ట్రంప్‌తో వాగ్వాదం.. ఆపై జెలెన్‌స్కీ కీలక ట్వీట్‌ | Zelenskyy Stark Message To USA President Donald Trump | Sakshi
Sakshi News home page

ట్రంప్‌తో వాగ్వాదం.. ఆపై జెలెన్‌స్కీ కీలక ట్వీట్‌

Published Sat, Mar 1 2025 7:17 PM | Last Updated on Sat, Mar 1 2025 7:43 PM

Zelenskyy Stark Message To USA President Donald Trump

కీవ్:  అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‍, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్ స్కీల మధ్య వైట్ హౌస్ వేదికగా జరిగిన చర్చలు పూర్తిగా విఫలం కావడమే కాదు.. ఆ చర్చ కాస్తా ‘ మూడో ప్రపంచ యుద్ధం’ అని ట్రంప్ నోట వచ్చే వరకూ వెళ్లింది. అంటే రష్యాతో శాంతి చర్చలకు తాము సిద్ధమంటూనే ట్రంప్ చెప్పిన ప్రతీ దానికి తలాడించలేదు జెలెన్ స్కీ. పూర్తిగా తమ భూభాగంపై ఎటువంటి కాల‍్పులు, బాంబుల మోత లేకుండా చూస్తామని అమెరికా తరఫున మీరు(ట్రంప్) మాటిస్తేనే  మీతో వాణిజ్య ఖనిజాల ఒప్పందంపై సంతకం చేస్తామని కరాఖండీగా చెప్పేశారు జెలెన్ స్కీ.

తమ భూ భాగంలో నివసిస్తే వేరే వాళ్ల పెత్తనం ఏమిటని  జెలెన్ స్కీ కాస్త గట్టిగానే స్వరం వినిపించారు. ఇది ట్రంప్ కు నషాళానికి ఎక్కినట్లుంది.  రష్యాతో శాంతి ఒప్పందం చేసుకోకపోతే మూడో ప్రపంచం యుద్ధం వచ్చినా రావొచ్చు అని ట్రంప్ హెచ్చరించారు. దాంతో వారి మధ్య చర్చ సంగతి పక్కన పెడితే, వాగ్వాదమే ఎక్కువ కనిపించింది.

ఇలా వాదోపవాదాల నడుమనే ఎటువంటి ఒప్పందంపై సంతకం చేయకుండా వైట్ హౌస్ వీడారు జెలెన్ స్కీ.  అయితే జెలెన్ స్కీ వైఖరి కచ్చితంగానే ఉందనే అభిప్రాయమో, ట్రంప్ పై కోపమో తెలీదు కానీ కొన్ని దేశాలు మాత్రం ఉక్రెయిన్ కు మద్దతు తెలిపాయి. కెనడా, బ్రిటన్ తో సహా పలు కీలక దేశాలు జెలెన్ స్కీకి జై కొట్టాయి.

మీ సపోర్ట్ ఎప్పుడూ కీలకమే.. కానీ మాకు స్వేచ్ఛ కూడా ​అవసరం

అయితే ఇలా ట్రంప్ తో వాదించి వెళ్లిన జెలెన్ స్కీ  గురించి ప్రపంచం అంతా చర్చించుకునే తరుణం ఇది.  అగ్రదేశం, ఆ దేశ అధ్యక్షుడ్ని ఎదిరించి వాదించిన సిసలైన నాయకుడు అని,  ‘వీడు మగడ్రా బుజ్జి’  అని సోషల్ మీడియా వరల్డ్ అనుకుంటున్న తరుణం.. అయితే ట్రంప్‌ తో  వాగ్వాదం తర్వాత జెలెన్‌స్కీ..  తమకు యూఎస్ సపోర్ట్ అనేది కీలకమని మరోసారి స్పష్టం చేశారు. 

ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడిగా ఉన్న ట్రంప్ సపోర్ట్ చాలా కీలకమని వ్యాఖ్యానించారు. తన సోషల్ మీడియా హ్యాండిల్ ‘ఎక్స్’ వేదికగా జెలెన్ స్కీ ట్వీట్ చేశారు. ‘ మీ సపోర్ట్ మాకు అత్యంత కీలకం. ఇప్పటివరకూ రష్యాతో వార్ లో మాకు అందించిన ప్రతీ సహకారం మరువలేనింది.  ఉక్రెయిన్ ప్రజలు మీకు ఎప్పుడూ రుణపడే ఉంటారు.

ఇప్పుడు ట్రంప్ సపోర్ట్ మాకు అత్యంత కీలకం. ఆయన యుద్ధాన్ని ముగించాలని చూస్తున్నారు. యుద్ధాన్ని ముగించడానికి మా కంటే ఎక్కువ కోరుకునే వారు ఎవరూ ఉండరు. కానీ మేము యుద్ధంతోనే జీవనం సాగిస్తున్నాం. మా స్వాతంత్య్యం కోసం మేము చేస్తున్నా పోరాటం.. మా ప్రతీ ఒక్కరి ఆశయం, ఆశ కూడా మాకు స్వే‍చ్ఛగా మనుగడ సాగించడమే’ అని రాశారు. 

 

 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement