Minister post
-
TN: ‘సుప్రీం’ దెబ్బకు దిగొచ్చిన తమిళనాడు గవర్నర్
చెన్నై: డీఎంకే నేత కె.పొన్ముడి తమిళనాడు మంత్రిగా శుక్రవారం(మార్చ్ 22) మధ్యాహ్నం 3.30గంటలకు మళ్లీ ప్రమాణస్వీకారం చేయనున్నారు. పొన్ముడి ప్రమాణస్వీకారాన్ని తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి పెండింగ్‌లో పెట్టడంపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. 24 గంటల్లో గవర్నర్ ఈ విషయంలో నిర్ణయం తీసుకోవాలని అల్టిమేటం కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో రాజ్‌భవన్‌లో పొన్ముడి ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు చకచకా చేయడం గమనార్హం. అక్రమాస్తుల కేసులో పొన్ముడికి పడిన మూడేళ్ల జైలు శిక్షపై సుప్రీంకోర్టు స్టే విధించింది. అనంతరం పొన్ముడిని సీఎం స్టాలిన్ తిరిగి మంత్రివర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించారు. అయితే పొన్ముడితో ప్రమాణస్వీకారం చేయించడానికి గవర్నర్ రవి నిరాకరించారు. దీనిపై తమిళనాడు ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పిటిషన్ విచారించిన సుప్రీంకోర్టు కన్నెర్ర జేయడంతో గవర్నర్ దిగిరాక తప్పలేదు. కాగా, తమిళనాడు ప్రభుత్వంలో గతంలో మంత్రిగా ఉన్న పొన్ముడిని అక్రమాస్తుల కేసులో దోషిగా తేలుస్తూ మద్రాస్ హైకోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించింది. దీంతో ఆయన తన శాసనసభ్యత్వాన్ని కోల్పోయారు. శిక్షపై సుప్రీంస్టే తర్వాత ఆయన తన శాసనసభ్యత్వాన్ని తిరిగి పొందారు. ఆ వెంటనే పొన్ముడిని మంతత్రివర్గంలోకి తిరిగి తీసుకోవాలని సీఎం స్టాలిన్ నిర్ణయించారు. ఇదీ చదవండి.. కేజ్రీవాల్ పిటిషన్ విత్ డ్రా -
జైల్లోని తమిళనాడు మంత్రికి సుప్రీంకోర్టులో ఊరట
న్యూఢిల్లీ: మనీలాండరింగ్ కేసుతో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అరెస్ట్ చేసిన తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీకి (ప్రస్తుతం జ్యూడిషియల్ కస్టడీలో ఉన్నారు) సుప్రీంకోర్టులో ఊరట లభించింది. బాలాజీని మంత్రి పదవి నుంచి తప్పించాలంటూ ఓ సామాజిక కార్యకర్త దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీం శుకవ్రారం కొట్టివేసింది. తమిళనాడు ముఖ్యమంత్రి అనుమతి లేకుండా రాష్ట్ర కేబినెట్ నుంచి తొలగించడం కుదరదని కోర్టు ఈ సందర్భంగా స్పష్టం చేసింది. పోర్ట్‌ఫోలియో లేని బాలాజీని మంత్రిగా కొనసాగాలా వద్దా అనేది ముఖ్యమంత్రే నిర్ణయిస్తారని చెబుతూ.. ఇంతకు ముందు మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీం సమర్థించింది. ‘ఒక మంత్రిని తొలగించే అధికారం గవర్నర్‌కు ఉందా? లేదా? అనే విషయాన్ని హైకోర్టు పరిగణనలోకి తీసుకుంటుంది. అంతేగానీ సంబంధిత వ్యక్తి మంత్రిగా కొనసాగాలా వద్దా అనే దానిపై నిర్ణయం తీసుకునే బాధ్యతను ముఖ్యమంత్రికి వదిలివేస్తుంది' అని జస్టిస్ అభయ్ శ్రీనివాస్ ఓకాతో కూడిన ఏకసభ్య ధర్మాసనం స్పష్టం చేసింది. మద్రాస్ హైకోర్టు అభిప్రాయంతో ఏకీభవిస్తున్నామని అత్యున్నత ధర్మాసనం పేర్కొంది. ఈ విషయంలో జోక్యం చేసుకోవాల్సిన అవసరం లేదని తెలిపింది. గతంలో మద్రాస్ హైకోర్టు తీర్పును సామాజిక కార్యకర్త ఎంఎల్ రవి సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. మనీలాండరింగ్ కేసులో బాలాజీని దర్యాప్తు సంస్థ ఈడీ అరెస్ట్ చేసినప్పటికీ.. ఆయన తమిళనాడు ప్రభుత్వంలో పోర్ట్‌ఫోలియో లేని మంత్రిగా కొనసాగడంపై అభ్యంతరం వ్యక్తం చేశారాయన. దీనిపై విచారణ జరిపిన సర్వోన్నత న్యాయస్థానం.. ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం కూడా.. క్రిమినల్ ప్రాసిక్యూషన్ పెండింగ్‌లో ఉన్న వ్యక్తిని మంత్రి పదవిని నిర్వహించకుండా నిరోధించలేదని, కేవలం అతడు దోషిగా తేలితే మాత్రమే ఆ పదవికి అనర్హుడిగా గుర్తిస్తారని కోర్టు ప్రస్తావించింది. ఎంఎల్ రవి పిటిషన్‌ను తోసిపుచ్చింది. కాగా మనీ లాండరింగ్ కేసులో సెంథిల్ బాలాజీని ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన జ్యూడీషియల్ కస్టడీలో ఉన్నారు. అయితే ఆయన అనారోగ్యం బారిన పడటంతో మంత్రి సెంథిల్ బాలాజీని బెయిల్‌పై బయటకు తీసుకొచ్చేందుకు న్యాయవాదులు తీవ్రంగా ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయింది. హైకోర్టు, సుప్రీంకోర్టులోనూ సెంథిల్‌కు బెయిల్ దక్కలేదు. చదవండి: ఇండియన్ మ్యూజియానికి బాంబు బెదిరింపులు -
ఆ ఊళ్లో బసచేస్తే మంత్రి పదవి ఊడిపోతుండట!
కొందరు బడాబాడా నాయకులకు సైతం అనేక మూఢనమ్మకాలను కలిగి ఉంటారు. ఇలాంటివారు కొన్ని నమ్మకాలను అనుసరిస్తూ జీవితాన్ని గడుపుతుంటారు. ఈనాటికీ చాలామంది నాయకులు రాత్రివేళ ఆ ప్రాంతంలో బస చేయాలంటే సంకోచిస్తారట. ఇలా చేయడం వల్ల వారు తమ పదవులకు కోల్పోతారట. ఈ ప్రదేశం మధ్యప్రదేశ్‌లో ఉంది. అక్కడ ఏ ముఖ్యమంత్రి లేదా మంత్రి రాత్రి బసచేయాలంటే భయపడిపోతారు. ఎందుకంటే రాత్రిపూట అక్కడ బస చేసిన ఏ మంత్రీ తిరిగి అధికారంలోకి రాలేదని చెబుతుంటారు. చాలా మంది మంత్రులు, ముఖ్యమంత్రులు మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో రాత్రవేళ బసచేసే ధైర్యం చేయరు. మహాకాళేశ్వరుడు కొలువై ఉండటమే ఇందుకు కారణమని భావిస్తారు. ఉజ్జయినిలో కొలువైన మహారాజు.. మహాకాళేశ్వరుడేనని, అందుకే అక్కడ మరే ఇతర రాజు ఉండడం తగదని అంటుంటారు. అలా చేస్తే శిక్ష అనుభవించాల్సి వస్తుందని అంటారు. దీనికి పౌరాణిక కథలను ఉదాహరణలుగా చూపిస్తుంటారు. చాలామంది నేతలు ఇదే నమ్మకాన్ని కలిగివుండటంతో మిగిలిన నేతలు కూడా వారిని అనుసరిస్తున్నారు. మహాకాళీశ్వరుని ముందు తలవంచి, నమస్కరిస్తూ పూజలు చేసినప్పటికీ.. ఏనాయకుడూ రాత్రివేళ ఇక్కడ ఉండేందుకు ఇష్టపడటం లేదు. ఎంతటి అధికార బలం ఉన్నా ఇక్కడికి వస్తే వాటిని పోగొట్లుకోవడం ఖాయమని అంటున్నారు. ఇలాంటి నమ్మకాలు కేవలం ఉజ్జయినిలో మాత్రమే కాదు వివిధ రాష్ట్రాల్లో కూడా ఉన్నాయని చెబుతుంటారు. కొంతమంది ఇందుకు వాస్తు దోషాలను కారణంగా చూపుతుంటారు. ఇది కూడా చదవండి: హిజ్రాల పెళ్లి వేడుక ఏడుపుతో ఎందుకు ముగుస్తుంది? ఇదేమైనా సంప్రదాయమా? -
‘పోలవరంపై చంద్రబాబు మాట్లాడేవన్నీ అబద్దాలే’
విజయవాడ: ప్రాజెక్టులపై మాట్లాడే అర్హత చంద్రబాబుకి ఎక్కడిదని మంత్రి బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. అధికారంలో ఉన్న 14 ఏళ్లలో ఏ ప్రాజెక్ట్ అయినా పూర్తి చేశాడా? అని ప్రశ్నించారు. పోలవరంపై చంద్రబాబు మాట్లాడేవన్నీ అబద్దాలేనని చెప్పారు. దివంగత సీఎం వైఎస్సార్ పోలవరం శంఖుస్ధాపన చేయగా.. ఆయన తనయుడు సీఎం వైఎస్ జగన్ దానిని పూర్తి చేస్తారని అన్నారు. 'వైఎస్సార్ నిర్మించిన కాలువలలో గోదావరి నీళ్లు పారించి పట్టిసీమ పేరుతో చంద్రబాబు దోచుకున్నారు. రైతులకు రావలసిన ఆర్ & ఆర్ ప్యాకేజీని చంద్రబాబు తాకట్టు పెట్టారు. ప్రాజెక్ట్‌లని సందర్శించే నైతికత చంద్రబాబుకి లేదు. రాబోయే ఆరు నెలలలో ఎన్నికలు రాబోతున్నాయి. చంద్రబాబుకి వచ్చే ఎన్నికల్లో ప్రజలు రెస్ట్ ఇస్తారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు ఆటంకం కలిగించాలని చంద్రబాబు చూస్తున్నాడు. పుంగుటూరు ఘటన చంద్రబాబు ప్రోద్బలంతోనే జరిగింది. ముందుగా లేకపోతే ఆ తుపాకులు, కత్తులు ఎక్కడి నుంచీ వచ్చాయి.' అని బొత్స సత్యనారాయణ అన్నారు. సినీ పరిశ్రమ ఒక పిచుకా అని చిరంజీవి వ్యాఖ్యలపై మంత్రి బొత్స సత్యనారాయణ అభ్యంతరం వ్యక్తం చేశారు. చిరంజీవి ఏ ఉద్దేశంతో వ్యాఖ్యలు చేశారో తెలియదని అన్నారు. ప్రభుత్వం తన పని తాను చేసుకుపోతుందని చెప్పారు. జాతీయ స్ధాయిలో చర్చించుకోవాలంటే పుంగునూరు ఘటనలా చేస్తారా..? అన్నటువంటి పవన్ వ్యాఖ్యలపై మాకు అదే అనుమానం కలుగుతోందని మంత్రి బోత్స అన్నారు. చట్టాలను చేతుల్లోకి తీసుకుంటే చూస్తూ ఊరుకోంబోమని తెలిపారు. ఉపాధ్యాయ సంఘాలతో వివిధ అంశాలపై చర్చించామని అన్నారు. వచ్చే వారం మరోసారి ఉపాధ్యాయ సంఘాలతో చర్చలు కొనసాగుతాయి. పరీక్షా విధానాల్లో మార్పులు చేయాలని ఆలోచనచేస్తున్నామని చెప్పారు. ఎంఈఓ జాబ్ ఛార్ట్ ల విషయంలో కూడా నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. ఇదీ చదవండి: గత ప్రభుత్వానికి, ఈ ప్రభుత్వానికి తేడా గమనించండి: సీఎం జగన్ -
‘నా కళ్లు చిన్నగా ఉండొచ్చు.. కానీ’.. మరోమారు వార్తల్లోకి ఆ మంత్రి
కోహిమా: పరిస్థితులు ఎలా ఉన్నా సందర్భానుసారం నవ్వులు పూయించటంలో కొందరు నిష్ణాతులుంటారు. అలాంటి వారిలో నాగాలాండ్ మంత్రి టెమ్జెన్ ఇమ్నా అలోంగ్ ఒకరు అని చెప్పకతప్పదు. తనలాగే ఒంటరిగా ఉండండంటూ జనాభా పెరుగుదలపై చమత్కారమైన సలహా ఇచ్చి సోషల్ మీడియాలో ట్రెండింగ్‌గా మారు. అంతకు ముందు ఈశాన్య ప్రజలకు చిన్నకళ్లు ఉంటాయని జాత్యాహంకార వ్యాఖ్యలపైనా తనదైన శైలీలో సమాధానమిచ్చి వార్తల్లో నిలిచారు మంత్రి టెమ్జెన్. తాజాగా మరోమారు ‘చిన్న కళ్లు’ వ్యాఖ్యలతో వైరల్‌గా మారారు. తాజాగా తన ఫోటోను ట్విటర్లో షేర్ చేశారు మంత్రి టెమ్జెన్. తాను ఎల్లప్పుడూ ఫోటో పోజులకు రెడీ అని పేర్కొన్నారు. తనకు ఉన్న చిన్న కళ్లతోనే మైల్ దూరంలో ఉన్న కెమెరాలను గుర్తించగలనని చమత్కరించారు. ‘నా కళ్లు చిన్నగా ఉండొచ్చు.. కానీ, ఒక మైల్ దూరం నుంచి నేను కెమెరాను చూస్తాను. ఎల్లప్పుడూ పోజ్‌కు రెడీ. ఇది చదువుతున్నప్పుడు మీ పెదాలపై చిరునవ్వును చూస్తాను.’ అంటూ ట్వీట్ చేశారు. ఆదివారం ఉదయం ఫోటో షేర్ చేయగా కొన్ని గంటల్లోనే ఐదు వేల వరకు లైకులు, వందల కొద్ది కామెంట్లు వచ్చాయి. లాఫింగ్ ఎమోజీలతో కామెంట్ సెక్షన్ నిండిపోయింది. మీరు మమ్మల్ని ఎప్పుడూ సంతోషంగా ఉంచుతారనే దాంట్లో ఎలాంటి సందేశం లేదు అంటూ ఓ నెటిజన్ రాసుకొచ్చారు. దేశంలోనే అత్యంత వినోదభరితమైన మంత్రిగా మరొకరు పేర్కొన్నారు. My eyes may be small, but I can see the camera from a mile. Always pose ready. 📸 Also I can see you smile as you reading it! 😉 Good Morning pic.twitter.com/7ntWw5UMVx — Temjen Imna Along (@AlongImna) October 9, 2022 ఇదీ చదవండి: బార్కొలానా వీక్.. సముద్రంపై ‘తెరచాప’ పడవల పందెం -
బాధితుల గోడు వినాల్సిందే!
అన్యాయం జరుగుతున్నా అడ్డుకొనేవారు లేరని ఆవేదన పడుతున్నప్పుడు అనుకోని రీతిలో ఆపన్నహస్తం ఎదురైతే? బలవంతుడిదే రాజ్యమని నిరాశలో మునిగిపోతున్నవేళ, బడుగు వర్గాల బాధితుల హక్కులను పరిరక్షిస్తూ, వ్యవస్థ మీద కాసింతైనా నమ్మకం మిగిలే సంఘటన జరిగితే? లఖీమ్‌పుర్ ఖీరీ సంఘటనలోని బాధితులకు సోమవారం అలాంటి సాంత్వనే లభించింది. అధికారంలో ఉన్నామనే అహంతో అమాయకులపైకి వాహనం పోనిచ్చి, వారి మరణానికి కారణమైన కేంద్ర మంత్రి గారి పుత్రరత్నం జామీనును రద్దు చేస్తూ, దేశ సర్వోన్నత న్యాయస్థానం సోమవారం ఇచ్చిన ఆదేశాలు అనేక విధాలుగా గణనీయమైనవి. అది బాధితుల హక్కులను కాపాడిన తీర్పు. నిందితులకు జామీను విషయంలో ఒక పూర్వోదాహరణగా నిలిచే రేపటి చరిత్ర. ధర్మసంకటంలో తమకు దిశానిర్దేశంగా రానున్న రోజుల్లో కింది కోర్టులు గుర్తుంచుకోవాల్సిన పాఠం. గత ఏడాది అక్టోబర్ 3న ఉత్తరప్రదేశ్‌లోని లఖీమ్‌పుర్ ఖీరీలో జరిగిన హింసాకాండ కేసులో కేంద్ర హోమ్ శాఖ సహాయమంత్రి అజయ్ మిశ్రా తేనీ కుమారుడైన ఆశిష్ మిశ్రా ప్రధాన నిందితుడు. ఆందోళన చేస్తున్న అమాయక రైతులపైకి వేగంగా వాహనం నడిపి, ఓ జర్నలిస్టుతో పాటు నలుగురు రైతుల మరణానికి కారకుడైనట్టు ఆయనపై ప్రధాన ఆరోపణ. తదనంతర హింసలో ఇద్దరు బీజేపీ కార్యకర్తలు, ఓ జీప్ డ్రైవర్ కూడా ప్రాణాలు కోల్పోయారు. అలా మొత్తం 8 మంది మరణంతో, దేశవ్యాప్త సంచలనమైన ఆ ఘటనలో హత్యానేరం కింద మంత్రివర్యుల గారాలబాబు బుక్కయ్యారు. అయితే, ఈ ఫిబ్రవరి 10న అలహాబాద్ హైకోర్టు జామీను ఇచ్చింది. దర్యాప్తు సాగుతుండగానే, బాధితుల వాదనలు వినకుండానే జామీను ఇచ్చారని ఆరోపణ. దీనిపై సుప్రీమ్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి సారథ్యంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం సోమవారం స్పష్టమైన తీర్పునిచ్చింది. బెయిల్ మంజూరులో అలహాబాద్ హైకోర్ట్ లక్నో బెంచ్ తన పరిధిని దాటి ప్రవర్తించిందని కుండబద్దలు కొట్టింది. బాధితుల హక్కులను గుర్తించి, ప్రస్తావించడంలో హైకోర్ట్ విఫలమైన తీరు పట్ల ‘‘అసంతృప్తి’’ని రికార్డులకెక్కించింది. నిజానికి ఈ కేసులో నిందితులను కాపాడేందుకు ఆది నుంచి అనేక ప్రయత్నాలు జరిగాయి. అప్పుడూ సుప్రీమ్ కోర్టే జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. పదే పదే జోక్యం చేసుకున్నాకే, కేసు కొంతైనా పురోగమించింది. సాక్షులను సురక్షితంగా ఉండేలా చూసుకోవాలనీ కోర్టు చెప్పాల్సి వచ్చింది. ఆఖరికి గత నవంబర్ నుంచి ఓ మాజీ న్యాయమూర్తి పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఈ కేసు దర్యాప్తు సాగేలా చూడాల్సి వచ్చింది. అయితే, ఆ తర్వాత ఈ కేసులో ప్రధాన నిందితుడికి అలహాబాద్ హైకోర్ట్ జామీనివ్వడం విమర్శల పాలైంది. జామీనివ్వడాన్ని వ్యతిరేకిస్తూ, అప్పీలు ఫైల్ చేయాలంటూ సాక్షాత్తూ సుప్రీమ్ ఆదేశంతో ఏర్పడ్డ ‘సిట్’ ఒకటికి రెండు సార్లు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వానికి సిఫారసు కూడా చేసింది. కానీ, కేంద్ర మంత్రివర్యుల పార్టీయే అధికారంలోఉన్న అక్కడి సర్కారు వారు అది వినీ విననట్టే ఉండిపోయారు. చివరకిప్పుడు అధికారం – పలుకుబడి గల నిందితుణ్ణి జామీనుపై వదిలిపెట్టడాన్ని కూడా సుప్రీమ్ కోర్టే అభ్యంతర పెట్టి, రద్దు చేయాల్సి వచ్చింది. బాధితుల హక్కులకు కాపు కాయాల్సి వచ్చింది. లఖిమ్‌పుర్ ఘటనలో జనంపైకి దూసుకుపోయిన 3 అధునాతన వాహనాల్లో, ఒకటి నింది తుడు మిశ్రా కుటుంబానిదే. ఆ కుటుంబ ప్రాబల్యమూ తెలిసినదే. అయినా సరే, హత్యానేరాన్ని ఎదుర్కొంటున్న ఆశిష్ మిశ్రాను జైలు నుంచి వదిలేయడం సమర్థనీయం కాదు. వర్చ్యువల్‌గా సాగిన బెయిల్ కేసు విచారణలో బాధితుల తరఫు వకీలు లింకు కట్ అయింది. ఆ తరువాత మళ్ళీ వాదన వినాల్సిందిగా అభ్యర్థన దాఖలు చేసినా, హైకోర్ట్ దాన్ని తోసిపుచ్చడం మరీ విచిత్రం. బెయిల్ మంజూరులో హైకోర్ట్ తీరును ధర్మాసనం గట్టిగానే తప్పుబట్టింది. నేర తీవ్రత, సాక్ష్యాధారా లను ప్రభావితం చేసేందుకు నిందితుడికి ఉన్న వీలు లాంటి తప్పనిసరి అంశాలను సైతం విస్మరించి, అసంగతమైనవాటిని అడ్డం పెట్టుకొని బెయిల్ ఇచ్చారన్న సుప్రీమ్ వ్యాఖ్య తీవ్రమైనది. విచారణ మొదలవకుండానే కేసు బలాబలాల్ని బెయిల్ ఉత్తర్వులో అనవసరంగా ప్రస్తావించారేమి టన్న దానికీ సంతృప్తికరమైన సమాధానం లేదు. ప్రధాన నిందితుడికి జామీనివ్వడానికి హైకోర్ట్ ఎక్కడలేని తొందర పడడాన్ని కూడా సుప్రీమ్ ఎత్తిచూపింది. మరి, ఈ మాత్రం అక్కర, తొందర అక్రమ కేసుల్లో ఏళ్ళ తరబడి జైళ్ళలో మగ్గుతున్నవారి బెయిల్‌పై ఎందుకు చూపరో అర్థం కాదు. మొత్తం 24 పేజీల తీర్పులో సుప్రీమ్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యలు రాబోయే రోజుల్లో వివిధ కేసుల్లో బాధితుల హక్కులకూ, బెయిల్ మంజూరు విధానాలకూ మార్గదర్శకం కానున్నాయి. ఏ కేసులోనైనా సరే బాధితుల వాదనను సముచిత రీతిలో, సక్రమంగా వినితీరాలన్న సుప్రీమ్ మాట శిరోధార్యం. ఆ వాదనకు బలాన్నిస్తూ గతంలో భారతీయ కోర్టులు ఇచ్చిన తీర్పులనూ, అంతర్జాతీయ న్యాయశాస్త్రాలనూ ధర్మాసనం ప్రస్తావించింది. నిందితులకు బెయిల్ ఇస్తున్నప్పుడు బాధితుల వాదన సైతం చెవికెక్కించుకోవాలన్నది సారాంశం. దీన్ని ఇక ఆచరణలో పెట్టాల్సింది కింది కోర్టులే. ఏమైనా, లఖీమ్‌పుర్ కేసులో ప్రధాన నిందితుడి బెయిల్ రద్దు మరోసారి న్యాయవ్యవస్థపై సామాన్యుల్లో ఆశలు రేపింది. కుంటుతూ అయినా సరే ధర్మం నిలబడుతుందనే కాస్తంత నమ్మకం కలిగింది. ఏ వ్యవస్థయినా నిలబడాల్సింది బాధితుల పక్షానే కదా! -
నేను బిక్షగాడిని కాదు సార్ .. బూట్ పాలిష్ చేస్తాను!
బెంగళూరు: లాక్‌డౌన్‌తో కార్మికులు ఎంతో దయనీయ స్థితిలో ఉన్నారో తేటతెల్లం చేసే సంఘటన ఇది. జిల్లా ఇన్చార్జి మంత్రి జగదీశ్ శెట్టర్ కారులో వెళ్తుండగా ఓ కార్మికుడు కారు వద్దకు వచ్చి పార్ బూట్ పాలిష్ చేస్తా అంటూ వెట్టర్ను ప్రాధేయపడ్డాడు. నగరంలోని కిమ్స్ సమీపంలో ఈ ఘటన జరిగింది. మంత్రి డబ్బులు ఇవ్వపోగా..‘నేను బిక్షగాడిని కాదు.. మిమ్మల్ని బిక్షం అడగడం లేదు.. మాకు ఉపాధి కల్పించి పుణ్యం కట్టుకోండి సార్’ అని ప్రాధేయపడ్డాడు. చివరకు మంత్రి రూ. 500 నగదు ఇచ్చి ఇతనికి శాంతపరిచి పంపారు. చదవండి: ముఖ్యమంత్రి మార్పు: ‘మా కుటుంబాన్ని లాగొద్దు’ -
మహిళ ఫిర్యాదు, మరుగుదొడ్లు కడిగిన మంత్రి
భోపాల్: మధ్యప్రదేశ్ ఇంధన శాఖ మంత్రి ప్రద్యుమాన్ సింగ్ తోమర్ గ్వాలియర్‌లోని కమిషనర్ కార్యాలయాన్ని సందర్శించారు. తరువాత మరుగుదొడ్లు శుభ్రపరిచే సామాన్లలను అందించాలని కోరిన ఆయన స్వయంగా పౌర రక్షణా సిబ్బందితో కలిసి మరుగుదొడ్లను శుభ్రం చేశారు. మరుగుదొడ్లు సరిగా శుభ్రం చేయడంలేదని కమిషనర్ కార్యాలయంలోని ఒక మహిళ సిబ్బంది ఫిర్యాదు చేశారు. దీంతో మంత్రే స్వయంగా మరుగుదొడ్లు శుభ్రం చేయడంతో అందరూ ఆశ్చర్యానికి గురయ్యారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, ‘మరుగుదొడ్లు అందరికి ముఖ్యం. టాయ్లెట్లు సరిగా లేనందువల్ల మహిళలు చాలా ఇబ్బందులను ఎదుర్కొంటారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ పరిసరాల పరిశుభ్రత కోసం నిరంతరం ప్రయత్నాలు చేస్తున్నారు. కార్యాలయాలు ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి’ అని పేర్కొన్నారు. మరుగుదొడ్లు ఎల్లప్పుడూ శుభ్రంగా, ఉపయోగపడేలా ఉండాలని అధికారులను ఆదేశించారు. తోమర్ మార్చి నెలలో కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. చదవండి: పీపీఈ సూట్‌తో ఓటు.. మరో ఎమ్మెల్యేకు కరోనా -
సోమిరెడ్డే మంత్రి
♦ పనిచేయని నారాయణ మంత్రం ♦ మూడోసారి మంత్రిగా అవకాశం ♦ సోమిరెడ్డికి కలిసొచ్చిన నారాయణ వైఫల్యాలు ♦ నేడు మంత్రిగా ప్రమాణస్వీకారం సాక్షి ప్రతినిధి, నెల్లూరు : అనేక సమీకరణాలు, తీవ్ర ఉత్కంఠ అనంతరం ఎమ్మెల్సీ సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మూడో సారి మంత్రిగా ఎంపికయ్యారు. ఆదివారం ఉదయం అమరావతిలో ఆయన ప్రమాణస్వీకారం చేయనున్నారు. మంత్రి వర్గ విస్తరణపై ఆరు నెలలుగా ప్రచారం జరుగుతుండడంతో సోమిరెడ్డి అప్పటి నుంచే మంత్రి పదవి సాధించడం కోసం తన సర్వశక్తులూ ఒడ్డారు. 2వ తేదీ మంత్రి వర్గ విస్తరణ ముహూర్తం ఖరారుకావడంతో జిల్లా నుంచి సోమిరెడ్డికి పదవి ఖాయమనే ప్రచారం గట్టిగా జరిగింది. అయితే జిల్లా పార్టీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర అనూహ్యంగా బీసీ కోటాలో మంత్రి పదవి కోసం తెరమీదకొచ్చారు. దీంతో ఇద్దరిలో ఎవరిది పై చేయి అవుతుందోనని తెలుగుదేశం పార్టీతో పాటు జిల్లా రాజకీయ వర్గాలు ఆసక్తిగా ఎదురుచూస్తూ వచ్చాయి. జిల్లాకు రెండో మంత్రి పదవి రాకుండా చూడటానికి మంత్రి నారాయణ తీవ్రంగానే ప్రయత్నం చేశారు. తప్పనిసరిగా పదవి ఇవ్వాల్సి వస్తే రవిచంద్రకు ఇవ్వాలని ఆయన సిఫారసు చేశారు. అయితే మూడేళ్లుగా మంత్రి పదవిలో ఉన్న నారాయణ జిల్లాలో పార్టీని, అధికార యంత్రాంగాన్ని గాడిలో పెట్టలేకపోయారు. దీనికి తోడు ఇటీవల జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో తనకు అత్యంత సన్నిహితుడైన వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డిని గెలిపించుకోలేకపోవడం, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి వాసుదేవనాయుడు కూడా ఓటమి పాలు కావడంతో చంద్రబాబు వద్ద నారాయణ పరపతి తగ్గింది. మంత్రి పదవి కోసం అన్ని రకాల మార్గాల్లో ప్రయత్నిస్తున్న సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి నారాయణ వైఫల్యాలు సానుకూలంగా మారాయి. కాగా, 1996లో చంద్రబాబునాయుడు చేపట్టిన మంత్రి వర్గ విస్తరణలో చంద్రమోహన్‌రెడ్డికి తొలిసారి మంత్రి పదవి దక్కింది. 2001లో చంద్రబాబు నాయుడు జరిపిన మంత్రి వర్గ విస్తరణలో సోమిరెడ్డికి రెండోసారి మంత్రి పదవి దక్కింది. 2001 నుంచి 2004 వరకు ఆయన సమాచార, ప్రసారశాఖ మంత్రిగా పదవీబాధ్యతలు నిర్వర్తించారు. మళ్లీ సోమిరెడ్డి హవా.. 2014 ఎన్నికల్లో ఓటమి అనంతరం నారాయణకు మంత్రి పదవి దక్కడంతో జిల్లా రాజకీయాల్లో సోమిరెడ్డి ఆధిపత్యం ముగిసినట్లేనని టీడీపీ వర్గాలు భావిస్తూ వచ్చాయి. సీఎం చంద్రబాబునాయుడు మంత్రి నారాయణకు అత్యంత ప్రాధాన్యతను ఇవ్వడం.. జిల్లా పార్టీ వ్యవహారాలు, అధికారుల నియామకాలు, ప్రభుత్వ విధాన నిర్ణయాల్లో సైతం నారాయణకు పెద్ద పీట వేశారు. దీంతో మూడేళ్లుగా నారాయణ ఆధిపత్యం కొనసాగుతూ చంద్రమోహన్‌రెడ్డి పట్టు తగ్గింది.అయితే చంద్రబాబుతో ఉన్న సన్నిహిత సంబంధాలు, పార్టీ పట్ల విధేయత కారణంగా ఏడాది క్రితం సోమిరెడ్డి ఎమ్మెల్సీ పదవి సాధించగలిగారు. ఎన్నికలకు ముందు మంత్రి వర్గ విస్తరణ ఉంటుందనే అంచనాతో అప్పటి నుంచి సోమిరెడ్డి తన సహజ వ్యవహారశైలిని మార్చుకొని జిల్లా పార్టీ నాయకులందరితో స్నేహితంగా మెలుగుతూ వస్తున్నారు. వివాదాస్పద వ్యవహారాల జోలికి పోకుండా జాగ్రత్తగా అడుగులేస్తున్నారు. చంద్రబాబు పురమాయించే రాజకీయ కార్యక్రమాలను పూర్తి చేస్తూ వస్తున్నారు. ఈ కారణాలన్నింటి రీత్యా మరోసారి చంద్రమోహన్‌రెడ్డి మంత్రి పదవికి మార్గం సుగమమైంది. సోమిరెడ్డికి మంత్రి పదవి ఖరారైనట్లు సమాచారం అందడంతో జిల్లాలోని ఆయన మద్దతుదారులు శనివారం రాత్రి అమరావతికి బయలుదేరి వెళ్లారు.