సాక్షి, చెన్నై : అనర్హత వేటు పడిన దినకరన్ వర్గానికి 18 మంది ఎమ్మెల్యేలను తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే సమన్వయకర్త ఎడపాడి పళనిస్వామి పార్టీలోకి ఆహ్వానించారు. అనర్హత వేటు పడినవారంతా మళ్లీ చేరాలని వస్తే పార్టీలోకి స్వాగతిస్తామని పేర్కొన్నారు. కానీ ఇంతవరకు అలాంటి ప్రతిపాదన తన వద్దకు రాలేదన్నారు.
మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘దినకరన్ గూటికి చేరిన 18 మంది ఎమ్మెల్యేలు తిరిగి సొంత గూటికి వస్తారని మీడియా ద్వారానే తెలుసుకున్నాను. ఒకవేళ వారు తిరిగి వస్తానంటే సాదరంగా ఆహ్వానిస్తామ’ని పేర్కొన్నారు. ఆ 18 మందిలో ఒకరికి మంత్రి పదవి ఇస్తామని ఆఫర్ చేశారటగా అని విలేకరులు ప్రశ్నించగా ‘అది నేను ఎలా ఇవ్వగలను’ అని సమాధానమిచ్చారు. అనర్హత పడిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉపఎన్నికలు జరిగే అవకాశం ఉందా అని అడగ్గా.. ఆ విషయం కోర్టు పరిధిలో ఉందని, దాని గురించి మాట్లాడబోమని అన్నారు.
కాగా, దినకరన్ వర్గానికి చెందిన 18 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు కేసులో అనిశ్చితి నెలకొంది. ఇద్దరు న్యాయమూర్తుల బెంచ్ భిన్నాభిప్రాయాలతో తీర్పు వెలువరించకపోవడంతో విచారణను విస్తృత ధర్మాసనానికి బదలాయించారు. 18 మంది ఎమ్మెల్యేలపై స్పీకర్ వేసిన అనర్హత వేటు చెల్లుతుందని జస్టిస్ ఇంద్రాణి బెనర్జీ తీర్పునివ్వగా, స్పీకర్ నిర్ణయం చెల్లబోదని జస్టిస్ సెల్వం విచారణ సందర్భంగా భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment