
చెన్నై: ఇటీవల అన్నా డీఎంకేతో బీజేపీ పొత్తు పెట్టుకున్న తర్వాత డీఎంకే పార్టీ తీవ్రంగా స్పందిస్తోంది. గత వారం అదొక ‘అవినీతి కూటమి’ అంటూ వ్యాఖ్యానించిన డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు సీఎం స్టాలిన్.. వారి పొత్తుపై మరొకసారి ఘాటు వ్యాఖ్యాలు చేశారు. తమిళనాడుకొచ్చి బీజేపీ ఏదో చేద్దామని కలలు కంటుందని, అది వారి వల్ల కాదని స్టాలిన్ నేరుగా విమర్శలు చేశారు. తమిళనాడుకు అమిత్ షానే కాదు.. ఏ షా వచ్చినా తమకేమీ కాదంటూ విమర్శించారు.
అన్నా డీఎంకేతో పొత్తు పెట్టుకునే సందర్భంలో తమిళనాడుకు సంబంధించి ఏ ఒక్క విషయంలోనూ బీజేపీ పెద్దలు క్లారిటీ ఇవ్వలేదని ధ్వజమెత్తారు. అవకతవకలు జరిగిన నీట్ ఎగ్జామ్స్ కు సంబంధించి రాష్ట్ర విద్యార్థులకు ఎటువంటి మినహాయింపును బీజేపీ ఇవ్వలేదన్నారు. అదే సమయంలో హిందీని తమిళనాడులో రుద్దమనే విషయంలో కూడా వారు ఏమీ స్పష్టత ఇవ్వలేదని, ఇక డీలిమిటేషన్ అంశంపై కూడా ఏమీ పెదవి విప్పలేదని బీజేపీని కార్నర్ చేశారు స్టాలిన్.
తమిళనాడు గవర్నర్ ఆర్ ఎన్ రవి తమ ప్రభుత్వం పట్ల వ్యవహరించిన తీరును సుప్రీంకోర్టు తప్పుబట్టిన విషయాన్ని స్టాలిన్ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇది కేంద్ర ప్రభుత్వానికి ఒక చెంపు పెట్టులాంటి తీర్పని స్టాలిన్ వ్యాఖ్యానించారు. వ్యవస్థలను వ్యక్తులను అడ్డుపెట్టుకుని పెత్తనం చేయాలని ఎన్డీఏ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం చూస్తోందని ఆరోపించారు.
తాను ఇక్కడ ఒక విషయం మాత్రం దేశ ప్రజలకు చెప్పదలుచుకున్నానని, తమ పోరాటం కేవలం తమిళనాడుకి, తమిళ ప్రజలకు సంబంధించినది మాత్రమే కాదని, యావత్ దేశ ప్రజల తరఫున చేస్తున్న పోరాటంగా స్టాలిన్ అభివర్ణించారు. ఇది డీఎంకే బలమంటూ బీజేపీ, అన్నాడీఎంకేల పొత్తును దెప్పిపొడిచారు. అందుచేత తమిళనాడు ఎవరు వచ్చినా తమను ఏం చేయలేరని స్టాలిన్ వ్యాఖ్యానించారు.