తమిళనాడు గవర్నర్‌ నిర్ణయం తీసుకున్నారా? | setback for Sasikala? Tamil Nadu Governor willnot be called to form government | Sakshi
Sakshi News home page

శశికళకు షాక్‌: గవర్నర్‌ నిర్ణయం ఇదేనా?

Published Fri, Feb 10 2017 11:19 PM | Last Updated on Tue, Aug 21 2018 11:58 AM

తమిళనాడు గవర్నర్‌ నిర్ణయం తీసుకున్నారా? - Sakshi

తమిళనాడు గవర్నర్‌ నిర్ణయం తీసుకున్నారా?

చెన్నై: గడిచిన నాలుగురోజులుగా సాగుతోన్న రాజకీయ ప్రతిష్ఠంభనకు గవర్నర్‌ తెరదించినట్లు శుక్రవారం రాత్రి వార్తలు ప్రసారం కావడంతో తమిళనాట టెన్షన్‌ తారాస్థాయికి చేరింది. మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు తనకే ఉందని, ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించే అవకాశం కల్పించాలన్న శశికళ అభ్యర్థనను తమిళనాడు ఇన్‌చార్జి గవర్నర్‌ సి.విద్యాసాగర్‌రావు తిరస్కరించినట్లు, ఈ మేరకు శుక్రవారం కేంద్ర ప్రభుత్వానికి పంపిన నివేదికలో గవర్నర్‌ స్పష్టమైన అభిప్రాయం వెల్లడించినట్లు తెలిసింది. దీంతో చిన్నమ్మ వర్గం ఒక్కసారిగా షాక్‌కు గురైంది.

ముఖ్యమంత్రి పదవికోసం పోటీ పడుతోన్న ఇద్దరు నేతల(శశికళ, ఓ.పన్నీర్‌ సెల్వం)తో గురువారం భేటీ అయిన గవర్నర్‌, శుక్రవారం మద్రాస్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తితోనూ సమావేశం నిర్వహించారు. అటు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలతోనూ, ప్రతిపక్ష నేత స్టాలిన్‌తోనూ మాట్లాడారు. అందరి అభిప్రాయాలను క్రోడీకరించిన గవర్నర్‌.. శుక్రవారమే కేంద్ర హోం శాఖకు ఒక నివేదిక పంపినట్లు సమాచారం. ఆ నివేదికలోనే.. ప్రభుత్వ ఏర్పాటుకు శశికళను ఆహ్వానించబోనని గవర్నర్‌ పేర్కొన్నట్లు తెలిసింది.

శశికళకు షాక్‌ ఇచ్చే విధంగా గవర్నర్‌ నిర్ణయం తీసుకోవడానికి ప్రధానంగా రెండు కారణాలను పేర్కొన్నట్లు తెలిసింది. శశికళ అక్రమ ఆస్తుల కేసుపై వచ్చే వారం సుప్రీంకోర్టు తీర్పు వెలువడనుండటం, చట్టసభలో సభ్యురాలు కాకపోవడం వల్లే బలనిరూపణకు ఆమెకు అవకాశం ఇవ్వకూడదని గవర్నర్‌ భావిస్తున్నట్లు రిపోర్టులో పేర్కొన్నారు. సాధారణంగా చట్టసభకు ఎంపిక కానివారితో మంత్రిగానో, ముఖ్యమంత్రిగానో ప్రమాణం చేయిస్తే, ఆరు నెలలలోగా వారు ఏదోఒక అసెంబ్లీ లేదా మండలి స్థానం నుంచి గెలవవాల్సి ఉంటుంది. అయితే రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 164 (1) ప్రకారం చట్టసభలో సభ్యులుకాని వ్యక్తులకు శాసనసభలో బలం నిరూపించుకునే(ముఖ్యమంత్రి అయ్యే) అవకాశం కల్పించాలా? వద్దా? అనేదానిపై గవర్నర్‌దే తుది నిర్ణయం. దీనికి సంబంధించి ఆర్టికల్‌ 164(4)పై గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారమే నడుచుకోవాలని గవర్నర్‌ విద్యాసాగర్‌రావు భావిస్తున్నట్లు నివేదికలో పేర్కొన్నారు.

అబ్బే! నివేదికరాలేదే..
ఒక జాతీయ చానెల్‌ ప్రసారం 'నివేదిక' వార్తలు దావానలంలా మారి, దుమారం రేపుతుండటంతో కేంద్ర హోంశాఖ, తమిళనాడు రాజ్‌భవన్‌లు రంగంలోకి దిగాయి. 'అసలు అలాంటి నివేదిక ఏదీ గవర్నర్‌గారు కేంద్రప్రభుత్వానికి పంపనేలేదు' అని రాజ్‌భవన్‌ పౌరసంబంధాల అధికారి(పీఆర్‌వో) శుక్రవారం రాత్రి మీడియాకు చెప్పారు. అటు కేంద్ర హోం శాఖ కూడా 'తమిళనాడు గవర్నర్‌ నుంచి నివేదిక రాలేదు'అని తేల్చిచెప్పింది. దీంతో తమిళనాట ఉత్కంఠ కొనసాగుతూనేఉంది..

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement