![Y Category Security To Tamil Nadu Actor Vijay Sparks Political Storm](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2025/02/15/Vijay_Security.jpg.webp?itok=lpy381Tj)
చెన్నై: అగ్రనటుడు, టీవైకే పార్టీ అధినేత విజయ్‌కు కేంద్రం ‘వై’ కేటగిరీ భద్రతను కేటాయించింది. రాజకీయాల్లో ఆయన క్రియాశీలకంగా మారడం, పైగా తరచూ జనాల్లోకి వెళ్తుండడంతో ఆయన ప్రాణాలకు ముప్పు కలగవచ్చని నిఘా వర్గాలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంతోనే హోం శాఖ ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఈ వ్యవహారం ఇప్పుడు రాజకీయ దుమారం రేపుతోంది.
నటుడు, రాజకీయనేత అయిన విజయ్(Vijay)తో పాటు పలువురు ప్రముఖుల ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు తాజాగా కేంద్ర హోం శాఖకు నివేదికలు ఇచ్చాయి. ఇంటెలిజెన్స్ బ్యూరో(Intelligence Bureau) సూచనల మేరకు వాళ్లందరికీ ‘ఎక్స్, వై, జెడ్’ కేటగిరీల కింద ప్రత్యేక భద్రత కల్పించేందుకు కేంద్ర హోం శాఖ ముందుకు వచ్చింది. ఈ మేరకు ఫిబ్రవరి 13వ తేదీన ఓ నోటిఫికేషన్ కూడా రిలీజ్‌చేసింది. తాజా నిర్ణయంతో.. ఒకరు లేదా ఇద్దరు కమాండోలతో పాటు 8-11 మంది సీఆర్పీఎఫ్ సిబ్బంది విజయ్‌కు భద్రతగా ఉండనున్నారు. అయితే..
ఈ వ్యవహారం(Vijay Security Row) తమిళనాట రాజకీయ విమర్శలకు దారి తీసింది. విజయ్‌కు రాష్ట్ర ప్రభుత్వమే ఇలాంటి భద్రత ఎందుకు కల్పించలేకపోయిందని బీజేపీ ప్రశ్నలు సంధించింది. ‘‘విజయ్ తమిళనాట ప్రజాదరణ ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి భద్రతకు ముప్పు పొంచి ఉందనే సమాచారం ఉన్నప్పుడు.. ఇక్కడి ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదు. డీఎంకే ప్రభుత్వం ఆయనకు భద్రత కల్పించేందుకు ముందుకు రావొచ్చు కదా?’’ అని తమిళనాడు బీజేపీ చీఫ్ అన్నామలై ప్రశ్నించారు. దీనిపై డీఎంకే నుంచి బదులు రావాల్సి ఉంది.
మరోవైపు.. వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు ఉండడంతో విజయ్‌ను ప్రసన్నం చేసుకోవడానికి బీజేపీ ఆడుతున్న డ్రామా ఇదని అన్నాడీఎంకే(AIADMK) ఆరోపిస్తోంది. నిజాయితీగా విజయ్‌కు కేంద్రం భద్రతను ఇచ్చి ఉంటే ఫర్వాలేదు. కానీ, రాజకీయం కోసం చేసి ఉంటే మాత్రం.. తమిళనాడులో అలాంటి పాచికలు పారవు’’ అని అన్నాడీఎంకే నేత మునుస్వామి చురకలటించారు.
కోలీవుడ్ స్టార్ హీరో విజయ్‌కు తమిళనాడులో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కిందటి ఏడాది ఫిబ్రవరిలో తమిళగ వెట్రి కజగం అనే పార్టీని ప్రకటించారు. రాష్ట్రంలో డీఎంకే, కేంద్రంలోని బీజేపీకి తన పార్టీ ప్రత్యామ్నాయమని ప్రకటించారాయన. ఆ మధ్య నిర్వహించిన ఓ బహిరంగ సభకు అశేషమైన స్పందన లభించింది కూడా. తరచూ జనాల్లో వెళ్తున్నారు కూడా. ఇక విజయ్ కదలికలను రాజకీయ వర్గాలు నిశితంగా పరిశీలిస్తూ వస్తున్నాయి. అలాగే.. మాజీ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తోనూ ఆయన తరచూ భేటీ అవుతూ వస్తున్నారు. వచ్చే ఏడాది జరగబోయే అసెంబ్లీ ఎన్నికలనే లక్ష్యంగా ఆయన టీవీకేను ముందుకు తీసుకెళ్తున్నారు.
ఇదీ చదవండి: కళ్లు చెదిరిపోయేలా.. జయలలిత ఆస్తులు!
Comments
Please login to add a commentAdd a comment