వీడని ప్రతిష్టంభన
తమిళ సీఎం పీఠంపై వీడని చిక్కుముడి
- రాజ్‌భవన్‌లో రాజకీయ బంతి
- గవర్నర్‌తో పన్నీర్, పళనిస్వామి భేటీ
- పళనిని పిలుస్తారా? సభను సమావేశ పరుస్తారా?
- గవర్నర్ ఏం చేస్తారనే దానిపై ఉత్కంఠ
- శశికళ, పళనిస్వామిపై కిడ్నాప్ కేసు
- ఇది తగదంటూ సుబ్రమణ్యస్వామి ట్వీట్
సాక్షి ప్రతినిధి, చెన్నై
తమిళనాడులో రాజకీయ ప్రతిష్టంభన ఇంకా తొలగిపోలేదు. అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా ఎంపికైన పళనిస్వామి తనకు 128 మంది ఎమ్మెల్యేల మద్దతుందని, ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని కోరి రెండు రోజులైనప్పటికీ గవర్నర్ సీహెచ్. విద్యాసాగర్‌రావునుంచి ఎలాంటి స్పందన లేకపోవడంపై రాజకీయవర్గాల్లో చర్చ మొదలైంది. మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతున్నవారిని ప్రభుత్వ ఏర్పాటుకు పిలవడమే పార్లమెంటరీ సంప్రదాయమని నిపుణులు చెబుతున్నారు. అయితే ఒకే పార్టీలోని ఇరువర్గాలు పోటీ పడుతున్నప్పుడు శాసనసభను ప్రత్యేకంగా సమావేశపరచి బలపరీక్షకు అవకాశమివ్వవచ్చని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ కూడా సోమవారం ఇదే సూచించిన విషయాన్ని ప్రస్తావిస్తున్నారు.
మరోవైపు సీఎం పదవికై పోటా పోటీగా పావులు కదుపుతున్న పన్నీర్‌సెల్వం, పళనిస్వామి బుధవారం రాత్రి వేర్వేరుగా గవర్నర్‌ను కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించాల్సిందిగా పళనిస్వామి గవర్నర్‌ను కోరినట్లు సమాచారం. తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుపై కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోదని, గవర్నర్ రాజ్యాంగం ప్రకారం నిర్ణయం తీసుకుంటారని కేంద్రమంత్రి అరుణ్‌జైట్లీ ప్రకటించారు. మరోవైపు కువత్తూరులో ఎమ్మెల్యేలను బలవంతంగా నిర్బంధించారని శశికళ, పళనిస్వామిలపై కేసు నమోదైంది. దీనిపై తమిళనాడు డీజీపీని హెచ్చరించాలని కేంద్ర హోంమంత్రిని కోరినట్లు బీజేపీ సీనియర్ నేత సుబ్రమణ్యస్వామి ట్వీట్ చేశారు. పళనిస్వామి సీఎం అయ్యాక భద్రతా కారణాల దృష్ట్యా శశికళను తమిళనాడుకు తరలించాలని కోరారు. వీటన్నింటి నేపథ్యంలో గవర్నర్ పళనిస్వామిని పిలుస్తారా? లేక ప్రత్యేక సమావేశం నిర్వహించి బలపరీక్షకు అవకాశమిస్తారా? అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని రాష్ట్రమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తోంది.
రెండు శిబిరాల్లోనూ ఆందోళన
శశికళ జైలు కెళ్లగానే పన్నీర్‌సెల్వం వైపు ఎమ్మెల్యేల క్యూ కడతారని ఆశించిన వారికి నిరాశే మిగిలింది. పన్నీర్ ఇంటివద్ద బుధవారం జనం బాగా పలుచబడ్డారు. సినీనటి గౌతమి మాత్రమే పన్నీర్‌ను కలిసి మద్దతు ప్రకటించారు. తన మద్దతుదారులతో మంగళవారం వరకు చెదరని చిరునవ్వుతో పదే పదే మీడియాకు ముందుకు వచ్చిన పన్నీర్‌సెల్వం బుధవారం ఒక్కసారి కూడా ఇంటినుంచి బైటకు రాలేదు. ఆయన అనుచరులు సైతం నీరసపడిపోయినట్లు కనిపించారు. పళనిస్వామిని గవర్నర్ ఆహ్వానించిన పక్షంలో తమ పరిస్థితి ఏమిటని పన్నీర్ ఆలోచనలో పడినట్లు సమాచారం.
మరోవైపు శశికళ ఉన్నంతవరకు హుషారుగా వ్యహరించిన కువత్తూరు రిసార్టులోని ఎమ్మెల్యేలు ఆమె జైలు కెళ్లడంతో డీలాపడిపోయారు. సుప్రీంకోర్టు తీర్పు వెలువడి, శశికళ జైలుకు వెళ్లిన తరువాత కూడా పళనిస్వామిని ప్రభుత్వ ఏర్పాటుకు పిలవకుండా గవర్నర్ జాప్యం చేయడంపై ఆందోళన నెలకొంది. రిసార్టులోని ఎమ్మెల్యేలు పన్నీర్‌వైపు జారిపోకుండా పలు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. మాజీ మంత్రి సెంగొట్టయ్యన్ బుధవారం కువత్తూరులో మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించేవరకు ఇక్కడున్న ఎమ్మెల్యేలు బైటకు వచ్చే ప్రసక్తేలేదని స్పష్టం చేశారు.
కాంపోజిట్ బలపరీక్ష అంటే?
ఒకే పార్టీకి చెందిన ఇద్దరు వ్యక్తులు ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కోరినప్పుడు, ఎవరికి బలముందో స్పష్టత లేనప్పుడు గవర్నర్ శాసనసభను ప్రత్యేకంగా సమావేశపరచి బలాన్ని నిరూపించుకునే అవకాశమిస్తారు. సభకు హాజరైన వారిలో మెజారిటీ ఎవరికి ఉందో వారిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తారు. బలపరీక్ష వాయిస్ ఓట్, డివిజన్ ఓట్ ద్వారా జరగవచ్చు. డివిజన్ ఓట్ కోరినప్పుడు బ్యాలెట్ లేదా ఈవీఎంల ద్వారా ఓటింగ్ నిర్వహిస్తారు. ఇద్దరిలో ఎవ్వరికీ మెజారిటీ దక్కని పక్షంలో స్పీకర్ ఓటు వేస్తారు. ఉత్తరప్రదేశ్‌లో కళ్యాణ్‌సింగ్, జగదాంబికాపాల్ ఇరువురూ ప్రభుత్వ ఏర్పాటు కోసం పోటీపడినప్పుడు కాంపోజిట్ బలపరీక్ష నిర్వహించాలని 1998లో సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. తమిళనాడులో కూడా ఇదే పద్ధతి అనుసరించాలని, వారంలోగా సభను సమావేశపరిచి బలపరీక్షకు అవకాశమివ్వాలని అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ సోమవారం గవర్నర్‌కు సూచించిన విషయం తెలిసిందే.
శశికళ, ఎడపాడిపై కిడ్నాప్ కేసు
అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను కిడ్నాప్ చేసినట్లుగా వచ్చిన ఫిర్యాదులపై కువత్తూరు పోలీసులు శశికళ, ఎడపాడి పళనిస్వామిలపై మూడు సెక్షన్ల కింద బుధవారం కేసు నమోదు చేశారు. శశికళ నిర్వహిస్తున్న కువత్తూరు క్యాంప్ నుంచి ఈనెల 13వ తేదీన తప్పించుకు వచ్చిన మదురై పశ్చిమ ఎమ్మెల్యే శరవణన్ డీజీపీకి ఒక ఫిర్యాదు చేశారు. శశికళ తరఫు వ్యక్తులు ఎమ్మెల్యేలను కిడ్నాప్ చేసి కువత్తూరులో దాచిపెట్టినట్లు అందులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదుపై డీజీపీ, కాంచీపురం ఎస్పీ ఆదేశాల మేరకు శశికళ, పళనిస్వామిలపై కిడ్నాప్ కేసు నమోదు చేశారు.
రెండాకుల చిహ్నం ఎవరికి?
పన్నీర్‌సెల్వం, పళనిస్వామి వర్గాలుగా అన్నాడీఎంకే రెండుగా చీలిపోయిన పక్షంలో రెండాకుల చిహ్నం ఏ వర్గానికి దక్కుతుందని అప్పుడే చర్చ మొదలైంది. పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన శశికళ పార్టీలో కీలకపదవుల్లో కొన్ని నియామకాలు, తొలగింపులు చేశారు. అయితే తాత్కాలిక ప్రధాన కార్యదర్శికి నియామకాలు చేసే హక్కులు లేవని పన్నీర్‌సెల్వం వర్గం వాదిస్తోంది. వైరివర్గాల్లో పార్టీ ప్రిసీడియం చైర్మన్‌గా ఇద్దరు, కోశాధికారిగా ఇద్దరు ఉన్నారు. పార్టీ నియమావళి ప్రకారం తాత్కాలిక ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎన్నిక చెల్లదని ఎన్నికల కమిషన్‌కు అందిన ఫిర్యాదు పరిశీలనలో ఉంది. ఈ పరిస్థితుల్లో అన్నాడీఎంకే రెండాకుల చిహ్నం ఎవరికి దక్కుతుందోనని రెండు శిబిరాల్లో చర్చించుకుంటున్నారు.