పన్నీర్ ఇంటికి రాఘవ లారెన్స్
చెన్నై: మరికొద్ది గంటల్లో రాజకీయ సంక్షోభానికి తెరపడనున్నవేళ.. తమిళనాడులో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మొన్నటి జల్లికట్టు ఉద్యమంలో కీలకంగా వ్యవహరించి, రాజకీయ పార్టీని స్థాపించబోతున్నట్లు ప్రకటించిన సినీ నటుడు, డాన్స్ మాస్టర్ రాఘవ లారెన్స్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. చెన్నైలోని గ్రీన్‌వేస్ రోడ్డులోగల ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్ సెల్వం ఇంటికి సోమవారం రాత్రి లారెన్స్ వచ్చారు.
పన్నీర్ సెల్వం, ఇతర నేతలు ఆత్మీయ ఆలింగనాలతో రాఘవ లారెన్స్‌కు స్వాగతం పలికిన అనంతరం ఉమ్మడిగా మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనించానని, అన్నీ ఆలోచించిన మీదట పన్నీర్ సెల్వానికి మద్దతు పలకాలనే నిర్ణయానికి వచ్చినట్లు రాఘవ లారెన్స్ చెప్పారు. అమ్మ ఆశయాలను ముందుకు తీసుకెళ్లగల సత్తా ఓపీఎస్‌కు మాత్రమే ఉందని వ్యాఖ్యానించారు. లారెన్స్ కంటే ముందే సీనియర్ నటులు కొందరు పన్నీర్‌కు మద్దతు తెలిపిన విషయం తెలసిందే.
శశికళ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మంగళవారం ఉదయం సుప్రీంకోర్టు తీర్పు వెలువరించనున్న దరిమిలా ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు చిన్నమ్మ గోల్డెన్‌బే రిసార్ట్స్‌లోనే మకాంవేసిన సంగతి తెలిసిందే. సోమవారం సాయంత్రమే రిసార్ట్స్‌కు చేరుకున్న ఆమె ఎమ్మెల్యేలు, నేతలతో ఎడతెగని చర్చలు జరుపుతున్నారు.