్చిన ప్రతి ఒక్క డాలర్‌కూ రెండు డాలర్లు చెల్లించాలన్నది అమెరికా డిమాండ్. ఇంత చేసినా ఉక్రెయిన్ రక్షణకు గ్యారెంటీ ఇవ్వటానికి తిరస్కరించటం, ముసాయిదా ఒప్పందంలో తొలుత ఉన్న ఆ మాటను తొలగించటం జెలెన్‌స్కీకి మింగుడుపడని అంశాలు.
ఎవరో ప్రోత్సహిస్తే అక్రమంగా సింహాసనం అధిష్ఠించటం, ఎవరికోసమో పొరుగు దేశంపై తొడగొట్టడం ఎంత ఆత్మహత్యా సదృశమో వర్తమాన ఉక్రెయిన్‌ను చూసి అన్ని దేశాలూ గుణపాఠం నేర్చుకోవాలి. స్వీయప్రయోజనాలే సర్వస్వం అయిన యుగంలో బతుకుతూ అపరిపక్వతతో, అనాలోచితంగా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే అవి చివరకు తననే కాటేస్తాయని జెలెన్‌స్కీ గ్రహించలేక పోయారు. ఒకనాడు అమెరికన్ కాంగ్రెస్‌లో యుద్ధ యోధుడిగా నీరాజనాలందుకున్న మనిషే ఇవాళ దిక్కుతోచని స్థితిలో పడ్డారు. మూడేళ్లలో ఎంత మార్పు!
Comments
Please login to add a commentAdd a comment