న్యూఢిల్లీ: మనీలాండరింగ్ కేసుతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్ట్ చేసిన తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీకి (ప్రస్తుతం జ్యూడిషియల్ కస్టడీలో ఉన్నారు) సుప్రీంకోర్టులో ఊరట లభించింది. బాలాజీని మంత్రి పదవి నుంచి తప్పించాలంటూ ఓ సామాజిక కార్యకర్త దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం శుకవ్రారం కొట్టివేసింది. తమిళనాడు ముఖ్యమంత్రి అనుమతి లేకుండా రాష్ట్ర కేబినెట్ నుంచి తొలగించడం కుదరదని కోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేసింది. పోర్ట్‌ఫోలియో లేని బాలాజీని మంత్రిగా కొనసాగాలా వద్దా అనేది ముఖ్యమంత్రే నిర్ణయిస్తారని చెబుతూ.. ఇంతకు ముందు మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం సమర్థించింది.
‘ఒక మంత్రిని తొలగించే అధికారం గవర్నర్‌కు ఉందా? లేదా? అనే విషయాన్ని హైకోర్టు పరిగణనలోకి తీసుకుంటుంది. అంతేగానీ సంబంధిత వ్యక్తి మంత్రిగా కొనసాగాలా వద్దా అనే దానిపై నిర్ణయం తీసుకునే బాధ్యతను ముఖ్యమంత్రికి వదిలివేస్తుంది' అని జస్టిస్ అభయ్ శ్రీనివాస్ ఓకాతో కూడిన ఏకసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. మద్రాస్ హైకోర్టు అభిప్రాయంతో ఏకీభవిస్తున్నామని అత్యున్నత ధర్మాసనం పేర్కొంది. ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని తెలిపింది.
గతంలో మద్రాస్ హైకోర్టు తీర్పును సామాజిక కార్యకర్త ఎంఎల్ రవి సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. మనీలాండరింగ్ కేసులో బాలాజీని దర్యాప్తు సంస్థ ఈడీ అరెస్ట్ చేసినప్పటికీ.. ఆయన తమిళనాడు ప్రభుత్వంలో పోర్ట్‌ఫోలియో లేని మంత్రిగా కొనసాగడంపై అభ్యంతరం వ్యక్తం చేశారాయన. దీనిపై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం.. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం కూడా.. క్రిమినల్ ప్రాసిక్యూషన్ పెండింగ్‌లో ఉన్న వ్యక్తిని మంత్రి పదవిని నిర్వహించకుండా నిరోధించలేదని, కేవలం అతడు దోషిగా తేలితే మాత్రమే ఆ పదవికి అనర్హుడిగా గుర్తిస్తారని కోర్టు ప్రస్తావించింది. ఎంఎల్ రవి పిటిషన్‌ను తోసిపుచ్చింది.
కాగా మనీ లాండరింగ్ కేసులో సెంథిల్ బాలాజీని ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన జ్యూడీషియల్ కస్టడీలో ఉన్నారు. అయితే ఆయన అనారోగ్యం బారిన పడటంతో మంత్రి సెంథిల్ బాలాజీని బెయిల్‌పై బయటకు తీసుకొచ్చేందుకు న్యాయవాదులు తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. హైకోర్టు, సుప్రీంకోర్టులోనూ సెంథిల్‌కు బెయిల్ దక్కలేదు.
చదవండి: ఇండియన్ మ్యూజియానికి బాంబు బెదిరింపులు
Comments
Please login to add a commentAdd a comment