ఖరీదైన దళారి.. రూ. 200 కోట్లు.. 20 లగ్జరీ కార్లు | ED Files Money Laundering Case Against Sukesh Chandrashekar | Sakshi
Sakshi News home page

ఖరీదైన దళారి.. రూ. 200 కోట్లు.. 20 లగ్జరీ కార్లు

Published Tue, Aug 24 2021 8:58 AM | Last Updated on Tue, Aug 24 2021 10:19 AM

ED Files Money Laundering Case Against Sukesh Chandrashekar  - Sakshi

సాక్షి, చెన్నై: కేంద్ర ప్రభుత్వ కాంట్రాక్టులు కావాలా, బదిలీలు చేయించాలా, సీబీఐ కేసుల నుంచి తప్పించాలా.. ఇలా ఒకటేమిటి దేశ రాజధానిలో అన్నిపనులు చక్కబెడుతానంటూ మభ్యపెట్టి రూ.200 కోట్ల లావాదేవీలు నెరపిన చెన్నైకి చెందిన ఖరీదైన దళారీ బండారం బట్టబయలైంది. ఢిల్లీ నుంచి వచ్చిన ఈడీ అధికారులు చెన్నైలోని సుకేష్‌ చంద్రశేఖర్‌ అనే దళారి ఇంటిపై సోమవారం చేసిన దాడులతో భారీ మోసాల కోణం వెలుగుచూసింది.

వివరాలు..  చీఫ్‌ ఎలక్షన్‌ కమిషన్‌ కార్యాలయం నుంచి అన్నాడీఎంకే పార్టీ చిహ్నమైన రెండాకుల గుర్తును సాధించి పెడతానని రూ.2 కోట్లు లంచం పుచ్చుకున్న కేసులో అరెస్టయిన సుకేష్‌ చంద్రశేఖర్‌కు చెందిన చెన్నై కానత్తూరులోని ఇంటిలో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరక్టరేట్‌ (ఈడీ) అధికారులు సోమవారం పెద్దఎత్తున దాడులు నిర్వహంచారు. 

చదవండి: 'నిన్ను మనసారా ప్రేమించా'.. సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఆత్మహత్య

నేపథ్యం ఇదీ.. 
అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణం తరువాత 2015లో ఆ పార్టీ రెండుగా చీలిపోయింది. ఒక వర్గానికి శశికళ, మరో వర్గానికి ఓ పన్నీర్‌సెల్వం సారథ్యం వహించారు. ఎమ్మెల్యేగా జయలలిత ప్రాతినిథ్యం వహించిన ఆర్‌కే నగర్‌ ఖాళీగా మారడంతో ఉప ఎన్నికలు వచ్చాయి. ఆ ఉప ఎన్నికల్లో శశికళ వర్గం అభ్యర్థిగా టీటీవీ దినకరన్, పన్నీర్‌సెల్వం అభ్యర్థిగా పార్టీ ప్రిసీడియం చైర్మన్‌ మధుసూదనన్‌ బరిలోకి దిగారు. రెండాకుల చిహ్నం కోసం ఈసీ వద్ద ఇద్దరూ పోటీపడ్డారు. దీంతో రెండాకుల చిహ్నంపై ఈసీ తాత్కాలిక నిషేధం విధించి ఎవ్వరికీ కేటాయించలేదు. దీంతో రెండాకుల చిహ్నాన్ని ఎలాగైనా దక్కించుకోవాలన్న పంతంతో టీటీవీ దినకరన్‌.. దళారి సుకేష్‌ చంద్రశేఖర్‌ను కలిసి రూ.50 కోట్లకు డీల్‌ కుదుర్చుకున్నట్లు సమాచారం.

అడ్వాన్స్‌గా రూ.2 కోట్లు పుచ్చుకుంటున్న సమయంలో ఢిల్లీలో ఈడీ అధికారులు సుకేష్‌ చంద్రశేఖర్‌ను 2017లో రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుని అరెస్ట్‌ చేశారు. ఆనాటి నుంచి సుకేష్‌ చంద్రశేఖర్‌ తీహార్‌ జైల్లో ఉన్నాడు. ఇదిలా ఉండగా, ఢిల్లీకి చెందిన 16 మంది ఈడీ అధికారులు సోమవారం తెల్లవారుజామున చెన్నై కానత్తూరులోని సుకుష్‌ చంద్రశేఖర్‌ ఇంటిపై మెరుపుదాడులు చేసి తనిఖీలు ప్రారంభించారు. విదేశాల నుంచి దిగుమతి చేసుకున్న రూ.70 కోట్ల విలువైన 20 లగ్జరీ కార్లు, కారవాన్, నిందితుడి ఇంటిలోని లాప్‌ట్యాప్, లెక్కల్లో చూపని రూ.60 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. లగ్జరీ కార్లన్నీ చట్ట విరుద్ధంగా విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది. 

వాగ్మూలం ఆధారంగానే..
తీహార్‌ జైల్లో ఉన్న సుకేష్‌ చంద్రశేఖర్‌ వద్ద 10 రోజుల క్రితం ఈడీ అధికారులు విచారణ జరిపారు. ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వ కాంట్రాక్టర్లు, ముఖ్యమైన పదవుల్లో ఉన్నవారు, సీబీఐ అధికారుల పేర్లు చెప్పి పనులు, బదిలీలు చేయిస్తానని పలువురు పారిశ్రామికవేత్తలు, ప్రభుత్వ అధికారులు, రాజకీయ నాయకుల నుంచి సుమారు రూ.200 కోట్లు, ఖరీదైన బహుమతులు పొందినట్లు బయటపడింది. అతనిచ్చిన వాంగ్మూలం ఆధారంగానే చెన్నైలోని ఇంట్లో సోదాలు చేపట్టారు. తనిఖీల అనంతరం ఈడీ అధికారులు ఢిల్లీకి వెళ్లిపోయారు. కాగా రెండాకుల  గుర్తు కేటాయింపు కేసు విచారణలో భాగంగా సుకేష్‌ చంద్రశేఖర్‌ను త్వరలో తీహార్‌ జైలు ఉంచి చెన్నైకి తీసుకురానున్నట్లు తెలిసింది. 

చదవండి: వైరల్‌ వీడియో: కన్నకొడుకు కంటే ఈ కుక్కే నయం..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement