సాక్షి, చెన్నై: అన్నాడీఎంకే బహిష్కృత నేత వీఎస్ శశికళ నటరాజన్ కు ఎట్టకేలకు పెరోల్ మంజూరు కావడంతో శుక్రవారం బెంగళూరులోని పరప్పణ అగ్రహార జైలు నుంచి విడుదల అయ్యారు. ఆమెకు జైలు వద్ద దినకరన్‌తో పాటు పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. అవినీతి కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న శశికళకు ఆమె భర్త నటరాజన్ అనారోగ్యం కారణంగా అయిదురోజుల పాటు పెరోల్ లభించిన విషయం తెలిసిందే. కాగా ఆమె వ్యక్తిగత కార్యక్రమాలకే పరిమితం కావాలని జైళ్లశాఖ సూచించింది.
అనారోగ్యంతో ఉన్న భర్తను చూసుకునేందుకు తనను పెరోల్ పై విడుదల చేయాల్సిందిగా శశికళ కర్నాటక జైళ్ల శాఖను తొలుత కోరగా.. వారు నిరాకరించారు. ఈ నేపథ్యంలో ఆమె కర్ణాటక కోర్టును ఆశ్రయించింది. న్యాయస్థానం ఇరు రాష్ట్రాల స్పందనను కోరగా.. అభ్యంతరం లేదని తమిళనాడు ప్రభుత్వం, కర్నాటక ప్రభుత్వాలు స్పష్టం చేశాయి. దీంతో జైళ్ల శాఖ ఆమెకు పెరోల్ ఇచ్చింది.
నిజానికి ఆమె 15 రోజుల కోసం దరఖాస్తు చేసుకోగా.. ఐదు రోజులకు మాత్రమే ఆమెకు కోర్టు పెరోల్ మంజూరు చేసింది. అదే సమయంలో వ్యక్తిగత అవసరాల కోసమే పెరోల్ ను వినియోగించుకోవాలని... రాజకీయ కార్యక్రమాలను హాజరు కావొద్దని ఆమెను కోర్టు ఆదేశించింది. కాగా, అక్రమాస్తుల కేసులో శిక్షకు గురైన శశికళ ప్రస్తుతం కర్నాటక లోని పరప్పన అగ్రహారం జైలులో ఉన్న సంగతి తెలిసిందే.
సుప్రీంకోర్టులోనూ చుక్కెదురు
అన్నాడీఎంకే బహిష్కృత నేత టీవీవీ దినకరన్‌కు వరుస షాకులు తగులుతున్నాయి. ఆయనకు సుప్రీంకోర్టులోనూ ఎదురుదెబ్బ తగిలింది. రెండాకుల గుర్తు కేసులో స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. తక్షణమే విచారణ ప్రారంభించాలని ఈసీని ఉన్నత న్యాయస్థానం శుక్రవారం ఆదేశించింది. కాగా రెండాకుల గుర్తుల అంశాన్ని కొంత కాలం వాయిదా వేయాలంటూ దినకరన్ దాఖలు చేసిన అభ్యర్థనను గురువారం మద్రాస్ హైకోర్టు తోసిపుచ్చిన విషయం తెలిసిందే.
అన్నాడీఎంకే పార్టీ గుర్తు విషయంలో సెప్టెంబర్ 15న మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు త్వరగతిన తేల్చేందుకు ఎన్నికల సంఘం సిద్ధం అవుతోంది. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది ఫిబ్రవరి 28 వరకు గడువు విధించాలని దినకరన్ కోరగా.. అందుకు మధురై బెంచ్ న్యాయమూర్తులు వేణుగోపాల్, అబ్దుల్ ఖుద్ధోష్‌లు నిరాకరించారు. ముందుగా చెప్పినట్లు అక్టోబర్ 31లోగా ఈ వ్యవహారాన్ని తేల్చేయాలని ఎన్నికల సంఘాన్ని కోర్టు ఆదేశించింది కూడా. దీంతో దినకరన్ నేడు సుప్రీంకోర్టును ఆశ్రయించినప్పటికీ ఫలితం లేకపోయింది.
Comments
Please login to add a commentAdd a comment