
న్యూఢిల్లీ:అత్యాచార కేసులో జీవితఖైదు శిక్ష అనుభవిస్తున్న బాబా ఆశారాం(Asaram Bapu)నకు మధ్యంతర బెయిల్ లభించింది. సుప్రీంకోర్టు(Supreme court) ఆయనకు మార్చి 31 దాకా మధ్యంతర బెయిల్(Interim Bail) ఇచ్చింది. గుండె సంబంధిత వ్యాధికి చికిత్స తీసుకునేందుకు బెయిల్ మంజూరు చేసింది. అయితే మరో అత్యాచార కేసులోనూ మధ్యంతర బెయిల్ వచ్చేదాకా ఆయన జైలులోనే ఉండనున్నారు.
బెయిల్‌పై విడుదలైన తర్వాత ఆయన తన అనుచరులను కలవడానికి వీళ్లేదని కోర్టు ఆదేశించింది. ఆశారాం ఆస్పత్రికి వెళ్లేటప్పుడు ఎస్కార్ట్ ఇవ్వాలే తప్ప ఆయన ఎక్కడికి వెళ్లాలో నిర్ణయించ వద్దని పోలీసులను కోర్టు ఆదేశించింది. గుజరాత్ మోతేరాలోని ఆశ్రమంలో పనిచేస్తున్న సమయంలో తనపై ఆయన పలుమార్లు లైంగికదాడికి పాల్పడినట్లు సూరత్‌కు చెందిన ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
2001 నుంచి 2006 మధ్య తనపై పలుమార్లు లైంగికదాడికి పాల్పడ్డారని ఆమె ఆరోపించింది. దీనిపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆశారాంతో పాటు మరో ఏడుగురిపై కేసు నమోదు చేశారు.ఈ కేసులో గాంధీనగర్ సెషన్స్ కోర్టు ఆయనను దోషిగా తేల్చింది. ఈ కేసులో మిగిలిన నిందితులకు సంబంధించి ఎలాంటి సాక్ష్యాధారాలు లేకపోవడంతో వారిని విడుదల చేశారు.
అనంతరం ఆశారాంకు జీవితఖైదు విధిస్తూ తీర్పునిచ్చింది. జోధ్‌పూర్‌లోని మరో ఆశ్రమంలో 16 ఏళ్ల బాలికపై అత్యాచారం కేసులోనూ ఆయన దోషిగా తేలారు.ఈ కేసులోనూ ఆయనకు జీవితఖైదు పడింది. రెండు కేసుల్లో ఆశారం ఒకేసారి శిక్ష అనుభవిస్తున్నారు.
ఇదీ చదవండి: 16 ఏళ్లకే ఇంటిని వదిలి..తాళాల బాబా సాధన ఇదే