AIDMK
-
తమిళనాడులో బీజేపీ వ్యూహం
సాక్షి, చెన్నై : తమిళనాడులో బీజేపీ పార్టీ బలోపేతం దిశగా వడివడిగా అడుగులు వేస్తోందా? 400కుపైగా లోక్‌సభ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పెట్టుకున్న కషాయ దళానికి దక్షిణాది రాష్ట్రాల్లో గెలుపు కచ్చితంగా అవసరమని భావిస్తోందా? ఒకే దెబ్బకు రెండు పిట్టలన్న చందంగా తమిళనాట అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల కోసం బీజేపీ అధినాయకత్వం సరికొత్త వ్యూహం రచిస్తుందా? అంటే అవుననే అంటున్నాయి తమిళ రాజకీయాలు ఎన్డీయే కూటమిలోకి పీఎంకే లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో.. 400 ఫ్లస్ సీట్లను ఎన్డీయే టార్గెట్‌గా పెట్టుకుంది. ఇందుకోసం దక్షిణ రాష్ట్రాల్లో గెలుపు కచ్చితంగా అవసరమని భావిస్తోంది. ఈ క్రమంలోనే లక్ష్యం దిశగా..సీట్ల కేటాయింపుల విషయంలోనూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. తమిళనాడులో ఇప్పటికే దినకరన్, మాజీ సీఎం పన్నీర్ సెల్వంతో బీజేపీ పొత్తు పెట్టుకుంది. అయితే తాజాగా ఎన్డీయే కూటమిలో చేరిన పట్టాలి మక్కల్ కట్చి (పీఎంకే) కు 10 సీట్లను కేటాయించి ఆసక్తికర చర్చకు దారి తీసింది. అన్నా డీఎంకే వద్దకు పీఎంకే దూత పీఎంకే నిర్ణయంతో తమిళనాడు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అన్నాడీఎంకే (ఏఐఏడీఎంకే) లోక్‌సభ ఎన్నికల ఫలితాలపై ప్రతికూల ప్రభావం పడనుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. రాష్ట్రంలో అత్యంత సీనియర్ రాజకీయ నాయకులలో ఒకరైన పీఎంకే వ్యవస్థాపకుడు ఎస్ రామదాస్ పొత్తు, సీట్లపై చర్చలు బీజేపీతో కాకుండా ఏఐఏడీఎంకేతో జరిపాలని అనుకున్నారు. చర్చలు జరిపేందుకు ఏఐఏడీఎంకే ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పళనిస్వామి వద్దకు ఓ దూతను పంపారు. బీజేపీతో పొత్తు అదే సమయంలో చెన్నైకి 120 కిలోమీటర్ల దూరంలోని తైలాపురంలో సమావేశమైన పీఎంకే అత్యున్నత స్థాయి కమిటీ బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని నిర్ణయించింది. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. అన్నాడీఎంకేని కాదని బీజేపీతో పొత్తు పెట్టుకోవాలనే నిర్ణయాన్ని పీఎంకే అధ్యక్షుడు అన్బుమణి రామదాస్ ప్రతిపాదించారు. ఆ పార్టీ ఏఐఏడీఎంకేతో తెగతెంపులు చేసుకుని బీజేపీతో పొత్తుతో లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు. ఎన్నికల ఒప్పందంపై సంతకమే పొత్తుపై పీఎంకే ప్రధాన కార్యదర్శి వడివేల్ రావణన్ మాట్లాడుతూ.. ‘బీజేపీతో పొత్తు పెట్టుకుని లోక్‌సభ ఎన్నికలను ఎదుర్కొంటామని పీఎంకే వ్యవస్థాపకుడు ఎస్ రామదాస్ అత్యున్నత స్థాయి కమిటీ సమావేశంలో ప్రకటించినట్లు తెలిపారు. బీజేపీ నేతృత్వంలోని కూటమిలో చేరాలనే నిర్ణయాన్ని రామదాస్, ఆయన కుమారుడు అన్బుమణి సంయుక్తంగా తీసుకున్నారని’ చెప్పారు. పీఎంకేలో బీజేపీతో పొత్తు పెట్టుకోవడంపై ఎలాంటి భిన్నాభిప్రాయాలు లేవని పార్టీ నేతలు వెల్లడించారు. అధికారిక ఎన్నికల ఒప్పందంపై సంతకం చేసేందుకు రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కె. అన్నామలై తైలాపురం వెళ్లనున్నారు. అన్నామలై ప్రయత్నాలు సఫలం బీజేపీ కూటమిలో చేరాలని పీఎంకే తీసుకున్న నిర్ణయం, అధికార పార్టీ డీఎంకే, ప్రతిపక్ష పార్టీ ఏఐఏడీఎంకేలకు ధీటుగా బీజేపీ ఎదిగేందుకు.. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై చేస్తున్న ప్రయత్నాలు సఫలీకృతం చేస్తున్నాయి. బీజేపీలోకి 15 మంది మాజీ ఎమ్మెల్యేలు గతంలో బీజేపీ ఎన్డీయే కూటమిలో అన్నాడీఎంకే భాగస్వామిగా ఉండేది. అన్నామలై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అన్నాడీఎంకే నేతల అవినీతిపై ఆరోపణలు చేశారు. దాంతోపాటు దివంగత ముఖ్యమంత్రి జయలలితను విమర్శించడంతో ఇరు పార్టీల మధ్య విభేదాలు పెరిగాయి. ఈ క్రమంలోనే ఎన్డీయే కూటమి నుంచి వైదొలుగుతున్నట్లు అన్నాడీఎంకే ప్రకటించింది. ఈ క్రమంలో రాష్ట్రంలోని 15మంది మాజీ ఎమ్మెల్యేలు, ఒక ఎంపీని బీజేపీలో చేర్చుకుంది. ఒకే దెబ్బకు తాజాగా, లోక్‌సభ ఎన్నికల్లో వన్నియార్ సామాజిక వర్గంలో దాదాపు 6 శాతం ఓటు బ్యాంకు ఉన్న పీఎంకేతో జతకట్టింది. ఉత్తర తమిళనాడులో ఓటు షేర్ పెంచుకోవాలని భావిస్తున్న బీజేపీకి పీఎంకేతో పొత్తు మరింత లబ్ధి చేకూర్చుతుంది. దక్షిణ తమిళనాడు అంతటా ఆధిపత్య Mukkulathorలను ఆకర్షించడంలో అన్నాడీఎంకే నాయకులు ఓ పన్నీర్ సెల్వం, టీటీవీ దినకరన్‌ల మద్దతు కూడగట్టుకుంది. లోక్‌సభ ఎన్నికలే కాదు తమిళనాడులోని మొత్తం 234 అసెంబ్లీ నియోజకవర్గాలను కవర్ చేసేలా మోదీ వరుస పర్యటనలు చేయడంతో పాటు, భారీగా నిధులు కేటాయించేందుకు కేంద్రం సిద్ధమైంది. -
త్రిషకు మద్దతుగా కస్తూరి.. హీరోయిన్లు వేశ్యలా అంటూ వార్నింగ్
తమిళ నటి కస్తూరి 90వ దశకంలో చాలా సినిమాల్లో హీరోయిన్గా నటించి ప్రస్తుతం సీరియల్స్‌తో బిజీగా ఉన్నారు. కస్తూరి సినిమాలే కాదు, పలు సామాజిక, రాజకీయ అంశాల మీద కూడా తన అభిప్రాయాన్ని డైరెక్ట్‌గా చెబుతుంది. అవతల ఉండే వ్యక్తి ఎవరు ఉన్నా సరే.. తరువాత ఏమైనా కానియ్..ఐ డోంట్ కేర్ అనుకునే రకం ఆమె.. ఆమెలో ఉన్న డేరింగ్ తత్వం అది. అన్నాడీఎంకే బహిష్కృత నేత మాజీ ఎమ్మెల్యే ఏవీ రాజు హీరోయిన్ త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.. హీరోయిన్ త్రిషకు. రూ.25 లక్షలు ఇచ్చి రిసార్ట్‌కి రప్పించామని, డ్యాన్సులు చేయించామని నోటికొచ్చిందల్లా వాగాడు.. దీంతో త్రిష కూడా అతనిపై కేసు కూడా పెట్టింది. ఈ అంశంపై హీరో విశాల్ మాజీ ఎమ్మెల్యే ఏవీ రాజుపై తీవ్రంగా విరుచుక పడిన విషయం తెలిసిందే. తాజాగా నటి కస్తూరి కూడా అతనిపై ఫైర్ అయింది. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేసిన తెలుగమ్మాయి హాలీవుడ్ సినిమా.. ఆ సాంగ్ స్పెషల్) ఈ మధ్య సినిమా హీరోయిన్లపై విపరీతమైన దూషణలు పెరిగాయి.ఏమాత్రం నిజానిజాలు చూసుకోకుండా నోటికొచ్చింది వాగేస్తున్నారు. నోరు, నాలుకలు ఉంటే సరిపోదు.. మనం ఏం మాట్లాడుతున్నామో అనే బుద్ది కూడా ఉండాలి. కొద్దిరోజుల క్రితం త్రిషపై మన్సూర్ అలీఖాన్ కూడా ఇలాంటి చెత్త వ్యాఖ్యలే చేశాడు.. మళ్లీ ఇప్పుడు అన్నాడీఎంకే మాజీ ఎమ్మెల్యే ఏవీ రాజు త్రిషపై నీచమైన కామెంట్లు చేశాడు. ఇలాంటివి సమాజానికి మంచిది కాదు. మీ రాజకీయ పార్టీలోని వ్యక్తులతో సమస్యలు ఉంటే అక్కడ చూసుకోకుండా ఇలా త్రిష పేరును తెరపైకి తీసుకొచ్చి చిల్లర వ్యాఖ్యలు చేయం ఏంటి..? మీలాంటి వారికి మేము ఎలా కనిపిస్తున్నాం..? సినిమా పరిశ్రమకు చెందిన వారందరూ మీ కంటికి వేశ్యల్లా కనిపిస్తున్నారా..? సినిమాలో పనిచేస్తున్న అమ్మాయిలకు అమ్మానాన్నలు ఉంటారనే ఆలోచన కూడా లేకుండా పోయిందా..? కనీసం వారి గురించి అయినా ఆలోచించరా..? ఇక నుంచి నోరు అదుపులో పెట్టుకుని ఆడపిల్లల గురించి కామెంట్లు చేయండి. ఒక అమ్మాయి గురించి ఇలాంటి కామెంట్లు చేసే అధికారం మీకు ఎవడు ఇచ్చాడు..? ఎవరో చెప్పారు చెప్పారంటూ ఇలాంటి వ్యాఖ్యలు చేస్తారా..? మీ వద్ద ఆదారాలు ఉంటే బయట పెట్టండి. రాజకీయ నాయకులు ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే.. మీకు ఉన్న గౌరవం పోతుంది. ఇలాంటి వారి వల్ల సమాజం కోసం పనిచేసే రాజకీయ నాయకులకు కూడా చెడ్డపేరు వస్తుంది. పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులను కూడా అధిగమించి తమ కుటుంబాల కోసం ఆడపిల్లలు పనిచేస్తున్నారు. ముఖ్యంగా సినిమాల్లోకి మహిళలు వచ్చేదే తక్కువ.. పరిశ్రమలో అడుగుపెట్టాలంటే చాలా ధైర్యం ఉండాలి. కానీ సినిమాల్లోకి వచ్చాక మీలాంటివారు ఇలాంటి ముద్రలు వేస్తుంటే ఎలా..? తమిళనాడులో అందరూ అమ్మగా పిలిచి అభిమానించే నాయకురాలు జయలలిత గారు. ఆమె కూడా నటిగా,మహిళగా, ముఖ్యమంత్రిగా వెలుగొందారనే విషయం మరిచిపోయారా..? ఆమె సారథ్యం వహించిన పార్టీలో ఇలాంటి వ్యక్తికి స్థానం ఇవ్వడం ఏంటి..? ఇప్పుడు జయలలిత ఉండుంటే ఇలాంటి వ్యాఖ్యలు చేసేవారా..? ఇలాంటి ఘటనలు తలుచుకుంటే బాధ కలుగుతుంది.' అని కస్తూరి అన్నారు. -
సరైన పార్టీలోకే వచ్చా: అన్నాడీఎంకేలోకి గౌతమి
సాక్షి, చైన్నె: సినీ నటి గౌతమి బుధవారం అన్నాడీఎంకేలో చేరారు. ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి పళని స్వామి సమక్షంలో సాయంత్రం అన్నాడీఎంకే కండువా కప్పుకున్నారు. గతంలో గౌతమి బీజేపీలో పని చేసిన సంగతి తెలిసిందే. అయితే పార్టీ నుంచి తనకు తనకు మద్ధతు కరువైందని చెబుతూ ఆమె రాజీనామా చేశారు. ఆ తర్వాత తన రాజకీయ భవిష్యత్తు గురించి ఆమె ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం చైన్నెగ్రీన్ వేస్ రోడ్డులోని పళని స్వామి నివాసానికి వెళ్లారు. ఆయన సమక్షంలో అన్నాడీఎంకేలో చేరారు. ఈ సందర్భంగా గౌతమి మీడియాతో మాట్లాడుతూ.. సరైన పార్టీలోకి తాను వచ్చానని పేర్కొన్నారు. దివంగత సీఎం అమ్మ జయలలిత మరణం తర్వాత అన్నాడీఎంకేను సరైన మార్గంలో పళని స్వామి నడిపిస్తున్నారని ఆమె కితాబిచ్చారు. పాతికేళ్లుగా బీజేపీలో కొనసాగిన గౌతమి తాడిమళ్ల.. కిందటి ఏడాది అక్టోబర్‌లో బీజేపీకి గుడ్‌బై చెప్పారు. ఆ సమయంలో ఆమె సంచలన ఆరోపణలే చేశారు. పార్టీ నుంచి మద్దతు కరువైనందునే తాను ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారామె. ఈ మేరకు ఎక్స్ అకౌంట్లో ఆమె ఆ సమయంలో పెద్ద పోస్ట్ ఉంచారు. తన ఆస్తులను స్వాహా చేసిన వ్యక్తికి పార్టీలో సీనియర్లే మద్దతు ఇచ్చారంటూ ఆమె ఆరోపించారు కూడా. ఇదిలా ఉంటే.. గత వారం బీజేపీ నుంచి బయటకు వచ్చిన నటి గాయత్రి రఘురాం కూడా అన్నాడీఎంకేలో చేరిన విషయం తెలిసిందే. -
ఒక్క సీటుతో కింగ్‌మేకర్.. కూటమిలతో తగ్గిన విజయకాంత్ క్రేజ్
కోలీవుడ్ ప్రముఖ నటుడు, డీఎండీకే అధినేత విజయకాంత్ (71) అనారోగ్యంతో చికిత్స పొందుతూ... నేడు (డిసెంబర్ 28) తుది శ్వాస విడిచారు. శ్వాసకోశ సమస్యలతో బాధపడుతున్న ఆయనను కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స పొందుతూ ఈరోజు ఉదయం మృతి చెందినట్లు ఆసుపత్రి వర్గాలు తెలిపాయి. విజయకాంత్ మృతి పట్ల అభిమానులు, సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. విజయకాంత్ జననం: విజయకాంత్ 1952 ఆగస్టు 25న తమిళనాడులోని మధురైలో జన్మించారు. ఆయన అసలు పేరు నారాయణన్ విజయరాజ్ అలగరస్వామి. సినిమా రంగంలోకి వచ్చిన తర్వాత తన పేరును విజయకాంత్‌గా మార్చుకున్నారు. విజయకాంత్‌కు భార్య ప్రేమలత, ఇద్దరు కుమారులు ఉన్నారు. సినిమా ఎంట్రీ: విజయకాంత్ 27 ఏళ్ల వయసులో సినీ రంగ ప్రవేశం చేశారు. 1979లో 'ఇనిక్కుం ఇలామై' చిత్రంతో విలన్‌గా ప్రేక్షకులకు పరిచయమయ్యారు. అప్పటి నుంచి 2015 వరకు 150కి పైగా చిత్రాల్లో నటించారు. రోజుకు మూడు షిఫ్టులు పనిచేశారు. కెరీర్ ప్రారంభంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కున్నప్పటికీ. ఆ తర్వాత ఆయన నుంచి ఎన్నో మంచి సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. 1984లో విజయకాంత్ నుంచి 18 సినిమాలు విడుదలయ్యాయి. 20కి పైగా సినిమాల్లో పోలీస్ ఆఫీసర్‌గా కనిపించాడు. విజయకాంత్ తమిళ చిత్రాల్లో మాత్రమే నటించారు. ఇతర భాషల్లో నటించలేదు. కానీ ఆయన సినిమాలు చాలా భాషల్లో డబ్బ్ అయ్యాయి. సూపర్ స్టార్ రజనీకాంత్, కమల్ హాసన్ లకు విజయకాంత్ ఒకప్పుడు గట్టి పోటీ ఇచ్చారు. విజయకాంత్ మెసేజ్ బేస్డ్ సినిమాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చేవారు. దేశభక్తి చిత్రాలైనా, గ్రామీణ నేపథ్య సినిమాలైనా, ద్విపాత్రాభినయాలైనా నటించేందుకు విజయకాంత్ ఎప్పుడూ ముందుండేవారు. వాటితో పాటు కమర్షియల్ సినిమాల్లోనూ సందడి చేసేవారు. అయితే ఆయన ఏ నిర్మాత వద్ద కూడా ముందుగా డబ్బు తీసుకోడని కోలీవుడ్ పరిశ్రమలో గుర్తింపు ఉంది. కోలీవుడ్ నిర్మాతలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని తెలిస్తే వారి నుంచి రెమ్యూనరేషన్ తీసుకోకుండానే సినిమా అవకాశం ఇస్తారని సమాచారం. ఒక్క సీటుతో రాజకీయ ప్రయాణం 2005లో దేశీయ ముర్పోక్కు ద్రావిడ కళగం (డీఎండీకే) అనే పార్టీని సినీ నటుడు విజయకాంత్ ఏర్పాటు చేశారు. తొలిసారిగా 2006 ఎన్నికల సమయంలో తన పార్టీ నుంచి తానొక్కడే గెలిచాడు.. కానీ ఆయన పార్టీ 10 శాతం ఓట్లు సాధించి తమిళ రాజకీయాలలో విజయకాంత్‌ను ప్రత్యామ్నాయ శక్తిగా మార్చింది. 2011 అసెంబ్లీ ఎన్నికలలో జయలలిత (అన్నాడీఎంకే)తో చేతులు కలిపి 41 సీట్లలో 29 స్థానాలను గెలుచుకున్నారు. ఆ సమయంలో ఎం.కరుణానిధి (డీఎంకే) పార్టీని చిత్తు చేసిన విజయకాంత్ ప్రధాన ప్రతిపక్ష నేతగా అవతరించారు. ఆ తదుపరి అన్నాడీఎంకేతో వైరం వంటి పరిణామాలు విజయకాంత్ పార్టీకి గడ్డు పరిస్థితులను సృష్టించాయి. దీంతో జయలలిత, విజయకాంత్ పార్టీల మధ్య విభేదాలు వచ్చాయి. కూటమిల పేరుతో నష్టం 2014 లోక్‌సభ ఎన్నికలలో ఆయన ఎన్డీఏతో వెళ్లి ఓటమిని చవి చూశారు. కానీ ఓటు బ్యాంక్ శాతం పెంచుకోవడం ఆయనకు కలిసి వచ్చిన అంశంగా మారింది. 2016 అసెంబ్లీ ఎన్నికల్లో డీఎండీకే నేతృత్వంలో రాష్ట్రంలో మూడో కూటమి అవతరించినా, ఫలితం శూన్యం. ఆ ఎన్నికల్లో అన్నిచోట్ల విజయకాంత్ కూటమి పార్టీ డిపాజిట్లను కోల్పోయింది. ఆ ఎన్నికల్లో విజయకాంత్ కూడా సుమారు 50 వేలకు పైగా ఓట్లతో ఓటమి చెందారు. ఆ తర్వాత వరుస ఓటములు ఎదురైనా ఏ మాత్రం డీలా పడకుండా కేడర్ మద్దతు, సినీ అభిమానుల అండతో ఒంటరిగానే పార్టీని నడిపిస్తూ వచ్చారు. కానీ కూటమిల పేరుతో ఆయన ఇతర పార్టీలకు అనుకూలంగా పనిచేయడం, ఇతర పార్టీలకు చెందిన అధినేతల సలహాలతో డీఎండీకేను ముందుకు నడపడం వంటి కారణాలతో ఆయన ఇమేజ్ క్రమేపి తగ్గుతూ వచ్చింది. ఇంతలో ఆయన తరుచుగా అనారోగ్యంతో ఇబ్బందులు పడటం కూడా పార్టీకి నష్టం వాటిల్లింది. చివరకు అనారోగ్య పరిస్థితుల దృష్ట్యా, పార్టీ వ్యవహారాలను ఆయన పర్యవేక్షించ లేని పరిస్థితి నెలకొంది పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని కూడా ఆయన సతీమణి ప్రేమలతకు ఆయన అప్పచెప్పారు. తాజాగా ఆయన మరణం డీఎండీకే పార్టీకి తీరని లోటు అని చెప్పవచ్చు. 2024లో జరగనున్న లోక్‌సభ ఎన్నికలలో ఆయన సతీమణి ప్రేమలత ఒంటరిగానే బరిలోకి దిగుతారా..? మరేదైనా పార్టీకి మద్ధతు ఇస్తారా..? అనేది తేలాల్సి ఉంది. -
బీజేపీతో పొత్తు ప్రసక్తే లేదు.. కొత్త కూటమికి సిద్ధమవుతున్న అన్నా డీఎంకే!
సాక్షి, చైన్నె: బీజేపీతో ఇక పొత్తు ప్రసక్తే లేదని అన్నాడీఎంకే సీనియర్ నేత కేపీ మునుస్వామి స్పష్టం చేశారు. రాయబారాలకు ఆస్కారం లేదని తేల్చి చెప్పారు. బీజేపీ కూటమికి అన్నాడీఎంకే బై..బై చెప్పేసిన విషయం తెలిసిందే. అయితే ఇదంతా రాజకీయ నాటకంగా ప్రచారం జరుగుతోంది. అదే సమయంలో బీజేపీ పెద్దలు అన్నాడీఎంకే వ్యవహారంలో మౌనంగా ఉండడమే కాకుండా పరిస్థితులను నిశితంగా వీక్షిస్తున్నారు. రాష్ట్ర బీజేపీ నేతలు అయితే ఢిల్లీ పయనానికి రెడీ అవుతున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై ఢిల్లీ పెద్దలతో చర్చించాల్సిన అంశాల గురించి స్థానిక నేతలతో నీలగిరులలో తిష్ట వేసి సమావేశాల్లో మునిగి ఉన్నారు. ఈ పరిస్థితుల్లో కృష్ణగిరిలో గురువారం కేపీ మునుస్వామి మీడియాతో మాట్లాడుతూ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై తప్పుడు ప్రచారాలు, ఆధార రహిత ఆరోపణలు, విమర్శల కారణంగానే ఆ పార్టీ కూటమినుంచి బయటకు వచ్చామని స్పష్టం చేశారు. తమ నేతలు జయలలిత, అన్నాదురై, పళణి స్వామిని విమర్శించే అర్హత అన్నామలైకు లేదన్నారు. దివంగత నేతలు అన్నా, జయలలిత జాతీయ స్థాయిలో చక్రం తిప్పిన వాళ్లు అని, అయితే, వారినే టార్గెట్ చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. రెండు కోట్ల మంది అన్నాడీఎంకే కేడర్ ముక్త కంఠంతో ఇచ్చిన ఆదేశాలను తమ ప్రధాన కార్యదర్శి పళణి స్వామి ఆలకించి, కూటమి విషయంలో అమలు చేశారన్నారు. అన్నామలైను బీజేపీ నుంచి తొలగించాలని తాము ఎవరి వద్ద ఫిర్యాదులు చేయలేదు, విజ్ఞప్తులు పెట్టలేదని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. మళ్లీ కూటమిలోకి వెళ్తామన్నట్లు ప్రచారం జరుగుతోందని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తమ నేతృత్వంలోనే కొత్త కూటమి.. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇక బీజేపీతో పొత్తు ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశాలోని పార్టీలు ఏవిధంగా ప్రధాని అభ్యర్థిత్వం వ్యవహారం, కూటమి వ్యవహారంలో వ్యవహరిస్తున్నాయో అదే తరహాలో ఇక అన్నాడీఎంకే పయనం ఉంటుందన్నారు. లోక్‌సభ ఎన్నికలే కాదు, 2026 అసెంబ్లీ ఎన్నికలలోనూ బీజేపీతో పొత్తుకు ఆస్కారం లేదని , రాయబారాలకు, బెదిరింపులకు ఛాన్సే లేదని తేల్చి చెప్పారు. ఇక ఏ ఎన్నికలైనా సరే తమ ప్రధాన కార్యదర్శి పళణిస్వామి నేతృత్వంలోనే కొత్త కూటమి ఏర్పాటు చేసి పోటీ చేస్తామన్నారు. గతంలో తమ అమ్మ, దివంగత నేత జయలలిత అనుసరించిన బాటలోనే బీజేపీ వ్యవహారంలో తమ నిర్ణయాలు ఉంటాయన్నారు. -
ఆ వైభవం తిరిగొస్తుందా?
గత అక్టోబర్‌లో యాభై ఏళ్ళు నిండినప్పుడు అందరూ ఆగిచూసిన దక్షిణాది ప్రాంతీయ పార్టీ అఖిల భారత అన్నా ద్రావిడ మున్నేట్ర కళగం (అన్నాడీఎంకె)కు మంచి రోజులు రానున్నాయా? అప్పట్లో ద్రావిడ మున్నేట్ర కళగం (డీఎంకె)తో సరిపడక హీరో ఎమ్జీఆర్ బయటకొచ్చి స్థాపించిన ఈ పార్టీపై పట్టు కోసం కోర్టులో పోరు కొలిక్కి వచ్చినట్టేనా? పార్టీ నుంచి తనను బహిష్కరించడాన్నీ, తన ప్రత్యర్థి – మాజీ సీఎం ఈడప్పాడి పళనిస్వామి (ఈపీఎస్)ను ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకోవడాన్నీ సవాలు చేస్తూ మాజీ సమన్వయకర్త ఓ. పన్నీర్‌సెల్వం (ఓపీఎస్) వేసిన పిటిషన్లను మద్రాస్ హైకోర్ట్ మంగళవారం తోసిపుచ్చింది. కోర్టులో ఓపీఎస్‌కు ఎదురుదెబ్బ ఇది వరుసగా మూడోసారి. తీర్పుపై అప్పీలుకు అవకాశం ఉన్నా, ఆయన రాజకీయ పునరాగమనానికి దారులు మూసుకుపోతున్నట్టే అనిపిస్తోంది. కేడర్‌పై విస్తరించిన పట్టు, కీలక స్థానాల్లో నమ్మినబంట్ల నియామకం, సమర్థ పరిపాల కుడిగా సాధించిన పేరు, తాజా కోర్టు తీర్పుతో... పార్టీ పగ్గాలు ఈపీఎస్ చేతికి దాదాపు వచ్చినట్టే. ఇది పార్టీ పునర్వైభవానికి దోహదమవుతుందా అన్నదే ఇక మిగిలిన ప్రశ్న. అధినేత్రి జయలలిత మరణానంతరం క్రమంగా కష్టాల్లో పడ్డ అన్నాడీఎంకె గత రెండేళ్ళలో తేవర్లు, గౌండర్లు, వగైరా కులాల కుంపట్లతో ఒకటికి నాలుగు (ఈపీఎస్, ఓపీఎస్, పదవీచ్యుత ప్రధాన కార్యదర్శి శశికళ, ఆమె మేనల్లుడు – ఏఎంఎంకె అధినేత టీటీవీ దినకరన్) వర్గాలైంది. సాంప్రదాయికంగా అన్నాడీఎంకెకు పట్టున్న రాష్ట్రంలోని పశ్చిమ ప్రాంతంలో నిరుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో డీఎంకె పాగా వేసింది. మహిళలు, వెనుకబడిన వర్గాలు, అగ్రవర్ణాల ఓటు బ్యాంక్ క్రమంగా చెదిరిపోతోంది. ఈపీఎస్, ఓపీఎస్ శిబిరాల మధ్య పోరుతో పార్టీ దశ, దిశ కోల్పోయి బలహీనపడ్డ సమయంలో కోర్ట్ తీర్పు అయాచిత వరమే. పేరుకు ప్రధాన ప్రతిపక్షమైనా వర్గ విభేదాలు, పార్టీకి సారథి ఎవరో తెలియని అయోమయం, ఎన్నికల చిహ్నం రెండాకులపై పోరాటం సాగుతున్న వేళ ఈ తీర్పు పార్టీ ప్రస్థానానికి దిశానిర్దేశమే. కోర్టు ఆదేశాలు ఈపీఎస్ వర్గానికి నైతికంగా పెద్ద అండ. నిజానికి, దివంగత జయలలితనే పార్టీ శాశ్వత అధినేత్రిగా ప్రకటించాలన్నది ఓపీఎస్ వర్గం దీర్ఘకాలిక డిమాండ్. ఇప్పుడీ తీర్పుతో వారి డిమాండ్‌కు గండిపడింది. ఈపీఎస్ మద్దతుదారులు తమ నేతను శాశ్వత ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకొని, పార్టీని మళ్ళీ పట్టాలెక్కించాలని ఉవ్విళ్ళూరుతున్నారు. ఈ ఫిబ్రవరిలో సుప్రీం కోర్ట్ సానుకూలంగా ఇచ్చిన తీర్పూ వారికి కలిసొచ్చే అంశం. ఇప్పటికే పార్టీ జనరల్ కౌన్సిల్లో, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో మెజారిటీ సభ్యుల మద్దతు ఈపీఎస్‌కే ఉంది గనక ఈపీఎస్ యథేచ్ఛగా ప్రత్యేక సమావేశాలు పెట్టుకోవచ్చు. సదరు సమావేశాల్లో పార్టీలో ఓపీఎస్ లాంటి ప్రత్యర్థుల్ని ఇంటికి సాగనంపుతూ తీర్మానాలు చేసే వీలు చిక్కుతుంది. అవసరాన్ని బట్టి పార్టీ రాజ్యాంగాన్నీ సవరించుకోవచ్చు. ఇవన్నీ ఈపీఎస్‌కు కలిసొచ్చే అంశాలు. ఇల్లలకగానే పండగ కాదనట్టు ఈపీఎస్‌కు అనేక సవాళ్ళు ముందున్నాయి. దాదాపు 1.5 కోట్ల మంది కార్యకర్తలున్న పార్టీని ఒంటరి దళపతిగా ఆయన ముందుకు నడపాలి. పార్టీకి మునుపు సారథ్యం వహించిన ఎమ్జీఆర్, జయలలిత లాంటి దిగ్గజాలకున్న ఇమేజ్, ప్రాచుర్యం ఈపీఎస్‌కు లేవు. వారిలా జనాకర్షణ, మాటే శాసనంగా పార్టీని నడిపే పట్టు ఆయన నుంచి ఆశించలేం. సొంత గూటి సంగతి పక్కన పెడితే, ప్రత్యర్థి పార్టీ అయిన డీఎంకెతో ఢీ అంటే ఢీ అనాలంటే ముందుగా కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా జనంలో పార్టీపై నమ్మకం పెంపొందించాలి. మరోపక్క 2019 లోక్‌సభ ఎన్నికల్లో, 2021 తమిళ అసెంబ్లీ ఎన్నికల్లో పెద్ద సంఖ్యలో విజయాలతో డీఎంకెను ముందుకు నడిపిన ఘనత స్టాలిన్‌ది. బలమైన ఈ ప్రత్యర్థితో తలపడడం ఈపీఎస్‌కు ఈజీ కాదు. తమిళ రాజకీయాలెప్పుడూ డీఎంకె, అన్నాడీఎంకెల మధ్య... కరుణానిధి, జయలలితల మధ్య ఊగడం రివాజు. ఆ రాజకీయ దృశ్యం ఇప్పుడు గణనీయంగా మారింది. చిరకాలంగా తమిళ రాజకీయాలకు దిక్సూచైన ద్రావిడ సిద్ధాంతం క్రమంగా కుంచించుకుపోతోంది. ఇద్దరు రిటైర్డ్ ఐపీఎస్ అధికారులను (గవర్నర్ రవి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై) 2021లో బరిలోకి దింపి, డీఎంకె వ్యతిరేక, హిందూత్వ జాతీయవాద వైఖరితో బీజేపీ కాలు దువ్వుతోంది. అలాగే, జయ మరణానంతరం అన్నాడీఎంకెకు పెద్దన్నగా వ్యవహరించిన బీజేపీ... ఆ పార్టీ బలహీనతల్ని వాటంగా చేసుకొని, జయ వదిలివెళ్ళిన స్థానంలో ప్రధాన ప్రతిపక్షంగా తాను కూర్చోవాలని శతధా ప్రయత్నిస్తోంది. పక్కనే పొంచివున్న ఈ ముప్పు పట్ల ఈపీఎస్ జాగరూకత వహించి, సమర్థంగా ఎదుర్కోవాలి. ఒక్కమాటలో– 39 పార్లమెంటరీ స్థానాలున్న తమిళనాట రానున్న 2024 లోక్‌సభ ఎన్నికలు ఈపీఎస్‌కు తొలి పెద్ద పరీక్ష. దానిలో పార్టీని బలంగా నిలబెట్టి, తర్వాత మరో రెండేళ్ళకు వచ్చే 234 స్థానాల శాసనసభా సమరంలో అధికారం చేజిక్కించుకునేలా పోరాడాలి. నిరుటి అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకె కూటమి 159 స్థానాలు సాధిస్తే, 75 సీట్లకే పరిమితమైన అన్నాడీఎంకె కూటమి ఆ లెక్కను తిరగరాయాలి. అదే జరిగితే అధినేతగా ఈపీఎస్‌కు తిరుగుండదు. లేదంటే, అన్నాడీఎంకెలో మరోసారి అసమ్మతి స్వరాలు పైకొస్తాయి. రిటైరయ్యానని ప్రకటించిన జయలలిత నెచ్చెలి శశికళను మళ్ళీ తెర పైకి తేవాలనే మాటలు వినిపిస్తాయి. అందుకే, రాగల మూడేళ్ళ కాలం ఈపీఎస్‌కు పరీక్షా సమయం. మంచి మార్కులు తెచ్చుకుంటేనే ఆయనకైనా, అన్నాడీఎంకెకైనా భవిష్యత్తు! -
అన్నాడీఎంకేతో పొత్తు పెట్టుకుంటే అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తా: అన్నాలై
అన్నాడీఎంకేతో ఇక కటీఫ్, ఆ పార్టీతో కూటమి పెట్టుకుంటే పార్టీ పదవికి రాజీనామా చేస్తానని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై చేసిన వ్యాఖ్యలు చర్చకు దారి తీశాయి. ప్రధానంగా ఆయన అన్నాడీఎంకేను ఉద్దేశించి తీవ్ర వ్యాఖ్యలు చేయడం వివాదాస్పదమైంది. అయితే, కూటమి ఎవరెవరితో అని నిర్ణయించేది బీజేపీ కాదని, తాము మాత్రమే అని అన్నాడీఎంకే సీనియర్ నేతలు అన్నామలైపై ఎదురు దాడికి దిగారు. సాక్షి, చైన్నె: గత కొద్ది రోజులుగా పళణిస్వామి నేతృత్వంలోని అన్నాడీఎంకే శిబిరం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై మధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. బీజేపీతో పొత్తు అవసరమా..? అనే అంశాన్ని అన్నాడీఎంకే ఇప్పటికే తీవ్రంగా చర్చిస్తోంది. అయితే, జాతీయ స్థాయి పార్టీ కావడంతో ఆచీ తూచీగా స్పందిస్తూ వస్తోంది. ఈ పరిస్థితుల్లో చైన్నెలో జరిగిన పార్టీ సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై చేసిన వ్యాఖ్యలు అన్నాడీఎంకే వర్గాలకు అనుకూలంగా మారాయనే ప్రచారం సాగుతోంది. వైరల్ అవుతున్న కటీఫ్ వ్యాఖ్యలు చైన్నెలో శనివారం జరిగిన పార్టీ కార్యాక్రమంలో అన్నామలై అన్నాడీఎంకేపై తీవ్ర వ్యాఖ్యలు చేసినట్లు సామాజిక మాధ్యమాలు, కొన్ని చానళ్లలో జోరుగా ప్రచారం సాగింది. అందులోని అంశాల మేరకు వివరాలు... రానున్న లోక్ పసభ ఎన్నికలకు బూత్ కమిటీల ఏర్పాటు, పార్టీకి విరాళాల సేకరణ గురించి నేతలకు ఈ సమావేశంలో అన్నామలై నాయకులకు హితబోధ చేశారు. పార్టీ బలోపేతం దిశగా సాగుదామని పిలుపు నిచ్చారు. ఎన్నికల సమయంలో ఎవ్వరెవ్వరికో శాలువలు కప్పి కూటమిలోకి ఆహ్వానించాల్సిన అవసరం లేదన్నారు. ద్రవిడ పార్టీలతో కలిసి ఎన్నికలను ఎదుర్కొనడం తనకు ఇష్టం లేదని స్పష్టం చేశారు. పొత్తు ఎవరితో అనే నిర్ణయం మనమే తీసుకుందామని, ఒంటరిగా వెళ్లినప్పుడే బీజేపీ బలం ఏమిటో ద్రవిడ పార్టీలకు తెలియజేయగలమని అభిప్రాయపడ్డారు. అన్నాడీఎంకేలో పొత్తు పెట్టుకుంటే, పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి, సాధారణ కార్యకర్తగా బీజేపీలో కొనసాగుతానని వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోదీనికి కలిసి అన్ని వివరాలను తెలియజేయడానికి ప్రయత్నం చేస్తున్నానని పేర్కొన్నారు. కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో కొద్ది రోజులు బిజీ బీజీగా ఉంటానని, ఈ సమయంలో పార్టీ కేడర్ ప్రజల్లోకి చొచ్చుకు వెళ్లే కార్యక్రమాలు నిర్వహించాలని పిలుపు నిచ్చారు. అయితే, కూటమి విషయంపై అన్నామలై చేసిన వ్యాఖ్యలు ఆ పార్టీలోని ద్వితీయ శ్రేణి నేతలలో వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఆ పార్టీ శాసన సభా పక్ష నేత నయనార్ నాగేంద్రన్ స్పందిస్తూ, కూటమి విషయాన్ని నిర్ణయించాల్సింది పార్టీ రాష్ట్ర విభాగం కాదని, బీజేపీ అధిష్టానం అనే విషయాన్ని అన్నామలై గుర్తంచాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. అయితే బీజేపీలోని కొందరు నేతలు అన్నామలై వ్యాఖ్యలను వక్రీకరించినట్లు పేర్కొన్నారు. తమ పార్టీ సమావేశంలో జరిగిన చర్చ, అభిప్రాయాలు, వ్యాఖ్యలను బయటకు వెళ్లగక్కి ఎవరో రాజకీయం చేస్తున్నట్లుందని విమర్శించారు. దీటుగా స్పందించిన పళణివర్గం.. న్నామలై వ్యాఖ్యలకు అన్నాడీఎంకే వర్గాలు దీటుగా స్పందించాయి. అన్నాడీఎంకే సీనియర్లు జయకుమార్, ఓఎస్ మణియన్ పేర్కొంటూ. రాష్ట్రంలో పొత్తు గురించి నిర్ణయం తీసుకోవాల్సింది బీజేపీ కాదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో అన్నాడీఎంకే నేతృత్వంలోని కూటమిలో ఇతర పార్టీలు ఉంటాయనే విషయాన్ని ఆయన గుర్తుంచుకోవాలని చురకలు అంటించారు. ఎవరికి వంగి..వంగి దండాలు పెట్టాల్సిన అవసరం అన్నాడీఎంకేకు లేదని, అలా పెట్టే ప్రసక్తి కూడా లేదని తేల్చిచెప్పారు. -
సీఎం జగన్ బాటలో స్టాలిన్.. తమిళనాడులోనూ గ్రామ సచివాలయ వ్యవస్థ
ఆంధ్రప్రదేశ్‌లో మాదిరిగానే తమిళనాడులోనూ గ్రామ సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టున్నారు. ప్రజల భాగస్వామ్యంతో పారదర్శక పాలనకు దోహదపడే గ్రామ సచివాలయాలకు తమ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అన్నారు. రాష్ట్రంలో ఈ ఏడాది 600 గ్రామ సచివాలయాలను నిర్మిస్తామని తెలిపారు. అలాగే ఉత్తమ పట్టణ పంచాయతీలకు ‘ఉత్తమర్ గాంధీ’అవార్డులను ప్రదానం చేయనున్నట్లు చెప్పారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా శుక్రవారం పంచాయతీల ప్రగతి, పట్టణ పంచాయతీలకు సంబంధించిన పలు విషయాలపై సీఎం స్టాలిన్ మాట్లాడారు. ‘‘ఈనెల 24వ తేదీ జాతీయ పంచాయతీరాజ్ దినోత్సవం జరగనుంది. ప్రజాస్వామ్య దేశంలో పట్టణ పంచాయతీ పాలనకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇవి బలంగా ఉంటేనే ప్రభుత్వ పథకాలు క్షేత్రస్థాయిలో అమలు చేయగలం. డీఎంకే అధికారంలోకి వచ్చినపుడల్లా పంచాయతీలు, పట్టణ పంచాయతీలకు ప్రాధాన్యత ఇస్తున్నాం. ఏడాదికి ఒకరోజు స్థానిక సంస్థల దినంగా జరుపుకోవాలని నేను ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే సూచించాను. ఆ మేరకు 2007 నుంచి 2010 వరకు నవంబరు 1వ తేదీ జరుపుకున్నాం. అయితే ఆ తరువాత అధికారంలోకి వచ్చిన అన్నాడీఎంకే ప్రభుత్వం ఈ విధానాన్ని రద్దు చేసింది. గ్రామీణుల్లో ప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించేలా, ప్రజల భాగస్వామ్యంతో ప్రభుత్వ పాలనలో పారదర్శకత తీసుకొచ్చేలా ఇకపై ఏటా నవంబర్ 1వ తేదీ స్థానిక సంస్థల దినోత్సవం నిర్వహిస్తాం. గ్రామ పరిపాలనను బలోపేతం చేసేలా గ్రామ సచివాలయాలకు ఇప్పటికే అనేక అధికారాలు, బాధ్యతలు ఇచ్చాం. 1998లో కరుణానిధి సీఎంగా ఉన్న సమయంలో ఏడాదికి నాలుగుసార్లు గ్రామసభలు నిర్వహించాలని చట్టం తీసుకొచ్చాం. ఇక ఈ ఏడాది నుంచి ఏటా ఆరు గ్రామసభలు నిర్వహిస్తాం. సుపరిపాలన అందించే పట్టణ పంచాయతీలకు ‘‘ ఉత్తమర్ గాంధీ అవార్డు’’ను ప్రదానం చేస్తాం. పరిపాలనా సౌలభ్యం కోసం ఈ ఏడాది 600 గ్రామ సచివాలయ భవనాలను నిర్మిస్తామ’’ని వివరించారు. చదవండి👉🏾 సోనియా చేతికి నివేదిక అన్నాడీఎంకే వాకౌట్ రాష్ట్రంలో విద్యుత్ కోతలను నిరసిస్తూ ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకే సభ్యులు అసెంబ్లీ నుంచి వాకౌట్ చేశారు. అంతకు ముందు ప్రధాన ప్రతిపక్ష నేత ఎడపాడి పళనిస్వామి అసెంబ్లీలో మాట్లాడుతూ.. రోజుకు 17,100 మెగావాట్ల విద్యుత్ అవసరం కాగా 13,100 మెగావాట్ల విద్యుత్ మాత్రమే ఉత్పత్తి అవుతోందని అన్నారు. వేసవిలో విద్యుత్ డిమాండ్ పెరిగిందని, థర్మల్ విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన బొగ్గు అందుబాటులో లేనందున సరఫరాలో అంతరాయం పరిపాటిగా మారిందని దుయ్యబట్టారు. రైతులు, సూక్ష్మ, చిన్నతరహా పరిశ్రమలు నష్టపోతున్నట్లు తెలిపారు. ఈ విమర్శలకు విద్యుత్‌శాఖ మంత్రి సెంథిల్ బాలాజీ బదులిస్తూ, రాష్ట్రపరిధిలో విద్యుత్ ఉత్పత్తి పెరిగినా సెంట్రల్ గ్రిడ్ నుంచి రావాల్సిన 796 మెగావాట్లు రాకపోవడంతో ఇబ్బందులు తలెత్తాయని అన్నారు. తక్కువ ధరతో 3వేల మెగావాట్ల విద్యుత్ కొనుగోలుకు చర్యలు తీసుకున్నామని తెలిపారు. అయితే, మంత్రి సమాధానం సంతృప్తికరంగా లేదని ఆరోపిస్తూ ఎడపాడి నేతృత్వంలో అన్నాడీఎంకే సభ్యులంతా వాకౌట్ చేశారు. అసెంబ్లీలో అవీ ఇవీ.. ►పాలిటెక్నిక్ కాలేజీల్లో ఎవరూ చేరడం లేదని.. ఆయా కాలేజీల్లో అడ్మిషన్లు పెంచేందుకే నాన్ ముదల్వన్ పథకాన్ని తీసుకొచ్చామని ఉన్నత విద్యాశాఖ మంత్రి పొన్ముడి చెప్పారు. ►సీఎం స్టాలిన్‌ను మరో కామరాజర్గా భావిస్తున్నానని ప్రతిపక్ష పీఎంకే ఎమ్మెల్యే సదాశివం కీర్తించడం విశేషం. -
అన్నాడీఎంకేకు ఘోర అవమానం.. జోష్‌లో బీజేపీ!
తమిళనాడు అర్బన్ ఎన్నికల్లో అధికార డీఎంకే అఖండ విజయం దిశగా దూసుకెళ్తోంది. ఇప్పటికే మేజర్ స్థానాల్ని కైవసం చేసుకుని.. ఎన్నికల ట్రెండ్స్‌లో స్పష్టమైన ఆధిప్యతంతో ముందంజలో కొనసాగుతోంది. అదే సమయంలో మునుపెన్నడూ లేని చెన్నై వేదికగా సరికొత్త రాజకీయం అగుపించింది. చాలా చోట్ల అన్నాడీఎంకేను వెనక్కి రాజేసి.. బీజేపీ రెండో స్థానంలో కొనసాగుతోంది. ముఖ్యంగా చెన్నైలోని కొన్ని వార్డుల్లో.. ఆల్ ఇండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కగజమ్ పార్టీ మూడో స్థానానికి పరిమితమైంది. అదీ బీజేపీ కంటే చాలా ఓట్ల తేడాతో వెనుకబడడం విశేషం. తాజా ట్రెండ్ ప్రకారం.. చెన్నైలో కనీసం ఐదు వార్డులనైనా బీజేపీ సొంతం చేసుకోవచ్చని తెలుస్తోంది(ఇప్పటికే ఒక స్థానం గెల్చుకుంది). #LocalBodyElections2022 - #Chennai Result updates! pic.twitter.com/dUqWp4h0G9 — Greater Chennai Corporation (@chennaicorp) February 22, 2022 ఇక ఈ ఫలితాలు బీజేపీలో జోష్ నింపుతున్నాయి. స్థానిక సంస్థ ఎన్నికల ఫలితాలే అయినా.. తమిళనాట పాగా వేయాలన్న ప్రయత్నాలకు కాస్తైనా మార్గం సుగమం అయ్యిందని బీజేపీ శ్రేణులు సంతోషం వ్యక్తం చేస్తున్నాయి. ఈ ఫలితాలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే అన్నామలై స్పందిస్తూ.. 2026 అసెంబ్లీ ఎన్నికలకు శుభసంకేతంగా ఫలితాల్ని వర్ణించాడు. ప్రతిపక్ష హోదాలో అన్నాడీఎంకే కంటే తామే బాధ్యతగా వ్యవహరించడమే బహుశా ఈ ఫలితాలకు కారణమై ఉండొచ్చని విశ్లేషిస్తున్నాడు అన్నామలై. తమిళనాడులో బీజేపీ-అన్నాడీఎంకే పార్టీల మధ్య పొత్తు ఉంది. అయితే ఎక్కువ సీట్ల కోసం అర్బన్ ఎన్నికలకు మాత్రం విడివిడిగా పోటీ చేశాయి. ఈ ఎన్నికల సంగతి ఎలా ఉన్నా.. బీజేపీ అన్నాడీఎంకేల మధ్య పొత్తు రాబోయే పార్లమెంట్ సార్వత్రిక ఎన్నికలు, వీలైతే ఆపై అసెంబ్లీ ఎన్నికల్లోనూ కొనసాగుతుందని స్పష్టం చేశాడు అన్నామలై. -
అన్నాడీఎంకేలో మళ్లీ కోల్డ్ వార్.. ‘పళని’ ఎత్తు.. ‘పన్నీరు’ పైఎత్తు
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరు సెల్వం, కో– కన్వీనర్ పళని స్వామి మధ్య మళ్లీ అంతర్గత పోరు తెర మీదకు వచ్చింది. అన్నాడీఎంకే కైవసమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న చిన్నమ్మ శశికళ దూకుడు, పార్టీని కాపాడుకునేందుకు పన్నీరు, పళని సారథ్యంలోని సమన్వయ కమిటీ సాగిస్తున్న కుస్తీల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే, హఠాత్తుగా సోమవారం సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరు సెల్వం చిన్నమ్మ శశికళ నామస్మరణను అందుకోవడం చర్చకు దారి తీసింది. చిన్నమ్మను ఆది నుంచి పళని స్వామితో పాటుగా సీనియర్లు వ్యతిరేకిస్తున్న తరుణంలో, అందరితో చర్చించి చిన్నమ్మ విషయంలో నిర్ణయం తీసుకుంటామని పన్నీరు సెల్వం వ్యాఖ్యానించడంలో ఆంతర్యాన్ని పసిగట్టే పనిలో రాజకీయ విశేష్లకులు నిమగ్నమయ్యారు. ( చదవండి: అన్నాడీఎంకే కైవసమే లక్ష్యంగా చిన్నమ్మ పయనం.. దినకరన్ మద్దతు ) టార్గెట్.. ప్రధాన కార్యదర్శి పదవి తానే ప్రధాన కార్యదర్శి అని శశికళ స్పష్టం చేస్తూ వస్తున్న తరుణంలో ఆ పదవి విషయంలో కీలక నిర్ణయం తీసుకునేందుకు పళని రచించిన వ్యూహం మంగళవారం రాజకీయ వర్గాల ద్వారా వెలుగులోకి వచ్చింది. డిసెంబర్లో అన్నాడీఎంకే కార్యవర్గం, సర్వసభ్య సమావేశం నిర్వహించి, రద్దు చేసిన ఆ పదవిని మళ్లీ పునరుద్ధరించి, చేజిక్కించుకునేందుకు పళని వ్యూహాలకు పదును పెట్టినట్టు సంకేతాలు వెలువడ్డాయి. జంట నాయకత్వాన్ని పక్కన పెట్టి, ఏకాధిప్యతం లక్ష్యంగా సీనియర్లతో పళని రహస్య మంతనాలు చేస్తున్న విషయం పన్నీరు దృష్టికి రావడంతోనే హఠాత్తుగా చిన్నమ్మను జపాన్ని ఆయన తెర మీదకు తెచ్చినట్టు సమాచారం. ప్రధాన కార్యదర్శి పదవి తన గుప్పెట్లోకి వచ్చిన తరువాత.. చిన్నమ్మ దూకుడుకు కళ్లెం వేయవచ్చన్న ధీమాతో పళని ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సమయంలో ఎత్తుకు పైఎత్తు అన్నట్టుగా చిన్నమ్మ నినాదాన్ని పన్నీరు అందుకున్నట్టు అన్నాడీఎంకే వర్గాలు పేర్కొంటున్నాయి. చిన్నమ్మ పర్యటన ఓవైపు అన్నాడీఎంకేలో అంతర్గత కుమ్ములాట మళ్లీ తెర రాగా, మరోవైపు కేడర్‌లోకి చొచ్చుకు వెళ్లేందుకు చిన్నమ్మ దృష్టి పెట్టారు. మంగళవారం చెన్నై నుంచి ఆమె తంజావూరుకు బయలుదేరి వెళ్లారు. అమ్మ మక్కల్ మున్నేట్ర కళగం వర్గాలే కాకుండా, మద్దతుదారులు ఆమెకు బ్రహ్మరథం పట్టడం గమనార్హం. మూడు రోజుల పాటుగా ఆమె తంజావూరు, మదురై, రామనాథపురంలో పర్యటించనున్నారు. చదవండి: Vijayakanth: నా ఆరోగ్యం క్షీణించిన విషయం నిజమే.. అంత మాత్రాన.. -
తమిళనాడు: అమ్మపార్టీలో.. అంతర్గత పోరు
అన్నాడీఎంకేలో ఆధిపత్యపోరు సోమవారం మరోసారి తెరపైకివచ్చింది. ఖాళీ అయిన ప్రిసీడియం చైర్మన్ పదవిని తమఖాతాలో వేసుకునేందుకు పార్టీ సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీర్‌సెల్వం, ఉపకన్వీనర్ ఎడపాడి పళనిస్వామి పోటీపడడం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సాక్షి, చెన్నై: గడిచిన అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో అన్నాడీఎంకే అధికారాన్ని చేజార్చుకున్న తరువాత ప్రధాన నేతల మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి. ప్రధాన ప్రతిపక్ష నేత పదవికై ఎడపాడి, పన్నీర్‌సెల్వం తీవ్రస్థాయిలో పోటీపడ్డారు. అయితే కొంగుమండలం నుంచి అత్యధికంగా ఎమ్మెల్యేలను గెలిపించుకున్నారనే కారణంతో ఎడపాడినే ఆ పదవి వరించింది. అప్పటి నుంచి అధికారికంగా స్పందించకపోయినా ఎవరికి వారు భిన్నమైన ప్రకటనలు చేస్తున్నారు. దీంతో పార్టీ క్యాడర్లో అయోమయం నెలకొంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం పార్టీలో సమన్వయం కొరవడిందనే విమర్శలకు ఊతమిచ్చేలా, అన్నాడీఎంకే కూటమిలో రెండో అతిపెద్ద పార్టీ పీఎంకే ఒంటరిగానే పోటీచేయడం చర్చనీయాంశమైంది. మరోవైపు అన్నాడీఎంకేను కైవసం చేసుకునేందుకు శశికళ ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే 50 వసంతాల వేడుకలు ఈనెల 17వ తేదీన జరగనున్నాయి. కాగా 16వ తేదీన శశికళ చెన్నై మెరీనాబీచ్‌లోని జయలలిత సమాధి వద్దకు వెళ్లి రాష్ట్రవ్యాప్త పర్యటనకు సమాయుత్తం అవుతారనే అంశం సమాచారం ప్రచారంలో ఉంది. చదవండి: బలవంతంగా విషం తాగించి హత్య.. కోర్టులో డీఎంకే ఎంపీ లొంగుబాటు ‘ప్రిసీడియం’ కోసం పట్టు పార్టీలో ప్రిసీడియం చైర్మన్ అత్యంత కీలకపదవి. ఈ పదవిలో ఉండిన మధుసూదనన్ ఇటీవల మరణించారు. దీంతో ఈ పదవి తమ వర్గానికి దక్కించుకోవడం కోసం ఎడపాడి, పన్నీర్‌సెల్వం పోటాపోటీగా మళ్లీ పావులు కదుపుతున్నారు. ఆరంభంలో పన్నీర్‌సెల్వం అనుచరుడిగా వ్యవహరించిన మధుసూదనన్ ఆ తరువాత ఎడపాడి పంచన చేరారు. అంతేగాక పార్టీలో మెజార్టీ నేతలు ఎడపాడి వెనుకే ఉన్నారు. దీన్ని అవకాశంగా తీసుకుని ప్రిసీడియం చైర్మన్ పదవిని తన అనుచరులకు కట్టబెట్టాలని ఎడపాడి పట్టుదలతో ఉన్నారు. పార్టీ సంస్థాగత ఎన్నికలు ఈ ఏడాది డిసెంబరు ఆఖరులోగా ముగించాల్సి ఉన్నందున ప్రిసీడియం చైర్మన్ పదవి భర్తీని ఆ తరువాత చూసుకోవచ్చని పన్నీర్‌సెల్వం దాటవేస్తున్నారు. పార్టీలో ఇలాంటి గరంగరం వాతావరణం నెలకొని ఉన్న నేపథ్యంలో నిర్వాహక కార్యవర్గం సోమవారం ఉదయం 10 గంటలకు చెన్నై రాయపేటలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో అత్యవసరంగా సమావేశమైంది. పన్నీర్‌సెల్వం అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఎడపాడి, పార్టీ ప్రధాన కార్యాలయ నిర్వాహకులు, జిల్లాల కార్యదర్శులు హాజరయ్యారు. పార్టీ శ్రేణులంతా సమన్వయంతో ముందుకు సాగితేనే రాబోయే ఎన్నికల్లో సవాళ్లను ఎదుర్కొనగలమని అగ్రనేతలు తమ ప్రసంగాల్లో సూచించారు. సావనీర్ విడుదలపై.. పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో భాగంగా ఏటా ప్రిసీడియం చైర్మన్ చేతుల మీదుగా సావనీర్‌ను విడుదల చేయడం ఆనవాయితీగా వస్తోంది. అయితే మధుసూదనన్ మరణం వల్ల ఈ ఏడాది సావనీర్‌ను ఎవరు విడుదల చేస్తారనే అంశం చర్చకు వచ్చింది. ప్రిసీడియం పదవికై ఎడపాడి, పన్నీర్‌సెల్వం వర్గాలు పోటీపడడంతో సంస్థాగత ఎన్నికల తరువాత నిర్ణయం తీసుకోవచ్చని సమావేశంలో వాయిదా వేశారు. ఇక పార్టీని శశికళ తన చెప్పుచేతుల్లోకి తీసుకునే ప్రయత్నాలను సంఘటితంగా ఎదుర్కొనాలని పార్టీ నిర్ణయం తీసుకుంది. -
పులమైపిత్తన్ కన్నుమూత.. ఎంజీఆర్‌తో 22 ఏళ్ల పరిచయం
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే ప్రిసీడీయం మాజీ చైర్మన్, సినీ పాటల రచయిత, కవి పులమైపిత్తన్(86) అనారోగ్యంతో బుధవారం చెన్నైలో తుదిశ్వాస విడిచారు. ఆయన మృతికి సీఎం ఎంకే స్టాలిన్, అన్నాడీఎంకే నేతలు పన్నీరు సెల్వం, పళనిస్వామి నివాళులరి్పంచారు. తమిళ సినీ రంగంలో దివంగత సీఎం ఎంజీఆర్ నటించిన అనేక హిట్ చిత్రాలకు గేయ రచయితగా పనిచేసి పులమైపిత్తన్ తెర మీదకు వచ్చారు. అన్నాడీఎంకే ఆవిర్భావంతో ఎంజీఆర్ వెన్నంటి నడిచారు. వీరిద్దరి మధ్య 22 ఏళ్ల పరిచయం ఉంది. చదవండి: మరణంలోనూ వీడని స్నేహబంధం.. అందరూ యువకులే ఆ పార్టీ ప్రిసీడీయం చైర్మన్‌గా, గేయ రచయితగా గుర్తింపు పొందారు. దివంగత డీఎంకే అధినేత కరుణానిధి మెప్పును సైతం పొందారు. ఎమ్మెల్సీగా ప్రజా సేవలో ఉంటూనే, శివాజీ గణేషన్, కమల్, రజనీకాంత్ వంటి నటుల చిత్రాలకు అనేక సూపర్ హిట్ పాటల్ని అందించారు. తమిళనాడు ప్రభుత్వం నుంచి నాలుగుసార్లు ఉత్తమ గేయ రచయిత అవార్డును అందుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన గత కొంతకాలంగా వృద్ధాప్య సమస్యలతో బాధ పడుతున్నారు. ఈనెల 1న ఆయన్ని అడయార్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్చారు. అక్కడ వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందించారు. పరిస్థితి విషమించి బుధవారం ఉదయం 9.30 గంటలకు ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ సమాచారంతో అన్నాడీఎంకేలో విషాదం అలముకుంది. దర్శకుడు భారతీరాజా సహా ఇతర సినీప్రముఖులు పిత్తన్ భౌతికకాయానికి నివాళులరి్పంచారు. కాగా నీలాంకరైలోని ఆయ న నివాసంలో ఆప్తులు, పార్టీ వర్గాల సందర్శనార్థం భౌతిక కాయన్ని ఉంచారు. గురువారం అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. అయితే, అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలకు జరిపించాలని కుటుంబ సభ్యులు ప్రభుత్వాన్ని కోరారు. పీఎంకే అధినేత రాందాసు, తమిళ మానిల కాంగ్రెస్ నేత జీకే వాసన్, ఎండీఎంకే నేత వైగో, సంగీత దర్శకుడు ఇళయారాజా, నటుడు, మక్కల్ నీదిమయ్యం నేత కమల్‌హాసన్ తదితరులు సంతాపం తెలిపారు. చదవండి: శశికళకు మరో భారీ షాక్: రూ.వంద కోట్ల ఆస్తులు సీజ్ -
Tamil Nadu: అన్నాడీఎంకేలో విషాదం
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే ప్రిసీడియం చైర్మన్ మధుసూదనన్(81) ఇక లేరు. కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చిన ఆయన గురువారం తుదిశ్వాస విడిచారు. ఈ సమాచారం అన్నాడీఎంకే వర్గాల్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. మూడు రోజులపాటు సంతాపదినాలు పాటించేందుకు సమన్వయ కమిటీ నిర్ణయించింది. జీవించి ఉన్నంత కాలం, ఆయనే పారీ్టకి శాశ్వత ప్రిసీడియం చైర్మన్ అని జయలలిత వద్ద ముద్రపడ్డ నాయకుడు మధుసూదనన్. దివంగత ఎంజీఆర్‌కు వీరాభిమానిగా, ఉత్తర చెన్నై అన్నాడీఎంకేలో కీలక నేతగా, మాజీ మంత్రిగా, పార్టీ ప్రిసీడియం చైర్మన్‌గా అన్నాడీఎంకేలో కీలక పదవుల్లో ఉన్న మధుసూదనన్ మూడు నెలలుగా అనారోగ్య సమస్యలు, వయోభారంతో నగరంలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వచ్చారు. చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం తుదిశ్వాస విడిచారు. ఈ సమాచారంతో అన్నాడీఎంకే వర్గాల్లో విషాదం నెలకొంది. ఆయన మరణం పారీ్టకి తీరని లోటుగా అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరుసెల్వం, కో కనీ్వనర్ పళనిస్వామి ప్రకటించారు. మూడు రోజులు సంతాప దినం పాటించేందుకు నిర్ణయించారు. తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణా టక, కేరళ రాష్ట్రాల్లో పార్టీ, అనుబంధ విభాగాల తరఫున అన్ని కార్యక్రమాలు రద్దు చేశారు. విశ్వాసపాత్రుడు.... ఎంజీఆర్ అంటే మధుసూదనన్‌కు వీరాభిమానం. తన 14వ ఏట ఉత్తర చెన్నై వేదికగా ఎంజీఆర్‌కు అభిమాన సంఘాన్ని ఏర్పాటు చేసి తెరపైకి వచ్చారు. 1972లో అన్నాడీఎంకే ఆవిర్భావంతో ఉత్తర చెన్నై అన్నాడీఎంకేలో కీలక నేతగా అవతరించారు. ఎంజీఆర్ మరణం తర్వాత జయలలిత వెన్నంటి నడిచిన ఆయన 1991లో ఆర్కేనగర్ నుంచి అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఈ కాలంలో చేనేత శాఖ మంత్రిగా కూడా పనిచేశారు. 2007లో ఆయన్ను అన్నాడీఎంకే ప్రిసీడియం చైర్మన్‌గా జయలలిత నియమించారు. జీవించి ఉన్నంత కాలం ఆయనే పారీ్టకి ప్రిసీడియం చైర్మన్ అని స్వయంగా జయలలిత అప్పట్లో ప్రకటించారు. పార్టీ వ్యవహరాలను చివర్లో ఆయనతో చర్చించినానంతరం ప్రకటన రూపంలో జయలలిత విడుదల చేసేవారు. జయలలిత మృతి తర్వాత పరిణామాలతో మాజీ సీఎం పన్నీరుసెల్వం వెన్నంటి నడిచారు. తర్వాత పన్నీరు, పళనిల ఏకంతో అన్నాడీఎంకే ప్రిసీడియం చైర్మన్‌గానే వ్యవహరిస్తూ వచ్చారు. ఈ వివాదాల నేపథ్యంలో అన్నాడీఎంకే పార్టీ, చిహ్నాన్ని ఎన్నికల కమిషన్ మధుసూదనన్ చేతిలో అప్పగించడం గమనార్హం. ఆయన ప్రిసీడియం చైర్మన్ అన్న పదవితోనే చివరి శ్వాసను విడిచారు. ఆయన పారి్థవదేహాన్ని తండయారుపేటలోని ఆయన నివాసంలో ఆప్తులు, పార్టీ వర్గాల సందర్శన నిమిత్తం ఉంచారు. శుక్రవా రం సాయంత్రం అంత్యక్రియలు జరగనున్నాయి. -
మాజీ మంత్రిపై రూ.1,500 కోట్ల కమీషన్ పొందినట్లు ఫిర్యాదు
సాక్షి ప్రతినిధి, చెన్నై: వివిధ పథకాల కింద అమలు చేయాల్సిన పనుల్లో మాజీ మంత్రి ఎస్పీ వేలుమణి రూ.1,500 కోట్ల అవినీతికి పాల్పడినట్లు కోయంబత్తూరు ఆర్థికనేర విభాగం పోలీసులకు మంగళవారం ఫిర్యాదు అందింది. కోయంబత్తూరు రేస్‌కోర్స్ ప్రాంతానికి చెందిన డీఎంకే సభ్యుడు, సినీ నిర్మాత ‘రేస్‌కోర్స్’ రఘునాథ్ కోవై ఆర్థికనేరాల విభాగం పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులోని వివరాలు ఇలా ఉన్నాయి. గత అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో కోవై కార్పొరేషన్, కోవైలోని మున్సిపాలిటీల్లో అనేక అక్రమాలు చోటుచేసుకున్నాయి. మాజీ మంత్రి ఎస్పీ వేలుమణి, కొందరు శాసనసభ్యులు ప్రజాధనాన్ని స్వాహా చేశారు. కోయంబత్తూరు కార్పొరేషన్లో రూ.1,500 కోట్ల అవినాశీ–అత్తికడవు పథకానికి తొలివిడతగా రూ.225 కోట్లు మంజూరై పనులు ప్రారంభమయ్యాయి. బిల్లూరు 3వ అభివృద్ధి పథకం కింద సొరంగ మార్గం నిర్మాణానికి రూ.116 కోట్ల కేటాయింపు జరిగి పనులు జరుగుతున్నాయి. నొయ్యాల్ చెరువు స్వాధీనం కోసం రూ.230 కోట్లు, కోవై నగరానికి 24 గంటల తాగునీటి సరఫరాకు రూ.550 కోట్లు, కునియముత్తూరు భూగర్భ డ్రైనేజీ పనులకు రూ.19.5 కోట్లు, ఆత్తుపాలం–ఉక్కడం ఫ్లై ఓవర్ నిర్మాణ పనులకు రూ.215.51 కోటి, కోవై రేస్‌కోర్సు స్మార్ట్ సిటీ పథకానికి తొలివిడతగా రూ.40 కోట్లు కేటాయింపు జరిగింది. ఇలా జరిగే అన్నిపనుల్లోనూ మంత్రి తనవాటాగా 12 శాతం కమీషన్ పొందడం ఆనవాయితీగా పెట్టుకున్నారు. ఇలా వివిధ పథకాల ముసుగులో రూ.1,500 కోట్ల వరకు అవినీతికి పాల్పడిన మాజీ మంత్రి వేలుమణిపై అవినీతి నిరోధకశాఖ ద్వారా చట్టపరమైన చర్య తీసుకోవాలని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. -
Tamil Nadu: ‘ఆ ముగ్గురి గెలుపులో గోల్మాల్’
సాక్షి ప్రతినిధి, చెన్నై: గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో మంత్రి దురైమురుగన్, మాజీ మంత్రి సి.విజయభాస్కర్, జయకుమార్ గోల్‌మాల్‌కు పాల్పడి గెలుపొందారని.. వారిని అనర్హులుగా ప్రకటించేలా ఈసీని ఆదేశించాలని మద్రాసు హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ పిటిషన్లపై నాలుగు వారాల్లోగా బదులివ్వాలని ఎన్నికల కమిషన్‌ను హైకోర్టు ఆదేశించింది. వివరాలు ఇలా ఉన్నాయి.. వేలూరు జిల్లా కాట్పాడి నియోజకవర్గం ఎమ్మెల్యే, ప్రస్తుత నీటిపారుదలశాఖ మంత్రి దురైమురుగన్ గెలుపును అన్నాడీఎంకే అభ్యర్థి వి. రాము సవాల్ చేశారు. ఓట్ల లెక్కింపు సమయంలో పోస్టల్ బ్యాలెట్ ద్వారా వచ్చిన అర్హమైన ఓట్లను చెల్లని ఓట్లుగా ప్రకటించారని, ఎన్నికల నిబంధనలను సక్రమంగా పాటించలేదని ఆరోపించారు. తపాలా, ఈవీఎం ఓట్లను మళ్లీ లెక్కించాలని కోర్టును కోరారు. పుదుక్కోటై జిల్లా వీరాలిమలై నియోజకవర్గంలో అన్నాడీఎంకే అభ్యర్థి, మాజీ మంత్రి సి. విజయభాస్కర్ గెలుపొందారు. ఇదే నియోజకవర్గం నుంచి డీఎంకే అభ్యర్థిగా పోటీచేసిన ఎం. పళనియప్పన్ మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేశారు. బహుమతులు, నగదు పంపిణీ చేయడం ద్వారా ఓటర్లను మభ్యపెట్టారని, ఎన్నికల నియయావళి కంటే ఎక్కువ ఖర్చుపెట్టడంతోపాటు ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారని ఆరోపించారు. విజయభాస్కర్ గెలుపు చెల్లదని ఎన్నికల కమిషన్‌ను ఆదేశించాలని పిటిషన్లో విజ్ఞప్తి చేశారు. అలాగే ఈరోడ్ జిల్లా పెరుందురై నియోజకవర్గ అన్నాడీఎంకే ఎమ్మెల్యే జయకుమార్ గెలుపు చెల్లదని పేర్కొంటూ డీఎంకే చిహ్నం ఉదయసూర్యుని గుర్తుపై పోటీచేసిన కొంగునాడు మక్కల్ దేశీయ కట్చి అభ్యర్థి కేకేసీ బాలు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. ఈవీఎంల పనితీరు సక్రమంగా లేదని పోలింగ్ సమయంలోనే ఫిర్యాదు చేశామని, అయితే వాటిని సరిచేయకుండా పోలింగ్‌ను కొనసాగించారని పిటిషన్లో పేర్కొన్నారు. ఓట్ల లెక్కింపు సమయంలోనూ 81 ఈవీఎంలలో అవకతవకలు చోటుచేసుకున్నట్లు ఎన్నికల అధికారి దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని ఆరోపించారు. ఈ పిటిషన్లు న్యాయమూర్తి వి. భారతిదాసన్ ముందు సోమవారం విచారణకు వచ్చింది. మంత్రి దురైమురుగన్, మాజీ మంత్రి సి విజయభాస్కర్, జయకుమార్ గెలుపును సవాలు చేస్తూ పిటిషనర్లు వెలిబుచ్చిన ఆరోపణలపై చీఫ్ ఎన్నికల కమిషన్, రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్, ఆయా నియోజకవర్గాల అధికారులు 4 వారాల్లోగా బదులివ్వాలని న్యాయమూర్తి ఆదేశించారు. విచారణను సెప్టెంబరు 6వ తేదీకి వాయిదా వేశారు. -
హ్యాకింగ్‌కు గురైన తమిళనాడు సీఎం ట్విటర్ అకౌంట్..!
సాక్షి, చెనై: తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అధికారిక ట్విటర్ అకౌంట్ హ్యాకింగ్‌కు గురైంది. దీంతో ఆయన ఖాతాను తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ సమస్య మాజీ సీఎం ఈపీఎస్ పళనిస్వామి ట్విటర్ అకౌంట్‌ను స్టాలిన్‌కు బదిలీ చేయడంలో ఈ సమస్య తలెత్తినట్లు ఐటీ నిపుణులు గుర్తించారు. ప్రస్తుతం తన వ్యక్తిగత ట్విటర్ ఖాతా ద్యారా అధికారిక సమాచారాన్ని షేర్ చేస్తున్నారు. అంతకుముందు ఉన్న తమిళనాడు ముఖ్యమంత్రి అధికార ట్విటర్ ఖాతాను ట్విటర్లో మాజీ సీఎం ఇపీఎస్ పళనిస్వామి కార్యాలయంగా మార్చారు. ప్రస్తుతం ఈ సమస్యకు పరిష్కారం చూపుతామని, తిరిగి తమిళనాడు సీఎం అధికార ఖాతాగా మార్చేలా చర్యలు తీసుకుంటున్నామని అన్నాడీఎంకే ఐటీ వింగ్ తెలిపింది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ పేజీలలో కూడా ఇదే లోపం నెలకొంది. తమిళనాడు సీఎం అధికార ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఇంకా పళనిస్వామి ఛాయాచిత్రం, పేరు, ఇతర వివరాలతోనే ఉంది.డీఎంకే ఐటీ విభాగం కార్యాలయ అధికారి మాట్లాడుతూ ..‘రెండు, మూడు రోజుల్లో సమస్య పరిష్కారం అవుతుంది. ట్విట్టర్ వచ్చిన తరువాత తమిళనాడులో ప్రభుత్వం మారడం ఇదే మొదటిసార’ ని అన్నారు. "ముఖ్యమంత్రి అధికార ట్విట్టర్ ఖాతాను బదిలీ చేయడంలో మాజీ సీఎం ఈపీఎస్‌కు తప్పు సలహా ఇచ్చారని బీజేపీ నాయకుడు ఎస్జీ సూర్య ట్విటర్లో ఆరోపించారు. ప్రస్తుత ముఖ్యమంత్రికి ట్విటర్ ఖాతాను అప్పగించడం, గత సీఎం చేసిన ట్వీట్లను ఆర్కైవ్ చేయడం సరైన పద్ధతని తెలిపారు. చదవండి: M K Stalin: తమిళనాడు సీఎం బహిరంగ లేఖ -
ఎగ్జిట్ పోల్స్: బీజేపీకి షాకిచ్చిన దీదీ
న్యూఢిల్లీ: దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల మినీ సంగ్రామానికి నేటితో తెరపడింది. గురువారంతో.. అస్సాం, కేరళ, తమిళనాడు, పుదుచ్చేరి, పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. ఇప్పటికే నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు పూర్తవ్వగా.. పశ్చిమ బెంగాల్లో చివరి విడత ఎన్నికల పోలింగ్ ఈ రోజుతో ముగిసింది. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఆయా సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాల్లో అత్యధికంగా ప్రజలు అధికార పార్టీలకే పట్టం కట్టారు. ఒక్క తమిళనాడులో మాత్రం డీఎంకే అధికారంలోకి రానున్నట్లు ఎగ్జిట్ పోల్ ఫలితాలు వెల్లడించాయి. ఇక బెంగాల్లో బీజేపీ, టీఎంసీల మధ్య రసవత్తర పోరు సాగిన సంగతి తెలిసిందే. గత ఎన్నికల్లో పశ్చిమబెంగాల్లో బీజేపీ తక్కువ స్థానాలకే పరిమితం అయినప్పటికి ఈ సారి మాత్రం టీఎంసీకి గట్టి పోటీనే ఇచ్చినట్లు పలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వెల్లడించాయి. ఇక ఆయా సంస్థలు వెల్లడించిన ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు రాష్ట్రాల వారిగా ఇలా ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ (294 సీట్లు)... సీఓటర్ సర్వే: టీఎంసీదే విజయం సీఓటర్: టీఎంసీ 158, బీజేపీ 115, కాంగ్రెస్ ప్లస్ - 19 బెంగాల్ పీమార్క్ : బీజేపీ 120, టీఎంసీ 158, లెఫ్ట్+ 14 బెంగాల్ ఈటీజీ : బీజేపీ 110, టీఎంసీ 169, లెఫ్ట్+ 12 రిపబ్లిక్-సీఎన్ఎక్స్ : బెంగాల్లో అతిపెద్ద పార్టీగా బీజేపీ రిపబ్లిక్-సీఎన్ఎక్స్: టీఎంసీ 128-138, బీజేపీ138-148, కాంగ్రెస్: 11-21 సీఎన్ఎన్: టీఎంసీ 128-132, బీజేపీ: 138-148, ఇతరులు - 20 అస్సోం(126 అసెంబ్లీ స్థానాలు)... ఇండియా టుడే ఎగ్జిట్ పోల్: అసోంలో బీజేపీదే విజయం. బీజేపీ: 75-85, కాంగ్రెస్: 40-50 రిపబ్లిక్ ఎగ్జిట్‌పోల్: బీజేపీ 74-84, కాంగ్రెస్: 40-50 కేరళ (140 అసెంబ్లీ స్థానాలు)... రిపబ్లిక్ ఎగ్జిట్ పోల్: లెఫ్ట్‌ఫ్రంట్ 70-80, కాంగ్రెస్ 40-50 తమిళనాడు (234 అసెంబ్లీ స్థానాలు).. రిపబ్లిక్ ఎగ్జిట్ పోల్: డీఎంకే 160 -170, అన్నాడీఎంకే 58-68 పుదుచ్చేరి (30 అసెంబ్లీ స్థానాలు) ఇక్కడ బీజేపీకి విజయవకాశాలున్నట్టు తెలుస్తోంది. -
స్టాలినే సీఎం: డీఎంకేకు 180 స్థానాలు ఖాయం!
ఉదయ సూర్యుడికే ప్రజలు పట్టం కట్టారా..? డీఎంకే అభ్యర్థులకే గంపగుత్తగా ఓట్లేశారా..? ఆ పార్టీ అధినేత స్టాలిన్ వైపే మొగ్గుచూపారా..? అత్యధిక స్థానాలతో అధికార పీఠం చేపట్టనున్నారా..? అన్నాడీఎంకే హవాకు ఓటర్లు మంగళం పాడేశారా..? అతి తక్కువ సీట్లకే పరిమితం చేయనున్నారా..? తమిళనాట కమల వికాసం కలేనా..? బోణీ కొట్టే పరిస్థితి కూడా ఉండదా..? అవుననే అంటున్నాయి సర్వేలు. అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకే తిరుగులేని విజయం సాధిస్తుందని ఘంటాపథంగా వెల్లడిస్తున్నాయి. సాక్షి , చెన్నై : సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత డీఎంకేలో ఆనందం వెల్లివిరుస్తోంది, అన్నాడీఎంకేలో నైరాశ్యం అలుముకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత ఎన్నికల్లో ప్రధాన ప్రత్యర్థులుగా అన్నాడీఎంకే– డీఎంకే తలపడ్డాయి. 70 శాతం వరకు పోలింగ్ నమోదైంది. గ్రామీణ ప్రజలు అధికంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటింగ్ సరళి డీఎంకేకు అనుకూలమని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఐ బ్యాక్ సంస్థ ఎన్నికలకు ముందు మొత్తం 234 స్థానాల్లో సర్వేలో నిర్వహించి డీఎంకేకు 180 స్థానాలు ఖాయమని తేల్చింది. ఈ క్రమంలో పోలింగ్ న ఆడు డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ చెన్నైలోని ఐ బ్యాక్ సంస్థ కార్యాలయానికి సైతం వెళ్లడం విశేషం. పోలింగ్ ముగిసిన తర్వాత డీఎంకేకు 180 కంటే ఎక్కువ స్థానాలు వస్తాయని ఐ బ్యాక్ సంస్థ వెల్లడించింది. దీంతో డీఎంకే శ్రేణుల్లో సంతోషం వెల్లివిరుస్తోంది. స్టాలిన్ కూడా డీఎంకే అభ్యర్థులను చెన్నైకి పిలిపించుకుని విజయావకాశాలపై ఆరా తీస్తున్నారు. అందులో భాగంగా గురు, శుక్రవారాల్లో పార్టీ జిల్లా కార్యదర్శులు సైతం స్టాలిన్‌ను కలిశారు. ఈ సందర్భంగా స్టాలిన్ డీఎంకే అగ్రనేతలతో సమావేశమై మంత్రి పదవులు, శాఖల కేటాయింపుపై చర్చించినట్లు సమాచారం. అలాగే పలువురు ఐఏఎస్ అధికారులు స్టాలిన్‌ను కలిసి శుభాకాంక్షలు చెప్పినట్లు తెలుస్తోంది. రెండాకుల్లో గుబులు! అన్నాడీఎంకే విషయానికి వస్తే ఎన్నికలకు ముందు సీఎం ఎడపాడి పళనిస్వామి గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. అయితే పోలింగ్ ముగిసిన తర్వాత డీలా పడిపోయినట్లు ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. పలువురు మంత్రులు సైతం ఓటమిపాలవుతున్నట్లు ఆయనకు సమాచారం అందింది. పోలింగ్ పూర్తయిన తర్వాత పళనిస్వామి సేలం జిల్లా సూరమంగళంలోని తన సొంతింటిలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈక్రమంలో మంత్రులు ఎంసీ సంపత్, ఆర్బీ ఉదయకుమార్, విజయభాస్కర్, కేసీ వీరమణి, జయకుమార్ సహా పలువురు అభ్యర్థులు సేలం వెళ్లి ఎడపాడిని మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రులే ఓడిపోయే పరిస్థితి ఉందని వారు చెప్పడంతో పళనిస్వామి మరింత నిరాశకు గురైనట్లు తెలుస్తోంది. అన్నాడీఎంకే 20–30 సీట్లకు పరిమితమవుతుందని, బీజేపీ ఒక్క సీటు కూడా గెలుచుకోలేదని ఐ బ్యాక్ సంస్థ వెల్లడించినట్లు సమాచారం. చదవండి: సీనియర్ నటుడికి అత్యవసర చికిత్స -
స్టాలిన్ మొత్తం ఆస్తుల విలువ ఇంతేనా
చెన్నై:తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు దాఖలు చేసిన నామినేషన్ పత్రాలలో నాయకులు తమ ఆస్తుల వివరాలను ప్రకటిస్తున్నారు. అందులో భాగంగా డీఎంకే అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ తన వద్ద రూ.4.94 కోట్ల స్థిరాస్తులు, 2.24 కోట్లు చరాస్తులు ఉన్నట్లు సోమవారం ప్రకటించారు. తన పేరిట ఎలాంటి వాహనం లేదని, నగదు రూపంలో రూ. 50,000 ఉన్నట్లు తెలిపారు. మరో వైపు తన భార్య పేరిట 30,52,854 విలువైన చరాస్తుల ఉన్నాయని , 24.77 లక్షల విలువైన పాత బంగారు ఆభరణాలు ఉన్నట్లు వెల్లడించారు. బ్యాంకులు లేదా ప్రభుత్వ సంస్థలకు చెల్లించాల్సిన బకాయిలు ఏవీ లేవని, ఇతర అప్పులు కూడా లేవని ఆయన తెలిపారు. ఎమ్మెల్యే జీతం, బ్యాంకు డిపాజిట్లు, అద్దెల ద్వారా తన ఆదాయం సమకూరుతున్నట్లు అఫిడవిట్లో పేర్కొన్నారు. 2016 లో ప్రకటించిన అఫిడవిట్ లో, స్టాలిన్ 80.33 లక్షల విలువైన చరాస్తులు, 3.33 కోట్ల రూపాయల విలువ గల స్థిరాస్తులను చూపించారు. ఒక దశాబ్ద కాలంగా అధికారంలో ఉన్న అన్నాడిఎంకేను గద్దె దించడమే లక్ష్యంత ఏర్పడిన ప్రతిపక్ష కూటమికి స్టాలిన్ నాయకత్వం వహిస్తున్నారు. ఈ సారి తనయుడి రాజకీయ ఆరంగ్రేటం ఈ ఏడాది జరగనున్న ఎన్నికల్లో ఎంకె స్టాలిన్ కుమారుడు ఉదయనిధి మొదటి సారిగా పోటీ చేయనున్నారు. ఈ సందర్భంగా ఆయన తన వద్ద 21.13 కోట్ల చరాస్తులు ,రూ.6.54 కోట్ల విలువవైన స్థిరాస్తులు ఉన్నట్లు ప్రకటించారు. నగరంలోని చెపాక్-ట్రిప్లికేన్ సెగ్మెంట్ కు నామినేషన్ సమయంలో సమర్పించిన అఫిడవిట్ లో డిఎంకె యూత్ వింగ్ చీఫ్ ఈ విధంగా పేర్కొన్నారు. -
మెట్టుదిగని డీఎండీకే.. అన్నాడీఎంకేకు తలనొప్పి!
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకేలో సీట్ల పందేరం కొలిక్కి రావడం లేదు. ప్రధానంగా డీఎండీకే రూపంలో సమస్య తప్పడం లేదు. తమిళ మానిల కాంగ్రెస్‌కు సోమవారం సీట్ల కేటాయింపు సాగనుంది. చిన్న చిన్న పార్టీలు ఆదివారం అన్నాడీఎంకే సమన్వయ కమిటీ కన్వీనర్ పన్నీరుసెల్వం, కో కన్వీనర్ పళనిస్వామిని కలిసి మద్దతు తెలపడమే కాకుండా, తమకు తలా ఓ సీటు కేటాయించాలన్న విజ్ఞప్తిని ఉంచాయి. అన్నాడీఎంకే కూటమిలో పీఎంకేకు 23 సీట్లు కేటాయించారు. బీజేపీకి 20 సీట్లను కేటాయించినట్టు సమాచారాలు వెలువడ్డా, అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది. ఈ కూటమిలోని జీకే వాసన్ నేతృత్వంలోని తమిళ మానిల కాంగ్రెస్, విజయకాంత్ నేతృత్వంలోని డీఎండీకేకు సీట్ల కేటాయింపుల్లో సమస్యలు తప్పడం లేదు. పదిహేను మేరకు సీట్లను వాసన్ ఆశిస్తుండగా, పీఎంకేతో సమానంగా సీట్లకు డీఎండీకే పట్టుబడుతున్నట్టు సమాచారం. ఈ రెండు పార్టీలతో ఆదివారం కూడా చర్చలు సాగాయి. డీఎండీకేకు గతంలో ఉన్నంత బలం ప్రస్తుతం లేదని, పది నుంచి పదిహేనులోపు సీట్లతో సరి పెట్టేందుకు అన్నాడీఎంకే నిర్ణయించినట్టు తెలిసింది. అయితే, ఆ సీట్లను స్వీకరించేందుకు డీఎండీకే ముందుకు రావడం లేదు. మెట్టుదిగే ప్రసక్తే లేదని, తాము ఆశిస్తున్న సీట్లతో పాటు ఓ రాజ్యసభ ఇవ్వాల్సిందేనని డీఎండీకే పట్టుబడుతుండడంతో అన్నాడీఎంకేకు శిరోభారం తప్పడం లేదు. ఈ పరిణామాల నేపథ్యంలో ఆదివారం విజయకాంత్ నేతృత్వంలో ఆ పార్టీ ఆశావహుల ఇంటర్వ్యూలు సాగడం గమనార్హం. 13 జిల్లాల నుంచి ఆశావహుల్ని విజయకాంత్ ఇంటర్వ్యూ చేశారు. అన్నాడీఎంకే పట్టువీడని పక్షంలో ఒంటరి సమరానికి సిద్ధమన్నట్టుగా డీఎండీకే అడుగులు ఉన్నట్టు ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. జీకే వాసన్ ఓ మెట్టుదిగినట్టు, సోమవారం సీట్ల కేటాయింపునకు సంతకాలు జరిగే అవకాశం ఉందని అన్నాడీఎంకే వర్గాలు పేర్కొంటున్నాయి. మేనిఫెస్టో కసరత్తులు.. రాయపేటలోని కార్యాలయంలో పన్నీరు, పళని మేనిఫెస్టోకు తుది మెరుగుల కసరత్తుల్లో నిమగ్నమయ్యారు. పొన్నయ్యన్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా మేనిఫెస్టోపై చర్చించి మార్పులు చేర్పులపై దృష్టి పెట్టారు. అభ్యర్థుల జాబితా తుది కసరత్తులు పూర్తి చేసినట్టు సమాచారం. చదవండి: తమిళనాట ఎన్డీయేదే గెలుపు -
శశికళ కొత్త ఎత్తుగడ.. ఫలించేనా?!
సాక్షి ప్రతినిధి, చెన్నై: జైలు నుంచి విడుదలైన ఎంకే శశికళ ఎన్నికల్లో పోటీకి ఎదురవుతున్న అడ్డంకులను అధిగమించే పనిలోపడ్డారు. సిక్కిం రాజకీయాలను ఉదాహరణగా చూపుతూ ఆరేళ్ల నిషేధం తొలగింపుపై చట్టపరంగా పోరాడనున్నారు. శశికళ అనుచరులు న్యాయకోవిదులతో చర్చలు ప్రారంభించారు. ఆదాయానికి మించి ఆస్తుల కేసులో నాలుగేళ్ల శిక్ష పూర్తి చేసుకున్న శశికళ గత నెల 27వ తేదీన జైలు నుంచి విడుదలైనా తమిళనాడు అసెంబ్లీకి జరుగనున్న ఎన్నికల్లో పోటీచేసేందుకు వీలులేదు. ఆర్థికనేరంపై జైలు శిక్ష అనుభవించిన శశికళ 1988 అవినీతి నిరోధక చట్టం ప్రకారం ఆరేళ్లపాటూ అంటే 2027 జనవరి వరకు ఎన్నికల్లో పోటీచేసేందుకు వీలులేని పరిస్థితి నెలకొంది. పార్టీ సారధ్య బాధ్యతలకు చట్టపరంగా ఎలాంటి అడ్డంకి లేదు. అయితే ఈ ఆరేళ్ల కాలం నిషేధంపై న్యాయస్థానంలో సవాలు చేయాలని ఆమె అనుచరులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ విషయంలో సిక్కిం రాష్ట్ర రాజకీయాలను ఉదాహరణగా చూపిస్తున్నారు. సిక్కిం రాష్ట్ర పశుసంవర్దకశాఖ మంత్రి ప్రేమ్‌సింగ్ దమాంగ్ అవినీతి కేసులో జైలుశిక్ష అనుభవించి 2018లో విడుదలయ్యారు. ఆరేళ్లు పోటీచేసేందుకు వీలులేదని చట్ట నిపుణులు ఆయనకు చెప్పినా 2019లో వచ్చిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి గెలిచి ముఖ్యమంత్రి అయ్యారు. ఆరేళ్ల నిషేధాన్ని ఎత్తివేయాలని ఆయన చేసుకున్న విన్నపాన్ని ఎన్నికల కమిషన్ అమోదించింది. ప్రజా ప్రతినిధుల చట్టం 1951 సెక్షన్ 11 ప్రకారం సడలింపుకు అవకాశం ఉందని అంటున్నారు. సిక్కిం సీఎంలా శశికళ కూడా సడలింపు పొందే ప్రయత్నాల్లో భాగంగా ఎన్నికల కమిషన్‌ను కలుసుకోవాలని భావిస్తున్నారు. శశికళ న్యాయవాదులు చట్ట నిపుణులతో చర్చిస్తున్నారు. శశికళ చెన్నైకి చేరుకోగానే ఆమెతో నేరుగా మాట్లాడి ఒక నిర్ణయానికి వస్తారని సమాచారం. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీకి శశికళకు మార్గం సుగమం అవుతుందని, ఆమె క్రియాశీలక పాత్ర పోషిస్తారని అనుచరులు ఢంకా భజాయించి చెబుతున్నారు. చదవండి: ఏఐఏడీఎంకేతో పొత్తు కొనసాగుతుంది ఒంటరి పోరుకైనా సిద్ధమే! : ప్రేమలత -
జైలు నుంచి విడుదలైన శశికళ
బెంగళూరు: తమిళనాడు మాజీ సీఎం జయలలిత ఆప్తురాలు వీకే శశికళ బుధవారం ఉదయం జైలు నుంచి విడుదలయ్యారు. అవినీతి కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష అనుభవించిన శశికళ ఈనెల 20న కరోనా బారిన పడ్డారు. దీంతో బెంగళూరులోని విక్టోరియా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. శశికళ జైలు నుంచి విడుదల కానున్న నేపథ్యంలో దానికి సంబంధించిన తంతు అంతా ఆస్పత్రిలోనే పూర్తి చేశామని జైలు అధికారులు ప్రకటించారు. ఇవాళ జైలు నుంచి విడుదల అయినప్పటికీ.. ఆస్పత్రి నుంచి ఎప్పుడు డిశ్చార్జి అవుతారన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతానికి ఆమెకు కరోనా లక్షణాలేవీ లేవని వైద్యులు తెలిపారు. ఇప్పుడు ఆమె ఆరోగ్యం మెరుగ్గానే ఉందని, అయితే కోవిడ్ నిబంధనల ప్రకారం ఆమె మరో 10 రోజుల పాటు ఆస్పత్రిలో కొనసాగే అవకాశం ఉందని వైద్యులు వెల్లడించారు. శశికళ జైలు నుంచి విడుదల అయిన సందర్భంగా భారీ ఎత్తున స్వాగతం పలికేందుకు ఆమె అనుచరులు ఏర్పాట్లు చేస్తున్నారు. పరప్పణ అగ్రహారం జైలు నుంచి చెన్నై వరకు కనీసం వెయ్యి వాహనాలతో స్వాగతం పలికేందుకు అమ్మ మక్కల్ మున్నేట్రకళగం అధినేత, ఎమ్మెల్యే దినకరన్ టీమ్ ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. (శశికళను మళ్లీ పార్టీలో చేర్చుకునే ప్రసక్తేలేదు) -
శశికళకు అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక
సాక్షి, బెంగళూరు: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న శశికళ బుధవారం అస్వస్థతకు లోనయ్యారు. దీంతో వెంటనే ఆమెను బెంగళూరు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత ఆప్తురాలు వీకే శశికళ ఈ నెల 27న జైలు నుంచి విడుదల కానున్నారు. అక్రమాస్తుల కేసులో అరెస్టయిన శశికళ శిక్షాకాలం పూర్తి చేసుకుని బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలు నుంచి విడుదల కానున్నారు. ఆమె బంధువు, సహచర నిందితురాలు ఇళవరసి ఇంకొంత కాలం జైలుశిక్ష అనుభవించాల్సి ఉంది. (చదవండి: ముందస్తు విడుదల విఫలమవడంతో శశికళలో ఆధ్యాత్మికత) శశికళ, ఇళవరసి, మరో బంధువు వీఎన్ సుధాకర్‌లు 2017, ఫిబ్రవరి నుంచి పరప్పన జైలు జీవితం గడుపుతున్నారు. ఈ కేసులో ఇళవరసి కంటే కొంత ముందే శశికళ అరెస్టయి జైల్లో గడపడంతో ముందే విడుదల కానున్నారు. ఇతరత్రా కస్టడీ రోజులను సైతం పరిగణనలోకి తీసుకుంటే ఈ నెల 27తో శశికళ శిక్షా కాలం ముగుస్తుందని జైలు వర్గాలు తెలిపాయి. శశికళ, ఇళవరసి జరిమానాల కింద చెరో రూ. 10 కోట్లను చెల్లించారు. సుధాకర్ ఇంకా కట్టలేదని తెలిసింది. (చదవండి: శశికళను మళ్లీ పార్టీలో చేర్చుకునే ప్రసక్తేలేదు) -
విద్యార్థులకు బంపరాఫర్.. 2జీబీ డేటా ఫ్రీ
సాక్షి, చెన్నై : విద్యార్థులకు ప్రతిరోజూ 2 జీబీ డేటాను తమిళనాడు ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి ఉచితంగా అందజేయనున్నారు. ఆన్లైన్ తరగతుల్లో పాల్గొనేందుకు వీలుగా ఈ ప్రకటన చేయడంతో విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు గత మార్చి 21వ తేదీ నుంచి లాక్డౌన్ ప్రకటించారు. దీంతో పాఠశాలలు, కళాశాలలు మూతబడ్డాయి. కరోనా నానాటికీ అధికమవుతున్నందున విద్యాసంస్థలను ప్రారంభించడంలో ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో వార్షిక పరీక్షలు రద్దు చేసి ఆల్ పాస్ అని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ ప్రకటనను యూజీసీ, ఏఐసీటీఈ తీవ్రంగా ఖండించాయి. దీనికి సంబంధించిన కేసు న్యాయస్థానంలో పెండింగ్‌లో ఉంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 16 వర్సిటీల కళాశాల విద్యార్థులకు పరీక్షలు నిర్వహించేందుకు టైంటేబుల్ విడుదలైంది. దీంతో చెన్నై వర్సిటీ పదిరోజులుగా విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో లాక్డౌన్ ఉత్తర్వులు జారీ చేసి పదినెలలకు పైగా కావస్తున్న స్థితిలో ప్రస్తుత విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో విద్యార్థుల చదువు కుంటుపడే పరిస్థితి ఏర్పడింది. దీంతో విద్యాసంస్థలను ప్రారంభించాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో పీజీ కళాశాల విద్యార్థులకు డిసెంబర్ రెండవ తేదీ నుంచి తరగతులు ప్రారంభమయ్యాయి. యూజీ విద్యార్థులకు తరగతులను ప్రారంభించేందుకు నిర్ణయించారు. ఇలావుండగా కొత్త కరోనా వైరస్ వ్యాప్తితో కళాశాలలు ప్రారంభించేందుకు చిక్కులు ఏర్పడ్డాయి. దీంతో విద్యార్థులకు ఆన్లైన్, టీవీల ద్వారా విద్యాబోధన చేపట్టేందుకు నిర్ణయించారు. కొందరు విద్యార్థులు సాంకేతిక సౌకర్యాలు లేక కష్టపడుతున్నందున ప్రత్యేక మార్గాలను అన్వేషించాల్సి వచ్చింది. దీంతో ఆన్లైన్ తరగతులలో పాల్గొనేందుకు వీలుగా 9.69 లక్షల మంది కళాశాల విద్యార్థులకు ప్రతిరోజు 2 జీబీ డేటా ఉచితంగా అందజేసేందుకు ముఖ్యమంత్రి ఎడపాడి ఉత్తర్వులిచ్చారు. విద్యావేత్తల అసంతృప్తి : అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని ఈ తరహా ప్రకటన చేయడం సరికాదని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం పలు మొబైల్ సంస్థలు 1.5 జీబీ డేటా ఉచితంగా అందిస్తున్నాయని, వీటిని ఉపయోగించలేని స్థితిలో పలు నెట్‌వర్క్‌లు లభించడం లేదని ఫిర్యాదులందుతున్నట్లు తెలిపారు. -
సీఎం పీఠంపై వివాదం: చిన్నమ్మతో సవాల్
సాక్షి, చెన్నై : అసెంబ్లీ ఎన్నికలు ఒక వైపు, అన్నాడీఎంకే బహిష్కృత నేత శశికళ విడుదల మరో వైపు సవాళ్లు విసురుతున్న వేళ సర్వసభ్య సమావేశంతో అన్నాడీఎంకే అగ్రజులంతా శనివారం ఒకే వేదికపై రానున్నారు. ఎన్నికల్లో తలపడనున్న కూటమి పార్టీల వైఖరిపై కసరత్తు చేయనున్నారు. అధికారపార్టీ హోదాలో ఈసారికి ఇదే తుది సమావేశం కావడం గమనార్హం. తమిళనాడులోని అన్ని రాజకీయపార్టీలు ఏడాదికి ఒకసారి సర్వసభ్య సమావేశం, రెండుసార్లు కార్యనిర్వాహకుల సమావేశాన్ని నిర్వహించాలి. ఈ సమావేశంలో తీసుకున్న కీలక నిర్ణయాలను ఎన్నికల కమిషన్‌కు తెలియజేయాలి. ఈ ప్రకారం అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశం గత ఏడాది డిసెంబర్లో జరగాల్సి ఉంది. అయితే కరోనా కారణంగా చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో కార్యనిర్వాహక సమావేశాన్ని మాత్రమే నిర్వహించారు. ఈ సమయంలో 11 మంది సభ్యులతో మార్గదర్శకాల కమిటీని ఏర్పాటు చేసుకుని పార్టీ పరమైన నిర్ణయాలపై వారికి కొన్ని అధికారాలు ఇచ్చారు. అయితే ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను సర్వసభ్యం ఆమోదించాల్సి ఉంది. కరోనా కేసులు తగ్గుముఖం పట్టి లాక్డౌన్లో అనేక సడలింపులు చోటుచేసుకోవడంతో సర్వసభ్య సమా వేశానికి అన్నాడీఎంకే సిద్ధమైంది. చెన్నై శివారు వానగరం శ్రీనివాస కల్యాణమండపంలో శనివారం ఉదయం 8.30 గంటలకు ప్రారంభమయ్యే సమావేశానికి పార్టీ కన్వీనర్, ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం, కో–కన్వీనర్, ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి, 302 మంది కార్యనిర్వాహకసభ్యులు సహా 3,500 మంది హాజరుకానున్నారు. శశికళ వస్తే ఎలా? అన్నాడీఎంకే బహిష్కృతనేత దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చిలి శశికళ ఈనెల 27వ తేదీన జైలు నుంచి విడుదల కానున్నారు. అన్నాడీఎంకే శ్రేణులకు అసెంబ్లీ ఎన్నికలతోపాటు శశికళను ఎదుర్కోవడం కూడా సవాలుగా మారే పరిస్థితులున్నాయి. జయలలిత మరణం సమయంలో ముఖ్యమంత్రిగా ఉండిన పన్నీర్‌సెల్వం చేత శశికళ బలవంతంగా రాజీనామా చేయించారు. అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా ఎన్నికై గవర్నర్ ఆమోదానికి పంపిన దశలో ఆమె జైలుపాలయ్యారు. ముఖ్యమంత్రి అయ్యే అవకాశం శశికళకు తృటిలో తప్పిపోగా ప్రత్యామ్నాయంగా ఎడపాడిని ఆ కుర్చీలో కూర్చోబెట్టారు. అనేక రాజకీయ పరిణామాల నేపథ్యంలో శశికళను ఎడపాడే స్వయంగా పార్టీ నుంచి బహిష్కరించాల్సి వచ్చింది. నాలుగేళ్ల జైలుశిక్ష ముగించుకుని ఈనెల 27న శశికళ జైలు నుంచి విడుదలవుతున్నారు. జయ హయాంలోనే పార్టీలో చక్రం తిప్పిన శశికళకు పాద నమస్కారాలు చేసే స్థాయిలో అన్నాడీఎంకేలో అనుంగు శిష్యులున్నారు. రేపు జైలు నుంచి విడుదలైతే పార్టీలో ఎలాంటి ప్రకంపనలు ఎదురవుతాయోనని అగ్రనేతలు చెవులు కొరుక్కుంటున్నారు. శశికళ విడుదల, అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న దశలో పార్టీ సర్వసభ్య సమావేశం ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది. అన్నాడీఎంకే కూటమిలోని మిత్రపక్షపార్టీల గురించి చర్చిస్తారని సమాచారం. ముఖ్యంగా కూటమి నుంచి ఎడపాడి పళనిస్వామి ముఖ్యమంత్రి అభ్యర్థిత్వంపై బీజేపీ అభ్యంతరం లేవనెత్తడం, 60 సీట్లకు పట్టుబడడంపై ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. ఈనెల 27న శశికళ జైలు నుంచి విడుదలయ్యే అవకాశాలు మెండుగా ఉండడంతో పార్టీలో ఆ ప్రభావంపై కూడా ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది.