
అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాది వ్యవధి ఉండగానే తమిళనాడులో ప్రత్యర్థి పార్టీల మధ్య చిట పటలు మొదలైపోయాయి. ఈసారి ఎలాగైనా నిలదొక్కుకుని పార్టీ జెండా రెపరెపలాడించాలని బీజేపీ కృతనిశ్చయంతో ఉన్నట్టు కనబడుతోంది. అందుకే ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌పై విమర్శల జోరుపెంచారు. స్టాలిన్ కూడా అంతే దీటుగా బదులిస్తున్నారు. రెండేళ్ల క్రితం తమను వీడివెళ్లిన అన్నా డీఎంకేతో బీజేపీ చెలిమిని ఖరారు చేసుకుంది. అందుకోసం అమిత్ షా చెన్నై రావటాన్ని చూస్తే రాబోయే పోరులో తమది కీలకమైన పాత్రని ఆ పార్టీ చెప్పదల్చుకున్నట్టు అర్థమవుతుంది.
అయితే ఈ సాన్నిహిత్యం ఏమంత సజావుగా లేదని జరుగుతున్న పరిణామాలు చెబుతున్నాయి. కేవలం ఈ చెలిమి కోసం బీజేపీ అన్నామలైని రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి తప్పించి ఆ స్థానంలో నయనార్ నాగేంద్రన్‌ను నియ మించింది. అన్నామలై గత రెండేళ్లుగా డీఎంకే సర్కారుపైకి దూకుడుగా పోతున్నారు. నిరుడు జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో పార్టీకి ఆధిపత్య కులాల వోట్లు రాబట్టడంలో, యువతను సమీకరించటంలో ఆయన విజయం సాధించారు. సీట్లయితే రాలేదుగానీ... బీజేపీ వోటు శాతం 11.24 శాతా నికి చేరుకుంది. కానీ ఆ దూకుడు పొత్తు రాజకీయాల్లో చిచ్చు పెడుతుందన్న భయం బీజేపీ అధిష్ఠా నంలో వుంది.
ఎందుకంటే లోక్‌సభ ఎన్నికల సందర్భంగా అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి, మాజీ సీఎం పళనిస్వామిపై అన్నామలై తీవ్ర విమర్శలు చేశారు. అవి వ్యక్తిగత స్థాయికి వెళ్లి పోయాయి. అందుకే ఎన్నికల వరకూ పొత్తు సజావుగా వుండాలంటే అన్నామలైని తప్పించటమే మంచిదని కేంద్ర నాయకత్వం భావించింది. నాగేంద్రన్ అన్నాడీఎంకే నుంచి వచ్చినవారే. జయ సర్కారులో పళని స్వామి, ఆయనా సహచరులు కూడా. 2016లో జయ మరణం తర్వాత నాగేంద్రన్ బీజేపీ కండువా కప్పుకున్నారు. ఆ మాటెలావున్నా రెండు పార్టీలకూ ఇది ఇష్టం లేని పొత్తే. కొన్ని సీట్లయినా సాధించుకోగలిగితే ద్రవిడ కోటలో పాగా వేశామన్న అభిప్రాయం కలిగించ వచ్చని బీజేపీ ఆశిస్తోంది.
అటు అన్నాడీఎంకే పరిస్థితీ ఏమంత బాగోలేదు. జయ మరణంతో అది అనాథగా మారింది. అంత ర్గత కీచులాటల మధ్య 2021 వరకూ ప్రభుత్వం మనుగడ సాగించినా తర్వాత అది మూడు ముక్క లైంది. పళనిస్వామి నేతృత్వంలోని అన్నాడీఎంకేకు అసెంబ్లీ ఎన్నికల్లో 66 స్థానాలొచ్చాయి. కానీ గత లోక్‌సభ ఎన్నికల్లో పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. మొత్తం 39 స్థానాలనూ డీఎంకే కూటమి గెల్చుకుంది. అందుకే అటు బీజేపీకి, ఇటు అన్నాడీఎంకేకు ప్రస్తుత పొత్తు ప్రాణావసరమైంది.
సమస్యేమంటే రెండు పార్టీల మధ్యా పొత్తు ఏర్పడినా, అది ఎన్డీయే కూటమిగా ఉంటుందని అమిత్ షా చెప్పినా ఈ చెలిమితో ఇరుపక్షాలూ ఇబ్బంది పడుతున్న వైనం కనబడుతోంది. లోక్‌సభ ఎన్నికల్లో అన్నాడీఎంకే లేకుండానే తాము 11.24 శాతం వోట్లు రాబట్టుకోగలిగామని బీజేపీ ధీమాగా వుంది. కానీ ఆ పరిస్థితి అన్నాడీఎంకేలో లేదు. అధికారంలో పాలుపంచుకుంటామో, లేదో ఎన్నికల తర్వాతే చెబుతామని షా అంటే... ఎన్నికల్లో పోటీవరకే పొత్తులని పళనిస్వామి ప్రక టించారు. తమిళనాడు రాజకీయ ధోరణులు గమనిస్తే అక్కడ కూటమి ప్రభుత్వాలు ఎప్పుడూ లేవు.
పొత్తులున్నా రాష్ట్ర మంత్రివర్గంలో ఏనాడూ జాతీయ పార్టీలకు చోటీయలేదు. ఇప్పుడు కూడా అదే కొనసాగుతుందనుకుంటే తప్ప తమిళ వోటర్లు కనికరించరని పళనిస్వామి, అమిత్ షాలు అనుకుని వుండొచ్చు. అయితే డీఎంకేపై విరుచుకుపడటానికి తగిన ఆయుధాలు లేకపోవటం ఎన్డీయే కూటమికున్న ప్రధాన సమస్య. కాశీకి ప్రత్యేక రైలు నడపటం, కొత్త పార్లమెంట్ భవనంలో సెంగోల్, వీణ పెట్టడం ద్రవిడ రాజకీయ ప్రాబల్యంగల తమిళనాడును అంతగా ఆకర్షించినట్టు లేదు.
స్టాలిన్ అమ్ములపొదిలో చాలా అస్త్రాలున్నాయి. ముఖ్యంగా ఆయన తమిళుల ఆత్మగౌరవంఅంశాన్ని ముందుకు తెచ్చారు. తమిళులు అనాగరికులని కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వ్యాఖ్యా నించటం, అనంతరం క్షమాపణ చెప్పటం ప్రస్తావిస్తున్నారు. బలవంతంగా హిందీ రుద్దాలని చూస్తు న్నారని ఆరోపిస్తున్నారు. ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో అప్పటి సీఎం నవీన్ పట్నాయక్‌కు సన్నిహి తుడైన తమిళ ఐఏఎస్ అధికారి వీకే పాండ్యన్‌పై బీజేపీ రేపిన దుమారాన్ని గుర్తుచేస్తున్నారు.
ఒడిశా ప్రజలపై తమిళులు పెత్తనం ఎలా చేస్తారని ప్రశ్నించటాన్ని ఎత్తిచూపుతున్నారు. గత పదేళ్లలో తమిళ నాడుకు కేంద్ర నిధులు మూడు రెట్లు పెరిగినా కొందరికి ఏడవటం అలవాటైపోయిందన్న ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలనూ ఆయన తనకు అనుకూలంగా మలుచుకున్నారు. తమ వంతు వాటా అడగటం తమ హక్కని, అందుకు ఏడవటం లేదా బానిసత్వం చేయటం చేతకాదని స్టాలిన్ జవాబి చ్చారు. 234 స్థానాలుగల అసెంబ్లీలో గత ఎన్నికల్లో డీఎంకే సొంతంగా 133, మిత్రులతో కలిసి 159 గెల్చుకుంది. 46 శాతం వోట్లు రాబట్టింది.
ఇప్పటికైతే తమిళనాట సామాజిక న్యాయం, రాష్ట్రాల హక్కులు, ఆత్మగౌరవం ప్రధానాంశాలు. గవర్నర్ ఆర్‌ఎన్ రవి అసెంబ్లీ ఆమోదించిన పది బిల్లుల్ని దీర్ఘకాలం పెండింగ్‌లో ఉంచటం, సుప్రీంకోర్టు ఆయన్ను మందలించటంతోపాటు వాటిని ఆమోదించినట్టుగా భావించాలని చెప్పటం స్టాలిన్‌కు మరింత శక్తినిచ్చింది. అవినీతి పెరిగిందని, వేలకోట్ల ప్రజాధనాన్ని డీఎంకే నేతలు దోచు కుంటున్నారని, శాంతిభద్రతలు దెబ్బతిన్నాయని బీజేపీ చేస్తున్న ఆరోపణలు ప్రజల్ని ఎంతవరకూ కదలించగలవో చూడాలి. అంతకన్నా ముందు అసెంబ్లీ ఎన్నికలు జరిగే వచ్చే ఏప్రిల్‌నాటికైనా తమ పొత్తు విషయంలో ఆత్మవిశ్వాసాన్ని కనబర్చటం అవసరమని ఎన్డీయే గుర్తించాలి.