శశికళ జాతకంపై నేడే తీర్పు
తమిళనాడులో హైటెన్షన్: అల్లర్లు జరగవచ్చని హెచ్చరిక
- తీర్పు తనకు అనుకూలంగా ఉంటుందని చిన్నమ్మ ధీమా
- వ్యతిరేక తీర్పు వస్తే ప్రత్యామ్నాయాలపై చిన్నమ్మ శిబిరం మంతనాలు
- శశికళ జైలుకు పోవడం ఖాయమని పన్నీర్ వర్గాల ప్రచారం
- అల్లర్లు జరిగే అవకాశం ఉందని సీఎస్, డీజీపీని హెచ్చరించిన గవర్నర్
- పోలీసు అధికారులతో సీఎస్ అత్యవసర సమావేశం
- పన్నీర్ గూటికి మరో ఎమ్మెల్యే, ఎంపీ
- అదను చూసి అధికారం దక్కించుకోవాలని డీఎంకే వ్యూహం
- గవర్నర్ వెనుక కేంద్రమంత్రులు ఉన్నారన్న ఎంపీ సుబ్రమణ్య స్వామి
చెన్నై నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: తమిళనాడులో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ముఖ్యమంత్రి పీఠంకోసం వారం రోజులుగా ఎత్తులు, పై ఎత్తులతో రాష్ట్ర రాజకీయాలను వేడెక్కించిన ఆపద్ధర్మ ముఖ్యమంతి పన్నీర్ సెల్వం, అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ మరింత దూకుడుగా వ్యవహరిస్తున్నారు. సీఎం పదవికి రాజీనామా చేశాక పన్నీర్ సోమవారం తొలిసారి సచివాలయానికి వెళ్లి సమీక్షలు నిర్వహించగా... శశికళ ప్రజాక్షేత్రంలోకి ప్రవేశించి సామాన్యులతో మమేకమయ్యారు. వెయ్యిమంది పన్నీర్‌సెల్వంలను చూశానంటూ విరుచుకుపడ్డారు. ఎమ్మెల్యేలను ఆకర్షించేందుకు పన్నీర్ పలు ప్రయత్నాలు చేసినప్పటికీ... ఇప్పటికీ 119 మంది ఎమ్మెల్యేలు శశికళ శిబిరంలో ఉన్నారని ప్రభుత్వమే మద్రాసు హైకోర్టుకు నివేదిక సమర్పించింది. అయితే శశికళ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో సుప్రీంకోర్టు మంగళవారం తీర్పు వెలువరించే అవకాశం ఉండడంతో రాష్ట్రమంతటా ఉత్కంఠ నెలకొంది.
ఈ కేసులో శశికళ దోషిగా తేలితే ఆమె ముఖ్యమంత్రి పదవి చేపట్టడానికి అనర్హురాలవుతారు. తీర్పు తమకే అనుకూలంగా ఉంటుందని ఇరు వర్గాలు పైకి ధీమా వ్యక్తం చేస్తున్నా మంగళవారం ఏం జరగబోతోందోనని నరాలు తెగే ఉత్కంఠతో ఎదురుచూస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా అల్లర్లు జరిగే అవకాశం ఉందని ఇన్‌చార్జ్ గవర్నర్ విద్యాసాగర్‌రావు అధికార యంత్రాంగాన్ని హెచ్చరించడంతో పోలీసు యంత్రాంగం అప్రమత్తమైంది. శశికళ ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో కర్ణాటక ప్రభుత్వంతోపాటు పలువురు ఫైల్ చేసిన అప్పీళ్లపై జస్టిస్ పీసీ ఘోష్, జస్టిస్ అమితవరాయ్‌లతో కూడిన బెంచ్ ఉదయం 10:30 గంటలకు తీర్పు వెలువరించవచ్చని తెలుస్తోంది. సుప్రీంకోర్టు తీర్పు ఎలా వచ్చినా స్వీకరిస్తానని శశికళ ప్రకటించారు.
అయితే తీర్పు వ్యతిరేకంగా వస్తే ఏ రకమైన వ్యూహం అమలు చేయాలి, తమ తరఫున పార్టీని ఎవరు నడపాలి, సీఎం కుర్చీలో ఎవరు కూర్చోవాలి అనే అంశాలపై శశికళ తనకు అత్యంత సన్నిహితులైన వారితో సుదీర్ఘంగా చర్చలు జరిపారు. శశికళ జైలుకు పోవడం ఖాయమని అపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం శిబిరం పెద్ద ఎత్తున ప్రచారం చేస్తోంది. శశికళ శిబిరం నుంచి మధురై ఎమ్మెల్యే శరవణన్ తప్పించుకుని మారువేషంలో చెన్నైకి చేరుకున్నారు. ఎంపీ గోపాలకృష్ణన్‌తో కలసి ఆయన సోమవారం రాత్రి ఆయన పన్నీర్ గూటికి చేరారు. దీంతో పన్నీర్‌కు మద్దతు ఇస్తున్న ఎంపీల సంఖ్య 12కు, ఎమ్మెల్యేల సంఖ్య 8కి చేరింది. శశికళ శిబిరంలోని ఎమ్మెల్యేలంతా పన్నీర్ ఇంటికి వస్తారని ఎంపీ గోపాలకృష్ణన్ ఎద్దేవా చేశారు.
న్యాయ నిపుణులతో సమాలోచనలు
ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో తీర్పు శశికళకు అనుకూలంగా వస్తే ఏం చేయాలి, వ్యతిరేకంగా వస్తే ఎలా నిర్ణయం తీసుకోవాలనే విషయాలపై ఇన్‌చార్జ్ గవర్నర్ విద్యాసాగర్‌రావు అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గీ, మాజీ అటార్నీ జనరల్ సోలీసొరాబ్జీల నుంచి న్యాయ సలహాలు తీసుకున్నారు. వారం రోజుల్లోగా శాసనసభను ప్రత్యేకంగా సమావేశపరిచి శశికళ, పన్నీర్ బలాబలాలు నిరూపించుకునే అవకాశమివ్వాలని గవర్నర్‌కు రోహత్గీ సూచించినట్లు తెలిసింది. గవర్నర్ నిర్ణయం సాగదీయడం వెనుక కొందరు కేంద్ర మంత్రులు ఉన్నారని బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి సంచలన ఆరోపణలు చేశారు. గవర్నర్ ఇంకా సాగదీస్తే కేసు వేస్తానని కూడా ఆయన హెచ్చరించారు. శశికళ సీఎంగానే ఢిల్లీకి వస్తారని ధీమాగా చెప్పారు. గవర్నర్ రాజ్యాంగానికి బ్రేకులు వేస్తున్నారని ఆయన విమర్శించారు. మోదీని విమర్శిస్తే అంతు చూస్తామని కేంద్ర సహాయ మంత్రి పొన్ రాధాకృష్ణన్ హెచ్చరించారు. శశికళను సీఎంగా ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించేలా గవర్నర్‌ను ఆదేశించాలని ఎంఎల్ శర్మ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
అల్లర్లు జరగవచ్చని హెచ్చరిక
రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ వాతావరణం, శశికళ కేసులో సుప్రీంకోర్టు తీర్పు రానున్న నేపథ్యంలో అల్లర్లు జరిగే అవకాశం ఉందని గవర్నర్ విద్యాసాగర్‌రావు అధికార యంత్రాంగాన్ని హెచ్చరించారు. పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించేవారె వరైనా సరే కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గిరిజా వైద్యనాథన్ హోం శాఖ కార్యదర్శి, పోలీసు ఉన్నతాధికారులు, డీజీపీతో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి శాంతి భద్రతల అంశాన్ని సమీక్షించారు. ఈ సమావేశం ముగిసిన రెండు గంటలకే ఇంటెలిజెన్స్ ఐజీ కె.ఎన్.సత్యమూర్తిని బదిలీ చేశారు. ఆయన స్థానంలో పోలీస్ వెల్ఫేర్ ఐజీ డేవిడ్‌సన్ దేవాశీర్వాదంను నియమిస్తూ ఉత్తర్వులిచ్చారు.
సంతకాల పరిశీలన
మద్దతు తెలుపుతున్న ఎమ్మెల్యేల పేర్లతో శశికళ సమర్పించిన జాబితాలోని సంతకాలను గవర్నర్ పరిశీలన చేయిస్తు న్నారు. ఈ నేపథ్యంలోనే కృష్ణగిరి జిల్లా ఊత్తంగరై ఎమ్మెల్యే మనోరంజితం తాను ఎమ్మెల్యేల సమావేశానికే హాజరు కాలేదని చెప్పారు. తన సంతకాన్ని ఫోర్జరీ చేశారని, ప్రజాభిప్రాయం మేరకు తాను పన్నీర్‌కు మద్దతిస్తానన్నారు. మరోవైపు సెంగోట్టి యన్‌కు పార్టీ ప్రిసీడియం చైర్మన్ పదవి ఇవ్వడంతో లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ తంబి దురై అసంతృప్తితో ఢిల్లీలోనే ఉన్నారని ప్రచారం జరిగింది. ఈ ప్రచారాన్ని శశికళ వర్గం ఖండించింది. రాష్ట్రపతి అపాయింట్ మెంట్ కోసం ఆయన ఢిల్లీలో ప్రయత్నాలు చేస్తున్నారని, శశికళతో టచ్‌లోనే ఉన్నారని ఆ వర్గాలు చెప్పాయి.