
ఎమ్మెల్యేల మద్దతు నాకే..
అన్నా డీఎంకేలోని ఎమ్మెల్యేల అండతో అసెంబ్లీలో బలపరీక్షకు తాను సిద్ధంగా ఉన్నానని తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం స్పష్టం చేశారు.
తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ధీమా
- ‘అమ్మ’మృతిపై ప్రజల్లో ఇంకా అనుమానాలున్నాయి.
- వాటిని నివృత్తి చేసేందుకు విచారణ కమిషన్ వేయాలి
సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నా డీఎంకేలోని ఎమ్మెల్యేల అండతో అసెంబ్లీలో బలపరీక్షకు తాను సిద్ధంగా ఉన్నానని తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం స్పష్టం చేశారు. ‘అమ్మ’ఆశయాలు, ప్రజాభీష్టానికి కట్టుబడిన ఎమ్మెల్యేలు తనకు మద్దతు పలకడం, బలపరీక్షలో తాను నెగ్గడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఆయన బుధవారం చెన్నైలోని తన నివాసంలో మీడియా సమావే శంలో మాట్లాడారు. అధికారంలో ఉన్నా, ప్రతి పక్షంలో ఉన్నా ఏనాడూ పార్టీకి తాను ద్రోహం చేయలేదని చెప్పారు. అయితే, ఇప్పుడు పార్టీకి కళంకం తెచ్చానని ఆరోపిస్తున్నారని అన్నారు. ఈ ఆరోపణలకు కాలమే సమాధానం చెబు తుందని పేర్కొన్నారు.
డీఎంకేతో సంబంధాలు లేవు
‘‘అన్నాడీఎంకే సంస్థాగత ఎన్నికల్లో శాశ్వత ప్రధాన కార్యదర్శిని ఎన్నుకుంటాం. పార్టీ కోశాధికారి పదవి నుంచి నన్ను తప్పించే అధికారం తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళకు లేదు. శశికళ ఆరోపిస్తున్నట్లు ప్రతిపక్ష డీఎంకేతో నాకు ఎలాంటి సంబంధాలు లేవు. ప్రధాన ప్రతిపక్ష నేత స్టాలిన్‌తో నవ్వుతూ మాట్లాడితే తప్పేంటి? జయలలిత అన్న కుమార్తె అనే భావనతో దీపకు పిలుపునిస్తున్నా. ఆమె ఎప్పుడు వచ్చినా తగిన మర్యాద ఇచ్చేందుకు నేను సిద్ధం. కేంద్రంలో ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ప్రజా సంక్షేమం దృష్ట్యా అన్నాడీఎంకే ప్రభుత్వం సహకరించడం ఆనవాయితీగా వస్తోంది. అలాగే కేంద్రం కూడా సహకరిస్తోంది. అంతేగానీ పన్నీర్‌సెల్వం ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా అండగా నిలవడం లేదు’’అని పన్నీర్ సెల్వం పేర్కొన్నారు.
నన్ను కాదంటే ‘అమ్మ’ను ధిక్కరించినట్లే
ఒక తమిళ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో పన్నీర్ సెల్వం పలు అంశాలను వెల్లడించారు. ‘‘జయలలిత 75 రోజులు ఆసుపత్రిలో ఉన్నారు. ప్రతిరోజూ ఆసుపత్రికి వెళ్లాను. ఒక్కసారైనా ఆమెను కలవలేకపో యాను. ‘అమ్మ’తో మాట్లాడారా అని నా కుటుంబ సభ్యులు రోజూ అడిగేవారు. వారితో అబద్ధం చెబుదామని అనుకున్నా.. కానీ, చెప్పలేకపోయా. ప్రజలు తమను ఎందుకు గెలిపించారనే విషయాన్ని ఎమ్మెల్యేలు దృష్టిలో పెట్టుకోవాలి. ‘అమ్మ’ఆత్మసాక్షి ప్రకారం ఎమ్మెల్యేలు మంచి నిర్ణయం తీసుకుంటారని నమ్ముతున్నా. ఒకవేళ నేను రాజీనామా ఉపసంహరించుకుని సీఎంగా బాధ్యతలు చేపడితే మంత్రులు, ఎమ్మెల్యేలు సహాయ నిరాకరణ చేస్తారని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే నన్ను ‘అమ్మ’ముఖ్యమంత్రిగా నియమించారు. నన్ను కాదంటే ‘అమ్మ’ను ధిక్కరించినట్లే. నేను సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తుండగా మరొకరు (శశికళ) సీఎంగా ఉండాలని మంత్రులు బహిరంగంగా చెప్పడం ఎంతో బాధాకరం. పార్టీ క్రమశిక్షణకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న మంత్రులను కేవలం ఒక్క సంతకంతో బర్తరఫ్ చేసే అధికారం ఒక సీఎంగా నాకు ఉంది. అయి తే ప్రభుత్వంలో ఇలాంటి పోకడలు ‘అమ్మ’ ఆత్మకు క్షోభ కలిగిస్తాయనే భావనతో సహిం చాను. కొందరు ఆరోపిస్తున్నట్లుగా పార్టీ వ్యవ హారాల్లో సహకరించాల్సిందిగా ప్రధాని మోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షాను కోరలేదు. 32 ఏళ్లపాటు ‘అమ్మ’వెన్నంటి ఉండడమే ప్రధాన కార్యదర్శి, సీఎం పదవు లకు అర్హత కాకూడదని భావించాను. అలా చేయడం వల్ల ఏర్పడే పరిణామాలను ఎదుర్కొంటున్నాను. ‘అమ్మ’ మృతిపై ప్రజల్లో అనేక సందేహాలు నెలకొన్నాయి. కాబట్టే సుప్రీంకోర్టు న్యాయమూర్తి నేతృత్వంలో విచారణ కమిషన్ వేయాలని కోరాను’’ అని ఆపద్ధర్మ సీఎం పన్నీర్‌సెల్వం వెల్లడించారు.
పార్టీ పరిణామాలపై దీప షాక్
అన్నా డీఎంకేలో చోటుచేసుకున్న తాజా పరిణామాలను తనను షాక్‌కు గురి చేశాయని జయ సోదరుడి కుమార్తె దీపాజయకుమార్ అన్నారు. తమతో కలిసి పనిచేసేందుకు దీపను ఆహ్వానిస్తామంటూ సీఎం పన్నీర్‌సెల్వం చేసిన ప్రకటనపై ఆమె స్పందించారు. మీడియా ద్వారానే ఈ విషయం తెలిసిందని చెప్పారు.