దమ్ముంటే పన్నీర్‌కు బదులివ్వండి
- శశికళకు ప్రధాన ప్రతిపక్ష నేత స్టాలిన్ సవాల్
సాక్షి ప్రతినిధి, చెన్నై: డీఎంకే పార్టీని ఆడిపోసుకోకుండా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం సంధించిన ప్రశ్నలకు దమ్ముంటే సమాధానాలు ఇవ్వాలని డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు, ప్రధాన ప్రతిపక్ష నేత స్టాలిన్ వ్యాఖ్యానించారు. అన్నాడీఎంకేలో నెలకొన్న పరిస్థితులు, డీఎంకేపై విమర్శలు చేస్తున్న నేపథ్యంలో బుధవారం స్టాలిన్ ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రతిపక్ష నేతను చూసి ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం నవ్వారని, వారిద్దరికీ సంబంధాలు ఉన్నాయని శశికళ చేసిన వ్యాఖ్యలను ఖండించారు.
వాయువేగంలో సీఎం కాలేకపోయాననే దిగులుతో కృంగిపోయిన స్థితిలో శశికళ ఈ వ్యాఖ్యలు చేసినట్లు భావిస్తున్నానని ఎద్దేవా చేశారు. గవర్నర్ సమక్షంలో ప్రమాణ స్వీకారం చేసిన పన్నీర్‌సెల్వంను పోయెస్‌గార్డెన్‌కు పిలిపించి, రెండు గంటలపాటు బెదిరించి రాజీనామా చేయించిన శశికళ అన్నాడీఎంకే కార్యకర్తల ఆగ్రహానికి గురికాక తప్పదన్నారు. శశికళకు నిజంగా దమ్ముంటే పన్నీర్‌సెల్వం చేసిన విమర్శలకు, అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని ఆయన సవాల్ విసిరారు. పన్నీర్‌సెల్వం నేతృత్వంలో సాగుతున్న ప్రభుత్వాన్ని కూలదోస్తూ ఆయన చేత బలవంతంగా రాజీనామా చేయించిన సంఘటనపై సీబీఐ విచారణ జరపాలని ఆయన కోరారు.