అన్యాయం జరుగుతున్నా అడ్డుకొనేవారు లేరని ఆవేదన పడుతున్నప్పుడు అనుకోని రీతిలో ఆపన్నహస్తం ఎదురైతే? బలవంతుడిదే రాజ్యమని నిరాశలో మునిగిపోతున్నవేళ, బడుగు వర్గాల బాధితుల హక్కులను పరిరక్షిస్తూ, వ్యవస్థ మీద కాసింతైనా నమ్మకం మిగిలే సంఘటన జరిగితే? లఖీమ్‌పుర్ ఖీరీ సంఘటనలోని బాధితులకు సోమవారం అలాంటి సాంత్వనే లభించింది. అధికారంలో ఉన్నామనే అహంతో అమాయకులపైకి వాహనం పోనిచ్చి, వారి మరణానికి కారణమైన కేంద్ర మంత్రి గారి పుత్రరత్నం జామీనును రద్దు చేస్తూ, దేశ సర్వోన్నత న్యాయస్థానం సోమవారం ఇచ్చిన ఆదేశాలు అనేక విధాలుగా గణనీయమైనవి. అది బాధితుల హక్కులను కాపాడిన తీర్పు. నిందితులకు జామీను విషయంలో ఒక పూర్వోదాహరణగా నిలిచే రేపటి చరిత్ర. ధర్మసంకటంలో తమకు దిశానిర్దేశంగా రానున్న రోజుల్లో కింది కోర్టులు గుర్తుంచుకోవాల్సిన పాఠం.
గత ఏడాది అక్టోబర్ 3న ఉత్తరప్రదేశ్‌లోని లఖీమ్‌పుర్ ఖీరీలో జరిగిన హింసాకాండ కేసులో కేంద్ర హోమ్ శాఖ సహాయమంత్రి అజయ్ మిశ్రా తేనీ కుమారుడైన ఆశిష్ మిశ్రా ప్రధాన నిందితుడు. ఆందోళన చేస్తున్న అమాయక రైతులపైకి వేగంగా వాహనం నడిపి, ఓ జర్నలిస్టుతో పాటు నలుగురు రైతుల మరణానికి కారకుడైనట్టు ఆయనపై ప్రధాన ఆరోపణ. తదనంతర హింసలో ఇద్దరు బీజేపీ కార్యకర్తలు, ఓ జీప్ డ్రైవర్ కూడా ప్రాణాలు కోల్పోయారు. అలా మొత్తం 8 మంది మరణంతో, దేశవ్యాప్త సంచలనమైన ఆ ఘటనలో హత్యానేరం కింద మంత్రివర్యుల గారాలబాబు బుక్కయ్యారు. అయితే, ఈ ఫిబ్రవరి 10న అలహాబాద్ హైకోర్టు జామీను ఇచ్చింది. దర్యాప్తు సాగుతుండగానే, బాధితుల వాదనలు వినకుండానే జామీను ఇచ్చారని ఆరోపణ. దీనిపై సుప్రీమ్ కోర్టు ప్రధాన న్యాయమూర్తి సారథ్యంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం సోమవారం స్పష్టమైన తీర్పునిచ్చింది. బెయిల్ మంజూరులో అలహాబాద్ హైకోర్ట్ లక్నో బెంచ్ తన పరిధిని దాటి ప్రవర్తించిందని కుండబద్దలు కొట్టింది. బాధితుల హక్కులను గుర్తించి, ప్రస్తావించడంలో హైకోర్ట్ విఫలమైన తీరు పట్ల ‘‘అసంతృప్తి’’ని రికార్డులకెక్కించింది.
నిజానికి ఈ కేసులో నిందితులను కాపాడేందుకు ఆది నుంచి అనేక ప్రయత్నాలు జరిగాయి. అప్పుడూ సుప్రీమ్ కోర్టే జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. పదే పదే జోక్యం చేసుకున్నాకే, కేసు కొంతైనా పురోగమించింది. సాక్షులను సురక్షితంగా ఉండేలా చూసుకోవాలనీ కోర్టు చెప్పాల్సి వచ్చింది. ఆఖరికి గత నవంబర్ నుంచి ఓ మాజీ న్యాయమూర్తి పర్యవేక్షణలో ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ఈ కేసు దర్యాప్తు సాగేలా చూడాల్సి వచ్చింది. అయితే, ఆ తర్వాత ఈ కేసులో ప్రధాన నిందితుడికి అలహాబాద్ హైకోర్ట్ జామీనివ్వడం విమర్శల పాలైంది. జామీనివ్వడాన్ని వ్యతిరేకిస్తూ, అప్పీలు ఫైల్ చేయాలంటూ సాక్షాత్తూ సుప్రీమ్ ఆదేశంతో ఏర్పడ్డ ‘సిట్’ ఒకటికి రెండు సార్లు ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వానికి సిఫారసు కూడా చేసింది. కానీ, కేంద్ర మంత్రివర్యుల పార్టీయే అధికారంలోఉన్న అక్కడి సర్కారు వారు అది వినీ విననట్టే ఉండిపోయారు. చివరకిప్పుడు అధికారం – పలుకుబడి గల నిందితుణ్ణి జామీనుపై వదిలిపెట్టడాన్ని కూడా సుప్రీమ్ కోర్టే అభ్యంతర పెట్టి, రద్దు చేయాల్సి వచ్చింది. బాధితుల హక్కులకు కాపు కాయాల్సి వచ్చింది.
లఖిమ్‌పుర్ ఘటనలో జనంపైకి దూసుకుపోయిన 3 అధునాతన వాహనాల్లో, ఒకటి నింది తుడు మిశ్రా కుటుంబానిదే. ఆ కుటుంబ ప్రాబల్యమూ తెలిసినదే. అయినా సరే, హత్యానేరాన్ని ఎదుర్కొంటున్న ఆశిష్ మిశ్రాను జైలు నుంచి వదిలేయడం సమర్థనీయం కాదు. వర్చ్యువల్‌గా సాగిన బెయిల్ కేసు విచారణలో బాధితుల తరఫు వకీలు లింకు కట్ అయింది. ఆ తరువాత మళ్ళీ వాదన వినాల్సిందిగా అభ్యర్థన దాఖలు చేసినా, హైకోర్ట్ దాన్ని తోసిపుచ్చడం మరీ విచిత్రం. బెయిల్ మంజూరులో హైకోర్ట్ తీరును ధర్మాసనం గట్టిగానే తప్పుబట్టింది. నేర తీవ్రత, సాక్ష్యాధారా లను ప్రభావితం చేసేందుకు నిందితుడికి ఉన్న వీలు లాంటి తప్పనిసరి అంశాలను సైతం విస్మరించి, అసంగతమైనవాటిని అడ్డం పెట్టుకొని బెయిల్ ఇచ్చారన్న సుప్రీమ్ వ్యాఖ్య తీవ్రమైనది. విచారణ మొదలవకుండానే కేసు బలాబలాల్ని బెయిల్ ఉత్తర్వులో అనవసరంగా ప్రస్తావించారేమి టన్న దానికీ సంతృప్తికరమైన సమాధానం లేదు. ప్రధాన నిందితుడికి జామీనివ్వడానికి హైకోర్ట్ ఎక్కడలేని తొందర పడడాన్ని కూడా సుప్రీమ్ ఎత్తిచూపింది. మరి, ఈ మాత్రం అక్కర, తొందర అక్రమ కేసుల్లో ఏళ్ళ తరబడి జైళ్ళలో మగ్గుతున్నవారి బెయిల్‌పై ఎందుకు చూపరో అర్థం కాదు.
మొత్తం 24 పేజీల తీర్పులో సుప్రీమ్ కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ వ్యాఖ్యలు రాబోయే రోజుల్లో వివిధ కేసుల్లో బాధితుల హక్కులకూ, బెయిల్ మంజూరు విధానాలకూ మార్గదర్శకం కానున్నాయి. ఏ కేసులోనైనా సరే బాధితుల వాదనను సముచిత రీతిలో, సక్రమంగా వినితీరాలన్న సుప్రీమ్ మాట శిరోధార్యం. ఆ వాదనకు బలాన్నిస్తూ గతంలో భారతీయ కోర్టులు ఇచ్చిన తీర్పులనూ, అంతర్జాతీయ న్యాయశాస్త్రాలనూ ధర్మాసనం ప్రస్తావించింది. నిందితులకు బెయిల్ ఇస్తున్నప్పుడు బాధితుల వాదన సైతం చెవికెక్కించుకోవాలన్నది సారాంశం. దీన్ని ఇక ఆచరణలో పెట్టాల్సింది కింది కోర్టులే. ఏమైనా, లఖీమ్‌పుర్ కేసులో ప్రధాన నిందితుడి బెయిల్ రద్దు మరోసారి న్యాయవ్యవస్థపై సామాన్యుల్లో ఆశలు రేపింది. కుంటుతూ అయినా సరే ధర్మం నిలబడుతుందనే కాస్తంత నమ్మకం కలిగింది. ఏ వ్యవస్థయినా నిలబడాల్సింది బాధితుల పక్షానే కదా!
Comments
Please login to add a commentAdd a comment