
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మాట మార్చారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీపై ట్రంప్ పలుమార్లు విమర్శలు గుప్పించారు. జెలెన్‌స్కీని టార్గెట్ చేసి నియంత అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అయితే, తాజాగా తాను అలా అనలేదంటూ ట్రంప్ ట్విస్ట్ ఇచ్చారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.
అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌తో తాజాగా బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ సమావేశం అయ్యారు. అనంతరం, ఇరువురు నేతలు మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఉక్రెయిన్ విషయంలో ట్రంప్ వ్యాఖ్యలపై ఓ విలేకరి ప్రశ్నించారు. ఇందుకు ట్రంప్ సమాధానం ఇస్తూ..‘నేను అలా అనలేదు కదా?. అలాంటా వ్యాఖ్యలు చేశానంటే నేనే నమ్మలేకపోతున్నాను. జెలెన్‌స్కీతో నాకు మంచి సంబంధాలున్నాయి. శనివారం మా ఇద్దరి మధ్య మంచి సంభాషణ జరుగుతుందని భావిస్తున్నా’ అంటూ చెప్పుకొచ్చారు. దీంతో, అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యానికి లోనయ్యారు.
ఇక, అంతకుముందు.. ట్రంప్, స్టార్మర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఉక్రెయిన్‌లో శాంతి నెలకొనాలంటే సంబంధిత చర్చల్లో ఉక్రెయిన్‌ను, ఐరోపా దేశాల నేతలను భాగస్వాముల్ని చేయాలని ఆయన కోరారు. ఉక్రెయిన్‌పై రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో త్వరలో ట్రంప్ సమావేశం కానున్న నేపథ్యంలో వీరి భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది. ఉక్రెయిన్ ప్రతినిధులెవ్వరూ లేకుండానే అమెరికా-రష్యా ప్రతినిధులు ఇటీవల చర్చించుకున్నప్పటి నుంచి ఇతర దేశాలు స్పందిస్తున్నాయి.
ఇదిలా ఉండగా.. జెలెన్‌స్కీ ఓ నియంత అని, అందుకే ఆ దేశంలో ఎన్నికలు జరపడం లేదని ట్రంప్ మండిపడ్డారు. రష్యా తమ భూభాగాన్ని ఆక్రమించిందనే ఉక్రెయిన్ వాదనను తప్పుబట్టారు. కాస్త భూమితో పోయేదాన్ని యుద్ధం వరకూ తీసుకొచ్చారన్నారు. ఇప్పుడు ఎక్కువ భూమి సహా పెద్దసంఖ్యలో ప్రాణాలు కూడా కోల్పోవాల్సి వచ్చిందని వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
Trump last week: Zelenskyy is a “dictator”
Trump today: “Did I say that?” pic.twitter.com/kiCRee8Tbh— The Recount (@therecount) February 27, 2025