జయలలిత వస్తువుల  అప్పగింత షురూ!  | Jayalalithaa Seized Assets Officially Handed Over To Tamilnadu Govt Including Gold, Silver And Other Documents | Sakshi
Sakshi News home page

జయలలిత వస్తువుల  అప్పగింత షురూ! 

Published Sat, Feb 15 2025 6:01 AM | Last Updated on Sat, Feb 15 2025 8:35 AM

Jayalalithaa seized assets officially handed over to Tamilnadu Govt

బెంగళూరుకు చేరుకున్న తమిళనాడు అధికారులు  

ఆస్తి పత్రాలు, విలువైన అభరణాలు అప్పగిస్తున్న కర్ణాటక అధికారులు  

రెండు రోజుల్లో పూర్తికానున్న అప్పగింత ప్రక్రియ  

సాక్షి, బెంగళూరు:  తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు సంబంధించిన ఆస్తి పత్రాలు, బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులను తమిళనాడు ప్రభుత్వానికి అప్పగించే ప్రక్రియ శుక్రవారం ప్రారంభమైంది. కోర్టు ఆదేశాల మేరకు జయలలిత వస్తువులను తీసుకెళ్లేందుకు తమిళనాడు పోలీసులు, అధికారులు కర్ణాటక రాజధాని బెంగళూరుకు చేరుకున్నారు. 

జయలలితకు సంబంధించిన ఆస్తి పత్రాలు, 11,344 పట్టు చీరలు, 750 జతల పాదరక్షలు, గడియారాలు, 7,040 గ్రాముల బరువైన 468 రకాల బంగారు, వజ్రాభరణాలు, 700 కిలోల వెండి అభరణాలు, 250 శాలువాలు, 12 రిఫ్రిజిరేటర్లు, 10 టీవీసెట్లు, 8 వీసీఆర్లు, ఒక వీడియో కెమెరా, 4 సీడీ ప్లేయర్లు, 2 ఆడియో డెక్‌లు, 24 టూ ఇన్‌ వన్‌ టేప్‌రికార్డర్లు, 1,040 వీడియో క్యాసెట్లు, 3 ఐరన్‌ లాకర్లతోపాటు ఇతర విలువైన వస్తువులను కర్ణాటక అధికారులు న్యాయమూర్తి సమక్షంలో తమిళనాడు అధికారులకు అప్పగిస్తున్నారు. ఈ సందర్భంగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ అప్పగింత ప్రక్రియ రెండు రోజుల్లో పూర్తికానుంది.  

జయలలిత బంధువులమంటూ దీప, దీపక్‌ అనే వ్యక్తులు గతంలో కర్ణాటక ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు. జయలలితకు సంబంధించిన ఆభరణాలు, వస్తువులను తమకు అప్పగించాలంటూ వారు దాఖలు చేసిన పిటిషన్‌ను ప్రత్యేక న్యాయస్థానం కొట్టివేసింది. అవన్నీ తమిళనాడు ప్రభుత్వానికే చెందుతాయని తేల్చిచెప్పింది. ఈ మేరకు 2024 ఫిబ్రవరి 19వ తేదీన ఆదేశాలు జారీ చేసింది. 

2024 మార్చి 6, 7 తేదీల్లో వాటిని స్వాధీనం చేసుకునేందుకు అధికారిక బృందాన్ని ఏర్పాటు చేయాలని తమిళనాడు ప్రభుత్వానికి సూచించింది. అంతలోనే దీప, దీపక్‌ ప్రత్యేక కోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. దీంతో జయలలిత వస్తువుల అప్పగింతపై గతేడాది మార్చి 5న హైకోర్టు స్టే విధించింది. ఆ తర్వాత దీప, దీపక్‌ల పిటిషన్‌ను కొట్టివేసింది. దాంతో ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాల మేరకు వస్తువుల అప్పగింత ప్రక్రియ ప్రారంభమైంది. అక్రమాస్తుల కేసులో దోషిగా తేలిన జయలలితకు స్పెషల్‌ కోర్టు 2014 సెప్టెంబర్‌ 27న నాలుగేళ్ల జైలు శిక్షతోపాటు రూ.100 కోట్ల జరిమానా విధించింది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement