O.Panneerselvam
-
స్పీకర్ కు లిమిటెడ్ ఆప్షన్స్ ఉంటాయా..?
చెన్నై: విశ్వాసపరీక్ష నేపథ్యంలో తమిళనాడు అసెంబ్లీలో నేటి ఉదయం నుంచి గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. మాజీ సీఎం పన్నీర్ సెల్వం, డీఎంకే అధినేత స్టాలిన్ మద్ధతుదారులు సభ సజావుగా సాగకుండా యత్నిస్తుండటంతో సభను స్పీకర్ ధన్ పాల్ పలుమార్లు వాయిదా వేయాల్సి వచ్చింది. తమిళనాడు తాజా రాజకీయ పరిస్థితులపై ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ స్పీకర్ సురేష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. సాధారణంగా అసెంబ్లీ స్పీకర్ కు కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. వాస్తవంగా అసెంబ్లీలో నేడు పళనిస్వామి ప్రభుత్వానికి అజెండా అంటూ ఏదీ లేదన్నారు. తమ ప్రభుత్వానికి మద్ధతు ఉందని పళనిస్వామి సభలో నిరూపించుకుంటే.. దానిపై సభాపతి గవర్నర్ విద్యాసాగర్ రావుకు నివేదిక అందించాల్సి ఉంటుందని సురేష్ రెడ్డి తెలిపారు. తమిళనాడు అసెంబ్లీలో జరుగుతున్న పరిణామాలు ఎంతో బాధాకరమన్నారు. విశ్వాసపరీక్ష రహస్య ఓటింగ్ ప్రకారమే జరిపించాలన్న కచ్చితమైన నిబంధనలేమీ లేవన్నారు. సభలోకి పోలీసులు ఎలా వస్తారంటూ డీఎంకే ఎమ్మెల్యేలు, అన్నాడీఎంకే తిరుగుబాటు ఎమ్మెల్యేలు ప్రశ్నిస్తున్నారు.. కానీ మార్షల్స్ వచ్చినా, నేతలు వచ్చినా, ఇతర ఏ సిబ్బంది వచ్చినా సభాపతి ఆదేశాల మేరకు ఇలా జరుగుతుందన్నారు. సభ సజావుగా సాగకుండా, ఇబ్బందులకు గురిచేస్తూ.. తీవ్ర ఆటంకం కలిగించిన నేపథ్యంలో సభాపతి మార్షల్స్ కు కొన్ని ఆదేశాలు జారీచేస్తారు. సభాపతి ఆదేశాల మేరకు ఆయా ఎమ్మెల్యేలను సభ నుంచి బయటకు లాక్కెళ్తారని చెప్పారు. సీఎంగా ప్రమాణస్వీకారం చేసిన వ్యక్తి రాజ్యాంగ పరంగా విశ్వాస పరీక్ష లేదా బలనిరూపణలో నెగ్గాల్సి ఉంటుందని, అప్పటినుంచీ పూర్తిస్థాయి ప్రభుత్వం కార్యరూపం దాల్చినట్లని వివరించారు. మరోవైపు డీఎంకే ఎమ్మెల్యేలు సభలో అలాగే కూర్చొని తమ నిరసన వ్యక్తం చేస్తున్నారు. -
నేడే బల పరీక్ష.. పది ఓట్లే కీలకం
-
పన్నీర్.. సీఎం బంగ్లా ఖాళీచెయ్యండి
-
అమ్మకు ఓటేయండి
ఎమ్మెల్యేలకు మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం పిలుపు సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు ప్రజలు అమ్మను చూసి అన్నాడీఎంకేను గెలిపించారు... విశ్వాస తీర్మానంపై ఓటేసే ముందు ఒక్కసారి అమ్మను తలచుకోవాలని మాజీ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం ఎమ్మెల్యేలకు పిలుపునిచ్చారు. కుటుంబ పాలనకు జయలలిత పూర్తిగా వ్యతిరేకమని గుర్తుచేసుకోండి, రాష్ట్రాన్ని కుటుంబ పాలన నుంచి రక్షించండని విజ్ఞప్తి చేశారు. విశ్వాసతీర్మానానికి అనుకూలంగా ఓటువేస్తే అది ప్రజలకు, అమ్మ ప్రభుత్వానికి చేసిన ద్రోహమవుతుందని వ్యాఖ్యానించారు. ఆయన శుక్రవారం చెన్నైలోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ... ఎమ్మెల్యేలు ఎటువంటి ప్రలోభాలకు లొంగరని విశ్వసిస్తున్నట్లు చెప్పారు. ప్రజలు కోరుకున్నవారికే రెండాకుల చిహ్నం సొంతమన్నారు. విశ్వాస పరీక్షలో పళనిస్వామి ప్రభుత్వం నెగ్గినట్లయితే రాష్ట్రవ్యాప్తంగా పర్యటిస్తూ ప్రజాన్యాయస్థానంలోనే ఎమ్మెల్యేలను నిలదీసేందుకు పన్నీర్ సిద్ధమవుతున్నారు. ర్యాలీకి పోలీసుల బ్రేక్ ప్రజామద్దతును కూడగట్టుకుని ఎమ్మెల్యేలపై ఒత్తిడి పెంచేందుకు పన్నీర్‌సెల్వం వర్గం శుక్రవారం తలపెట్టిన ర్యాలీకి పోలీసులు బ్రేకు వేశారు. మరోవైపు అసెంబ్లీలో బలపరీక్ష సమయంలో సీఎం పళనిస్వామికి వ్యతిరేకంగా ఎమ్మెల్యేలపై ఒత్తిడి పెంచేందుకు జల్లికట్టు తరహా ఉద్యమానికి యువత మెరీనా బీచ్‌కు చేరుకుంటారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో మెరీనాతీరమంతా భారీగా బారికేడ్లు ఏర్పాటుచేసి, పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు. కాగా, ముఖ్యమంత్రి హోదాలో పన్నీర్‌సెల్వం తన కుటుంబం సహా నివసిస్తున్న చెన్నై గ్రీన్‌వేస్ రోడ్డులోని ప్రభుత్వ బంగ్లాను ఖాళీ చేయాల్సిందిగా ప్రజాపనుల శాఖ ఆయనకు నోటీసులు జారీచేసింది. ఇదిలా ఉండగా.. పార్టీ పదవులు, ప్రాథమిక సభ్యత్వం నుంచి పన్నీర్‌సెల్వం, ప్రిసీడియం చైర్మన్ మధుసూదనన్ తదితరులను బహిష్కరిస్తున్నట్లు గతంలో శశికళ ప్రకటించారు. ఇప్పుడు శశికళ, సీఎం పళనిస్వామి, మంత్రుల హోదాలో ఉన్నవారిని పార్టీ నుంచి బహిష్కరిస్తున్నట్లు పన్నీర్వైపున్న ప్రిసీడియం చైర్మన్ మధుసూదనన్ ప్రకటించారు. విద్యార్థిని ఆడియో హల్చల్ శశికళా వద్దూ... ఆమెకు మద్దతు పలుకుతున్న మీరూ వద్దంటూ విద్యాశాఖ మంత్రి సెంగొట్టయన్‌ను ఉద్దేశించి ఒక విద్యార్థిని చేసిన విమర్శల ఆడియో సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తోంది. గోపిచెట్టి పాళయంకు చెందిన కాలేజీకి చెందిన ఒక విద్యార్థిని సెంగోట్టయన్‌కు ఫోన్ చేయగా మీటింగ్‌లో ఉన్నారని ఆయన అనుచరుడు బదులిచ్చాడు. దీంతో మంత్రికి తన అసంతృప్తిని చేరవేయమని చెబుతూ జరిగిన సంభాషణలను సామాజిక మాధ్యమాల్లో పెట్టింది. -
‘మ్యాజిక్’ చేసేదెవరు?
తమిళనాడులో నేడే బలపరీక్ష... పది ఓట్లే కీలకం - ఉదయం 11 గంటలకు అసెంబ్లీ.. పన్నీర్ గూటికి మైలాపూర్ ఎమ్మెల్యే - పళని క్యాంప్‌లోని 20 మంది ఎమ్మెల్యేల తిరుగుబాటు - హుటాహుటిన రిసార్ట్స్‌కు సీఎం.. ఎమ్మెల్యేల బుజ్జగింపు - పళని శిబిరంలో 123.. పన్నీర్ వద్ద 12 మంది ఎమ్మెల్యేలు - పళనిస్వామికి వ్యతిరేకంగా ఓటు వేస్తామన్న డీఎంకే - అధిష్టానం ఆదేశానుసారం నడుస్తామన్న కాంగ్రెస్ చెన్నై నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: తమిళనాడు రాజకీయ పరిమాణాలు చివరిఘట్టంలోనూ తీవ్ర ఉత్కంఠను రేకెత్తిస్తున్నాయి. అసెంబ్లీలో నేడు ఉదయం 11 గంటలకు జరగనున్న బలపరీక్షపై దేశమంతా ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ముఖ్యమంత్రిగా బుధవారం ప్రమాణస్వీకారం చేసిన పళనిస్వామికి బలనిరూపణకు గవర్నర్ విద్యాసాగర్‌రావు 15 రోజుల గడువు ఇచ్చినప్పటికీ ఆయన శనివారమే బలం నిరూపించుకుంటానని ప్రకటించిన విషయం తెలిసిందే. సంఖ్యాపరంగా పళనిస్వామివైపే ఎక్కువమంది ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ శుక్రవారం చోటు చేసుకున్న పరిణామాలు రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించాయి. ఎవరికీ మద్దతివ్వబోమని ప్రకటించిన డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్.. తాజాగా పళనిస్వామికి వ్యతిరేకంగా ఓటు వేస్తామని ప్రకటించి హైడ్రామాకు తెరలేపారు. అమ్మ వ్యతిరేకులకు ఓటు వేయలేనంటూ... మైలాపూర్ ఎమ్మెల్యే, మాజీ డీజీపీ నటరాజన్ తాజాగా పన్నీర్ శిబిరంలోకి చేరారు. అమ్మ బొమ్మతో గెలిచిన ఎమ్మెల్యేలు కుటుంబపాలనకు, విశ్వాసతీర్మానానికి వ్యతిరేకంగా ఓటు వేయాలని మాజనీ సీఎం పన్నీర్ సెల్వం విజ్ఞప్తి చేశారు. కువత్తూరు క్యాంప్‌లో ఉన్న 20మంది ఎమ్మెల్యేలు తిరుగుబాట పట్టారన్న వార్తలు సంచలనం రేకెత్తించాయి. అసంతృప్త ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు పళనిస్వామి పలు ప్రయత్నాలు చేస్తున్నారు. బెంగళూరు జైలునుంచి శశికళ కూడా ఎమ్మెల్యేలతో మాట్లాడినట్లు తెలుస్తోంది. మరోవైపు రహస్య ఓటింగ్ డిమాండ్ చేస్తూ పన్నీర్ మద్దతుదారులు స్పీకర్‌కు వినతిపత్రం సమర్పించారు. స్పీకర్ రహస్య ఓటింగ్‌కు అనుమతిస్తే పరిస్థితులు మరింత ఉత్కంఠగా మారతాయని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. క్యాంపులో ఉన్నవారిలో పదిమంది పళనిస్వామికి వ్యతిరేకంగా ఓటు వేసినా పరిస్థితులు తారుమారవుతాయి. దీంతో శిబిరంలో ఉన్న ఎమ్మెల్యేలందరినీ కాపాడుకుని బలపరీక్షలో సత్తా చాటేందుకు పళనిస్వామి వ్యూహాలు రచిస్తున్నారు. మరో పదిమందినైనా ఆకర్షించడంద్వారా పళనిస్వామి ప్రభుత్వాన్ని గద్దె దించి శశికళను దెబ్బ కొట్టాలని విపక్షాలు పథకాలు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో శనివారం ఉదయం జరుగనున్న బలపరీక్షలో విజయమెవరిదన్నది ఆసక్తికరంగా మారింది. ప్రజాక్షేత్రంలో జయలలిత బొమ్మతో గెలుపొందిన ఎమ్మెల్యేలు అమ్మ నమ్మినబంటువైపు నిలుస్తారా? చిన్నమ్మ నమ్మినబంటుకు ఓటేస్తారా? అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఉత్కంఠగా తమిళ రాజకీయాలు పురట్చితలైవి జయలలిత మరణం తరువాత ఆపద్ధర్మ సీఎంగా ఉన్న పన్నీర్ సెల్వం, చిన్నమ్మ శశికళపై తిరుగుబాటు చేయడంతో తమిళ రాజకీయాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాయి. పదిరోజుల హైడ్రామా తర్వాత సుప్రీంకోర్టు తీర్పుతో శశికళ జైలు పాలుకావడం... పన్నీర్ పదవీచ్యుతుడవ్వడం.. ముఖ్యమంత్రిగా పళనిస్వామి ప్రమాణస్వీకారం చేయడం చకచకా జరిగిపోయాయి. బలపరీక్షకు 15 రోజులు సమయం ఉన్నా... 18నే అసెంబ్లీ సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించి పళనిస్వామి బలపరీక్షకు సిద్ధమయ్యారు. ఆ తరువాత కొన్ని గంటల్లో చెన్నైలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ప్రమాణస్వీకారానికి రాజ్‌భవన్‌కు తీసుకొచ్చిన ఎమ్మెల్యేలను తిరిగి కువత్తూరులోని రిసార్ట్స్‌కు తరలించారు. ఆ తరువాత మైలాపూర్ ఎమ్మెల్యే నటరాజన్ శుక్రవారం ఉదయం పళనిస్వామికి ఝలక్ ఇచ్చి పన్నీర్ శిబిరంలో వచ్చి చేరారు. తాను అమ్మ ఫొటోతో గెలిచానని, అమ్మ వ్యతిరేకులకు ఓటు వేయలేనని ఆయన తేల్చిచెప్పినట్లు సమాచారం. అవసరమైతే తిరిగి అమ్మఫొటోతో ఎన్నికలకు వెళ్లేందుక్కూడా వెనుకాడబోనని ప్రకటించినట్లు తెలిసింది. 20 మంది తిరుగుబాటు నటరాజన్ ప్రకటన వెలువడిన వెంటనే రిసార్ట్స్‌లో ఉన్న సుమారు 20 మంది ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేసినట్లు సమాచారం. అపరిష్కృతంగా ఉన్న పలు సమస్యలను వారు తెరమీదకు తెచ్చారు. వెంటనే తీర్చకపోతే తమ నిర్ణయం మరోలా ఉంటుందని హెచ్చరించారు. దీంతో పళనిస్వామి బెంగళూరు పర్యటను రద్దు చేసుకున్నారు. హుటాహుటిన శుక్రవారం రిసార్ట్స్‌కు వెళ్లి ఎమ్మెల్యేలను బుజ్జగించే పనిలో పడ్డారు. బెంగళూరు జైల్లో ఉన్న శశికళ కూడా తమ వద్దకు రావడం కంటే ఎమ్మెల్యేలు చేజారిపోకుండా చూడమని హుకుం జారీచేసినట్లు తెలిసింది. క్యాంప్‌లో ఉన్న ఎమ్మెల్యేలందరితో శశకళ జైలు నుంచి ఫోన్లో మాట్లాడినట్లు సమాచారం. బలనిరూపణలో గెలిచిన అనంతరం మంత్రివర్గ విస్తరణ ఉంటుందని అసంతృప్త ఎమ్మెల్యేలకు ఆశ చూపినట్టు తెలుస్తోంది. పళనిస్వామికి వ్యతిరేకంగా ఓటేయాలని భావించే ఎమ్మెల్యేలను బుజ్జగించేందుకు వారి బంధువులు, అనుచరులను రిసార్ట్స్‌కు పిలిపించి ఒప్పించే ప్రయత్నాలకు శ్రీకారం చుట్టారు. దీంతో శుక్రవారం ఉదయం నుంచి రాత్రి వరకు రిసార్ట్స్ పరిసర ప్రాంతాల్లో వాహనాలతో నిండిపోయాయి. రిసార్ట్స్‌కు వచ్చిపోయే వారిని మన్నార్గుడి సైన్యం క్షుణ్ణంగా పరిశీలించి అనుమతిస్తోంది. రిసార్ట్స్ గేటు ముందు, కువత్తూరు ముఖద్వారం వద్ద భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. రహస్య ఓటింగ్‌కు డిమాండ్ అసెంబ్లీలో నిర్వహించనున్న బలపరీక్షను రహస్యంగా చేపట్టాలని పన్నీర్‌సెల్వం మద్దతుదారులు డిమాండ్ చేశారు. ఈ మేరకు స్పీకర్ ధనపాల్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు. క్యాంప్‌లో అనేకమంది ఎమ్మెల్యేను నిర్బంధించారని స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. బలపరీక్షలో ఎమ్మెల్యేలంతా స్వేచ్ఛగా ఓటు వేసే వాతావరణం కల్పించాలని కోరారు. మరోవైపు పన్నీర్‌సెల్వంకు మద్దతుగా ప్రజలు కొన్ని నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల నివాసాలను, కార్యాలయాలను ముట్టడించారు. పన్నీర్ అనుకూలంగా ఓటెయ్యకపోతే నియోజకవర్గాల్లో తిరగలేరని హెచ్చరించారు. 30 ఏళ్ల తరువాత బలపరీక్ష రిపీట్ తమిళనాడు రాజకీయాల్లో బలపరీక్షలు, అవిశ్వాస తీర్మానాలూ కొత్తేమీ కాదు. 1952లో రాజాజీపై అవిశ్వాస తీర్మానం పెట్టగా, 200 మంది ఎమ్మెల్యేలు ఆయనకు అనుకూలంగా ఓటేసి తిరిగి సీఎంగా ఎన్నుకున్నారు. ఆ తరువాత 1972 డిసెంబర్ 11న డీఎంకే నేత కరుణానిధి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అదే పార్టీలో ఉన్న ఎంజీ రామచంద్రన్‌ను పార్టీ నుంచి తొలగించారు. ఆ సమయంలో సీఎం కరుణానిధిపై అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఆ బలపరీక్షలో కరుణానిధికి అనుకూలంగా 172 మంది ఎమ్మెల్యేలు మద్దతు తెలుపడంతో ఆయనే సీఎంగా ఎన్నికయ్యారు. 1988లో ఎంజీ రామచంద్రన్ మరణించాక అన్నాడీఎంకే పార్టీ రెండుగా చీలిపోయింది. అన్నాడీఎంకే (జా) జానకీ రామచంద్రన్, అన్నాడీఎంకే (జే) జయలలిత సీఎం పీఠం కోసం పోటీపడ్డారు. జనవరి 28న బలపరీక్ష నిర్వహించారు. స్పీకర్ పీహెచ్ పాండ్యన్ సమక్షంలో నిర్వహించిన బలపరీక్షలో జానకీ రామచంద్రన్ సీఎం అభ్యర్థిగా ఎన్నికయ్యారు. జానకీ రామచంద్రన్‌కు అనుకూలంగా 99 మంది, జయలలితకు అనుకూలంగా 33 మంది ఎమ్మెల్యేలు నిలిచారు. ఆ సమయంలో అసెంబ్లీలో జరిగిన గొడవలో 29 మంది ఎమ్మెల్యేలు గాయపడ్డారు. పరిస్థితి చేయిదాటడంతో గవర్నర్ రాష్ట్రపతి పాలనకు ఆదేశించారు. జయలలిత మరణంతో 30 ఏళ్ల తరువాత తమిళనాడు అసెంబ్లీ మరోసారి బలపరీక్షకు సిద్ధమవుతోంది. నేడు జరుగనున్న బలపరీక్ష ఎవరికి పరీక్ష కానుందో కొన్ని గంటల్లో తేలిపోనుంది. -
తమిళనాడులో వీడని ప్రతిష్టంభన
-
పన్నీర్ శిబిరంలో పదవుల ఆశ
కేంద్రంలో బెర్త్‌లపై ఎంపీల ధీమా.. తంబిదురైకు గండం తప్పదా? సాక్షి, చెన్నై: ఆలు లేదు... సూలు లేదు కొడుకేమో సోమలింగం అన్నట్టుగా రాష్ట్రంలో అధికారం చేపట్టేందుకే మెజారిటీ ఎమ్మెల్యేలు లేకపోయినా... కేంద్రంలో తమకు బెర్త్‌లు ఖాయమని ఆపద్ధర్మ సీఎం పన్నీర్ సెల్వం శిబిరం ఎంపీలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. గ్రీన్‌వేస్ రోడ్డులోని పన్నీర్ శిబిరంలో సాగుతు న్న ఈ చర్చ సర్వత్రా విస్మయానికి గురి చేస్తోంది. అన్నాడీఎంకేకు తమిళనాడులో 37 లోక్‌సభ, 13 రాజ్యసభ ఎంపీలు ఉన్నారు. దేశంలోనే మూడో అతిపెద్ద పార్టీగా అన్నాడీ ఎంకే అవతరించడంతో, ఆ సంఖ్య తమకు అవసరం కాబట్టి పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ పదవిని ఆ పార్టీకి కేంద్రం కట్టబెట్టింది. ఈ పదవిలో సీనియర్ ఎంపీ తంబిదురై కొనసాగు తున్నారు. ప్రస్తుతం అన్నాడీఎంకేలో సాగుతున్న రాజకీయ సమరంలో తంబిదురై శశికళ పక్షాన నిలవగా, 12మంది ఎంపీలు పన్నీర్‌కు మద్దతు పలుకుతున్నారు. మరికొందరు ఆయ న పక్షాన చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. పన్నీర్ చేతికి అధికార పగ్గాలు చిక్కడం ఖాయం అని ధీమా వ్యక్తం చేస్తున్న ఆ శిబిరం ఎంపీలు, రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పాటు కాగానే, తక్షణ కర్తవ్యంగా తంబిదురైను డిప్యూటీ స్పీకర్ పదవి నుంచి దించేందుకు వ్యూహాలు రచిస్తు న్నారు. అలాగే ఎన్డీఏ ప్రభుత్వంలో పన్నీర్ భాగస్వామ్యం కావడం ఖాయం అని, దీంతో కేంద్రంలో సహాయ పదవులు తమలో ఒకరి ద్దరికి దక్కే అవకాశాలు ఉండొచ్చని అప్పుడే పదవుల ఆశల్లో తేలియాడుతున్నారు. పోయెస్ గార్డెన్ దీపక్‌కు! టీ నగర్ (చెన్నై): ఆళ్వారుపేటలోగల పోయెస్‌గార్డెన్ ఇల్లు ఎవరికి దక్కుతుందన్న విషయం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. దీనిని జయలలిత అన్న కుమారుడు దీపక్‌కు శశికళ అప్పగించనున్నట్లు ఊహాగానాలు చెలరేగుతున్నాయి. దీపక్ ప్రస్తుతం శశికళకు మద్దతుగానే ఉన్నారు. ఆయన సోదరి దీపతో సన్నిహితంగా లేరు. జయలలిత అంత్యక్రియల్లో పాల్గొనడం ద్వారానే దీపక్ గురించి బయటి ప్రపంచానికి తెలిసింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళ జైలుకు వెళుతున్నందున పోయెస్‌గార్డెన్‌లో ఉన్న పోలీసులందరిని ఉపసంహరించుకు న్నారు. దీంతో పోయెస్ గార్డెన్ ఇల్లు ఎవరి ఆధీనంలోకి వస్తుందనే ప్రశ్న ఉదయించింది. దీపక్ మంగళవారం మధ్యాహ్నం కువత్తూరులోగల రిసార్ట్‌కు వెళ్లారు. అన్నాడీఎంకేలో ముఖ్యమైన పదవి అందజేసేందుకు, పోయెస్ గార్డెన్ ఇంటి నిర్వహణ బాధ్యతలు అప్పగించనున్నట్లు శశికళ పిలిపించినట్లు తెలుస్తోంది. మరోవైపు పోయెస్ గార్డెన్ ఇంటిని జయలలిత స్మారక భవనంగా మార్చేందుకు పన్నీర్ వర్గం సంతకాల సేకరణ చేపట్టింది. -
వీడని ప్రతిష్టంభన
తమిళ సీఎం పీఠంపై వీడని చిక్కుముడి - రాజ్‌భవన్‌లో రాజకీయ బంతి - గవర్నర్‌తో పన్నీర్, పళనిస్వామి భేటీ - పళనిని పిలుస్తారా? సభను సమావేశ పరుస్తారా? - గవర్నర్ ఏం చేస్తారనే దానిపై ఉత్కంఠ - శశికళ, పళనిస్వామిపై కిడ్నాప్ కేసు - ఇది తగదంటూ సుబ్రమణ్యస్వామి ట్వీట్ సాక్షి ప్రతినిధి, చెన్నై తమిళనాడులో రాజకీయ ప్రతిష్టంభన ఇంకా తొలగిపోలేదు. అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా ఎంపికైన పళనిస్వామి తనకు 128 మంది ఎమ్మెల్యేల మద్దతుందని, ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరి రెండు రోజులైనప్పటికీ గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్రావునుంచి ఎలాంటి స్పందన లేకపోవడంపై రాజకీయవర్గాల్లో చర్చ మొదలైంది. మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతున్నవారిని ప్రభుత్వ ఏర్పాటుకు పిలవడమే పార్లమెంటరీ సంప్రదాయమని నిపుణులు చెబుతున్నారు. అయితే ఒకే పార్టీలోని ఇరువర్గాలు పోటీ పడుతున్నప్పుడు శాసనసభను ప్రత్యేకంగా సమావేశపరచి బలపరీక్షకు అవకాశమివ్వవచ్చని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ కూడా సోమవారం ఇదే సూచించిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. మరోవైపు సీఎం పదవికై పోటా పోటీగా పావులు కదుపుతున్న పన్నీర్‌సెల్వం, పళనిస్వామి బుధవారం రాత్రి వేర్వేరుగా గవర్నర్‌ను కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించాల్సిందిగా పళనిస్వామి గవర్నర్‌ను కోరినట్లు సమాచారం. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోదని, గవర్నర్ రాజ్యాంగం ప్రకారం నిర్ణయం తీసుకుంటారని కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటించారు. మరోవైపు కువత్తూరులో ఎమ్మెల్యేలను బలవంతంగా నిర్బంధించారని శశికళ, పళనిస్వామిలపై కేసు నమోదైంది. దీనిపై తమిళనాడు డీజీపీని హెచ్చరించాలని కేంద్ర హోంమంత్రిని కోరినట్లు బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్యస్వామి ట్వీట్ చేశారు. పళనిస్వామి సీఎం అయ్యాక భద్రతా కారణాల దృష్ట్యా శశికళను తమిళనాడుకు తరలించాలని కోరారు. వీటన్నింటి నేపథ్యంలో గవర్నర్ పళనిస్వామిని పిలుస్తారా? లేక ప్రత్యేక సమావేశం నిర్వహించి బలపరీక్షకు అవకాశమిస్తారా? అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని రాష్ట్రమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. రెండు శిబిరాల్లోనూ ఆందోళన శశికళ జైలు కెళ్లగానే పన్నీర్‌సెల్వం వైపు ఎమ్మెల్యేల క్యూ కడతారని ఆశించిన వారికి నిరాశే మిగిలింది. పన్నీర్ ఇంటివద్ద బుధవారం జనం బాగా పలుచబడ్డారు. సినీనటి గౌతమి మాత్రమే పన్నీర్‌ను కలిసి మద్దతు ప్రకటించారు. తన మద్దతుదారులతో మంగళవారం వరకు చెదరని చిరునవ్వుతో పదే పదే మీడియాకు ముందుకు వచ్చిన పన్నీర్‌సెల్వం బుధవారం ఒక్కసారి కూడా ఇంటినుంచి బైటకు రాలేదు. ఆయన అనుచరులు సైతం నీరసపడిపోయినట్లు కనిపించారు. పళనిస్వామిని గవర్నర్ ఆహ్వానించిన పక్షంలో తమ పరిస్థితి ఏమిటని పన్నీర్ ఆలోచనలో పడినట్లు సమాచారం. మరోవైపు శశికళ ఉన్నంతవరకు హుషారుగా వ్యహరించిన కువత్తూరు రిసార్టులోని ఎమ్మెల్యేలు ఆమె జైలు కెళ్లడంతో డీలాపడిపోయారు. సుప్రీంకోర్టు తీర్పు వెలువడి, శశికళ జైలుకు వెళ్లిన తరువాత కూడా పళనిస్వామిని ప్రభుత్వ ఏర్పాటుకు పిలవకుండా గవర్నర్ జాప్యం చేయడంపై ఆందోళన నెలకొంది. రిసార్టులోని ఎమ్మెల్యేలు పన్నీర్‌వైపు జారిపోకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మాజీ మంత్రి సెంగొట్టయ్యన్ బుధవారం కువత్తూరులో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించేవరకు ఇక్కడున్న ఎమ్మెల్యేలు బైటకు వచ్చే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు. కాంపోజిట్ బలపరీక్ష అంటే? ఒకే పార్టీకి చెందిన ఇద్దరు వ్యక్తులు ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కోరినప్పుడు, ఎవరికి బలముందో స్పష్టత లేనప్పుడు గవర్నర్ శాసనసభను ప్రత్యేకంగా సమావేశపరచి బలాన్ని నిరూపించుకునే అవకాశమిస్తారు. సభకు హాజరైన వారిలో మెజారిటీ ఎవరికి ఉందో వారిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తారు. బలపరీక్ష వాయిస్ ఓట్, డివిజన్ ఓట్ ద్వారా జరగవచ్చు. డివిజన్ ఓట్ కోరినప్పుడు బ్యాలెట్ లేదా ఈవీఎంల ద్వారా ఓటింగ్ నిర్వహిస్తారు. ఇద్దరిలో ఎవ్వరికీ మెజారిటీ దక్కని పక్షంలో స్పీకర్ ఓటు వేస్తారు. ఉత్తరప్రదేశ్‌లో కళ్యాణ్‌సింగ్, జగదాంబికాపాల్ ఇరువురూ ప్రభుత్వ ఏర్పాటు కోసం పోటీపడినప్పుడు కాంపోజిట్ బలపరీక్ష నిర్వహించాలని 1998లో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. తమిళనాడులో కూడా ఇదే పద్ధతి అనుసరించాలని, వారంలోగా సభను సమావేశపరిచి బలపరీక్షకు అవకాశమివ్వాలని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ సోమవారం గవర్నర్‌కు సూచించిన విషయం తెలిసిందే. శశికళ, ఎడపాడిపై కిడ్నాప్ కేసు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను కిడ్నాప్ చేసినట్లుగా వచ్చిన ఫిర్యాదులపై కువత్తూరు పోలీసులు శశికళ, ఎడపాడి పళనిస్వామిలపై మూడు సెక్షన్ల కింద బుధవారం కేసు నమోదు చేశారు. శశికళ నిర్వహిస్తున్న కువత్తూరు క్యాంప్ నుంచి ఈనెల 13వ తేదీన తప్పించుకు వచ్చిన మదురై పశ్చిమ ఎమ్మెల్యే శరవణన్ డీజీపీకి ఒక ఫిర్యాదు చేశారు. శశికళ తరఫు వ్యక్తులు ఎమ్మెల్యేలను కిడ్నాప్ చేసి కువత్తూరులో దాచిపెట్టినట్లు అందులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుపై డీజీపీ, కాంచీపురం ఎస్పీ ఆదేశాల మేరకు శశికళ, పళనిస్వామిలపై కిడ్నాప్ కేసు నమోదు చేశారు. రెండాకుల చిహ్నం ఎవరికి? పన్నీర్‌సెల్వం, పళనిస్వామి వర్గాలుగా అన్నాడీఎంకే రెండుగా చీలిపోయిన పక్షంలో రెండాకుల చిహ్నం ఏ వర్గానికి దక్కుతుందని అప్పుడే చర్చ మొదలైంది. పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన శశికళ పార్టీలో కీలకపదవుల్లో కొన్ని నియామకాలు, తొలగింపులు చేశారు. అయితే తాత్కాలిక ప్రధాన కార్యదర్శికి నియామకాలు చేసే హక్కులు లేవని పన్నీర్‌సెల్వం వర్గం వాదిస్తోంది. వైరివర్గాల్లో పార్టీ ప్రిసీడియం చైర్మన్‌గా ఇద్దరు, కోశాధికారిగా ఇద్దరు ఉన్నారు. పార్టీ నియమావళి ప్రకారం తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎన్నిక చెల్లదని ఎన్నికల కమిషన్‌కు అందిన ఫిర్యాదు పరిశీలనలో ఉంది. ఈ పరిస్థితుల్లో అన్నాడీఎంకే రెండాకుల చిహ్నం ఎవరికి దక్కుతుందోనని రెండు శిబిరాల్లో చర్చించుకుంటున్నారు. -
సస్పెన్స్ సీరియల్
-
రాఘవ లారెన్స్ అనూహ్య నిర్ణయం
-
తమిళనాడులో హైటెన్షన్: అల్లర్లు !
-
సరైన సమయంలో కీలక నిర్ణయం
-
సరైన సమయంలో కీలక నిర్ణయం
- డీఎంకే నిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ - అన్నాడీఎంకే ఎప్పుడూ మా ప్రత్యర్థే సాక్షి, చెన్నై: తమిళనాట రాజకీయ సంక్షోభం నేపథ్యంలో సరైన సమ యంలో కీలక నిర్ణయం తీసుకుంటామని డీఎంకే నిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ తెలిపారు. అన్నాడీఎంకే ఎప్పుడూ డీఎంకేకు ప్రత్యర్థేనని స్పష్టం చేశారు. ఎవ్వరికీ మద్దతిచ్చే ప్రసక్తే లేదన్నారు. స్టాలిన్ అధ్యక్ష తన, ప్రధానకార్యదర్శి అన్బళగన్ నేతృత్వంలో సోమవారం చెన్నై తేనాం పేటలోని రాష్ట్ర పార్టీ కార్యాలయంలో డీఎంకే ఉన్నతస్థాయి కమిటీ భేటీ జరిగింది. కమిటీలోని ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్య నేతలతో గంట సేపు రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై స్టాలిన్ చర్చించారు. 11 తీర్మానాలు ప్రవేశపెట్టారు. ఆ వివరాలను మీడియాకు స్టాలిన్ వివరించారు. రాష్ట్రంలో స్థిరమైన ప్రభుత్వం లేని కారణంగా పలు సమస్యలతో అన్ని వర్గాల ప్రజలు తీవ్ర సంకట పరిస్థితుల్ని ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధానంగా నీట్ పరీక్షల గందరగోళం విద్యార్థుల్ని ఆందోళనలో పడేస్తున్నదన్నారు. రైతు ఆత్మహత్యల పర్వం సాగుతున్నా, కరువుతో ప్రజలు తల్లడిల్లుతున్నా పట్టించుకునేవాళ్లు కరువయ్యారని ధ్వజ మెత్తారు. ఆపద్ధర్మ సీఎం పన్నీరు సెల్వం తానే పదవిలో కొనసాగాలని తీవ్ర ప్రయత్నాల్లో పడి పాలనను విస్మరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ ఇకనైనా రాష్ట్రంలో సుస్థిర ప్రభుత్వం ఏర్పాటుకు చర్యల్ని వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. అసెంబ్లీని సమావేశపరిచి మెజారిటీ ఉన్నవారిని అధికార పగ్గాలు చేపట్టే విధంగా ఆహ్వానించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. డీఎంకేపై శశికళ చేస్తున్న వ్యాఖ్యలపై తాను స్పందించబోనని ఓ ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. పదవీ వ్యామోహంతో వారి మధ్య పోటీ సాగుతోందని, దొడ్డిదారిన వారిలో ఎవరికో ఒకరికి మద్దతు ఇవ్వాల్సిన అవసరం డీఎంకేకు లేదని స్పష్టం చేశారు. బల పరీక్ష తప్పనిసరైతే, డీఎంకే మద్దతు ఎవరికి? అని ప్రశ్నించగా... వేచి చూడండి, సరైన సమయంలో కీలక నిర్ణయాన్ని తీసుకుంటామని బదులిచ్చారు. ఉదయం పది గంటల సమయంలో స్టాలిన్ శాసనసభకు వెళ్లడంతో రాజకీయ ఉత్కంఠ నెలకొంది. గంట పాటుగా తన చాంబర్లో ఉన్న స్టాలిన్ మీడియాతో కూడా మాట్లాడకుండా వెళ్లిపోయారు. మరికాసేపట్లో ఆపద్ధర్మ సీఎం పన్నీరుసెల్వం సచివాలయంలోకి వస్తారన్న సమయంలో హఠాత్తుగా స్టాలిన్ ప్రత్యక్షం కావడంతో చర్చ బయల్దేరింది. మరిన్ని తమిళనాడు కథనాలు చదవండి.. శశికళ జాతకంపై నేడే తీర్పు నేనెవరికి మద్దతివ్వాలి? శిబిరంలో 119 మంది ఎమ్మెల్యేలు సరైన సమయంలో కీలక నిర్ణయం శశికళకు కారాగారమా? అధికారమా? వారంలోగా బలపరీక్ష! ప్రజాక్షేత్రంలోకి శశికళ మారువేషంలో బయటపడ్డా చిన్నమ్మ సేనల్లో ఉత్కంఠ -
శశికళ జాతకంపై నేడే తీర్పు
తమిళనాడులో హైటెన్షన్: అల్లర్లు జరగవచ్చని హెచ్చరిక - తీర్పు తనకు అనుకూలంగా ఉంటుందని చిన్నమ్మ ధీమా - వ్యతిరేక తీర్పు వస్తే ప్రత్యామ్నాయాలపై చిన్నమ్మ శిబిరం మంతనాలు - శశికళ జైలుకు పోవడం ఖాయమని పన్నీర్ వర్గాల ప్రచారం - అల్లర్లు జరిగే అవకాశం ఉందని సీఎస్, డీజీపీని హెచ్చరించిన గవర్నర్ - పోలీసు అధికారులతో సీఎస్ అత్యవసర సమావేశం - పన్నీర్ గూటికి మరో ఎమ్మెల్యే, ఎంపీ - అదను చూసి అధికారం దక్కించుకోవాలని డీఎంకే వ్యూహం - గవర్నర్ వెనుక కేంద్రమంత్రులు ఉన్నారన్న ఎంపీ సుబ్రమణ్య స్వామి చెన్నై నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: తమిళనాడులో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ముఖ్యమంత్రి పీఠంకోసం వారం రోజులుగా ఎత్తులు, పై ఎత్తులతో రాష్ట్ర రాజకీయాలను వేడెక్కించిన ఆపద్ధర్మ ముఖ్యమంతి పన్నీర్ సెల్వం, అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారు. సీఎం పదవికి రాజీనామా చేశాక పన్నీర్ సోమవారం తొలిసారి సచివాలయానికి వెళ్లి సమీక్షలు నిర్వహించగా... శశికళ ప్రజాక్షేత్రంలోకి ప్రవేశించి సామాన్యులతో మమేకమయ్యారు. వెయ్యిమంది పన్నీర్‌సెల్వంలను చూశానంటూ విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యేలను ఆకర్షించేందుకు పన్నీర్ పలు ప్రయత్నాలు చేసినప్పటికీ... ఇప్పటికీ 119 మంది ఎమ్మెల్యేలు శశికళ శిబిరంలో ఉన్నారని ప్రభుత్వమే మద్రాసు హైకోర్టుకు నివేదిక సమర్పించింది. అయితే శశికళ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సుప్రీంకోర్టు మంగళవారం తీర్పు వెలువరించే అవకాశం ఉండడంతో రాష్ట్రమంతటా ఉత్కంఠ నెలకొంది. ఈ కేసులో శశికళ దోషిగా తేలితే ఆమె ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి అనర్హురాలవుతారు. తీర్పు తమకే అనుకూలంగా ఉంటుందని ఇరు వర్గాలు పైకి ధీమా వ్యక్తం చేస్తున్నా మంగళవారం ఏం జరగబోతోందోనని నరాలు తెగే ఉత్కంఠతో ఎదురుచూస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అల్లర్లు జరిగే అవకాశం ఉందని ఇన్చార్జ్ గవర్నర్ విద్యాసాగర్‌రావు అధికార యంత్రాంగాన్ని హెచ్చరించడంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. శశికళ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కర్ణాటక ప్రభుత్వంతోపాటు పలువురు ఫైల్ చేసిన అప్పీళ్లపై జస్టిస్ పీసీ ఘోష్, జస్టిస్ అమితవరాయ్‌లతో కూడిన బెంచ్ ఉదయం 10:30 గంటలకు తీర్పు వెలువరించవచ్చని తెలుస్తోంది. సుప్రీంకోర్టు తీర్పు ఎలా వచ్చినా స్వీకరిస్తానని శశికళ ప్రకటించారు. అయితే తీర్పు వ్యతిరేకంగా వస్తే ఏ రకమైన వ్యూహం అమలు చేయాలి, తమ తరఫున పార్టీని ఎవరు నడపాలి, సీఎం కుర్చీలో ఎవరు కూర్చోవాలి అనే అంశాలపై శశికళ తనకు అత్యంత సన్నిహితులైన వారితో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. శశికళ జైలుకు పోవడం ఖాయమని అపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం శిబిరం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. శశికళ శిబిరం నుంచి మధురై ఎమ్మెల్యే శరవణన్ తప్పించుకుని మారువేషంలో చెన్నైకి చేరుకున్నారు. ఎంపీ గోపాలకృష్ణన్‌తో కలసి ఆయన సోమవారం రాత్రి ఆయన పన్నీర్ గూటికి చేరారు. దీంతో పన్నీర్‌కు మద్దతు ఇస్తున్న ఎంపీల సంఖ్య 12కు, ఎమ్మెల్యేల సంఖ్య 8కి చేరింది. శశికళ శిబిరంలోని ఎమ్మెల్యేలంతా పన్నీర్ ఇంటికి వస్తారని ఎంపీ గోపాలకృష్ణన్ ఎద్దేవా చేశారు. న్యాయ నిపుణులతో సమాలోచనలు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తీర్పు శశికళకు అనుకూలంగా వస్తే ఏం చేయాలి, వ్యతిరేకంగా వస్తే ఎలా నిర్ణయం తీసుకోవాలనే విషయాలపై ఇన్చార్జ్ గవర్నర్ విద్యాసాగర్‌రావు అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ, మాజీ అటార్నీ జనరల్ సోలీసొరాబ్జీల నుంచి న్యాయ సలహాలు తీసుకున్నారు. వారం రోజుల్లోగా శాసనసభను ప్రత్యేకంగా సమావేశపరిచి శశికళ, పన్నీర్ బలాబలాలు నిరూపించుకునే అవకాశమివ్వాలని గవర్నర్‌కు రోహత్గీ సూచించినట్లు తెలిసింది. గవర్నర్ నిర్ణయం సాగదీయడం వెనుక కొందరు కేంద్ర మంత్రులు ఉన్నారని బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి సంచలన ఆరోపణలు చేశారు. గవర్నర్ ఇంకా సాగదీస్తే కేసు వేస్తానని కూడా ఆయన హెచ్చరించారు. శశికళ సీఎంగానే ఢిల్లీకి వస్తారని ధీమాగా చెప్పారు. గవర్నర్ రాజ్యాంగానికి బ్రేకులు వేస్తున్నారని ఆయన విమర్శించారు. మోదీని విమర్శిస్తే అంతు చూస్తామని కేంద్ర సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్ హెచ్చరించారు. శశికళను సీఎంగా ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించేలా గవర్నర్‌ను ఆదేశించాలని ఎంఎల్ శర్మ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అల్లర్లు జరగవచ్చని హెచ్చరిక రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ వాతావరణం, శశికళ కేసులో సుప్రీంకోర్టు తీర్పు రానున్న నేపథ్యంలో అల్లర్లు జరిగే అవకాశం ఉందని గవర్నర్ విద్యాసాగర్‌రావు అధికార యంత్రాంగాన్ని హెచ్చరించారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేవారె వరైనా సరే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాథన్ హోం శాఖ కార్యదర్శి, పోలీసు ఉన్నతాధికారులు, డీజీపీతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి శాంతి భద్రతల అంశాన్ని సమీక్షించారు. ఈ సమావేశం ముగిసిన రెండు గంటలకే ఇంటెలిజెన్స్ ఐజీ కె.ఎన్.సత్యమూర్తిని బదిలీ చేశారు. ఆయన స్థానంలో పోలీస్ వెల్ఫేర్ ఐజీ డేవిడ్సన్ దేవాశీర్వాదంను నియమిస్తూ ఉత్తర్వులిచ్చారు. సంతకాల పరిశీలన మద్దతు తెలుపుతున్న ఎమ్మెల్యేల పేర్లతో శశికళ సమర్పించిన జాబితాలోని సంతకాలను గవర్నర్ పరిశీలన చేయిస్తు న్నారు. ఈ నేపథ్యంలోనే కృష్ణగిరి జిల్లా ఊత్తంగరై ఎమ్మెల్యే మనోరంజితం తాను ఎమ్మెల్యేల సమావేశానికే హాజరు కాలేదని చెప్పారు. తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని, ప్రజాభిప్రాయం మేరకు తాను పన్నీర్‌కు మద్దతిస్తానన్నారు. మరోవైపు సెంగోట్టి యన్‌కు పార్టీ ప్రిసీడియం చైర్మన్ పదవి ఇవ్వడంతో లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ తంబి దురై అసంతృప్తితో ఢిల్లీలోనే ఉన్నారని ప్రచారం జరిగింది. ఈ ప్రచారాన్ని శశికళ వర్గం ఖండించింది. రాష్ట్రపతి అపాయింట్ మెంట్ కోసం ఆయన ఢిల్లీలో ప్రయత్నాలు చేస్తున్నారని, శశికళతో టచ్‌లోనే ఉన్నారని ఆ వర్గాలు చెప్పాయి. మరిన్ని తమిళనాడు కథనాలు చదవండి.. శశికళ జాతకంపై నేడే తీర్పు నేనెవరికి మద్దతివ్వాలి? శిబిరంలో 119 మంది ఎమ్మెల్యేలు సరైన సమయంలో కీలక నిర్ణయం శశికళకు కారాగారమా? అధికారమా? వారంలోగా బలపరీక్ష! ప్రజాక్షేత్రంలోకి శశికళ మారువేషంలో బయటపడ్డా చిన్నమ్మ సేనల్లో ఉత్కంఠ -
పన్నీర్ ఇంటికి రాఘవ లారెన్స్
చెన్నై: మరికొద్ది గంటల్లో రాజకీయ సంక్షోభానికి తెరపడనున్నవేళ.. తమిళనాడులో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. మొన్నటి జల్లికట్టు ఉద్యమంలో కీలకంగా వ్యవహరించి, రాజకీయ పార్టీని స్థాపించబోతున్నట్లు ప్రకటించిన సినీ నటుడు, డాన్స్ మాస్టర్ రాఘవ లారెన్స్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. చెన్నైలోని గ్రీన్‌వేస్ రోడ్డులోగల ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్ సెల్వం ఇంటికి సోమవారం రాత్రి లారెన్స్ వచ్చారు. పన్నీర్ సెల్వం, ఇతర నేతలు ఆత్మీయ ఆలింగనాలతో రాఘవ లారెన్స్‌కు స్వాగతం పలికిన అనంతరం ఉమ్మడిగా మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనించానని, అన్నీ ఆలోచించిన మీదట పన్నీర్ సెల్వానికి మద్దతు పలకాలనే నిర్ణయానికి వచ్చినట్లు రాఘవ లారెన్స్ చెప్పారు. అమ్మ ఆశయాలను ముందుకు తీసుకెళ్లగల సత్తా ఓపీఎస్‌కు మాత్రమే ఉందని వ్యాఖ్యానించారు. లారెన్స్ కంటే ముందే సీనియర్ నటులు కొందరు పన్నీర్‌కు మద్దతు తెలిపిన విషయం తెలసిందే. శశికళ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో మంగళవారం ఉదయం సుప్రీంకోర్టు తీర్పు వెలువరించనున్న దరిమిలా ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు చిన్నమ్మ గోల్డెన్‌బే రిసార్ట్స్‌లోనే మకాంవేసిన సంగతి తెలిసిందే. సోమవారం సాయంత్రమే రిసార్ట్స్‌కు చేరుకున్న ఆమె ఎమ్మెల్యేలు, నేతలతో ఎడతెగని చర్చలు జరుపుతున్నారు. -
శశికళ సంచలన ప్రకటన
-
శశికళ రిసార్టుకు ఎందుకు వెళ్లారు: సెల్వం
-
‘అమ్మ’ కోసం అవమానాలు భరించా
- తమిళనాడు ఆపద్ధర్మ సీఎం పన్నీర్ సెల్వం వెల్లడి - ‘అమ్మ’ వారసుడిని తయారు చేసుకోకుండా శశికళ అడ్డుకున్నారు - పార్టీలో ఎవరినీ ఎదగనివ్వలేదు సాక్షి, చెన్నై: ‘‘అమ్మ నన్ను ఆప్యాయంగా పలకరిస్తే చాలు... క్షణాల్లో శశికళ నుంచి చీవాట్లు పడేవి. పదిహేను, పదహారేళ్లు అడుగ డుగునా అవమానాలు మౌనంగానే భరించా.. నాలో నేను రోదించా. అమ్మ తన వారసుడిని తయారు చేసుకునే ప్రయత్నం చేసినా శశికళ అడ్డుకున్నారు. పార్టీలో ఉన్న వారందరినీ బయటకు వెళ్లేలా చేశారు. ‘అమ్మ’ కోసం ఇవన్నీ భరించి ఆమెతోనే ఉన్నా’’ అని తమిళ నాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం చెప్పారు. క్యాంప్(శశికళ శిబిరం)లో ఉన్న ఎమ్మెల్యేలు దయచేసి నియోజకవర్గాల్లోకి వెళ్లాలని, ప్రజలతో చర్చించి మనస్సాక్షికి కట్టు బడి నిర్ణయం తీసుకోవాలని ఆయన సూచిం చారు. ఆదివారం కువత్తూరు వేదికగా ఎమ్మె ల్యేలను ఉద్దేశించి శశికళ ప్రసంగం ముగిసిన కాసేపటికి సీఎం పన్నీర్ సెల్వం గ్రీన్‌వేస్ రోడ్డులోని తన నివాసంలో మీడియాతో మాట్లాడారు. పార్టీ కోసం ఎంతో కష్టపడ్డానని వివరించారు. నేను సింహాన్ని కాదు ‘‘నేను ఎదుర్కొన్న కష్టాలు, చేసిన సేవలను జయలలిత స్వయంగా కార్యకర్తలకు వివరించి న సందర్భాలు ఎన్నో ఉన్నాయి. శశికళ నుంచి ఎన్నో అవమానాలు ఎదురైనా, ఎన్నడూ ‘అమ్మ’ దృష్టికి తీసుకెళ్లలేదు. ‘అమ్మ’ తన రాజకీయ వారసుడిని తయారు చేసుకునేం దుకు సిద్ధపడ్డా, శశికళ ఎవరినీ ఎదగనివ్వ లేదు. నన్ను బయటకు పంపించేందుకు కుట్రలు పన్నినా కేవలం జయలలిత కోసం అన్నీ దిగమింగుకున్నా. ఇతరులపై చాడీలు చెప్పడం, నిందలు వేయడం నాకు చేతకాదు. నేను సింహాన్ని కాదు’’ అని పన్నీర్ సెల్వం పరోక్షంగా శశికళను ఎద్దేవా చేశారు. అప్పుడు నిస్సహాయుడినే.. ‘‘జయలలిత ఆసుపత్రిలో ఉన్నప్పుడు కూడా కనీసం దగ్గరకు కూడా వెళ్లనివ్వకుండా శశికళ అడ్డుకున్నారు. అమ్మ మరణం తర్వాత పార్టీ ప్రధాన కార్యదర్శిగా మధుసూదనన్ పేరు ప్రతిపాదనకు వచ్చింది. కానీ, శశికళ ఆ పరిణామాలను తనకు అనుకూలంగా మార్చు కున్నారు. అమ్మ రక్త సంబంధీకులు దీప, దీపక్‌లను పార్థివదేహం దగ్గరకు రానివ్వ కుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. నేను పదవిలో ఉన్నా, అప్పుడు స్వతం త్రంగా వ్యవ హరించలేని నిస్స హాయుడిగా నిలవాల్సిన పరిస్థితి ఏర్పడింది’ అని పన్నీర్ వెల్లడించారు. నేటి నుంచి సచివాలయానికి వెళ్తా.. ‘‘శశికళ క్యాంపులోని పలువురు ఎమ్మెల్యేలు నాతో ఫోన్లో టచ్‌లో ఉన్నారు. నేనే అక్కడికి వెళ్లి వారిని బయటకు తెచ్చేంత అధికారం, చేతిలో ఉన్నా, నావల్ల శాంతి భద్రతలకు ఎలాంటి భంగం వాటిల్లకూడదని సంయమ నం పాటిస్తున్నా. రాజకీయ సంక్షోభం కారణం గా ప్రజలు ఇబ్బందులు పడకూడదు. పరిపా లన సజావుగా సాగేందుకు సోమవారం నుంచి సచివాలయానికి వెళ్తా. మంత్రులు, ఎమ్మెల్యేలంతా ప్రజల్లోకి రావాలి’’ అని పన్నీర్ సెల్వం పిలుపునిచ్చారు. -
ఎమ్మెల్యేలు ఇంకా రారేంటి?
- పన్నీర్ సెల్వం వర్గం తర్జనభర్జన - ఆశించిన స్థాయిలో ఎమ్మెల్యేలు రాకపోవడంపై మంతనాలు - శాసనసభ్యులను ఆకర్షించేందుకు కొత్త వ్యూహాలు చెన్నై నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: శశికళ శిబిరం నుంచి 11 మంది ఎంపీలతోపాటు అన్నాడీఎంకే నేతలు తన శిబిరంలోకి వచ్చినా, ఆశించిన సంఖ్యలో ఎమ్మెల్యేలు రాకపోవడం పట్ల తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ఆలోచనలో పడ్డారు. ఆదివారం నాటికి కనీసం 25 మంది శాసనసభ్యులు తన గూటికి చేరుతారని ఆయన భావించారు. అయితే, మంత్రి పాండియరాజన్ మాత్రమే వచ్చి చేరారు. దీంతో శశికళ శిబిరంలోని ఎమ్మెల్యేలకు ఎలా వల వేయాలనే దానిపై పన్నీర్‌సెల్వం వర్గం కసరత్తు చేస్తోంది. ఎమ్మెల్యేలను ఉంచిన ప్రదేశం ప్రైవేట్‌ది కావడంతో తానే స్వయంగా వెళ్లి వారితో మాట్లాడేందుకు పన్నీర్ సెల్వం సిద్ధమైనట్లు సమాచారం. అయితే, పోలీసు అధికారులు వారించడంతో ఆయన వెనక్కి తగ్గినట్లు తెలిసింది. ఈ విషయం తెలియడంతో శశికళ మద్దతుదారులు మరింత అప్రమత్తమయ్యారు. రిసార్ట్ చుట్టూ భారీ ఎత్తున ప్రైవేట్ సైన్యాన్ని మోహరించారు. ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు కూడా పెద్ద ఎత్తున బందోబస్తు ఏర్పాటు చేశారు. 11 మంది ఎంపీల చేరిక జయలలిత సమాధి సాక్షిగా శశికళపై పన్నీర్ సెల్వం తిరుగుబాటు జెండా ఎగురవేసి ఐదు రోజులైంది. ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టేం దుకు ఆయన అనేక వ్యూహాలు అమలు చేశారు. ప్రజలు, పార్టీ కార్యకర్తలు, నాయ కులు, సినీ ప్రముఖుల మద్దతు సంపాదిం చడంలో సఫలీకృతులయ్యారు. అయితే, ఆదివారం సాయంత్రం వరకు ఆరుగురు ఎమ్మెల్యేలు మాత్రమే పన్నీర్‌కు జై కొట్టారు. ఇప్పుడు పన్నీర్ వర్గంలో ఆయనతో కలిపి ఏడుగురు ఎమ్మెల్యేలే ఉన్నారు. ఆదివారం ఎంపీలు జయసింగ్ త్యాగరాజన్(తూత్తుకుడి), సెంగుట్టువన్ (వేలూరు), మారుతీరాజా (పెరంబలూరు) రాజేంద్రన్ (విల్లుపురం), లక్ష్మణన్ (రాజ్యసభ), పార్తీబన్(తేని) మద్దతు ప్రకటించడంతో పన్నీర్‌కు ఇప్పటివరకూ 11 మంది ఎంపీల బలం తోడైంది. లోపం ఎక్కడుంది? అన్నాడీఎంకే ఎంపీలు పన్నీర్ సెల్వం శిబిరంలోకి ఎందుకు పరుగులు తీస్తున్నారు? దీని వెనుక రహస్యం ఏమిటి? అని శశికళ వర్గం ఆరా తీస్తోంది. ఆశించిన స్థాయిలో ఎమ్మెల్యేలు తమ వద్దకు ఎందుకు రావడం లేదని పన్నీర్ సెల్వం వర్గం మంతనాలు సాగిస్తోంది. లోపం ఎక్కడుంది? మెజారిటీ ఎమ్మెల్యేలను ఆకర్షించాలంటే ఇంకా ఏం చేయాలి? అనే దానిపై పన్నీర్ వర్గంలోని ముఖ్య నేతలు ఆదివారం విస్తృతంగా చర్చిం చారు. సోషల్ మీడియా ద్వారా మంత్రులు, ఎమ్మెల్యేలపై ఒత్తిడి పెంచడం, వారి కుటుంబ సభ్యులను నేరుగా కలవడం, పన్నీర్ సెల్వంతో ఫోన్లో మాట్లాడించి హామీలు ఇప్పించడం వంటి వ్యూహాలు అమలు చేయాలని నిర్ణయిం చారు. ఇందులో భాగంగానే మంత్రి పాండియ రాజన్ ఆదివారం మైలాపూర్ ఎమ్మెల్యే నటరాజన్‌ను కలిసి చర్చలు జరిపారు. పన్నీర్ సెల్వంతో ఫోన్లో మాట్లాడించి ఆహ్వానించేలా చేశారు. అయితే, తాను ఇప్పటికిప్పుడు ఏ నిర్ణయమూ తీసుకోలేనని నటరాజన్ సమాధానం ఇచ్చారు. ఎందుకు వెళ్తున్నారో వారినే అడగండి శశికళ శిబిరం నుంచి మాయమైన ముగ్గురు ఎమ్మెల్యేలు తమవైపు వస్తారని పన్నీర్ సెల్వం భావించినా వారి నుంచి వర్తమానం అందలేదు. మరో రెండు, మూ డు రోజుల్లో తమ వర్గంలోని ఎమ్మెల్యేల సంఖ్య మూడంకెలకు (వందకుపైగా) చేరుతుందని పాండియరాజన్ ప్రకటిం చారు. మరోవైపు ఎంపీలు తన పట్టు నుంచి జారిపోతుండడాన్ని శశికళ తేలిగ్గా తీసుకున్నారు. ఎందుకు వెళుతున్నారో, ఎవరు పంపుతున్నారో వారినే అడగండి అని మీడియాతో వ్యాఖ్యానించారు. పన్నీర్ సెల్వం ఎన్ని ఎత్తులు వేసినా ఎమ్మెల్యేలను కాపాడుకోగలుగుతానని శశికళ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఆ 32 మంది ఎమ్మెల్యేలు ఎక్కడ? శిబిరాలలో ఉన్న ఎమ్మెల్యేల లెక్కలపై తమిళనాట తీవ్ర ఉత్కంఠ నెలకొంది. శశికళ శిబిరంలో 94 మంది ఎమ్మెల్యేలు ఉన్నట్లు లెక్క తేలింది. పన్నీరు సెల్వం శిబిరంలో ఆయనతో కలిపి ఉన్న ఎమ్మెల్యేలు ఏడుగురు మాత్రమే. తాను తటస్థం అని మైలాపూర్ ఎమ్మెల్యే నటరాజ్ ప్రకటించారు. మరి అన్నా డీఎంకే నుంచి గెలిచిన 134 మంది ఎమ్మెల్యేలలో మిగిలిన 32 మంది ఎక్కడున్నారు? వాళ్లంతా ఒకే చోట ఉన్నారా లేక వేర్వేరు చోట్ల ఉన్నారా? వారు ఎవరి పక్షం? ఇలాంటి ప్రశ్నలపై అనేక ఊహాగానాలు జోరుగా సాగుతున్నాయి. వారందరినీ చిన్నమ్మ శశికళే రహస్య ప్రదేశంలో ఉంచినట్లు ప్రచారం జరుగుతోంది. విచారణలో కనిపించింది 94 మంది ఎమ్మెల్యేలు చేజారిపోకుండా కూవత్తూరులోని గోల్డెన్ బే రిసార్ట్‌లో శశికళ మద్దతుదారులు క్యాంప్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఎమ్మెల్యేలను బలవంతంగా నిర్బంధించారన్న ఆరోపణలపై మద్రాసు హైకోర్టు శుక్రవారం విచారణకు ఆదేశించింది. దీంతో కాంచీపురం పోలీసులు, రెవెన్యూ అధికారులు శనివారం ఎమ్మెల్యేల వద్ద విచారణ చేపట్టి, లిఖితపూర్వక వాంగ్మూలం తీసుకున్నారు. ఈ విచారణ నివేదికను సోమవారం మద్రాసు హైకోర్టుకు సమర్పించనున్నారు. అయితే, 94 మంది ఎమ్మెల్యేలు మాత్రమే క్యాంప్‌లో ఉన్నట్టు పోలీసుల విచారణలో తేలింది. కనపించని 32 మంది ఎమ్మెల్యేలు పన్నీర్ సెల్వం మద్దతుదారులైతే ఇప్పటికే ఆ శిబిరంలో చేరి ఉండేవారని, వారంతా శశికళ మద్దతుదారులేనని ఆమె వర్గం నేతలు చెబుతున్నారు. కువత్తూరులో ఉద్రిక్తత అన్నాడీఎంకే ఎమ్మెల్యేల శిబిరం ఏర్పాటు చేసిన కువత్తూరులో ఆదివారం ఉద్రిక్తత చోటు చేసుకుంది. మీడియాపై శశికళ మద్దతుదారులు విరుచుకుపడ్డారు. ఆదివారం సాయంత్రం ఎమ్మెల్యేలతో సమావేశమయ్యేందుకు శశికళ అక్కడకు రావడంతో మీడియా ప్రతినిధులు కూడా వచ్చారు. వారిని అక్కడున్న మన్నార్గుడి ప్రైవేటు సెక్యూరిటీ వారు అడ్డుకుని దురుసుగా ప్రవర్తించారు. దీంతో మీడియా ప్రతినిధులు ఆ మార్గంలో బైఠాయించి ఆందోళనకు దిగడంతో ఉత్కంఠ నెలకొంది. పలువురు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు మీడియా ప్రతినిధుల వద్దకు వచ్చి సముదాయించారు. మరోసారి ఇలాంటి ఘటనలు చోటుచేసుకోకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. -
ఢిల్లీని ఢీ కొడతా
ఎన్నో కష్టాలు అనుభవించా... నాకు జైళ్లు కొత్త కాదు: శశికళ - ఢిల్లీ వరకూ చెబుతున్నా నన్నెవరూ ఏమీ చేయలేరన్న చిన్నమ్మ - ఆడదాన్నని అణగదొక్కాలనుకుంటే ‘అమ్మ’లా గర్జిస్తా.. - సమస్యలు జటిలమైతే ఎదుర్కొనేందుకు ప్రాణత్యాగానికైనా సిద్ధం - అసెంబ్లీలో జయలలిత ఫొటో పెడదాం.. ఇది ఖాయం - మద్దతుదారులైన ఎమ్మెల్యేలతో సమావేశమైన శశికళ కువత్తూరు నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి ‘‘జయలలితతో కలిసి ఎన్నో కష్టాలు అనుభవించాను. చెన్నై జైలు కొత్తకాదు.. బెంగళూరు జైలు కొత్త కాదు. జైలు నుంచి బయటకు వచ్చాం. మళ్లీ అధికారం చేజిక్కించు కున్నాం. మహిళ అనుకుని భయపెట్టి, అణగ దొక్కాలని చూస్తే ‘అమ్మ’లాగే నేను కూడా ఢిల్లీని ఢీ కొట్టేందుకు రెడీ. ఢిల్లీ వరకూ చెబుతున్నా.. నన్ను ఎవరూ ఏమీ చేయలేరు. ఎన్ని కుట్రలు, కుతంత్రాలు పన్నినా ఎదుర్కొనే దమ్మూ «ధైర్యం నాకున్నాయి. ఎట్టిపరిస్థితుల్లోనూ వెనకడుగు వేసే ప్రసక్తే లేదు’’ అని అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ తేల్చిచెప్పారు. ఆమె ఆదివారం రాత్రి మహాబలిపురం సమీపంలోని కువత్తూరు గోల్డెన్ బే రిసార్ట్‌లో తన మద్దతుదారులైన ఎమ్మెల్యేలతో సమావేశమయ్యారు. ఎరుపెక్కిన కళ్లతో విలపిస్తూ గంటసేపు మాట్లాడారు. శశికళ ప్రసంగం ఆమె మాటల్లోనే.. ‘‘అమ్మ(జయలలిత) చేతుల మీదుగా మహాశక్తిగా అవతరించి అన్నాడీఎంకేను కాపాడుకోవాలనే ఒకే ఉద్దేశంతో మీ దగ్గరకు వచ్చాను. కోపం ముఖ్యం కాదు, మన కర్తవ్యం ముఖ్యం. ‘అమ్మ’ సమాధి వద్దకు వెళ్లినప్పుడు తీవ్ర ఉద్వేగానికి లోనయ్యాను. అక్కడి నుంచి బయటకు రాలేకపోయాను. ఇక్కడికొచ్చాక ఆ భారం కొంత దిగింది. ఇక్కడున్న మీరంతా సింహాలే.. మీతో పాటు నేనూ ఒక సింహమే. భయపెట్టడం తప్ప మనల్ని ఎవరూ ఏమీ చేయలేరు. అయితే, మన జగ్రత్తలో మనం ఉండాలి. మనమంతా ఒకే లక్ష్యంతో ముందుకు సాగాలి. పార్టీకి పన్నీర్ సెల్వం కళంకం తెచ్చారు తమిళ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ‘అమ్మ’ అధికారాన్ని మనకు అప్పగించి వెళ్లారు. దీన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా ఉంది. నేను మాత్రమే కాదు, మీరంతా శ్రమించాలి. వరుసగా మూడోసారి (వచ్చే ఎన్నికల్లో ) మళ్లీ అధికార పగ్గాలు చేపట్టే శక్తిగా ఎదగాలి. బ్రహ్మాండమైన పరిపాలనతో ప్రజల మన్ననలు అందుకుని, రానున్న లోక్‌సభ ఎన్నికల్లో 40 స్థానాలు (పుదుచ్చేరితో కలిపి) గెలుచుకుని ‘అమ్మ’ సమాధి వద్ద కానుకగా సమర్పిద్దాం. ఇందుకోసం ‘అమ్మ’ ముందుగానే తగిన పథకాలు రచించారు. అయితే, మన చేతితో మన కళ్లను పొడిచే విధంగా పన్నీర్ సెల్వం కుట్రలు పన్ని పార్టీకి కళంకం తెచ్చారు. నేను వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చాను. ఆయన(పన్నీర్‌సెల్వం) కూడా వ్యవసాయ కుటుంబం నుంచే వచ్చారు. నమ్మకం, విధేయత అని చెప్పుకుంటూ ఇప్పుడు ఎందుకోసం తిరుగుబాటు చేశారు? సమస్యలు జఠిలమైతే ఎదుర్కొనేందుకు ప్రాణాత్యాగానికైనా సిద్ధం. మీరు నాకు కోటి మందితో సమానం మనందరి ముందు పెద్ద బాధ్యత ఉంది. ‘అమ్మ’ ఫొటో ముందు ప్రతిజ్ఞ చేద్దాం. 125 మంది నేరుగా ‘అమ్మ’ సమాధి వద్దకు వెళదాం. అక్కడి నుంచి నేరుగా సచివాలయంలో అడుగుపెడదాం. అసెంబ్లీ లోపల జయలలిత ఫొటో పెట్టబోతున్నాం.. ఇది ఖాయం. మీరంతా నా వెంట ఉంటే నాకు కోటి మందితో సమానం. ఇక్కడున్న వారంతా సంపన్నులు కాదు. పేదవాళ్లూ ఎమ్మెల్యేలు అయ్యారు. ఇది ‘అమ్మ’ దయ. కిందిస్థాయి కార్యకర్త కూడా ఉన్నత స్థానంలో ఉండాలన్నదే ‘అమ్మ’ ఆకాంక్ష.. ఇది కొనసాగుతుంది. ప్రతిపక్ష డీఎంకే గురించి మీకెవరికీ తెలియదు. అక్కడ ఎన్ని కుట్రలు జరుగుతున్నాయో అవన్నీ నాకు తెలుస్తాయి. అక్కడ(డీఎంకేలో) నావాళ్లు ఉన్నారు. వాళ్లు గానీ (డీఎంకే), ఇంకెవరైనా గానీ ఎన్ని కుట్రలు చేసినా ఎదుర్కొందాం. అమ్మ ఫొటో అసెంబ్లీలో ఉండాల్సిందే.. ఈ నిర్ణయంలో ఎలాంటి మార్పు లేదు.. మనమంతా ఒకటిగా ఉందాం’’ అని శశికళ పిలుపునిచ్చారు. -
చెన్నైలో హై టెన్షన్
-
తమిళ రాజకీయాల్లో సరికొత్త ట్విస్ట్
-
పన్నీర్ మైండ్ గేమ్ షురూ..
-
చెన్నైలో హై టెన్షన్
రాష్ట్రంలో 144 సెక్షన్ అమలుకు పరిశీలన సాక్షి, చెన్నై: తమిళనాడు రాజధాని నగరం చెన్నైలో నరాలు తెగే ఉత్కంఠ భరిత వాతావరణం నెలకొంది. అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి చిన్నమ్మ శశికళ, ఆపద్ధర్మ సీఎం పన్నీరుసెల్వం వర్గీయుల మధ్య పెరుగుతున్న మాటల దాడి, పరస్పరం ఫిర్యాదులు, బెదిరింపు ల పర్వం ఉత్కంఠభరిత వాతావరణాన్ని సృష్టిస్తున్నాయి. కేంద్రంపై యుద్ధాన్ని ప్రకటించే విధంగా శశికళ వ్యాఖ్యల తూటాలు, పన్నీరుకు మద్దతుగా ఎమ్మె ల్యేలపై ఒత్తిడికి ఓటర్లు సిద్ధం కావడం, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఈ 14వ తేదీ శశికళకు వ్యతిరేకంగా ఏదేని తీర్పు వెలువడ్డ పక్షంలో ఆ వర్గీయులు వీరంగాలకు దిగే చాన్స్ ఉందన్న సమాచారంతో అధికార వర్గాలు ముం దస్తు చర్యలు చేపడుతున్నాయి. రాజ్‌భవన్ పరిసరాల్ని భద్రతా వలయంలోకి తెచ్చారు. ఇక రాష్ట్రంలో 144 సెక్షన్ అమలుకు తగ్గ కసరత్తులపై అధికార యంత్రాంగం దృష్టి కేంద్రీకరించింది. చెన్నై పోలీసు కమిషనర్ జార్జ్ అధికా రులను అప్రమత్తం చేస్తూ సాయంత్రం ఆదేశాలు జారీ చేశారు. నగరంలో వాహ నాల తనిఖీలు విస్తృతం చేయాలని అందులో పేర్కొన్నారు. లాడ్జీలు, మ్యాన్ షన్లు, సర్వీస్ అపార్టుమెంట్లు, కల్యాణ మండపాలు తదితర వాటిని బయట వ్యక్తులకు ఇవ్వరాదని ఆంక్షలు విధించా రు. నగర శివారులు, ప్రధాన మార్గాల్లో ప్రత్యేక చెక్ పోస్టుల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. శాంతి భద్రతలకు విఘాతం కల్గించే విధంగా ఎవరైనా వ్యవహరిస్తే కఠినంగా స్పందించాల్సి ఉంటుందని హెచ్చరించారు. -
పన్నీర్ మైండ్ గేమ్ షురూ..
- సెల్వం శిబిరానికి మంత్రి, నలుగురు ఎంపీలు సహా పలువురు మాజీలు, పార్టీ ముఖ్యనేతలు - నష్ట నివారణకు నేరుగా రంగంలోకి దిగిన చిన్నమ్మ - పన్నీర్ ఇంటికి చేరిన అన్నాడీఎంకే వ్యవస్థాపక నాయకుడు పొన్నయ్యన్ చెన్నై నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: తమిళ ప్రజలు, సినీ ప్రముఖులు, ప్రతిపక్ష పార్టీల మద్దతు, కేంద్ర ప్రభుత్వం అండతో ఊపు మీదున్న ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం చిన్నమ్మ శశికళ వర్గాన్ని విచ్చిన్నం చేయడానికి శనివారం నుంచి తన మైండ్‌గేమ్ వేగం పెంచారు. కేంద్రప్రభుత్వం, గవర్నర్ తనకే మద్దతుగా ఉన్నారనే సంకేతాలు పంపుతూ శశికళ శిబిరంలోని ఎమ్మెల్యేల్లో గందరగోళం సృష్టించగలిగారు. మంత్రి పాండియరాజన్, ఎంపీలు టీఆర్ సుందరం, అశోక్‌కుమార్, సత్యభామ, వనరోజాలతోపాటు పలువురు పార్టీ ముఖ్యులను తన వైపునకు రప్పించుకోగలిగారు. శశికళ నివాసం ఉంటున్న జయలలిత ఇంటిని అమ్మ స్మారక భవనంగా మార్చేందుకు సంతకాల సేకరణకు శ్రీకారం చుట్టారు. తమిళనాడుకు కేంద్ర బలగాలు రాబోతున్నాయని కార్యకర్తల సమావేశంలో ప్రకటించి ప్రత్యర్థి శిబిరంలో మరింత ఆందోళన కలిగించారు. తాజా పరిణామాలపై శశికళ పోయెస్ గార్డెన్లో పార్టీ ముఖ్యులతో సమావేశమయ్యారు. శిబిరంలోని ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. అయితే ఆ సమావేశం ముగియగానే అక్కడినుంచి ఐదుగురు మంత్రులు, ఒక ఎమ్మెల్యే కనిపించకుండా పోవడం వారికి ఆందోళన కలిగిస్తోంది. మధుసూదనన్ మంత్రాంగం అన్నాడీఎంకే వ్యవస్థాగత వ్యవహారాలు, కార్యకర్తలు, నాయకుల బలాబలాలపై లోతైన అవగాహన ఉన్న పార్టీ ప్రిసీడియం చైర్మన్ మధుసూదనన్‌ను అనూహ్యంగా తన వైపునకు తిప్పుకోవడంతో పన్నీర్‌కు పెద్ద అండ దొరికింది. పార్టీలో ముఖ్యులు ఎవరిని ఎలా తమ ఆధీనంలోకి తెచ్చుకోవాలనే విషయాలు బాగా తెలిసిన మధుసూదనన్ పార్టీ కేడర్‌ను పన్నీర్ శిబిరంలోకి తేవడంలో నిమగ్నమయ్యారు. విస్తృతమైన తన సంబంధాలు, అవగాహనతో శనివారంనాటికి పార్టీ వ్యవస్థాపక సభ్యుడు, పార్టీ అధికార ప్రతినిధి సి.పొన్నయ్యన్‌తోపాటు ఆరుగురు మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ జిల్లా శాఖల ముఖ్యులను పన్నీర్ శిబిరానికి చేర్చారు. పార్టీ బైలా ప్రకారం తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎన్నికే చెల్లదని ఆయన ప్రకటించి పార్టీ శ్రేణుల్లో ఆలోచన రేకెత్తించగలిగారు. శశికళ శిబిరంలో ఉన్న ఎమ్మెల్యేలు పన్నీర్ వైపునకు రావాలని వారి నియోజకవర్గ ప్రజలు, కుటుంబ సభ్యుల నుంచి తీవ్రమైన ఒత్తిడి చేయిస్తున్నారు. చిన్నమ్మ ఇక సీఎం కావడం జరగదు అనే ప్రచారాన్ని ప్రజల్లోకి, పార్టీ శ్రేణుల్లోకి విస్తృతంగా పంపగలిగారు. జయలలిత కుటుంబం మద్దతు పన్నీర్‌కే ఉందని చూపించడానికి ఆయన మద్దతుదారులు జయలలిత, పన్నీర్‌సెల్వం, దీపా జయకుమార్ ఫొటోలతో రాష్ట్రవ్యాప్తంగా పెద్ద సంఖ్యలో వాల్ పోస్టర్లు అంటించారు. ఈ నెల 24వ తేదీ జయలలిత జయంతి సందర్భంగా దీపా జయకుమార్ పన్నీర్ సెల్వంకు తన మద్దతు తెలుపుతారని ఇరు వర్గాల మద్దతుదారులు చెబుతున్నారు. మరోవైపు జయలలితతో కలిసి చెన్నై చర్చ్‌పార్కు స్కూల్లో చదువుకున్న మిత్రులు ముగ్గురు పన్నీర్‌కు మద్దతు ప్రకటించారు. -
త్వరలో అధికారంలోకి డీఎంకే!
- ప్రధాన ప్రతిపక్ష నేత స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు - తమిళ రాజకీయాల్లో సరికొత్త ట్విస్ట్ - 20 మంది ఎమ్మెల్యేలు కీలకం సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు తదుపరి ముఖ్యమంత్రి ఎవరు? శశికళనా... పన్నీర్ సెల్వమా? అని అందరూ బుర్రబద్దలు కొట్టుకుంటున్న తరుణంలో వీరిద్దరూ కాదు తామని డీఎంకే తెరపైకి వచ్చింది. రాష్ట్రంలో త్వరలో డీఎంకే ప్రభుత్వం వికసిస్తుందని పార్టీ అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నేత స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేయడం ద్వారా శనివారం కొత్త చర్చకు తెరదీశారు. అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజాశ్రేయస్సును కోరుకోవడం తమ పార్టీ కర్తవ్యంగా భావిస్తామని స్టాలిన్ పార్టీ శ్రేణులతో చెప్పారు. సుపరిపాలనతో ప్రజలను తమవైపు తిప్పుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పారు. అయితే శశికళ, పన్నీర్‌సెల్వం మధ్య బలపరీక్ష అనివార్యమైన పక్షంలో ప్రజాస్వామ్య పరిరక్షణ దృష్ట్యా తమ ఎమ్మెల్యేల మద్దతు ఉంటుందని స్టాలిన్ రెండు రోజుల క్రితమే ప్రకటించిన విషయం తెలిసిందే. అసెంబ్లీలో బలాబలాలు... తమిళనాడులో మొత్తం 235 అసెంబ్లీ స్థానాలు ఉండగా వాటిల్లో ఒక స్థానాన్ని ఆంగ్లో ఇండియన్‌ను నామినేట్ చేస్తారు. గత ఏడాది మేలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో, ఆ తరువాత జరిగిన ఉప ఎన్నికలు కలుపుకుని మొత్తం 136 స్థానాలను అన్నాడీఎంకే గెలుచుకుంది. జయలలిత మరణంతో ప్రస్తుతం 135 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. 89 స్థానాలతో డీఎంకే ప్రధాన ప్రతిపక్షంగా నిలిచింది. డీఎంకే మిత్రపక్షాలైన కాంగ్రెస్‌కు 8, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్‌కు ఒక ఎమ్మెల్యే ఉన్నారు. అధికారానికి మ్యాజిక్ ఫిగర్ 117 కాగా మిత్రపక్షాలను కలుపుకుని అసెంబ్లీలో డీఎంకే బలం 98. ఈ నేపథ్యంలో బలపరీక్షలో నెగ్గి పన్నీర్‌సెల్వం సీఎం కాలేరని భావించే, శశికళ వద్ద ఇమడలేని 20 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను చేరదీసి డీఎంకే అధికారంలోకి రావచ్చు. ఈ ఆలోచనతోనే స్టాలిన్ వ్యాఖ్యానించారనే అంశంపై చర్చలు జోరుగా సాగుతున్నాయి. తమిళ సీఎం ఎన్నికలో బీజేపీ పాత్ర లేదు: వెంకయ్యనాయుడు సాక్షి, హైదరాబాద్: తమిళనాడు రాజకీయా ల్లో బీజేపీ జోక్యం చేసుకోదని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు చెప్పారు. ఆ రాష్ట్ర అసెంబ్లీలో బీజేపీకి ఒక్క ఎమ్మెల్యే కూడా లేరని.. ప్రభుత్వ ఏర్పాటులో, సీఎం ఎన్నిక విషయంలో తమ పార్టీ కి ఎలాంటి పాత్రా లేదని పేర్కొన్నారు. ప్రస్తుతం తమిళనా డులో జరుగుతున్నది ఏఐఏడీఎంకే అంతర్గత వ్యవహారమన్నారు. నియమ, నిబంధనలకు అనుగుణంగా, రాష్ట్రపతి ఇచ్చే ఆదేశాలకు అనుగుణంగా ఆ రాష్ట్ర గవర్నర్ నిర్ణయం తీసుకుంటారని పేర్కొన్నారు. శనివారం హైదరాబాద్‌లోని కేశవ స్మారక విద్యాలయంలో ఆయన విలేక రులతో మాట్లాడారు. తమిళనాడులో పరిణా మాలు బాధాకరమని.. జయలలిత ఆశయాలకు అనుగుణంగా పనిచేసే ప్రభు త్వం రావాలని అక్కడి ప్రజలు కోరుకుంటు న్నారని వెంకయ్య చెప్పారు. జయలలిత తర్వాత కూడా ఏఐఏడీఎంకేతో సంబంధాలు కొనసా గించాలనే అభిప్రాయంతో ఉన్నామని తెలిపారు. ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నం దున.. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై మోదీతో తెలంగాణ ప్రభుత్వ అఖిలపక్ష భేటీ వాయిదా పడిందన్నారు. ప్రజలు కాంగ్రెస్‌ను బహిష్కరిస్తారు: మన్మోహన్పై ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సమావేశాలను బహిష్కరిస్తా మంటోందని.. ఆ విధంగా చేస్తే ఆ పార్టీని ప్రజలు బహిష్కరిస్తారని వెంకయ్య నాయు డు వ్యాఖ్యానించారు. -
పన్నీర్ సెల్వం రాయని డైరీ
గవర్నర్‌కి ఏదో అయిందన్నట్లుగా అంతా వెళ్లి ఆయన్ని కలిసొస్తున్నారు! గవర్నర్ కూడా తనకేదో అయిందన్నట్లుగా అందర్నీ రాజ్‌భవన్‌కి పిలిపించుకుంటున్నారు. తమిళనాడులో ఇప్పుడిది గవర్నర్ పదవీ విరమణలా ఉంది కానీ, తమిళనాడులో ప్రభుత్వం ఏర్పాటుకు జరుగుతున్న బల నిరూపణలా లేదు! సాయంత్రం గవర్నర్‌ని కలిశాను. తీక్షణంగా నా వైపు చూశారు! నేను చీఫ్ మినిస్టర్‌గా ఉన్నప్పుడు ఆయనలో అంత లోతైన చూపు లేదు. అంత ఘాటైన భావన లేదు. ‘ఉన్న దాన్ని ఊడదీసుకుని, మళ్లీ ఇప్పుడొచ్చి నన్ను తగిలించమంటే ఎలా?’ అన్నట్లు చిరాగ్గా చూశారు. ‘మీరు మునుపటిలా లేరు’ అనబోయి ఆగిపోయాను. ఆయన మునుపటిలానే ఉన్నారు గవర్నర్‌గా! నేనే.. మునుపటిలా లేను ముఖ్యమంత్రిగా! అందుకే ఆగిపోయాను. ‘మీరు అన్నీ చూస్తూనే ఉన్నారు’ అని మొదలుపెట్టాను. మళ్లీ ఆయన చిరాగ్గా చూశారు. ‘ఏంటి చూసేది! నువ్వే అన్నీ చూపిస్తున్నావు’ అన్నారు. హర్ట్ కాబోయి ఆగిపోయాను. హర్ట్ అయినప్పుడు నాకు కన్నీళ్లు వస్తాయి. కన్నీళ్లొస్తే తుడుచుకోమని చెప్పడానికి ఇప్పుడు అమ్మ లేదు. తుడుచుకోమని అమ్మ చెప్పందే తుడుచుకునే అలవాటు నాకూ లేదు. అందుకే ఆగిపోయాను. ‘ఉత్తి పుణ్యానికి నా నెత్తిన బండెత్తేశావు కదయ్యా సెల్వం. నా ఫ్యామిలీ టూర్ మొత్తం పాడు చేసేశావ్. కాసేపలా కూర్చో, ఏం చేయాలో ఆలోచిద్దాం’ అన్నారు ఆనరబుల్ గవర్నర్. ఆయన చెప్పినట్లే కూర్చున్నాను. కానీ ఆయనే.. ఏం చేయాలో ఆలోచిస్తున్నట్లు లేదు! ‘ఒక్క చాన్సివ్వండి’ అని అడగబోయి ఆగిపోయాను. మూడుసార్లు ముఖ్యమంత్రిని అయ్యానన్న గౌరవం లేకుండా, ఎంత మాట పడితే అంత మాట అనేసేలా ఉంది ఆయన వాలకం! అందుకే ఆగిపోయాను. నేనక్కడ ఉండగానే గవర్నర్‌ను కలవడానికి చీఫ్ సెక్రెటరీ గిరిజా వైద్యనాథన్ వచ్చారు. ఆమె అక్కడ ఉండగానే గవర్నర్‌ను కలవడానికి పోలీస్ చీఫ్ రాజేందర్ వచ్చాడు. వాళ్లిద్దరూ అక్కడ ఉండగానే గవర్నరును కలవడానికి చీఫ్ జస్టిస్ కౌల్ వచ్చారు. వాళ్ల ముగ్గురూ అక్కడ ఉండగానే గవర్నరును కలవడానికి శశికళ వస్తోందన్న కబురొచ్చింది! అంతా కలిసి శశికళను రాజ్‌భవన్ నుంచే ఊరేగింపుగా తీసుకెళ్లరు కదా!! ‘ఎక్స్‌క్యూజ్‌మీ సర్..’ అనుకుంటూ కుర్చీలోంచి లేచి నిలబడ్డాను. ‘సార్.. ముందు నాకే అవకాశం ఇస్తారు కదా.. బల నిరూపణకు’ అన్నాను. ‘నీకే ఇస్తానయ్యా పన్నీర్ సెల్వం’ అన్నారు గవర్నర్. ‘మరి.. వాళ్లెందుకొచ్చారు సార్’ అని అడిగాను. గవర్నర్ మళ్లీ చిరాగ్గా చూశారు. ‘మీ ఇద్దరిలో ఎవరు బలాన్ని నిరూపించు కున్నా.. తర్వాత నేనే కదయ్యా లా అండ్ ఆర్డర్లో నా బలాన్ని నిరూపించుకోవలసింది’ అన్నారు! - మాధవ్ శింగరాజు -
తమిళనాడు రాజకీయాల్లో ఎత్తులు పైఎత్తులు
-
ఎత్తుకు పైఎత్తు
ఎమ్మెల్యేలు@శశివిలాస్.. పన్నీర్ మసాలా పబ్లిక్ హిట్ తమిళనాడులో క్షణక్షణానికీ మారుతున్న రాజకీయ సమీకరణలు - మధుసూదనన్‌పై చిన్నమ్మ వేటు - ప్రిసీడియం చైర్మన్‌గా సెంగోట్టియన్ నియామకం - ఎమ్మెల్యేలను బయటకు తెచ్చేందుకు పన్నీర్ తీవ్ర ప్రయత్నాలు - కోర్టు ఆదేశంతో శిబిరాలను విచ్ఛిన్నం చేసే యత్నం - శశికళ ఎన్నిక చెల్లదంటూ ఈసీకి మధుసూదనన్ ఫిర్యాదు - గవర్నర్ రాజ్యాంగాన్ని అమలు చేయక తప్పదని చిన్నమ్మ ధీమా - అసెంబ్లీని సమావేశ పరచాలని గవర్నర్‌కు స్టాలిన్ వినతి - ఎటు వైపు మొగ్గాలో తేల్చేందుకు కాంగ్రెస్ నేతలకు రాహుల్ పిలుపు - శాంతిభద్రతల అంశంపై సీఎస్, డీజీపీతో గవర్నర్ సమీక్ష - తమిళనాడులో తొలగని ఉత్కంఠ చెన్నై నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి చర్యలు, ప్రతి చర్యలు... సవాళ్లు, ప్రతి సవాళ్లు... ఎత్తులు, పైఎత్తులు... వ్యూహాలు, ప్రతివ్యూహాలతో తమిళనాడులో రాజకీయ సమీకరణాలు క్షణక్షణం మారిపోతున్నాయి. ముఖ్యమంత్రి కుర్చీకోసం తలపడుతున్న ఆపద్ధర్మ సీఎం పన్నీర్ సెల్వం, అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ శుక్రవారం రాజకీయాన్ని మరింత రసవత్తర స్థాయికి చేర్చారు. శశికళ ప్రమాణ స్వీకారం కోసం మద్రాసు యూనివర్సిటీ ఆవరణంలో ఏర్పాటు చేసిన బందోబస్తును పన్నీర్ తొలగింపచేశారు. కుటుంబ పాలనకు వ్యతిరేకంగా పుట్టిన అన్నాడీఎంకేను ఎట్టి పరిస్థితుల్లోనూ శశికళ కుటుంబం చేతుల్లో పడనీయబోమని ప్రకటించారు. అమ్మ జయలలిత చీరలాగిన డీఎంకేతో అంటకాగుతున్న పన్నీర్ సెల్వం పచ్చి ద్రోహి అని శశికళ దీటుగా ధ్వజమెత్తారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా తాను కచ్చితంగా బాధ్యతలు స్వీకరిస్తానని ధీమా వ్యక్తం చేశారు. పన్నీర్ శిబిరంలో చేరిన ప్రిసీడియం చైర్మన్ మధుసూదనన్‌ను పార్టీ నుంచి బహిష్కరించి... ఆయన స్థానంలో మాజీమంత్రి సెంగోట్టియన్‌ను నియమించారు. ఇందుకు ప్రతి చర్యగా మధుసూదనన్ పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎన్నికే చెల్లదంటూ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. శశికళను పార్టీ నుంచి బహిష్కరించడంతోపాటు ప్రాథమిక సభ్యత్వాన్ని సైతం రద్దుచేశామని ప్రకటించారు. పోయెస్ గార్డెన్‌లోని వేద నిలయం (జయలలిత ఇల్లు)ను అమ్మ స్మారకమందిరంగా మార్చుతామని వెల్లడించారు. మరోవైపు ఎమ్మెల్యేలు ఎక్కడున్నారనే అంశంపై తమకు నివేదిక ఇవ్వాలని హైకోర్టు ఆదేశించగా... శశికళ వర్గం ఎమ్మెల్యేల శిబిరాన్ని మార్చేసింది. తమను ఎవరూ నిర్బంధించలేదని కొందరు అనుకూల ఎమ్మెల్యేలతో మాట్లాడించింది. ప్రస్తుత సంక్షోభానికి ఒకటి, రెండు రోజుల్లో ముగింపు పడి తామే అధికారం చేపడతామని శశికళ ఎమ్మెల్యేలతో వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడి ధైర్యం చెప్పారు. శాంతి భద్రతల పరిస్థితిపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాథన్, డీజీపీ రాజేంద్రన్‌తో సమీక్షించిన గవర్నర్ విద్యాసాగర్‌రావు ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడంతో సీఎం కుర్చీ ఎవరికి దక్కుతుందనే ఉత్కంఠ మరింత తీవ్రమైంది. అయితే మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉన్నందున ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు తనను ఆహ్వానించాలంటూ శశికళ చేసిన విజ్ఞప్తిని గవర్నర్ తప్పనిసరిగా పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరంలేదని మాజీ గవర్నర్ కొణిజేటి రోశయ్య వ్యాఖ్యానించడం గమనార్హం. ప్రస్తుత సంక్లిష్ట రాజకీయ పరిస్థితుల్లో కేంద్రం సలహా మేరకే గవర్నర్ వ్యవహరించే అవకాశమే ఎక్కువగా ఉంటుందని ఆయన అభిప్రాయపడటం భవిష్యత్ పరిణామాలకు సూచకంగా కనిపిస్తోంది. రప్పిస్తారా? కాపాడుకుంటారా? రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు, పార్టీ కార్యకర్తలు, సినీ తారలు తనకు అండగా నిలిచినా... ఇతర రాజకీయ పార్టీలు తననే బలపరుస్తున్నా ఎమ్మెల్యేలు శశికళ శిబిరంలో ఉన్నతంకాలం తానేం చేయలేనని పన్నీర్‌కు తెలుసు. అందుకే శశికళ శిబిరంలో ఉన్న ఎమ్మెల్యేలను బయటకు తేవడానికి ముప్పేట దాడి మొదలుపెట్టారు. ఎమ్మెల్యేలను శశికళ నిర్బంధించారంటూ హైకోర్టులో తన మద్దతుదారులతో పిటిషన్ వేయించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు కనిపించడం లేదని ఆయా నియోజక వర్గాలకు చెందిన ప్రజల ద్వారా పోలీసులకు ఫిర్యాదు ఇప్పించారు. పన్నీర్ దూకుడును గమనించిన శశికళ వర్గం ఎమ్మెల్యేలెవ్వరూ చేజారకుండా పటిష్టమైన ఏర్పాట్లు చేసుకున్నారు. పిటిషన్‌పై స్పందించిన చెన్నై హైకోర్టు ఎమ్మెల్యేలు ఎక్కడ ఉన్నారు? ఎలా ఉన్నారు? అనే అంశంపై సోమవారంలోగా నివేదిక ఇవ్వాలని రాష్ట్ర హోం శాఖ కార్యదర్శి, డీజీపీ, చెన్నై పోలీసుకమిషనర్, కాంచీపురం జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. దీన్ని అవకాశంగా తీసుకుని పోలీసు బలంతో ఎమ్మెల్యేలను బయటకు రప్పించేందుకు పన్నీర్ అధికార అస్త్రం ప్రయోగించారు. అయితే ఈ విషయం తెలియడంతో చిన్నమ్మ మద్దతుదారులు వాయువేగంతో తమ ఎమ్మెల్యేలను మరో శిబిరానికి తరలించారు. ఈస్ట్ కోస్టు రోడ్డులోని గోల్డన్ బే రిసార్ట్స్‌లో ఉన్న ఎమ్మెల్యేల వద్దకు వెళ్లబోయిన మీడియాను చిన్నమ్మ నియమించిన బౌన్సర్లు అడ్డుకున్నారు. శశికళకు అత్యంత నమ్మకస్తులైన 11 మంది శాసనసభ్యులను మాత్రం రిసార్ట్స్ నుంచి రెండు కిలోమీటర్ల దూరానికి తీసుకుని వచ్చి తాము ఎలాంటి నిర్బంధంలో లేమనీ, స్వేచ్ఛగా ఉన్నామని మాట్లాడించి తీసుకుని వెళ్లారు. తన ప్రయత్నం సఫలం కాకపోవడంతో పోలీసు బలగాలను ప్రయోగించి ఒకటి రెండు రోజుల్లో వారిని బయటకు తీసుకు రావడానికి పన్నీర్ వ్యూహాలు రచిస్తున్నారు. ఎటువంటి పరిస్థితులు ఎదురైనా ఎమ్మెల్యేలను చేజారనివ్వకుండా శశికళ కూడా చాలా గట్టి ఏర్పాట్లు చేశారు. పన్నీర్ వెనుక డీఎంకే ఉందని శశికళ మద్దతుదారులు పెద్ద ఎత్తున రాజకీయ దాడికి దిగారు. రహస్య శిబిరంలో ఉన్న ఎమ్మెల్యేలతో శశికళ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడి ధైర్యం చెప్పారు. మంత్రులు, ఎమ్మెల్యేలపై ఫిర్యాదులు మంత్రులు, ఎమ్మెల్యేలు కనిపించడం లేదని ఆయా నియోజక వర్గాలకు చెందిన ప్రజల ద్వారా పోలీసులకు ఫిర్యాదు ఇప్పించి పరోక్షంగా వారి మీద ఒత్తిడి పెంచడానికి పన్నీర్ వర్గం స్కెచ్ గీసింది. ఇందులో భాగంగానే శుక్రవారం వేలూరు జిల్లా ఆరణి శాసనసభ్యుడు, దేవాదాయ శాఖ మంత్రి సేపూరు రామచంద్రన్ ఈ నెల 7వ తేదీ నుంచి కనిపించడం లేదని ఆ నియోజకవర్గానికి చెందిన కార్యకర్తలు ఆరణి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఇదే జిల్లాలోని అంటూరు ఎమ్మెల్యే బాలసుబ్రమణి కిడ్నాప్‌కు గురయ్యారని అక్కడి పన్నీర్ మద్దతుదారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ రకమైన ఒత్తిడి వస్తుందని ముందే ఊహించిన చిన్నమ్మ మద్దతుదారులు ఎమ్మెల్యేలను శిబిరానికి తరలించే సమయంలోనే వారి మొబైల్ ఫోన్లు తీసుకుని స్విచ్చాఫ్ చేసేశారు. తెర మీదకు స్టాలిన్, రాహుల్ అన్నా డీఎంకేలో సంక్షోభం వారి అంతర్గత వ్యవహారమని చెబుతూ వచ్చిన డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత స్టాలిన్ శుక్రవారం రాత్రి తెర మీదకు వచ్చారు. గవర్నర్‌ను కలసి అసెంబ్లీని సమావేశపరచి, సుస్థిర ప్రభుత్వం ఏర్పాటయ్యేలా చూడాలని డిమాండ్ చేయడం ద్వారా పరోక్షంగా పన్నీర్‌కు మేలు చేసే ఎత్తుగడ వేశారు. పన్నీరే కాకుండా ప్రధాన ప్రతిపక్షం కూడా శాసనసభను సమావేశ పరచాలని కోరిందని గవర్నర్ చెప్పుకునే అవకాశం కల్పించారు. అయితే ఈ అంశం గురించి శశికళ వర్గం తన మీద రాజకీయ దాడి చేయకుండా ఉండేందుకు పన్నీర్ సెల్వం పూర్తి స్థాయి సీఎంగా పనిచేయలేక పోయారని చిన్న విమర్శ చేశారు. మరోవైపు డీఎండీకే అధ్యక్షుడు విజయకాంత్ కూడా పెరంబలూరులో పార్టీ వర్గాలతో అత్యవసరంగా సమావేశమయ్యారు. పన్నీర్‌కు మద్దతుగా స్పందించాలని పలువురు కార్యదర్శులు సూచించగా... ఆలోచించి నిర్ణయం తీసుకుందామని ఆయన చెప్పినట్లు తెలిసింది. శశికళకు మద్దతిస్తామంటూ టీఎన్‌సీసీ అధ్యక్షుడు తిరునావుక్కరుసు వ్యాఖ్యానించడాన్ని ఆ పార్టీ సీనియర్ నేతలు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ విషయాన్ని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ దృష్టికి తీసుకెళ్లగా ఆయన పిలిపించి తటస్థంగా ఉండాలని సూచించారు. శాసనసభలో ఎనిమిదిమంది సభ్యుల బలం ఉన్న కాంగ్రెస్ చిన్నమ్మ వైపు మళ్లకుండా పన్నీర్ ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేయగలిగారని తెలుస్తోంది. అయితే చిన్నమ్మ వర్గం సైతం కాంగ్రెస్ మద్దతుకోసం ప్రయత్నాలు చేస్తోంది. తేల్చని గవర్నర్.. తీవ్రమైన ఉత్కంఠ ముఖ్యమంత్రి సీటు దక్కించుకునేందుకు పడుతున్న పన్నీర్, శశికళతో మాట్లాడి వారి వాదనలు, అభిప్రాయాలు విన్న ఇన్చార్జ్ గవర్నర్ విద్యాసాగర్‌రావు 24 గంటలు గడిచినా తన నిర్ణయం ఏమిటో ప్రకటించలేదు. శశికళ మీద ఉన్న అక్రమాస్తుల కేసు, న్యాయ సలహాలు తీసుకోవడం, క్షేత్ర స్థాయిలో పరిస్థితులను అవగాహన చేసుకునే పేరుతో ఆయన శుక్రవారంకూడా ఈ సంక్షోభానికి ముగింపు పలకలేదు. కేంద్ర ప్రభుత్వ మార్గదర్శనం కోసం ఆయన ఎదురు చూస్తున్నారు. ప్రధాని నరేంద్రమోదీ, రాష్ట్ర బీజేపీ పన్నీర్‌కు గట్టిగా మద్దతు ఇస్తున్నందువల్ల కేంద్రం నుంచి పన్నీర్ బలపరీక్షకు అవకాశం ఇవ్వాలని సందేశం వస్తే గవర్నర్ దాన్ని అమలు చేస్తారా? లేక రాజ్యాంగాన్ని కాపాడడానికి స్వతంత్ర నిర్ణయం తీసుకుంటారా? అన్నాడీఎంకే సంక్షోభానికి ఏ విధమైన ముగింపు పలుకుతారనే విషయం అటు రాజకీయ పార్టీలు, ఇటు ప్రజల్లోను తీవ్ర ఉత్కంఠ రేపుతోంది. మరోవైపు శశికళను ఇప్పట్లో సీఎం చేయడం సరైందని కాదని గవర్నర్ కేంద్రానికి పంపిన నివేదికలో పొందుపరచినట్లు కొన్ని తమిళ, తెలుగు టీవీ చానళ్లలో కథనాలు ప్రసారం కావడం కలకలం సృష్టించింది. అయితే ఈ కథనాలు, ప్రచారాలను రాజ్ భవన్ వర్గాలు ఖండించాయి. -
తమిళనాడు గవర్నర్ నిర్ణయం తీసుకున్నారా?
చెన్నై: గడిచిన నాలుగురోజులుగా సాగుతోన్న రాజకీయ ప్రతిష్ఠంభనకు గవర్నర్ తెరదించినట్లు శుక్రవారం రాత్రి వార్తలు ప్రసారం కావడంతో తమిళనాట టెన్షన్ తారాస్థాయికి చేరింది. మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు తనకే ఉందని, ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించే అవకాశం కల్పించాలన్న శశికళ అభ్యర్థనను తమిళనాడు ఇన్చార్జి గవర్నర్ సి.విద్యాసాగర్‌రావు తిరస్కరించినట్లు, ఈ మేరకు శుక్రవారం కేంద్ర ప్రభుత్వానికి పంపిన నివేదికలో గవర్నర్ స్పష్టమైన అభిప్రాయం వెల్లడించినట్లు తెలిసింది. దీంతో చిన్నమ్మ వర్గం ఒక్కసారిగా షాక్‌కు గురైంది. ముఖ్యమంత్రి పదవికోసం పోటీ పడుతోన్న ఇద్దరు నేతల(శశికళ, ఓ.పన్నీర్ సెల్వం)తో గురువారం భేటీ అయిన గవర్నర్, శుక్రవారం మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితోనూ సమావేశం నిర్వహించారు. అటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలతోనూ, ప్రతిపక్ష నేత స్టాలిన్‌తోనూ మాట్లాడారు. అందరి అభిప్రాయాలను క్రోడీకరించిన గవర్నర్.. శుక్రవారమే కేంద్ర హోం శాఖకు ఒక నివేదిక పంపినట్లు సమాచారం. ఆ నివేదికలోనే.. ప్రభుత్వ ఏర్పాటుకు శశికళను ఆహ్వానించబోనని గవర్నర్ పేర్కొన్నట్లు తెలిసింది. శశికళకు షాక్ ఇచ్చే విధంగా గవర్నర్ నిర్ణయం తీసుకోవడానికి ప్రధానంగా రెండు కారణాలను పేర్కొన్నట్లు తెలిసింది. శశికళ అక్రమ ఆస్తుల కేసుపై వచ్చే వారం సుప్రీంకోర్టు తీర్పు వెలువడనుండటం, చట్టసభలో సభ్యురాలు కాకపోవడం వల్లే బలనిరూపణకు ఆమెకు అవకాశం ఇవ్వకూడదని గవర్నర్ భావిస్తున్నట్లు రిపోర్టులో పేర్కొన్నారు. సాధారణంగా చట్టసభకు ఎంపిక కానివారితో మంత్రిగానో, ముఖ్యమంత్రిగానో ప్రమాణం చేయిస్తే, ఆరు నెలలలోగా వారు ఏదోఒక అసెంబ్లీ లేదా మండలి స్థానం నుంచి గెలవవాల్సి ఉంటుంది. అయితే రాజ్యాంగంలోని ఆర్టికల్ 164 (1) ప్రకారం చట్టసభలో సభ్యులుకాని వ్యక్తులకు శాసనసభలో బలం నిరూపించుకునే(ముఖ్యమంత్రి అయ్యే) అవకాశం కల్పించాలా? వద్దా? అనేదానిపై గవర్నర్దే తుది నిర్ణయం. దీనికి సంబంధించి ఆర్టికల్ 164(4)పై గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారమే నడుచుకోవాలని గవర్నర్ విద్యాసాగర్‌రావు భావిస్తున్నట్లు నివేదికలో పేర్కొన్నారు. అబ్బే! నివేదికరాలేదే.. ఒక జాతీయ చానెల్ ప్రసారం 'నివేదిక' వార్తలు దావానలంలా మారి, దుమారం రేపుతుండటంతో కేంద్ర హోంశాఖ, తమిళనాడు రాజ్భవన్లు రంగంలోకి దిగాయి. 'అసలు అలాంటి నివేదిక ఏదీ గవర్నర్‌గారు కేంద్రప్రభుత్వానికి పంపనేలేదు' అని రాజ్‌భవన్ పౌరసంబంధాల అధికారి(పీఆర్వో) శుక్రవారం రాత్రి మీడియాకు చెప్పారు. అటు కేంద్ర హోం శాఖ కూడా 'తమిళనాడు గవర్నర్ నుంచి నివేదిక రాలేదు'అని తేల్చిచెప్పింది. దీంతో తమిళనాట ఉత్కంఠ కొనసాగుతూనేఉంది.. సంబంధిత కథనాలు చదవండి.. శశికళపై పోలీసులకు ఫిర్యాదు ఏ టైమ్ లోనైనా గవర్నర్ నుంచి పిలుపు! అన్నాడీఎంకే ఎంపీలకు నిరాశ తప్పదా? (మొబైల్ జామర్లు ఆన్.. టీవీ, పేపర్ బంద్!) గవర్నర్‌తో ఓపీఎస్ భేటీ.. ఏం కోరారు? శుభవార్త చెప్తా.. కళకళలాడిన పన్నీర్! తమిళనాట ఆ నవ్వులు దేనికి సంకేతం నాకో అవకాశం ఇవ్వండి పన్నీర్‌సెల్వం దూకుడు రాత్రంతా బుజ్జగింపులు.. -
పన్నీర్ Vs శశికళ :రొంబ ఉత్కంఠ
-
ఎమ్మెల్యేల మద్దతు నాకే..
తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ధీమా - ‘అమ్మ’మృతిపై ప్రజల్లో ఇంకా అనుమానాలున్నాయి. - వాటిని నివృత్తి చేసేందుకు విచారణ కమిషన్ వేయాలి సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నా డీఎంకేలోని ఎమ్మెల్యేల అండతో అసెంబ్లీలో బలపరీక్షకు తాను సిద్ధంగా ఉన్నానని తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం స్పష్టం చేశారు. ‘అమ్మ’ఆశయాలు, ప్రజాభీష్టానికి కట్టుబడిన ఎమ్మెల్యేలు తనకు మద్దతు పలకడం, బలపరీక్షలో తాను నెగ్గడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆయన బుధవారం చెన్నైలోని తన నివాసంలో మీడియా సమావే శంలో మాట్లాడారు. అధికారంలో ఉన్నా, ప్రతి పక్షంలో ఉన్నా ఏనాడూ పార్టీకి తాను ద్రోహం చేయలేదని చెప్పారు. అయితే, ఇప్పుడు పార్టీకి కళంకం తెచ్చానని ఆరోపిస్తున్నారని అన్నారు. ఈ ఆరోపణలకు కాలమే సమాధానం చెబు తుందని పేర్కొన్నారు. డీఎంకేతో సంబంధాలు లేవు ‘‘అన్నాడీఎంకే సంస్థాగత ఎన్నికల్లో శాశ్వత ప్రధాన కార్యదర్శిని ఎన్నుకుంటాం. పార్టీ కోశాధికారి పదవి నుంచి నన్ను తప్పించే అధికారం తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళకు లేదు. శశికళ ఆరోపిస్తున్నట్లు ప్రతిపక్ష డీఎంకేతో నాకు ఎలాంటి సంబంధాలు లేవు. ప్రధాన ప్రతిపక్ష నేత స్టాలిన్‌తో నవ్వుతూ మాట్లాడితే తప్పేంటి? జయలలిత అన్న కుమార్తె అనే భావనతో దీపకు పిలుపునిస్తున్నా. ఆమె ఎప్పుడు వచ్చినా తగిన మర్యాద ఇచ్చేందుకు నేను సిద్ధం. కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ప్రజా సంక్షేమం దృష్ట్యా అన్నాడీఎంకే ప్రభుత్వం సహకరించడం ఆనవాయితీగా వస్తోంది. అలాగే కేంద్రం కూడా సహకరిస్తోంది. అంతేగానీ పన్నీర్‌సెల్వం ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా అండగా నిలవడం లేదు’’అని పన్నీర్ సెల్వం పేర్కొన్నారు. నన్ను కాదంటే ‘అమ్మ’ను ధిక్కరించినట్లే ఒక తమిళ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పన్నీర్ సెల్వం పలు అంశాలను వెల్లడించారు. ‘‘జయలలిత 75 రోజులు ఆసుపత్రిలో ఉన్నారు. ప్రతిరోజూ ఆసుపత్రికి వెళ్లాను. ఒక్కసారైనా ఆమెను కలవలేకపో యాను. ‘అమ్మ’తో మాట్లాడారా అని నా కుటుంబ సభ్యులు రోజూ అడిగేవారు. వారితో అబద్ధం చెబుదామని అనుకున్నా.. కానీ, చెప్పలేకపోయా. ప్రజలు తమను ఎందుకు గెలిపించారనే విషయాన్ని ఎమ్మెల్యేలు దృష్టిలో పెట్టుకోవాలి. ‘అమ్మ’ఆత్మసాక్షి ప్రకారం ఎమ్మెల్యేలు మంచి నిర్ణయం తీసుకుంటారని నమ్ముతున్నా. ఒకవేళ నేను రాజీనామా ఉపసంహరించుకుని సీఎంగా బాధ్యతలు చేపడితే మంత్రులు, ఎమ్మెల్యేలు సహాయ నిరాకరణ చేస్తారని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే నన్ను ‘అమ్మ’ముఖ్యమంత్రిగా నియమించారు. నన్ను కాదంటే ‘అమ్మ’ను ధిక్కరించినట్లే. నేను సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తుండగా మరొకరు (శశికళ) సీఎంగా ఉండాలని మంత్రులు బహిరంగంగా చెప్పడం ఎంతో బాధాకరం. పార్టీ క్రమశిక్షణకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న మంత్రులను కేవలం ఒక్క సంతకంతో బర్తరఫ్ చేసే అధికారం ఒక సీఎంగా నాకు ఉంది. అయి తే ప్రభుత్వంలో ఇలాంటి పోకడలు ‘అమ్మ’ ఆత్మకు క్షోభ కలిగిస్తాయనే భావనతో సహిం చాను. కొందరు ఆరోపిస్తున్నట్లుగా పార్టీ వ్యవ హారాల్లో సహకరించాల్సిందిగా ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాను కోరలేదు. 32 ఏళ్లపాటు ‘అమ్మ’వెన్నంటి ఉండడమే ప్రధాన కార్యదర్శి, సీఎం పదవు లకు అర్హత కాకూడదని భావించాను. అలా చేయడం వల్ల ఏర్పడే పరిణామాలను ఎదుర్కొంటున్నాను. ‘అమ్మ’ మృతిపై ప్రజల్లో అనేక సందేహాలు నెలకొన్నాయి. కాబట్టే సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో విచారణ కమిషన్ వేయాలని కోరాను’’ అని ఆపద్ధర్మ సీఎం పన్నీర్‌సెల్వం వెల్లడించారు. పార్టీ పరిణామాలపై దీప షాక్ అన్నా డీఎంకేలో చోటుచేసుకున్న తాజా పరిణామాలను తనను షాక్‌కు గురి చేశాయని జయ సోదరుడి కుమార్తె దీపాజయకుమార్ అన్నారు. తమతో కలిసి పనిచేసేందుకు దీపను ఆహ్వానిస్తామంటూ సీఎం పన్నీర్‌సెల్వం చేసిన ప్రకటనపై ఆమె స్పందించారు. మీడియా ద్వారానే ఈ విషయం తెలిసిందని చెప్పారు. -
ద్రోహుల్ని నమ్మొద్దు.. సాగనంపుదాం
- అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ - పన్నీరు కాకమ్మ బెదిరింపులకు భయపడను - పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేలతో రాజకీయ సమీక్ష సాక్షి, చెన్నై: ద్రోహుల్ని నమ్మొద్దు... మనం ఏమిటో నిరూపిద్దామని ఎమ్మెల్యేలకు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ పిలుపునిచ్చారు. అమ్మ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా డీఎంకే పక్షపాతిగా మారిన పన్నీరును శాశ్వతంగా పార్టీ నుంచి సాగనంపుదామని ఆవేశపూరిత ప్రసంగాన్ని సాగించారు. సీఎం పన్నీరు సెల్వం ప్రకటనతో అన్నాడీఎంకేలో మొదలైన ప్రకంపనను తిప్పికొట్టేందుకు శశికళ ఇచ్చిన పిలుపుతో అన్నాడీఎంకే శాసనసభా పక్షం, పార్టీ కార్య నిర్వాహకులు ఆగమేఘాలపై ఉదయాన్నే చెన్నైకు చేరుకున్నారు. శశికళ బుధవారం ఉదయం 11:30 గంటలకు రాయపేటలోని పార్టీ కార్యాలయానికి చేరుకుని గంటన్నర పాటు ఎమ్మెల్యేలు, పార్టీ కార్య నిర్వాహకులతో రాజకీయ సమీక్ష జరిపారు. అనంతరం ఆవేశంగా మాట్లాడారు. అమ్మ కలల సాకారానికే ముందుకు వచ్చా... అమ్మ జయలలితతో కలిసి 33 ఏళ్లు ఎన్నో కష్టనష్టాల్ని అనుభవించానని, ఎందరో ద్రోహులు, శత్రువులు, వారి కుట్రలను ఎదుర్కొంటూ, తిప్పికొట్టామని శశికళ గుర్తు చేశారు. అమ్మ మరణం తర్వాత పార్టీని నిర్వీర్యం చేయడానికి కుట్రలు సాగుతున్నాయని హెచ్చరించారు. ఇప్పటివరకు అన్నింటా గెలిచామని, ఇకముందు కూడా గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. అమ్మ మరణం తర్వాత పన్నీరుతో పాటు పలువురు తనను సీఎం పగ్గాలు చేపట్టాలని కోరినా, అప్పుడున్న మానసిక స్థితిలో తిరస్కరించినట్టు తెలిపారు. అమ్మ మెప్పు పొందిన పన్నీరుకే మళ్లీ అవకాశం కల్పిస్తూ పట్టం కట్టినట్టు చెప్పారు. కానీ పన్నీరుసెల్వం తీరు రానురాను పక్కదారి పట్టడాన్ని గుర్తించాకే తాను రంగంలోకి దిగాల్సి వచ్చిందని తెలిపారు. సీఎం బాధ్యతలు చేపట్టాలని తీర్మానాన్ని తీసుకొచ్చిన 42 గంటల అనంతరం మాట మార్చడం బట్టి చూస్తే, ఆయన వెంట డీఎంకే ఉందన్న విషయం స్పష్టం అవుతోందని ఆరోపించారు. చేసిన తప్పును కప్పి పుచ్చుకునే విధంగా కాకమ్మ బెదిరింపులు, ఆరోపణలు గుప్పిస్తున్నారని ధ్వజమెత్తారు. కాకమ్మ బెదిరింపులకు భయపడే వాళ్లెవరూ ఇక్కడలేరని హెచ్చరిస్తూ ప్రసంగాన్ని ముగించారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతిపై తాను ఏ విచారణకైనా సిద్ధమనిæ స్పష్టం చేశారు. అనంతరం శశికళ వర్గీయులు మీడియా ముందుకు వస్తూ సమావేశానికి 131 మంది ఎమ్మెల్యేలు హాజరైనట్టుగా తెలపడం గమనార్హం. నేడు శశికళ బలనిరూపణ.. తనకు 131 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నా సీఎంగా ప్రమాణ స్వీకారం చేయించడానికి గవర్నర్ విముఖత వ్యక్తం చేస్తున్నారంటూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని కలవడానికి శశికళ సిద్ధమయ్యారు. బుధవారం మధ్యాహ్నం ఎమ్మెల్యేలందరినీ ఢిల్లీకి తీసుకెళ్లి రాష్ట్రపతి ముందు పరేడ్ నిర్వహించాలని భావించారు. అయితే గవర్నర్ విద్యాసాగర్‌రావు గురువారం చెన్నైకి వస్తున్నట్లు రాజ్‌భవన్ వర్గాలు అధికారికంగా ప్రకటించడంతో ఢిల్లీకి వెళ్లాలన్న ఆలోచనను విరమించుకున్నారు. గురువారం చెన్నైలో గవర్నర్‌ను కలవడం కోసం శశికళ అపాయింట్మెంట్ కోరారు. గవర్నర్ విద్యాసాగర్‌రావు గురువారం సాయంత్రం చెన్నై చేరుకున్నాక రాజ్‌భవన్‌లో ఎమ్మెల్యేలతో బల నిరూపణకు చిన్నమ్మ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. -
దమ్ముంటే పన్నీర్‌కు బదులివ్వండి
- శశికళకు ప్రధాన ప్రతిపక్ష నేత స్టాలిన్ సవాల్ సాక్షి ప్రతినిధి, చెన్నై: డీఎంకే పార్టీని ఆడిపోసుకోకుండా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం సంధించిన ప్రశ్నలకు దమ్ముంటే సమాధానాలు ఇవ్వాలని డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నేత స్టాలిన్ వ్యాఖ్యానించారు. అన్నాడీఎంకేలో నెలకొన్న పరిస్థితులు, డీఎంకేపై విమర్శలు చేస్తున్న నేపథ్యంలో బుధవారం స్టాలిన్ ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రతిపక్ష నేతను చూసి ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం నవ్వారని, వారిద్దరికీ సంబంధాలు ఉన్నాయని శశికళ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. వాయువేగంలో సీఎం కాలేకపోయాననే దిగులుతో కృంగిపోయిన స్థితిలో శశికళ ఈ వ్యాఖ్యలు చేసినట్లు భావిస్తున్నానని ఎద్దేవా చేశారు. గవర్నర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసిన పన్నీర్‌సెల్వంను పోయెస్‌గార్డెన్‌కు పిలిపించి, రెండు గంటలపాటు బెదిరించి రాజీనామా చేయించిన శశికళ అన్నాడీఎంకే కార్యకర్తల ఆగ్రహానికి గురికాక తప్పదన్నారు. శశికళకు నిజంగా దమ్ముంటే పన్నీర్‌సెల్వం చేసిన విమర్శలకు, అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ఆయన సవాల్ విసిరారు. పన్నీర్‌సెల్వం నేతృత్వంలో సాగుతున్న ప్రభుత్వాన్ని కూలదోస్తూ ఆయన చేత బలవంతంగా రాజీనామా చేయించిన సంఘటనపై సీబీఐ విచారణ జరపాలని ఆయన కోరారు. -
రొంబ ఉత్కంఠ
పన్నీర్, శశికళ పోరు ముమ్మరం - పై చేయి ఎవరిదో తేలేది నేడే - నేనేంటో సభలో నిరూపిస్తా: సెల్వం - అమ్మ మరణంపై సుప్రీం జడ్జితో విచారణ జరిపించాలన్న ఆపద్ధర్మ సీఎం - ద్రోహులను నమ్మొద్దు: శశికళ - మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు నాకే - నేడు గవర్నర్ రాష్ట్రానికి రాక - క్యాంప్ రాజకీయాలు షురూ.. వీర విధేయుడి సింహనాదం ఒకవైపు.. నోరుమెదపని నెచ్చెలి శివతాండవం మరోవైపు.. తమిళనాట రాజకీయం రసవత్తరంగా మారింది. రోజంతా ఎత్తులు పై ఎత్తులతో పైచేయి సాధించేందుకు వైరి శిబిరాలు కత్తులు నూరుతూ కనిపించాయి. రాజకీయ పరిణామాలు క్షణానికో మలుపు తిరుగుతూ ఉత్కంఠ రేకెత్తించాయి. ఎన్నడూ గట్టిగా మాట్లాడని పన్నీర్ సెల్వం విలేకరుల సమావేశంలో హూంకరించారు. తానే సీఎంనని, అమ్మకు అనుంగు శిష్యుడిని కాబట్టి తనకే అన్ని అర్హతలు ఉన్నాయని కుండ బద్దలు కొట్టారు. ఎమ్మెల్యేల మద్దతు తనకే ఉందని, సభలో బలం నిరూపించుకుంటానని ధీమా వ్యక్తం చేశారు. అసలు అమ్మ మరణం మిస్టరీపై సుప్రీం జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేసి శశికళ వర్గంలో కలకలం రేపారు. మరోవైపు పొయెస్ గార్డెన్, అన్నాడీఎంకే కార్యాలయం వేదికగా శశికళ, ఆమె వర్గీయులు శివాలెత్తి పోయారు. 131 మంది ఎమ్మెల్యేల మద్దతు తమకే ఉందని ప్రకటించారు. పార్టీని చీల్చడానికి పన్నీర్ కుట్ర పన్నుతున్నా డని, ద్రోహులను క్షమించే ప్రసక్తి లేదని హెచ్చరించారు. మద్దతిస్తున్న ఎమ్మెల్యేలను శిబిరానికి తరలించారు. అవసరమైతే ఎమ్మెల్యేలతో రాష్ట్రపతి వద్ద పరేడ్ నిర్వహిస్తామ న్నారు. గురువారం గవర్నర్ చెన్నై రానుండడంతో ఏ నిర్ణయం వెలువడుతుందనే దానిపై ఉత్కంఠ నెలకొంది. చెన్నై నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: తమిళనాడు రాజకీయాలు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. పరిణామాలు వేగంగా మారుతున్నాయి. సవాళ్లు, ప్రతిసవాళ్లు దిష్టిబొమ్మల దహనాలతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. తమకు 131 మంది ఎమ్మెల్యేల మద్దతుందని అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ వర్గం ప్రకటించగా... తనదే అంతిమ విజయమవుతుందని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం శాసనసభలో బలపరీక్షకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో గవర్నర్ నిర్ణయం తమిళ రాజకీయాలను ఏ మలుపు తిప్పుతుందోనని తమిళ రాజకీయ పార్టీలు, ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. ఉత్కంఠ భరిత రాజకీయాలు... ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం మంగళవారం రాత్రి మెరీనా బీచ్ వద్ద ఉన్న జయలలిత సమాధి వేదికగా శశికళ మీద తిరుగుబాటు జెండా ఎగురవేసిన విషయం తెలిసిందే. జయలలిత మృతికి శశికళే కారణం అనే అర్థం వచ్చే రీతిలో పన్నీర్ చేసిన ఆరోపణలు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం కలిగించాయి. సౌమ్యుడు, మృదు స్వభావి అయిన పన్నీర్ సెల్వం ఈ తరహాలో తిరుగుబాటు చేయడాన్ని ఊహించలేకపోయిన శశికళ బుధవారం రాత్రి నుంచే ఎమ్మెల్యేలను తన శిబిరానికి తరలించే రాజకీయం ప్రారంభించారు. అన్నా డీఎంకేలో ఈ తరహా సంక్షోభం అనివార్యమని ధీమాగా ఉన్న డీఎంకే ఈ వ్యవహారంపై వేగంగా స్పందించింది. సీఎంను బెదిరించి రాజీనామా చేయించి, రాజ్యాంగ విరుద్ధంగా శశికళ సీఎం కావడాన్ని తాము అంగీకరించేది లేదని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నాయకుడు స్టాలిన్ ప్రకటించారు. పన్నీర్‌కు తమ మద్దతు ఉంటుందని పరోక్షంగా సంకేతాలు ఇచ్చారు. శశికళను సీఎం కాకుండా అడ్డుకోవడానికి ఆయన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, హోం మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను కలసి వినతి పత్రం ఇచ్చి ఈ అంశాన్ని జాతీయ స్థాయికి తీసుకుని వెళ్లే దిశగా అడుగులు వేస్తున్నారు. శశికళ సీఎం కావడం ప్రధాని నరేంద్ర మోదీకి ఏ మాత్రం ఇష్టంలేని విషయాన్ని గుర్తించిన స్టాలిన్ తన చర్య ద్వారా పరోక్షంగా కేంద్ర ప్రభుత్వానికి కూడా మద్దతు ప్రకటించినట్లైంది. మోదీ అండ.. పన్నీర్ ధీమా అన్నా డీఎంకే ఎమ్మెల్యేలు శశికళను ఆదివారం రాత్రి శాసనసభాపక్ష నాయకురాలిగా ఎన్నుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో పాటు ప్రతిపక్ష నాయకుడు స్టాలిన్ నుంచి మద్దతు కూడగట్టాకే రెండు రోజుల తర్వాత పన్నీర్ తిరుగుబాటుజెండా ఎగురవేశారనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ వెంట ఎక్కువమంది ఎమ్మెల్యేలు వెళతారనే విషయం తెలిసినా మోదీ, స్టాలిన్ ధీమాతోనే ఆయన శాసనసభలో బలనిరూపణకు సిద్ధమని సవాల్ విసిరి ఉంటారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. బుధవారం నిర్వహించిన సమావేశానికి 131 మంది ఎమ్మెల్యేలు హాజరైనట్లు శశికళ వర్గం ప్రకటించినా, ఎమ్మెల్యేలు అమ్మ ఆత్మ సాక్షిగా ఓటేస్తారని పన్నీర్ మరోసారి ధీమాగా చెప్పారు. అక్రమాస్తుల కేసులో సుప్రీం కోర్టు వారం లోపు తీర్పు చెబుతామని ప్రకటించడం, శశికళ తాత్కాలిక ప్రధాన క్యార్యదర్శి ఎన్నిక చెల్లదని ఎన్నికల సంఘం నిర్ణయానికి రావడం, జయ కుటుంబసభ్యుల నుంచి తగినంత మద్దతు లభించడం, ప్రధాన ప్రతిపక్షం సైతం అండగా నిలవడం పన్నీర్‌కు కొండంత ధైర్యం ఇచ్చినట్లు కనిపించింది. అక్రమాస్తుల కేసులో శశికళ జైలుకు పోవడం తథ్యమనీ, ఆ తర్వాత ఎమ్మెల్యేలు అనివార్యంగా తనకే మద్దతు ఇస్తారని పన్నీర్ తన ఆంతరంగికుల వద్ద చెబుతున్నట్లు రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఎమ్మెల్యేలతో శశికళ క్యాంపు రాజకీయం పన్నీర్ తిరుగుబాటుతో కంగుతిన్న శశికళ మంగళవారం రాత్రి నుంచే ఎమ్మెల్యేలతో క్యాంపు రాజకీయం ప్రారంభించారు. బుధవారం ఉదయం పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలతో శశికళ సమావేశం నిర్వహించిన తర్వాత తమకు 131 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని ఆమె వర్గం ప్రకటించింది. వీరిని బయటకు వదిలేస్తే పన్నీర్ సెల్వం తన్నుకుపోయే ప్రమాదం ఉందనే భయంతో పార్టీ కార్యాలయం నుంచి ప్రత్యేక బస్సుల్లో నగరంలోని రెండు స్టార్ హోటళ్లకు తరలించారు. తాము ఎక్కడికీ వెళ్లబోమని కొందరు ఎమ్మెల్యేలు చెప్పినా బలవంతంగా హాటల్‌కు తీసుకువెళ్లి తమ మద్దతుదారులను కాపలాగా ఉంచారు. ఎమ్మెల్యేల మొబైల్ ఫోన్లు కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ సంక్షోభానికి తెరపడే దాకా క్యాంపులోనే ఉండాలనీ, మాట వింటే తాయిలాలు ఇస్తామనీ, కాదని వెళితే చిన్నమ్మ సీఎం అయ్యాక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఎమ్మెల్యేలను బెదిరిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. శశికళకు నిజంగా 131 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంటే వారిని హోటళ్లలో ఎందుకు నిర్భంధిస్తారని పన్నీర్ వర్గం సామాజిక మీడియాలో విస్తృత ప్రచారం చేస్తోంది. శశికళ నిర్భంధంలో ఉన్న ఎమ్మెల్యేలు సభకు వస్తే తనకే ఓటేస్తారని పన్నీర్ సెల్వం చేసిన ప్రకటన శశికళ వర్గానికి మరింత ఆందోళన కలిగిస్తోంది. సీఎం పీఠంపై పన్నీర్, శశికళ ధీమా పన్నీర్ సెల్వం, శశికళకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేల సంఖ్య ఎంత అనేది ఖచ్చితంగా తేలలేదు. అయితే ఇద్దరూ తామే సీఎం కాబోతున్నామని ధీమాగా చెబుతున్నారు. శాసనసభలో బలనిరూపణకు గవర్నర్ తనకు అవకాశం ఇస్తారని పన్నీర్ చెబుతున్నారు. ఈ విషయం గురించి మాట్లాడటానికి ముంబై వచ్చి కలుస్తానని బుధవారం ఉదయం ఆయన గవర్నర్ సమయం కూడా కోరారు. తన మద్దతుదారులతో తానే ముంబై వస్తానని శశికళ కూడా గవర్నర్ సమయం కోరారు. ఈ వివాదం నేపథ్యంలో గవర్నర్ విద్యాసాగర్‌రావు ఇద్దరికీ సమయం కేటాయించకుండా గురువారం సాయంత్రం ఆయనే చెన్నై వస్తున్నారు. ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో... అది రాజకీయాలను ఏ మలుపు తిప్పుతుందోనని తమిళనాడు ఉత్కంఠగా ఎదురుచూస్తోంది. -
రాజ్యాంగాన్ని మరవొద్దు
జల్లికట్టు ఆందోళనతో అట్టుడికి ఈమధ్యే సద్దుమణిగిన తమిళనాడులో ప్రస్తుతం అంతకు మించిన డ్రామా నడుస్తోంది. రకరకాల మలుపులు తీసుకుంటూ ఉత్కంఠ రేపుతోంది. మూఢ నమ్మకాలకూ, సంప్రదాయం పేరిట సాగే తంతులకూ వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర గల ద్రవిడ రాజకీయాల్లో ఇప్పుడు ఆత్మ... అంతరాత్మ వంటి మాటలు వినిపిస్తున్నాయి. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన పన్నీర్ సెల్వం ఊహించని రీతిలో మంగళవారం రాత్రి దివంగత నేత జయలలిత సమాధి వద్ద ధ్యానముద్రలో కూర్చుని సంచలనానికి తెరలేపారు. ఆయన దాన్నుంచి బయటికొచ్చాక ఏం చెబుతారన్న అంశంపై అక్కడికొచ్చిన మీడియా సిబ్బంది కాసేపు అయోమయానికి గురయ్యారంటేనే పన్నీర్ సెల్వం ఎలాంటి వ్యక్తో అర్ధమవుతుంది. ఆయనలో ముందూ మునుపూ తిరుగుబాటు తత్వం లేకపోవడం, కనీసం పరుషంగా మాట్లాడిన చరిత్ర లేకపోవడం వల్లనే ఈ అయోమయం. జయలలిత జీవించి ఉన్నప్పుడు మాత్రమే కాదు...ఆమె మరణానంతరం సీఎం పదవిలో కొనసాగిన ఈ రెండు నెలల్లో కూడా పన్నీర్ సెల్వం వ్యవహారశైలి ఆ మాదిరే ఉంది. శశికళ మద్దతుదార్లు కోరగానే సీఎం పదవికి రాజీనామా చేయడం, శాసనసభాపక్ష సమావేశంలో ఆమె పేరును తానే ప్రతిపాదించి ఏకగ్రీవంగా ఎన్నిక కావడానికి సహకరించడం వంటివి గమనించినవారికి పన్నీర్ ఇలా తిరగబడతారన్నది ఊహకందని విషయం. అందువల్లే ‘ఆ సమావేశం సంగతే ముందు చెప్పలేదు... చిన్నమ్మ పిలుస్తున్నారంటే వెళ్లాను...అక్కడనన్ను అవమానించారు...నాతో బలవంతంగా రాజీనామా చేయించారు...’ అంటూ ఆయన చెప్పిన మాటలు విని అందరూ విస్తుపోయారు. పైగా అమ్మ (జయలలిత) ఆత్మ ప్రేరణతో ఈ నిజాలు చెబుతున్నానని అన్నారు. ఎవరో అన్నట్టు గొర్రెపిల్ల ‘గర్జించింది’. అయితే ఆ గర్జన అనంతరం దానికి కొనసాగింపుగా చేయాల్సిన పనులేమీ పన్నీర్ సెల్వం మొదలెట్టలేదు. ప్రజలు కోరుకుంటే రాజీనామాను వెనక్కు తీసుకుంటానని రాజ్యాంగం ప్రకారం అసాధ్యమైన మాటను అన్నారే తప్ప...అధికారానికి అర్రులు చాచే సగటు నేతలా ఎమ్మెల్యేలను సమీకరించే పనికి పూనుకోలేదు. ఇది పన్నీర్ సుగుణం కావొచ్చు. అటు ఏనాడూ ఏ పదవీ చేపట్టిన చరిత్ర లేని శశికళ మాత్రం పన్నీర్ తిరుగుబాటు అనంతరం చకచకా కదిలారు. పార్టీ ఎమ్మెల్యేలను సమీకరించి తరలించారు. ఆ శిబిరం ఎక్కడుందో తెలియకుండా జాగ్రత్తపడుతున్నారు. పార్టీకున్న 134మంది ఎమ్మెల్యేల్లో 131మంది మద్దతు ఉన్నదని ప్రకటించుకున్నారు. గురువారం రాష్ట్రానికొస్తున్న గవర్నర్ విద్యాసాగరరావు ఏం చేస్తారన్న అంశంలో ఎవరికెన్ని ఊహాగానాలున్నా రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ వద్దకు తనను సమర్ధించే ఎంపీలను వెళ్లమని ఆమె పురమాయించారు. అవసరమైతే తన ఎమ్మెల్యేలను కూడా ఢిల్లీ తీసుకెళ్లేందుకు సిద్ధపడుతున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో శశికళతో పోలిస్తే ఒక్క పన్నీర్‌సెల్వం మాత్రమే కాదు...గవర్నర్ సైతం తత్తరపడుతున్నారనిపిస్తుంది. సాధారణ సమయాల్లో గవర్నర్ పదవి అందరికీ అలంకారప్రాయంగా కనబడుతుంది. కానీ రాజకీయ సంక్షోభాలు తలెత్తినప్పుడు వారిది కీలకపాత్ర. శాంతిభద్రతల సమస్య తలెత్తకుండా, రాజ్యాంగ ఉల్లంఘనలు జరగకుండా చూడటం...సాధ్యమైనంత త్వరగా సాధారణ స్థితి నెలకొనేలా చూడటం గవర్నర్ కర్తవ్యం. అలా చూస్తే ఆదివారం శశికళ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారన్న సమాచారం అధికారికంగా అందిన వెంటనే విద్యాసాగరరావు కదిలి ఉండాల్సింది. ఆ సమావేశం సక్రమంగా జరిగిందని భావిస్తే శశికళను ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించి ఉండాలి. ఆ విషయంలో సంతృప్తి కలగకపోతే పన్నీర్ రాజీనామా ఆమోదించే ముందే తనకున్న సందేహాలను తీర్చుకోవాలి. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సుప్రీంకోర్టు తీర్పు వెలువడే వరకూ శశికళ వేచి చూడాలన్న అభిప్రాయం ఉంటే ఆ సంగతి ఆమెతో చెప్పాలి. అందుకామె అభ్యంతరం చెబితే న్యాయ నిపుణుల సలహా తీసుకుని దాని ప్రకారం నడుచుకోవాలి. కానీ విద్యాసాగరరావు ఇవేమీ చేయలేదు. అసలు రాష్ట్ర నాయకులెవరికీ ఆయన అందుబాటులోకి రాలేదు. కీలక సమయంలో ఇలా వ్యవహరించడం వల్ల ఆయన ఎవరి ఆదేశాల మేరకో వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలకూ, ఊహాగానాలకూ తావీయలేదా? సంక్షోభం ఏర్పడకుండా చూడాల్సిన గవర్నర్ జాప్యం చేయడం ద్వారా తానే అలాంటి స్థితికి కారకులయ్యారన్న అభిప్రాయం కలగలేదా? మిగిలినవారి సంగతలా ఉంచి బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామే ఆయనను తప్పుబడుతున్నారు. మంగళవారం రాత్రి పన్నీర్ ప్రకటన వల్ల కొత్త అంశాలు బయటపడి ఉండొచ్చు. అవన్నీ నిజమే కావొచ్చు కూడా. కానీ ఇవేవీ వర్తమాన స్థితిని మార్చలేవు. రాజ్యాంగపరంగా ప్రస్తుతం శశికళ అన్నా డీఎంకే శాసనసభా పక్ష నేత. ఆమెను ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానించడం, అసెంబ్లీలో బల నిరూపణ చేసుకోవడానికి అవకాశమివ్వడం తప్పనిసరి. పన్నీర్ సెల్వం అంటున్నట్టు ప్రస్తుతం శశికళ శిబిరంలో ఉన్నవారిలో ఆయన మద్దతుదార్లు ఉండొచ్చు. వారి సంఖ్య గణనీయమైనదే కావొచ్చు. అదే నిజమైతే శశికళ బలపరీక్షలో విఫలమై పదవినుంచి తప్పుకోవాల్సి వస్తుంది. సుప్రీంకోర్టు ముందున్న కేసులో వ్యతిరేకంగా తీర్పు వచ్చినా శశికళకు అదే పరిస్థితి ఉత్పన్నమవుతుంది. తెరవెనక ఏం జరిగిందన్న అంశాలతో సంబంధం లేకుండా రాజ్యాంగం ప్రకారం వ్యవహరించడమే తమిళనాడులో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితికి విరుగుడు. అందుకు విరుద్ధంగా శాసనసభను సుప్తచేతనావస్థలో ఉంచి రాష్ట్రపతి పాలన విధించడం వంటి చర్యలకు దిగితే అది ప్రజల తీర్పును వమ్ము చేసినట్టే అవుతుంది. ఎస్ఆర్ బొమ్మై కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా ప్రస్తుత ప్రతిష్టంభనకు ముగింపు పలికితే అది కేంద్ర ప్రభుత్వానికీ, గవర్నర్‌కూ మంచిది. లేనట్టయితే ఒక చెడు సంప్రదాయానికి నాంది పలికారన్న అపవాదు మూటగట్టుకున్నట్టవుతుంది. -
నన్ను తొలగించడానికి మీరెవరు?: పన్నీర్
-
పన్నీర్‌కు జై : శిబిరంలోకి ఎమ్మెల్యేలు
-
తమిళనాట సంచలనం : పన్నీర్ తిరుగుబాటు
-
నన్ను తొలగించడానికి మీరెవరు?: పన్నీర్
- పార్టీలోనే ఉంటా.. కొన్ని గంటల్లోనే నేనేంటో చూపిస్తా - తిరుగుబాటును విజయవంతం చేసేదిశగా సెల్వం అడుగులు - ఎమ్మెల్యేల మద్దతుతో నేడు ఢిల్లీకి పయనం చెన్నై: తనను అన్నాడీఎంకే కోశాధికారి పదవి నుంచి తప్పించడంపై పన్నీర్ సెల్వం తీవ్రస్థాయిలో మండిపడ్డారు. "ఈ పదవి నాకు అమ్మ(జయ) ప్రసాదించింది. నన్ను తీసేసే హక్కు ఎవ్వరీ లేదు. ఎట్టిపరిస్థితుల్లోనూ పార్టీని వీడను. మరి కొద్దిగంటల్లోనే నేనేంటో చూపిస్తా. వేచి చూడండి..' అని గర్హించారు. జయ సమాధి వద్ద మీడియా సమావేశం అనంతరం నేరుగా తన నివాసానికి వెళ్లిపోయిన పన్నీర్ సెల్వంను కలుసుకునేందుకు భారీ సంఖ్యలో అభిమానులు తరలివచ్చారు. అన్నాడీఎంకేకు చెందిన కీలకనేతలు సైతం పన్నీర్ ఇంటికి క్యూకట్టారు. వారిలో అసెంబ్లీ స్పీకర్ ధన్పాల్, సీనియర్ ఎంపీ మైత్రేయన్ లాంటి ముఖ్యులు కూడా ఉన్నారు. ఇదే క్రమంలో శశికళకు వ్యతిరేకంగా ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టేందుకు పన్నీర్ సెల్వం ప్రయత్నాలు ప్రారంభించారు. తిరిగి ముఖ్యమంత్రి పదవి చేపట్టేందుకు అవసరమైన ఎత్తుగడలను రచిస్తున్నారు. తనను 'ద్రోహి' అని నిందించిన శశికళ వర్గీయులపై మండిపడ్డ సెల్వం.. 'ప్రతిపక్ష నేత(స్టాలిన్) ఎదురుపడినప్పుడు నవ్వడం కూడా నేరమేనా? నాకు తెలిసి అలా నవ్వడం నేరమేమీకాదు'అని సెల్వం వ్యాఖ్యానించారు. చెన్నై 'సాక్షి' ప్రతినిధి సంజయ్ తెలిపిన వివరాల ప్రకారం ప్రస్తుతం పన్నీర్ క్యాంపులో 62 మంది ఎమ్మెల్యేలు చేరిపోయినట్లు తెలిసింది. ఇదే ఊపులో ఢిల్లీ వెళ్లేందుకు కూడా పన్నీర్ సెల్వం సమాయత్తం అయ్యారు. బుధవారం ఢిల్లీకి వెళ్లి రాష్ట్రపతి, కేంద్ర హోంమంత్రులను కలుసుకుని, మంత్రివర్గ ఏర్పాటుకై వినపత్రం ఇవ్వనున్నట్లు స్పష్టంగా తెలిసింది. మ్యాజిక్ ఫిగర్ సాధిస్తారా? నాలుగు రోజుల కిందటే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన పన్నీర్ సెల్వం తిరిగి పీఠం ఎక్కేందుకు ప్రయత్నాలు ప్రారంభించిన దరిమిలా సభలో బలనిరూపణ కీలక అంశంగా మారింది. 235 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో అన్నాడీఎంకేకు 135 మంది సభ్యుల బలం ఉంది. ప్రతిపక్ష డీఎంకే నుంచి 89మంది ఎమ్మెల్యేలు, కాంగ్రెస్‌పార్టీకి 8, ఇండియన్ యూనియన్ ముస్లింలీగ్ పార్టీకి చెందిన ఒక్క ఎమ్మెల్యే ఉన్నారు. పన్నీర్ ముఖ్యమంత్రి కావాలంటే ఆయనకు కనీసం 117మంది ఎమ్మెల్యేల మద్దతు అవసరం. ప్రస్తుతం ఆయనకు 62 మంది ఎమ్మెల్యేలు బేషరతుగా మద్దతు పలుకుతున్నారు. అంటే, మ్యాజిక్ ఫిగర్‌కు ఇంకా 55 ఎమ్మెల్యేల మద్దతు అవసరం. అయితే, అన్నాడీఎంకే ఎమ్మెల్యేల్లో అత్యధికులు శశికళ అనుచరులే కావడం వల్ల వారు పన్నీర్‌ను సపోర్ట్‌చేసే అవకాశాలు తక్కువ. ఈ పరిస్థితుల్లో ఆయనకున్న ఓకేఒక్క పెద్ద అండ.. ప్రతిపక్ష డీఏంకే! డీఎంకే మద్దతు ఇస్తుందా? నాలుగు రోజుల కిందట పన్నీర్ సెల్వం సీఎం పదవికి రాజీనామా చేసినప్పుడు అందరికంటే ముందుగా స్పందించింది ప్రతిపక్షనేత, డీఎంకే వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలినే! శశికళను సీఎం కాకుండా అడ్డుకోవడానికి ఎంతదూరమైనా వెళతామని ప్రకటించిన స్టాలిన్.. తమిళనాడులో రాష్ట్రపతి పాలన పెట్టాలనే డిమాండ్‌తో మంగళవారం ఢిల్లీకి వెళ్లారు. 'ఉంటే, గింటే పన్నీర్ సెల్వమే సీఎంగా ఉండాలికానీ, శశికళను ప్రజలు స్వీకరించరు'అని స్టాలిన్ వ్యాఖ్యానించారు. తద్వారా అడగకనే పన్నీర్‌కు తన మద్దతు ప్రకటించారు. పన్నీర్ సెల్వంను ముఖ్యమంత్రిని చేసేందుకు డీఎంకే మద్దతు పలికితే గనుక అది ఆ పార్టీకి ఆత్మహత్యాసదుశ్యమే! అయినాసరే, స్టాలిన్ ధైర్యం చేస్తారా? అంటే స్పష్టమైన సమాధానం చెప్పలేం. అన్నాడీఎంకే చీలిక వర్గానికి తాత్కాలిక మద్దతు పలకడంద్వారా వచ్చే ఎన్నికల నాటికి డీఎంకేను మరింత బలోపేతం చేయొచ్చని భావిస్తేగనుక పన్నీర్‌కు స్టాలిన్ మద్దతు పలకొచ్చు! (పన్నీర్ సెల్వం తిరుగుబాటు) -
అన్నాడీఎంకేలో చీలిక..!
- రాష్ట్రవ్యాప్తంగా పన్నీర్ వర్గీయుల సంబరాలు - పోయెస్ గార్డెన్లో శశికళ మంత్రాంగం చెన్నై: మాజీ ముఖ్యమంత్రి ఓ.పన్నీర్ సెల్వం(ఓపీఎస్) తిరుగుబావుటాతో అన్నాడీఎంకే నిట్టనిలువునా చీలినట్లైంది. పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళపై తీవ్రస్థాయి విమర్శలు చేసిన ఓపీఎస్‌కు ఎల్లడలా మద్దతు లభిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు రోడ్లపైకి వచ్చి సంబరాలు జరుపుకొంటున్నారు. ఈ పరిణామాలతో ఇరుకున పడ్డ శశికళ.. అతివేగంగా పావులు కదుపుతున్నారు. మంగళవారం రాత్రి ఓపీఎస్ మీడియా సమావేశం ముగిసిన వెంటనే.. తన వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు, ఇతర నాయకులతో పోయెస్ గార్డెన్లో అత్యవసరంగా భేటీ అయ్యారు. పన్నీర్ సెల్వంకు, ఆయన చేసిన ఆరోపణలకు గట్టిగా బదులు చెప్పాలని శశికళ నిర్ణయించినట్లు తెలిసింది. ఈ క్రమంలోనే.. 'ఓపీఎస్ కేంద్రం(బీజేపీ) చేతిలో రిమోట్‌కంట్రోల్' అంటూ శశికళ వర్గీయులు ఎదురుదాడి మొదలుపెట్టారు. (తమిళనాట సంచలనం: పన్నీర్ తిరుగుబాటు) ఇదిలాఉంటే, 50 మంది ఎమ్మెల్యేలు పన్నీర్ సెల్వంకు మద్దతు పలుకుతున్నారని ప్రముఖ చానెళ్లల్లో వార్తలు ప్రసారం అవుతున్నాయి. రేపు ఉదయం లేదా సాయంత్రానికి పన్నీర్‌ను బలపరిచే ఎమ్మెల్యేల సంఖ్య ఇంకా పెరగొచ్చని, వారి మద్దతుతో ఆయన తిరిగి ముఖ్యమంత్రి అవుతారని, ఆమేరకు జరిగే ప్రయత్నంలో బీజేపీ(కేంద్ర ప్రభుత్వం) కూడా దన్నుగా నిలుస్తుందని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఈ పరిణామాల నేపథ్యంలో శశికళ సీఎంగా ప్రమాణం చేసే అవకాశాలు దాదాపు సన్నగిల్లినట్లైంది. ప్రజల మద్దతు ఉన్న వ్యక్తి మాత్రమే పార్టీని నడిపించాలన్నది అమ్మ(జయ) నిర్ణయమని, కానీ ప్రస్తుతం పార్టీలోని పరిస్థితులు అందుకు విరుద్ధంగా తయారయ్యాయని పన్నీర్ సెల్వం ఆరోపించారు. మెరీనా బీచ్‌లోని జయలలిత సమాధి వద్ద గంటపాటు దీక్ష చేసిన అనంతరం ఓపీఎస్ మీడియాతో మాట్లాడారు. కనీస సమాచారం కూడా ఇవ్వకుండా తనను సీఎం పదవి నుంచి బలవంతంగా తొలిగించారని ఆయన ఆవేదన చెందారు. ఓపీఎస్ మీడియా సమావేశం అనంతరం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు ఒక్కసారిగా రోడ్లపైకి వచ్చారు. 'ఓపీఎస్.. ఓపీఎస్..' అంటూ పెద్ద ఎత్తున నినాదాలుచేస్తూ, శశికళపై విమర్శలు చేశారు. (సంచలన నిజాలు చెప్పిన పన్నీర్ సెల్వం) -
పన్నీర్ సెల్వం తిరుగుబాటు
శశికళకు వ్యతిరేకంగా తమిళనాడు ఆపద్ధర్మ సీఎం గళం ► నాతో బలవంతంగా రాజీనామా చేయించారు ► ప్రజలు కోరితే వెనక్కి తీసుకుంటా.. ► నిజాలు చెప్పాలని అమ్మ ఆత్మ ► తనను ప్రేరేపించిందన్న సెల్వం ► పార్టీ పదవి నుంచి పన్నీర్ తొలగింపు.. ► ఎమ్మెల్యేలంతా నా వెంటే: శశికళ సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడు రాజకీయాల్లో అనూహ్య మలుపు చోటుచేసుకుంది. సౌమ్యు డిగా, పార్టీకి విధేయుడిగా పేరున్న ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం.. జయ సమాధి సాక్షిగా రాష్ట్రంలో రాజకీయ ప్రకంపనలు సృష్టించారు. ముఖ్యమంత్రి పదవికి తనతో బలవంతంగా రాజీనామా చేయించారని చెప్పి శశికళపై తిరుబాటు బావుటా ఎగరేశారు. ప్రజలు, పార్టీ, ఎమ్మెల్యేలు కోరుకుంటే రాజీనామా వెనక్కి తీసుకోవడానికి సిద్ధమని ప్రకటించారు. దీంతో ఒక్కసారిగా ఏఐఏడీఎంకేలో ప్రకంపనలు పుట్టాయి. పార్టీ చీలిపోయిందనే ఊహాగానాలు చెలరేగాయి. ఈ పరిణామాలతో ప్రతిపక్ష నేత స్టాలిన్ కూడా రంగంలోకి దిగారు. వెంటనే అధికార పక్షం బలం నిరూపించుకోవాలని డిమాండ్ చేశారు. డిల్లీ నుంచి బీజేపీ నేతలే పన్నీర్‌తో నాటకం ఆడిస్తున్నారని అన్నా డీఎంకే వర్గాల విమర్శిస్తున్నాయి. మరోపక్క పార్టీ కోశాధికారి పదవి నుంచి పన్నీర్‌ను తొలగించినట్లు పార్టీ వర్గాలు అర్ధరాత్రి చెప్పాయి. మంగళవారం రాత్రి 9 గంటలకు చెన్నైలోని మెరీనా బీచ్‌లో జయ సమాధి వద్దకు సెల్వం చేరుకుని మౌన ముద్రలో కూర్చోవడంతో నాటకీయ పరిణామాలకు నాంది పడింది. ఆయన ఆ సమయంలో ఎందుకు అలా వచ్చారో.. ఎందుకు ధ్యానం చేస్తున్నారో ఎవరికీ అర్థం కాలేదు. 40 నిమిషాల తర్వాత మౌన ముద్రవీడి.. కళ్లు తుడుచుకుంటూ మీడియాతో మాట్లాడారు. నిజాలు వెల్లడించాలని అమ్మ (జయ) ఆత్మ తనను ప్రేరేపించడంతో దేశ ప్రజలకు, పార్టీకి కొన్ని నిజాలు చెప్పడానికి వచ్చానంటూ మాట్లాడటం ప్రారంభించారు. పార్టీని, రాష్ట్రాన్ని కాపాడాలని అమ్మ చెప్పిందన్నారు. తనను సీనియర్ మంత్రులు, నేతలు అవమానాలకు గురిచేశారని, అణగదొక్కాలని చూశారని చెప్పారు. జయలలిత మృతి తర్వాత పార్టీ ఖ్యాతిని, ప్రభుత్వాన్ని కాపాడటమే తన ప్రధాన పని అని చెప్పారు. అయితే తనను అడ్డుకునేందుకు ప్రయత్నాలు జరిగా యన్నారు. అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నపుడు అమ్మ తనకు కొన్ని ఆదేశాలు ఇచ్చారన్నారు. పార్టీ ప్రిసీడియం చైర్మన్‌గా ఉన్న మధుసూదన్‌ను ప్రధాన కార్యదర్శిగా నియమించాలని, సీఎంగా తనను బాధ్యతలు స్వీకరించాలని చెప్పారన్నారు. సీఎంగా ఉండేందుకు తాను నిరాకరిస్తూ ప్రజలు కోరుకునే వ్యక్తిని సీఎంగా నియమించాలని కోరానని తెలిపారు. అయితే గతంలో 2సార్లు సీఎంగా ఉన్న తననే పదవి చేపట్టాలని ఆదేశించారని చెప్పారు. తాను సీఎం పదవి చేపట్టిన తర్వాత ఎన్నో మంచి పనులు చేశానని, అది చూసి ఓర్చుకోలేక పార్టీలోని అగ్రనేతలందరూ కలసి ఒంటరి చేసి వేధింపులకు గురి చేశారని తెలిపారు. సీనియర్లు అవమానించారు.. శశికళను సీఎం చేయడానికి తనను పార్టీ నేతలు ఏవిధంగా ఇబ్బంది పెట్టింది పన్నీర్ వెల్లడించారు. ‘‘ఆదివారం పోయెస్ గార్డెన్లో సమావేశం ఏర్పాటు చేశారని నాకు తెలియదు. నన్ను పిలిస్తే చిన్నమ్మను కలవడానికి వెళ్లాను. అక్కడ పార్టీ సీనియర్ నేతలు శశికళను సీఎం చేయడానికి నన్ను రాజీనామా చేయమన్నారు. పార్టీ జనరల్ సెక్రటరీ పదవి, సీఎం పదవి ఒకరే చేపట్టాలని చెప్పారు. నన్ను ఒప్పించడానికి 2 గంటలపాటు ప్రయత్నించారు. లెజిస్లేచర్ పార్టీ ఎన్నుకున్న తర్వాత నన్ను రాజీనామా చేయమనడం సరైనదేనా అని ప్రశ్నించాను. పార్టీలో క్రమశిక్షణ కోసం అన్ని అవమానాలు భరించాను. నన్ను బలవంత పెట్టడంతో రాజీనామా చేశాను’’అని పన్నీర్ వెల్లడించారు. తన స్థానంలో ఎవరున్నా రాష్ట్ర ప్రజల్ని, రాష్ట్రాన్ని కాపాడాలని కోరుకుంటున్నానని తెలిపారు. జయ చూపిన దారిలో నడవాలన్నారు. దానికోసం తాను ఒంటరిగా మిగిలినా పోరాడతానని చెప్పారు. పార్టీలో చీలిక లేదు: శశికళ ఉదయం మాజీ స్పీకర్ పాండ్యన్.. జయ మృతిపై అనుమానాలున్నాయని చెప్పడంతో ఏఐఏడీఎంకేలో మొదలైన రాజకీయ ప్రకంపనలు పన్నీర్ తిరుగుబాటుతో తారస్థాయికి చేరాయి. పోయెస్ గార్డెన్లో పార్టీ ముఖ్యులతో శశికళ అత్యవసర సమావేశం నిర్వహించారు. ఆయనపై చర్యలు తీసుకోవాలని కొంతమంది పార్టీ నేతలు డిమాండ్ చేశారు. ఇదంతా బీజేపీ పెద్దలు ఆడిస్తున్నారంటూ మండిపడ్డారు. శశికళను సీఎం పీఠంపై కూర్చోనివ్వకుండా చేయడానికి పన్నీర్‌ను పావుగా వాడుకుంటున్నారని శశికళ అనుయాయులు వాదిస్తున్నారు. కాగా, ఎమ్మెల్యేలంతా తనవెంటే ఉన్నారని, పార్టీలో ఎలాంటి చీలిక లేదని అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో మీడియాతో మాట్లాడిన శశికళ అన్నారు. డీఎంకే మద్దతుతోనే పన్నీర్ ఇలా మాట్లాడారన్నారు. ఢిల్లీకి స్టాలిన్ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఎ–2గా ఉన్న శశికళ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడాన్ని నిలుపుదల చేయాలని కేంద్రాన్ని కోరేందుకు డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడుస్టాలిన్ మంగళవారం ఢిల్లీకి వెళ్లారు. ఈనెల 8 రాష్ట్రపతి, ప్రధానిని కలిసి వినతిపత్రం ఇవ్వనున్నారు. అన్నాడీఎంకేలో తన అభిమానుల బలాన్ని నిరూపించుకునేందుకు జయలలిత మేనకోడలు దీప సంతకాలు సేకరించే పనిలోపడ్డారు.