సాక్షి, చెన్నై: అమ్మ జయలలిత మరణానంతరం తమిళనాడు రాజకీయాల్లో అన్నాడీఎంకే పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. ఈ నేపథ్యంలో పార్టీని తిరిగి గాడిలో పెట్టాలన్నా.. బలోపేతం చేయాలన్నా చిన్నమ్మ శశికళకు పార్టీ బాధ్యతలు అప్పగించడం మేలన్న అభిప్రాయాన్ని పన్నీర్ సెల్వం వర్గం వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో వర్గ పోరు చిచ్చు రాజుకుంది.
అన్నాడీఎంకే బలోపేతానికి శశి‘కళ’ అనివార్యమనే గళం గట్టిగా వినిపిస్తోంది. వరుస పరాజయాల నుంచి గట్టెక్కాలంటే శశికళను పార్టీలో చేర్చుకోవడం మినహా గత్యంతరం లేదని తన అనుచరులద్వారా పన్నీర్‌సెల్వం సంకేతాలు పంపిస్తున్నారు. ఈ క్రమంలోనే తేని జిల్లా పెరియకుళం కైలాసపట్లిలో పలువురు నేతలు సమావేశమై శశికళ రీ-ఎంట్రీ తీర్మానం చేశారు. అయితే వాళ్లు పాల్గొన్న వేదిక.. అన్నాడీఎంకే సమన్వయకర్త పన్నీర్ సెల్వానికి చెందిన ఫామ్‌హౌస్ కావడం విశేషం.
ఎడపాడి అలక?
బుధవారం శశికళ, ఆమె మేనల్లుడు దినకరన్ రీఎంట్రీకి తీర్మానం చేయడం, ఇందుకు ఎడపాడి పళనిస్వామి విముఖత ప్రదర్శించడం తీవ్రస్థాయిలో చర్చనీయాంశమైంది. అన్నాడీంకేను అన్నీతానై నడిపించిన జయలలిత 2016 డిసెంబర్‌లో కన్నుమూసిన తరువాత పన్నీర్‌సెల్వం సీఎం బాధ్యతలు చేపట్టారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళను ఎన్నుకున్నారు. అయితే సీఎం పదవిపై కన్నేసిన శశికళ ఆ కుర్చీ నుంచి పన్నీర్‌సెల్వంను బలవంతంగా తప్పించి శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యారు. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ పిలువకపోవడం, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష పడడంతో శశికళ ఆశలు అడియాశలయ్యాయి. జైలు కెళ్లేముందు ఎడపాడి పళనిస్వామిని ఆమె సీఎం కుర్చీలో కూర్చోబెట్టి పార్టీ బాధ్యతలను మేనల్లుడు టీటీవీ దినకరన్‌కు అప్పగించింది. శశికళపై తిరుగు బాటు చేసి సొంతపార్టీ పెట్టుకున్న పన్నీర్‌సెల్వం.. మరలా ఎడపాడితో జట్టుకట్టి(సొంత పార్టీని విలీనం చేసి) ఉప ముఖ్యమంత్రిగా మారారు. పార్టీ కన్వీనర్, కో– కన్వీనర్‌లుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఈపీఎస్, ఓపీఎస్ ఇద్దరూ కలిసి శశికళ, టీటీవీ దినకరన్‌ను పార్టీ నుంచి బహిష్కరించారు.
ఓటమి తరువాత ఎడముఖం.. పెడముఖం
గడిచిన అసెంబ్లీ ఎన్నికల వరకు ఒకరికొకరుగా సాగిన ఎడపాడి, పళనిస్వామి, పార్టీ పరాజయం తరువాత ఎడముఖం, పెడముఖంగా మారిపోయారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, డీఎండీకే, పీఎంలను కూటమిలో కలుపుకుని పోటీకి దిగినా అన్నాడీఎంకేకు కేవలం ఒక్కస్థానమే దక్కింది. ఇక గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వం చేజారిపోయింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం పరాజయం వెంటాడింది. జనాకర్షణ లేకనే పార్టీ వరుస పరాజయాల ఎదుర్కొంటోందని కొందరు విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో పన్నీర్‌సెల్వం అధ్యక్షతన బుధవారం తేనీలో జరిగిన పార్టీ సమావేశంలో శశికళను మళ్లీ పార్టీలో చేర్చుకోవాలని తీర్మానం చేయడం కలకలం రేపింది. ఈ నిర్ణయంపై ఎడపాడి వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది.
గత రెండేళ్లుగా పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగే సమావేశాల్లో ‘శశికళ వర్గంతో సంబంధం పెట్టుకుంటే వేటు తప్పదు’ అని ఎడపాడి, పన్నీర్ హెచ్చరికలు జారీచేశారు. మరిప్పుడు సాక్షాత్తూ పార్టీ కన్వీనర్ పన్నీర్‌సెల్వమే చినమ్మ, దినకరన్‌కు స్వాగతం పలకడాన్ని కొందరు జీర్ణించుకోలేకున్నారు. మరి కొందరు సమర్ధిస్తున్నారు. పార్టీ అధిష్టానం తీసుకు నే నిర్ణయాలకు కట్టుబడి ఉంటామని మాజీ మంత్రి కడంబూరు రాజా, శశికళ ప్రవేశం వల్ల పార్టీలో మ రింత గందరగోళ పరిస్థితులు ఏర్పడుతాయని అ న్నాడీఎంకే ఎమ్మెల్యే అరుణ్‌మొళి దేవన్ వ్యాఖ్యానించారు. అన్నాడీఎంకే సారథ్యం సరిగా లేదు, అమ్మ మక్కల్ మున్నేట్ర కళగంతో విలీనమై పార్టీని దినకరన్ నడిపించాలని మాజీ ఎమ్మెల్యే ఆరుకుట్టి సూచించారు.
పళనివర్గం అత్యవసర సమావేశం
పార్టీలో చకచకా మారుతున్న పరిణామాలను గమ నిస్తున్న ఎడపాడి పళనిస్వామి మాజీ మంత్రులు, సీనియర్ నేతలతో సేలంలో గురువారం అత్యవసరంగా సమావేశమయ్యారు. ఈ సమాచారం అందుకున్న మీడియా ప్రతినిధులు అక్కడికి చేరుకోగా బందోబస్తులో ఉన్న పోలీసు సిబ్బంది వారిని అడ్డుకుని పంపివేశారు. పార్టీలో సమ ఉజ్జీలుగా సాగుతున్న ఎడపాడి, పళనిస్వామి మధ్య గత కొంతకాలంగా సాగుతున్న విభేదాలు తాజా పరిణామాలతో మరింత రాజుకునే అవకాశం ఉంటుందని పరిశీలకులు భావిస్తున్నారు.
అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ దారుణ ఓటమి చెందింది. ఈ నేపథ్యంలో పార్టీని తిరిగి గాడిలో పెట్టాలంటే శశికళకు పార్టీ బాధ్యతలు అప్పగించడం మేలన్న అభిప్రాయాన్ని అటు నేతలు, ఇటు కార్యకర్తలు వెల్లడిస్తున్నారు. పన్నీర్ సెల్వం సమక్షంలో ఆమోదించిన ఈ తీర్మానంపై ఎడప్పాడి వర్గం ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. శుక్రవారం జిల్లా కార్యనిర్వాహక మండలి సమావేశం జరుగుతుండగా.. పళని వర్గం ప్రత్యేకంగా సమావేశమై చర్చించనుంది. ఈ విషయంలో ఎడప్పాడి వర్గం సానుకూలంగా స్పందించి శశికళను తిరిగిపార్టీలోకి తీసుకుంటే తమిళ రాజకీయాలు మళ్లీ వేడెక్కడం ఖాయం.
Comments
Please login to add a commentAdd a comment