చర్యలు, ప్రతి చర్యలు... సవాళ్లు, ప్రతి సవాళ్లు... ఎత్తులు, పైఎత్తులు... వ్యూహాలు, ప్రతివ్యూహాలతో తమిళనాడులో రాజకీయ సమీకరణాలు క్షణక్షణం మారిపోతున్నాయి. ముఖ్యమంత్రి కుర్చీకోసం తలపడుతున్న ఆపద్ధర్మ సీఎం పన్నీర్ సెల్వం, అన్నాడీఎంకే తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ శుక్రవారం రాజకీయాన్ని మరింత రసవత్తర స్థాయికి చేర్చారు. శశికళ ప్రమాణ స్వీకారం కోసం మద్రాసు యూనివర్సిటీ ఆవరణంలో ఏర్పాటు చేసిన బందోబస్తును పన్నీర్ తొలగింపచేశారు. కుటుంబ పాలనకు వ్యతిరేకంగా పుట్టిన అన్నాడీఎంకేను ఎట్టి పరిస్థితుల్లోనూ శశికళ కుటుంబం చేతుల్లో పడనీయబోమని ప్రకటించారు.