నన్ను తొలగించడానికి మీరెవరు?: పన్నీర్‌ | O.Panneerselvam slams Sasikala over sank from party post | Sakshi
Sakshi News home page

నన్ను తొలగించడానికి మీరెవరు?: పన్నీర్‌

Published Wed, Feb 8 2017 2:54 AM | Last Updated on Tue, Sep 5 2017 3:09 AM

నన్ను తొలగించడానికి మీరెవరు?: పన్నీర్‌

నన్ను తొలగించడానికి మీరెవరు?: పన్నీర్‌

- పార్టీలోనే ఉంటా.. కొన్ని గంటల్లోనే నేనేంటో చూపిస్తా
- తిరుగుబాటును విజయవంతం చేసేదిశగా సెల్వం అడుగులు
- ఎమ్మెల్యేల మద్దతుతో నేడు ఢిల్లీకి పయనం


చెన్నై:
తనను అన్నాడీఎంకే కోశాధికారి పదవి నుంచి తప్పించడంపై పన్నీర్‌ సెల్వం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. "ఈ పదవి నాకు అమ్మ(జయ) ప్రసాదించింది. నన్ను తీసేసే హక్కు ఎవ్వరీ లేదు. ఎట్టిపరిస్థితుల్లోనూ పార్టీని వీడను. మరి కొద్దిగంటల్లోనే నేనేంటో చూపిస్తా. వేచి చూడండి..' అని గర్హించారు. జయ సమాధి వద్ద మీడియా సమావేశం అనంతరం నేరుగా తన నివాసానికి వెళ్లిపోయిన పన్నీర్‌ సెల్వంను కలుసుకునేందుకు భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. అన్నాడీఎంకేకు చెందిన కీలకనేతలు సైతం పన్నీర్‌ ఇంటికి క్యూకట్టారు. వారిలో అసెంబ్లీ స్పీకర్‌ ధన్‌పాల్‌, సీనియర్‌ ఎంపీ మైత్రేయన్‌ లాంటి ముఖ్యులు కూడా ఉన్నారు.

ఇదే క్రమంలో శశికళకు వ్యతిరేకంగా ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టేందుకు పన్నీర్‌ సెల్వం ప్రయత్నాలు ప్రారంభించారు. తిరిగి ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు అవసరమైన ఎత్తుగడలను రచిస్తున్నారు. తనను 'ద్రోహి' అని నిందించిన శశికళ వర్గీయులపై మండిపడ్డ సెల్వం.. 'ప్రతిపక్ష నేత(స్టాలిన్‌) ఎదురుపడినప్పుడు నవ్వడం కూడా నేరమేనా? నాకు తెలిసి అలా నవ్వడం నేరమేమీకాదు'అని సెల్వం వ్యాఖ్యానించారు. చెన్నై 'సాక్షి' ప్రతినిధి సంజయ్‌ తెలిపిన వివరాల ప్రకారం ప్రస్తుతం పన్నీర్‌ క్యాంపులో 62 మంది ఎమ్మెల్యేలు చేరిపోయినట్లు తెలిసింది. ఇదే ఊపులో ఢిల్లీ వెళ్లేందుకు కూడా పన్నీర్‌ సెల్వం సమాయత్తం అయ్యారు. బుధవారం ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతి, కేంద్ర హోంమంత్రులను కలుసుకుని, మంత్రివర్గ ఏర్పాటుకై వినపత్రం ఇవ్వనున్నట్లు స్పష్టంగా తెలిసింది.

మ్యాజిక్‌ ఫిగర్‌ సాధిస్తారా?
నాలుగు రోజుల కిందటే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన పన్నీర్‌ సెల్వం తిరిగి పీఠం ఎక్కేందుకు ప్రయత్నాలు ప్రారంభించిన దరిమిలా సభలో బలనిరూపణ కీలక అంశంగా మారింది. 235 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో అన్నాడీఎంకేకు 135 మంది సభ్యుల బలం ఉంది. ప్రతిపక్ష డీఎంకే నుంచి 89మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్‌పార్టీకి 8, ఇండియన్‌ యూనియన్‌ ముస్లింలీగ్‌ పార్టీకి చెందిన ఒక్క ఎమ్మెల్యే ఉన్నారు. పన్నీర్‌ ముఖ్యమంత్రి కావాలంటే ఆయనకు కనీసం 117మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ప్రస్తుతం ఆయనకు 62 మంది ఎమ్మెల్యేలు బేషరతుగా మద్దతు పలుకుతున్నారు. అంటే, మ్యాజిక్‌ ఫిగర్‌కు ఇంకా 55 ఎమ్మెల్యేల మద్దతు అవసరం. అయితే, అన్నాడీఎంకే ఎమ్మెల్యేల్లో అత్యధికులు శశికళ అనుచరులే కావడం వల్ల వారు పన్నీర్‌ను సపోర్ట్‌చేసే అవకాశాలు తక్కువ. ఈ పరిస్థితుల్లో ఆయనకున్న ఓకేఒక్క పెద్ద అండ.. ప్రతిపక్ష డీఏంకే!

డీఎంకే మద్దతు ఇస్తుందా?
నాలుగు రోజుల కిందట పన్నీర్‌ సెల్వం సీఎం పదవికి రాజీనామా చేసినప్పుడు అందరికంటే ముందుగా స్పందించింది ప్రతిపక్షనేత, డీఎంకే వర్కింగ్‌ ప్రెసిడెంట్ స్టాలినే! శశికళను సీఎం కాకుండా అడ్డుకోవడానికి ఎంతదూరమైనా వెళతామని ప్రకటించిన స్టాలిన్‌.. తమిళనాడులో రాష్ట్రపతి పాలన పెట్టాలనే డిమాండ్‌తో మంగళవారం ఢిల్లీకి వెళ్లారు. 'ఉంటే, గింటే పన్నీర్‌ సెల్వమే సీఎంగా ఉండాలికానీ, శశికళను ప్రజలు స్వీకరించరు'అని స్టాలిన్‌ వ్యాఖ్యానించారు. తద్వారా అడగకనే పన్నీర్‌కు తన మద్దతు ప్రకటించారు.

పన్నీర్‌ సెల్వంను ముఖ్యమంత్రిని చేసేందుకు డీఎంకే మద్దతు పలికితే గనుక అది ఆ పార్టీకి ఆత్మహత్యాసదుశ్యమే! అయినాసరే, స్టాలిన్‌ ధైర్యం చేస్తారా? అంటే స్పష్టమైన సమాధానం చెప్పలేం. అన్నాడీఎంకే చీలిక వర్గానికి తాత్కాలిక మద్దతు పలకడంద్వారా వచ్చే ఎన్నికల నాటికి డీఎంకేను మరింత బలోపేతం చేయొచ్చని భావిస్తేగనుక పన్నీర్‌కు స్టాలిన్‌ మద్దతు పలకొచ్చు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement