TVV Dinakaran
-
శశి‘కలకలం’.. రీఎంట్రీ కోసం చిన్నమ్మ చిచ్చు?
సాక్షి, చెన్నై: అమ్మ జయలలిత మరణానంతరం తమిళనాడు రాజకీయాల్లో అన్నాడీఎంకే పరిస్థితి అధ్వాన్నంగా తయారైంది. ఈ నేపథ్యంలో పార్టీని తిరిగి గాడిలో పెట్టాలన్నా.. బలోపేతం చేయాలన్నా చిన్నమ్మ శశికళకు పార్టీ బాధ్యతలు అప్పగించడం మేలన్న అభిప్రాయాన్ని పన్నీర్ సెల్వం వర్గం వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో వర్గ పోరు చిచ్చు రాజుకుంది. అన్నాడీఎంకే బలోపేతానికి శశి‘కళ’ అనివార్యమనే గళం గట్టిగా వినిపిస్తోంది. వరుస పరాజయాల నుంచి గట్టెక్కాలంటే శశికళను పార్టీలో చేర్చుకోవడం మినహా గత్యంతరం లేదని తన అనుచరులద్వారా పన్నీర్‌సెల్వం సంకేతాలు పంపిస్తున్నారు. ఈ క్రమంలోనే తేని జిల్లా పెరియకుళం కైలాసపట్లిలో పలువురు నేతలు సమావేశమై శశికళ రీ-ఎంట్రీ తీర్మానం చేశారు. అయితే వాళ్లు పాల్గొన్న వేదిక.. అన్నాడీఎంకే సమన్వయకర్త పన్నీర్ సెల్వానికి చెందిన ఫామ్‌హౌస్ కావడం విశేషం. ఎడపాడి అలక? బుధవారం శశికళ, ఆమె మేనల్లుడు దినకరన్ రీఎంట్రీకి తీర్మానం చేయడం, ఇందుకు ఎడపాడి పళనిస్వామి విముఖత ప్రదర్శించడం తీవ్రస్థాయిలో చర్చనీయాంశమైంది. అన్నాడీంకేను అన్నీతానై నడిపించిన జయలలిత 2016 డిసెంబర్లో కన్నుమూసిన తరువాత పన్నీర్‌సెల్వం సీఎం బాధ్యతలు చేపట్టారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళను ఎన్నుకున్నారు. అయితే సీఎం పదవిపై కన్నేసిన శశికళ ఆ కుర్చీ నుంచి పన్నీర్‌సెల్వంను బలవంతంగా తప్పించి శాసనసభాపక్ష నేతగా ఎన్నికయ్యారు. అయితే ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ పిలువకపోవడం, ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో నాలుగేళ్ల జైలు శిక్ష పడడంతో శశికళ ఆశలు అడియాశలయ్యాయి. జైలు కెళ్లేముందు ఎడపాడి పళనిస్వామిని ఆమె సీఎం కుర్చీలో కూర్చోబెట్టి పార్టీ బాధ్యతలను మేనల్లుడు టీటీవీ దినకరన్‌కు అప్పగించింది. శశికళపై తిరుగు బాటు చేసి సొంతపార్టీ పెట్టుకున్న పన్నీర్‌సెల్వం.. మరలా ఎడపాడితో జట్టుకట్టి(సొంత పార్టీని విలీనం చేసి) ఉప ముఖ్యమంత్రిగా మారారు. పార్టీ కన్వీనర్, కో– కన్వీనర్లుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఈపీఎస్, ఓపీఎస్ ఇద్దరూ కలిసి శశికళ, టీటీవీ దినకరన్‌ను పార్టీ నుంచి బహిష్కరించారు. ఓటమి తరువాత ఎడముఖం.. పెడముఖం గడిచిన అసెంబ్లీ ఎన్నికల వరకు ఒకరికొకరుగా సాగిన ఎడపాడి, పళనిస్వామి, పార్టీ పరాజయం తరువాత ఎడముఖం, పెడముఖంగా మారిపోయారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, డీఎండీకే, పీఎంలను కూటమిలో కలుపుకుని పోటీకి దిగినా అన్నాడీఎంకేకు కేవలం ఒక్కస్థానమే దక్కింది. ఇక గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రభుత్వం చేజారిపోయింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం పరాజయం వెంటాడింది. జనాకర్షణ లేకనే పార్టీ వరుస పరాజయాల ఎదుర్కొంటోందని కొందరు విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో పన్నీర్‌సెల్వం అధ్యక్షతన బుధవారం తేనీలో జరిగిన పార్టీ సమావేశంలో శశికళను మళ్లీ పార్టీలో చేర్చుకోవాలని తీర్మానం చేయడం కలకలం రేపింది. ఈ నిర్ణయంపై ఎడపాడి వర్గం ఆగ్రహం వ్యక్తం చేసింది. గత రెండేళ్లుగా పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగే సమావేశాల్లో ‘శశికళ వర్గంతో సంబంధం పెట్టుకుంటే వేటు తప్పదు’ అని ఎడపాడి, పన్నీర్ హెచ్చరికలు జారీచేశారు. మరిప్పుడు సాక్షాత్తూ పార్టీ కన్వీనర్ పన్నీర్‌సెల్వమే చినమ్మ, దినకరన్‌కు స్వాగతం పలకడాన్ని కొందరు జీర్ణించుకోలేకున్నారు. మరి కొందరు సమర్ధిస్తున్నారు. పార్టీ అధిష్టానం తీసుకు నే నిర్ణయాలకు కట్టుబడి ఉంటామని మాజీ మంత్రి కడంబూరు రాజా, శశికళ ప్రవేశం వల్ల పార్టీలో మ రింత గందరగోళ పరిస్థితులు ఏర్పడుతాయని అ న్నాడీఎంకే ఎమ్మెల్యే అరుణ్మొళి దేవన్ వ్యాఖ్యానించారు. అన్నాడీఎంకే సారథ్యం సరిగా లేదు, అమ్మ మక్కల్ మున్నేట్ర కళగంతో విలీనమై పార్టీని దినకరన్ నడిపించాలని మాజీ ఎమ్మెల్యే ఆరుకుట్టి సూచించారు. పళనివర్గం అత్యవసర సమావేశం పార్టీలో చకచకా మారుతున్న పరిణామాలను గమ నిస్తున్న ఎడపాడి పళనిస్వామి మాజీ మంత్రులు, సీనియర్ నేతలతో సేలంలో గురువారం అత్యవసరంగా సమావేశమయ్యారు. ఈ సమాచారం అందుకున్న మీడియా ప్రతినిధులు అక్కడికి చేరుకోగా బందోబస్తులో ఉన్న పోలీసు సిబ్బంది వారిని అడ్డుకుని పంపివేశారు. పార్టీలో సమ ఉజ్జీలుగా సాగుతున్న ఎడపాడి, పళనిస్వామి మధ్య గత కొంతకాలంగా సాగుతున్న విభేదాలు తాజా పరిణామాలతో మరింత రాజుకునే అవకాశం ఉంటుందని పరిశీలకులు భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీ దారుణ ఓటమి చెందింది. ఈ నేపథ్యంలో పార్టీని తిరిగి గాడిలో పెట్టాలంటే శశికళకు పార్టీ బాధ్యతలు అప్పగించడం మేలన్న అభిప్రాయాన్ని అటు నేతలు, ఇటు కార్యకర్తలు వెల్లడిస్తున్నారు. పన్నీర్ సెల్వం సమక్షంలో ఆమోదించిన ఈ తీర్మానంపై ఎడప్పాడి వర్గం ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. శుక్రవారం జిల్లా కార్యనిర్వాహక మండలి సమావేశం జరుగుతుండగా.. పళని వర్గం ప్రత్యేకంగా సమావేశమై చర్చించనుంది. ఈ విషయంలో ఎడప్పాడి వర్గం సానుకూలంగా స్పందించి శశికళను తిరిగిపార్టీలోకి తీసుకుంటే తమిళ రాజకీయాలు మళ్లీ వేడెక్కడం ఖాయం. -
ఖరీదైన దళారి.. రూ. 200 కోట్లు.. 20 లగ్జరీ కార్లు
సాక్షి, చెన్నై: కేంద్ర ప్రభుత్వ కాంట్రాక్టులు కావాలా, బదిలీలు చేయించాలా, సీబీఐ కేసుల నుంచి తప్పించాలా.. ఇలా ఒకటేమిటి దేశ రాజధానిలో అన్నిపనులు చక్కబెడుతానంటూ మభ్యపెట్టి రూ.200 కోట్ల లావాదేవీలు నెరపిన చెన్నైకి చెందిన ఖరీదైన దళారీ బండారం బట్టబయలైంది. ఢిల్లీ నుంచి వచ్చిన ఈడీ అధికారులు చెన్నైలోని సుకేష్ చంద్రశేఖర్ అనే దళారి ఇంటిపై సోమవారం చేసిన దాడులతో భారీ మోసాల కోణం వెలుగుచూసింది. వివరాలు.. చీఫ్ ఎలక్షన్ కమిషన్ కార్యాలయం నుంచి అన్నాడీఎంకే పార్టీ చిహ్నమైన రెండాకుల గుర్తును సాధించి పెడతానని రూ.2 కోట్లు లంచం పుచ్చుకున్న కేసులో అరెస్టయిన సుకేష్ చంద్రశేఖర్‌కు చెందిన చెన్నై కానత్తూరులోని ఇంటిలో ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ (ఈడీ) అధికారులు సోమవారం పెద్దఎత్తున దాడులు నిర్వహంచారు. చదవండి: 'నిన్ను మనసారా ప్రేమించా'.. సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య నేపథ్యం ఇదీ.. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణం తరువాత 2015లో ఆ పార్టీ రెండుగా చీలిపోయింది. ఒక వర్గానికి శశికళ, మరో వర్గానికి ఓ పన్నీర్‌సెల్వం సారథ్యం వహించారు. ఎమ్మెల్యేగా జయలలిత ప్రాతినిథ్యం వహించిన ఆర్కే నగర్ ఖాళీగా మారడంతో ఉప ఎన్నికలు వచ్చాయి. ఆ ఉప ఎన్నికల్లో శశికళ వర్గం అభ్యర్థిగా టీటీవీ దినకరన్, పన్నీర్‌సెల్వం అభ్యర్థిగా పార్టీ ప్రిసీడియం చైర్మన్ మధుసూదనన్ బరిలోకి దిగారు. రెండాకుల చిహ్నం కోసం ఈసీ వద్ద ఇద్దరూ పోటీపడ్డారు. దీంతో రెండాకుల చిహ్నంపై ఈసీ తాత్కాలిక నిషేధం విధించి ఎవ్వరికీ కేటాయించలేదు. దీంతో రెండాకుల చిహ్నాన్ని ఎలాగైనా దక్కించుకోవాలన్న పంతంతో టీటీవీ దినకరన్.. దళారి సుకేష్ చంద్రశేఖర్‌ను కలిసి రూ.50 కోట్లకు డీల్ కుదుర్చుకున్నట్లు సమాచారం. అడ్వాన్స్‌గా రూ.2 కోట్లు పుచ్చుకుంటున్న సమయంలో ఢిల్లీలో ఈడీ అధికారులు సుకేష్ చంద్రశేఖర్‌ను 2017లో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకుని అరెస్ట్ చేశారు. ఆనాటి నుంచి సుకేష్ చంద్రశేఖర్ తీహార్ జైల్లో ఉన్నాడు. ఇదిలా ఉండగా, ఢిల్లీకి చెందిన 16 మంది ఈడీ అధికారులు సోమవారం తెల్లవారుజామున చెన్నై కానత్తూరులోని సుకుష్ చంద్రశేఖర్ ఇంటిపై మెరుపుదాడులు చేసి తనిఖీలు ప్రారంభించారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న రూ.70 కోట్ల విలువైన 20 లగ్జరీ కార్లు, కారవాన్, నిందితుడి ఇంటిలోని లాప్‌ట్యాప్, లెక్కల్లో చూపని రూ.60 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. లగ్జరీ కార్లన్నీ చట్ట విరుద్ధంగా విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. వాగ్మూలం ఆధారంగానే.. తీహార్ జైల్లో ఉన్న సుకేష్ చంద్రశేఖర్ వద్ద 10 రోజుల క్రితం ఈడీ అధికారులు విచారణ జరిపారు. ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వ కాంట్రాక్టర్లు, ముఖ్యమైన పదవుల్లో ఉన్నవారు, సీబీఐ అధికారుల పేర్లు చెప్పి పనులు, బదిలీలు చేయిస్తానని పలువురు పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకుల నుంచి సుమారు రూ.200 కోట్లు, ఖరీదైన బహుమతులు పొందినట్లు బయటపడింది. అతనిచ్చిన వాంగ్మూలం ఆధారంగానే చెన్నైలోని ఇంట్లో సోదాలు చేపట్టారు. తనిఖీల అనంతరం ఈడీ అధికారులు ఢిల్లీకి వెళ్లిపోయారు. కాగా రెండాకుల గుర్తు కేటాయింపు కేసు విచారణలో భాగంగా సుకేష్ చంద్రశేఖర్‌ను త్వరలో తీహార్ జైలు ఉంచి చెన్నైకి తీసుకురానున్నట్లు తెలిసింది. చదవండి: వైరల్ వీడియో: కన్నకొడుకు కంటే ఈ కుక్కే నయం..! -
ఆర్కే నగర్ ఎన్నికల ప్రచారంలో కలకలం
-
ఆర్కేనగర్లో అరటి పళ్లలో డబ్బు పంపిణీ
-
ఆర్కే నగర్ ఎన్నికల ప్రచారంలో కలకలం
చెన్నై : ఆర్కే నగర్ ఉప ఎన్నికలో మరోసారి డబ్బు పంపిణీ కలకలం రేగింది. ఓటర్లకు డబ్బులు పంపిణీ చేస్తున్న క్రమంలో కొందరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి సుమారు 12.6 లక్షలను వసూలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. కొరుక్కుపేట్‌లోని ఓ సైకోథెరపీ సెంటర్లో డబ్బు దాచారన్న సమచారం అందుకున్న పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో కొందరికి డబ్బులు ఇస్తున్నప్పుడు పట్టుకున్నారు. ఇక ఇది దినకరన్ వర్గం పనేనంటూ అధికార పార్టీ ఆరోపణలు దిగటం.. ఇరు వర్గాల ఘర్షణకు దారితీయటంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. భారీగా మోహరించిన పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చే యత్నం చేస్తున్నారు. ఇంతకు ముందు ఏప్రిల్ 12న జరగాల్సిన ఎన్నిక ఓటుకు నోటు నేపథ్యంలోనే రద్దైన విషయం తెలిసిందే. ఆ సమయంలో దినకరన్ పై తీవ్ర ఆరోపణలు రాగా, ఆ వ్యవహారంపై దర్యాప్తు కొనసాగుతోంది. ఇక ఇప్పుడు మరోసారి ఇలాంటి పరిస్థితులే కనిపిస్తుండటంతో ఈసీ ఎలాంటి నిర్ణయం తీసుకోనుందోనన్న చర్చ మొదలైంది. ఇప్పటిదాకా సుమారు 20 లక్షల దాకా డబ్బు పట్టుబడినట్లు అధికారులు వెల్లడించారు. కాగా, డిసెంబర్ 21న ఆర్కే నగర్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక జరగనుండగా.. 59 మంది తమ అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. -
చివరకు దినకరన్‌కు దక్కింది ఇదే!
సాక్షి, చెన్నై : ఆర్కే నగర్ ఉప ఎన్నికల కోసం ఎన్నికల సంఘం గుర్తులు కేటాయించింది. ఇందులో భాగంగా అన్నాడీఎంకే బహిష్కృత నేత టీవీవీ దినకరన్‌కు ప్రెషర్ కుక్కర్ గుర్తును కేటాయించినట్లు ప్రకటించింది. రెండాకుల గుర్తు పళని-పన్నీర్ గ్రూప్‌కు చెందుతుందని ఇటీవలె ఈసీ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో గతంలో తమకు కేటాయించిన టోపీ గుర్తునే కేటాయించాలంటూ దినకరన్ ఈసీని అభ్యర్థించారు. దీనికి వ్యతిరేకంగా ఢిల్లీ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు కాగా.. టోపీ గుర్తును శశికళ-దినకరన్ వర్గానికి ఎలా కేటాయిస్తారంటూ ఈసీపై కోర్టు ప్రశ్నలు గుప్పించింది. ఆ ప్రభావమో లేక మరేయితర కారణమో తెలీదుగానీ ఎన్నికల సంఘం మాత్రం ఆ గుర్తును కొంగునాడు మున్నేట్ర కగజమ్ అభ్యర్థికి రమేష్‌కు కేటాయించి, దినకరన్ కు ప్రెషర్ కుక్కర్ ను కేటాయిస్తున్నట్లు ఈసీ ప్రకటించింది. దీనిపై స్పందించిన దినకరన్ ప్రత్యర్థులపై ఒత్తిడి పెంచేందుకే ఈ గుర్తు ఎంతో ఉపయోగపడుతుందని పేర్కొనటం విశేషం. కాగా, డిసెంబర్ 21 న జరగబోయే ఎన్నిక కోసం మొత్తం 145 నామినేషన్లు నమోదుకాగా ఈసీ 72 అభ్యర్థుల నామినేషన్లను మాత్రమే అంగీకరించింది. గత నలభై ఏళ్లలో 11 సార్లు డాక్టర్ రాధాకృష్ణన్(ఆర్కే నగర్) నియోజకవర్గానికి ఎన్నిక నిర్వహించగా.. అన్నాడీఎంకే పార్టీ 7 సార్లు ఘన విజయం సాధించింది. -
మోదీ, జైట్లీ మా నాశనం కోరుకుంటున్నారు
సాక్షి, చెన్నై : పోయెస్ గార్డెన్లో జరుగుతున్న ఐటీ దాడులపై అన్నాడీఎంకే బహిష్కృత నేత టీవీవీ దినకరన్ తీవ్ర స్థాయిలో స్పందించారు. రాజకీయ కుట్రలో భాగంగానే ఈ దాడులు చేస్తున్నారంటూ ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై మండిపడ్డారు. ఒకానోక దశలో ప్రధాన మోదీ, ఆర్థికశాఖ మంత్రి జైట్లీపై దినకరన్ తీవ్ర స్థాయి ఆరోపణలు చేశారు. ట్యుటికోరన్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ... ‘‘మోదీ, జైట్లీ మా కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తున్నారు. అందులో వారి ఆధీనంలో ఉండే ఐటీ శాఖను మాపై దాడులకు ప్రయోగిస్తున్నారు. కేంద్రం కవ్వింపు చర్యలకు మేం భయపడే ప్రసక్తే లేదు. మేము ఎక్కడికి పారిపోం. చాతనైంది చేసుకోండి అంటూ మండిపడ్డారు. జయలలిత నేతృత్వంలోని అన్నాడీఎంకేను మిత్రపక్షంగా చెప్పుకున్న మోదీ.. ఆమె ఆప్పత్రిలో ఉన్నంత కాలం ఒక్కరోజు కూడా పరామర్శించేందుకు రాలేదని... కానీ, ఇప్పుడు కరుణానిధి ఇంటికి వెళ్లటం ఏంటని? ఆయన ప్రశ్నించారు. అయితే దానిని రాజకీయం చేయటం తమకు ఇష్టం లేదని ఆయన చెప్పారు. అమ్మ గౌరవాన్ని కేంద్రం వద్ద తాకట్టుపెట్టి తమ పదువులను కాపాడుకునేందుకే ప్రయత్నిస్తున్నారంటూ సీఎం పళని, డిప్యూటీ సీఎం పన్నీర్ పై దినకరన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోయెస్ గార్డెన్లో సోదాలు జరుగుతున్నంత సేపు తమ వర్గానికి చెందిన కార్యకర్తలే బయట ఆందోళన చేపట్టారే తప్ప... పళని-పన్నీర్ వర్గానికి చెందిన వారు ఒక్కరైనా కనిపించారా? అని ఆయన నిలదీశారు. దీనిని బట్టే వారిద్దరికీ ఆమెపై ఎంత గౌరవం ఉందో అర్థం చేసుకోవాలన్నారు. ఇదిలా ఉండగా భారీ భద్రతా నడుపు జయ నివాసంలో సోదాలు జరిపిన పోలీసులు.. శశికళ, పూన్‌గంద్రన్‌లు వినియోగించిన గదులను క్షుణ్ణంగా పరిశీలించినట్లు సమాచారం. -
దినకరన్ ఎంట్రీ.. సూపర్ ట్విస్ట్
సాక్షి, చెన్నై : ఆర్కే నగర్ ఉప ఎన్నికపై అదిరిపోయే ట్విస్ట్. ఎన్నికలో తానే స్వయంగా దిగుతున్నట్లు శశికళ మేనల్లుడు, అన్నాడీఎంకే బహిష్కృత నేత టీవీవీ దినకరన్ ప్రకటించారు. సోమవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ... స్వయంగా నేనే బరిలో దిగబోతున్నా.. పోటీకి ఎవరొచ్చినా గెలుపు నాదే అంటూ ఆయన తెలిపారు. బలమైన అభ్యర్థుల వేటలో అధికార-ప్రతిపక్షాలు మునిగిపోయి ఉండగా.. స్వయంగా దినకరనే పోటీలో దిగుతుండటం చర్చనీయాంశంగా మారింది. ఈ విజయం ద్వారా అమ్మకు అసలైన వారసులం తామేనని (శశికళ వర్గం) నిరూపించుకునే అవకాశం వచ్చిందని దినకరన్ చెబుతున్నారు. జయలలిత మరణంతో దాదాపుగా ఏడాది నుంచి (రాధాకృష్ణన్ నగర్) ఆర్కే నగర్ నియోజక వర్గంలో ఈ ఏడాది ఏప్రిల్‌లోనే ఎన్నిక జరగాల్సి ఉంది. అయితే ఆ సమయంలో ఓటర్లను పెద్ద మొత్తంలో డబ్బు ఖర్చు చేసి ప్రలోభ పెట్టడం టాక్స్ అధికారుల దృష్టిలో పడటం.. అవినీతి ఆరోపణలు నిర్ధారణ కావటంతో ఎన్నికల సంఘం వాయిదా వేసి విచారణకు ఆదేశించింది. కాగా, ఈ ఉప ఎన్నికపై స్పష్టత ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్‌పై మద్రాస్ హైకోర్టు స్పందించింది. డిసెంబర్ 31లోగా ఉప ఎన్నిక పూర్తి చేయాలని ఆదేశించిన విషయం తెలిసిందే. దీంతో అభ్యర్థుల వేటలో పార్టీలన్నీ తలమునకలై ఉన్నాయి. పార్టీలో అంతర్గతంగా చర్చించాకే అభ్యర్థి పేరును ప్రకటిస్తామని అన్నాడీఎంకే ప్రకటించగా.. డీఎంకే తరపున దాదాపు అభ్యర్థి ఖరారైనట్లేనని.. మరో వారంలో ప్రకటించే అవకాశాలున్నాయని తెలుస్తోంది. ప్రతీ పార్టీ కూడా ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయి. -
శశికళకు పెరోల్.. దినకరన్‌కు మరో షాక్
-
జైలు నుంచి చెన్నైకి శశికళ
సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే బహిష్కృత నేత వీఎస్ శశికళ నటరాజన్ కు ఎట్టకేలకు పెరోల్ మంజూరు కావడంతో శుక్రవారం బెంగళూరులోని పరప్పణ అగ్రహార జైలు నుంచి విడుదల అయ్యారు. ఆమెకు జైలు వద్ద దినకరన్‌తో పాటు పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. అవినీతి కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న శశికళకు ఆమె భర్త నటరాజన్ అనారోగ్యం కారణంగా అయిదురోజుల పాటు పెరోల్ లభించిన విషయం తెలిసిందే. కాగా ఆమె వ్యక్తిగత కార్యక్రమాలకే పరిమితం కావాలని జైళ్లశాఖ సూచించింది. అనారోగ్యంతో ఉన్న భర్తను చూసుకునేందుకు తనను పెరోల్ పై విడుదల చేయాల్సిందిగా శశికళ కర్నాటక జైళ్ల శాఖను తొలుత కోరగా.. వారు నిరాకరించారు. ఈ నేపథ్యంలో ఆమె కర్ణాటక కోర్టును ఆశ్రయించింది. న్యాయస్థానం ఇరు రాష్ట్రాల స్పందనను కోరగా.. అభ్యంతరం లేదని తమిళనాడు ప్రభుత్వం, కర్నాటక ప్రభుత్వాలు స్పష్టం చేశాయి. దీంతో జైళ్ల శాఖ ఆమెకు పెరోల్ ఇచ్చింది. నిజానికి ఆమె 15 రోజుల కోసం దరఖాస్తు చేసుకోగా.. ఐదు రోజులకు మాత్రమే ఆమెకు కోర్టు పెరోల్ మంజూరు చేసింది. అదే సమయంలో వ్యక్తిగత అవసరాల కోసమే పెరోల్ ను వినియోగించుకోవాలని... రాజకీయ కార్యక్రమాలను హాజరు కావొద్దని ఆమెను కోర్టు ఆదేశించింది. కాగా, అక్రమాస్తుల కేసులో శిక్షకు గురైన శశికళ ప్రస్తుతం కర్నాటక లోని పరప్పన అగ్రహారం జైలులో ఉన్న సంగతి తెలిసిందే. సుప్రీంకోర్టులోనూ చుక్కెదురు అన్నాడీఎంకే బహిష్కృత నేత టీవీవీ దినకరన్‌కు వరుస షాకులు తగులుతున్నాయి. ఆయనకు సుప్రీంకోర్టులోనూ ఎదురుదెబ్బ తగిలింది. రెండాకుల గుర్తు కేసులో స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. తక్షణమే విచారణ ప్రారంభించాలని ఈసీని ఉన్నత న్యాయస్థానం శుక్రవారం ఆదేశించింది. కాగా రెండాకుల గుర్తుల అంశాన్ని కొంత కాలం వాయిదా వేయాలంటూ దినకరన్ దాఖలు చేసిన అభ్యర్థనను గురువారం మద్రాస్ హైకోర్టు తోసిపుచ్చిన విషయం తెలిసిందే. అన్నాడీఎంకే పార్టీ గుర్తు విషయంలో సెప్టెంబర్ 15న మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు త్వరగతిన తేల్చేందుకు ఎన్నికల సంఘం సిద్ధం అవుతోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 వరకు గడువు విధించాలని దినకరన్ కోరగా.. అందుకు మధురై బెంచ్ న్యాయమూర్తులు వేణుగోపాల్, అబ్దుల్ ఖుద్ధోష్లు నిరాకరించారు. ముందుగా చెప్పినట్లు అక్టోబర్ 31లోగా ఈ వ్యవహారాన్ని తేల్చేయాలని ఎన్నికల సంఘాన్ని కోర్టు ఆదేశించింది కూడా. దీంతో దినకరన్ నేడు సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ ఫలితం లేకపోయింది. -
పళని గూటికి దినకరన్ గ్రూప్ ఎంపీ
సాక్షి, చెన్నై: తన ప్రభుత్వాన్ని కూలదోసేందుకు దినకరన్‌తో కలిసి చేతులు కలిపి గవర్నర్‌ను పదే పదే కలుస్తున్న తిరుగుబాటు వర్గానికి అనర్హత వేటుతో పెద్ద దెబ్బే వేశారు ముఖ్యమంత్రి పళని సామి. ఈ నేపథ్యంలో తాత్కాలికంగా తదుపరి ఆదేశాలు ఇచ్చేంతవరకు బలనిరూపణ నిర్వహించకూడదన్న మద్రాస్ హైకోర్టు ఆదేశాలతో తమిళ రాజకీయాల్లో సందిగ్ధం నెలకొంది. ఇదిలా ఉంటే దినకరన్ మద్ధతుదారులలో కంగారు మొదలైనట్లు సంకేతాలు అందుతున్నాయి. ఈ క్రమంలోనే తెంకసి ఎంపీ వసంతి మురుగేశన్ దినకరన్‌కు హ్యాండిస్తూ పళని గ్రూప్ లోకి చేరిపోయారు. శుక్రవారం పళని ఇంటికి వెళ్లిన ఆమె తన మద్ధతు సీఎం పళనిసామికేనని ప్రకటించారు. దినకరన్ డీఎంకేతో కలిసి ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నం చేస్తున్నారని ఈ సందర్భంగా మీడియాతో ఆమె తెలిపారు. కీలక మహిళానేత అయిన వసంతి దినకరన్‌కు మొదటి నుంచి విశ్వసనీయురాలిగా ఉంటూ వస్తున్నారు. అలాంటి నేత తిరిగి తమ గూటికి చేరుకోవటంతో పళని-పన్నీర్ శిబిరంలో ఆనందం నెలకొంది. మరికొంత మంది నేతలు కూడా క్యూ కట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. -
శశికళకే పూర్తి హక్కులు: దినకరన్
సాక్షి, చెన్నై: తమిళ రాజకీయాల్లో శశికళ మేనల్లుడు టీవీవీ దినకరన్ దూకుడును ప్రదర్శిస్తున్నారు. ఓవైపు ప్రతిపక్ష నేత స్టాలిన్ ప్రభుత్వం మైనార్టీలో ఉందంటూ హస్తినకు తమిళ రాజకీయాలను మోసుకెళ్లగా, దినకరన్ కూడా బల నిరూపణ అంశంను తెరపైకి తీసుకొచ్చి పళనిని మరింత ఇరకాటంలోకి నెట్టేశారు. ఇప్పటికే 23 మంది ఎమ్మెల్యేలు దినకరన్ శిబిరంలోకి చేరిపోగా, పళని-పన్నీర్ గ్రూపులో స్లీపర్ సెల్స్ ఉన్నారని, వలసలు కొనసాగుతాయంటూ రిసార్ట్ లో సేదతీరుతున్న దినకరన్ వర్గ నేతలు హింట్ కూడా ఇచ్చేస్తున్నారు. అదే సమయంలో అన్నాడీఎంకే పార్టీలో కీలక నిర్ణయాలు తీసుకునే హక్కు శశికళకే ఉంటుందని దినకరన్ చెప్పుకొచ్చారు. శశికళ బహిష్కరణ నేపథ్యంలో కొత్త జనరల్ సెక్రటరీని ఎన్నుకునేందుకు సెప్టెంబర్ 12న పార్టీ జనరల్ బాడీ మీటింగ్ నిర్వహించబోతున్న విషయం తెలిసిందే. అయితే మీటింగ్ నిర్వహించే హక్కు ప్రధాన కార్యదర్శిగా శశికళకు తప్ప ఎవరికీ ఉండదంటూ చెప్పుకొచ్చారు. అంతేకాదు సమావేశానికి ఎవరూ హాజరుకావొద్దంటూ పార్టీ సభ్యులకు దినకరన్ సూచించారు. కాగా, సోమవారం సీఎం పళనిస్వామి నేతృత్వంలో నిర్వహించిన పార్టీ సర్వసభ్య సమావేశంలో శశికళ, దినకరన్‌లను బహిష్కరించటం, వారి నిర్ణయాలు చెల్లవంటూ తీర్మానాలు చేసిన విషయం తెలిసిందే. గవర్నర్ ను కలిసిన ఎమ్మెల్యేలు: శశికళ మరియు దినకరన్ వర్గాల ఎమ్మెల్యేలు గురువారం రాజ్‌భవన్‌లో గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్‌రావును కలిసి తాము ప్రభుత్వానికి మద్ధతు ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. అదే సమయంలో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలపై సెప్టెంబర్ 5లోగా వివరణ ఇవ్వాలంటూ స్పీకర్ ధన్పాల్ మరో దఫా 19 మంది రెబల్ ఎమ్మెల్యేలకు నోటీసులు పంపించారు. ఇక బలనిరూపణకు గవర్నర్ ను ఆదేశించాలంటూ దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యంపై మద్రాస్ హైకోర్టు నేడు విచారణ చేపట్టనుంది.