
అభిప్రాయం
తీవ్రత లేని కేసుల్లో కూడా బెయిల్‌ని ట్రయల్ కోర్టు తిరస్కరించే ధోరణి పెరుగుతున్నందుకు సుప్రీంకోర్టు ఈమధ్య తీవ్ర ఆందోళన వ్యక్తపరిచింది. ప్రజాస్వామ్య రాజ్యం పోలీసు రాజ్యంగా మార కూడదని న్యాయమూర్తులు అభయ్ ఎస్. ఓకా, ఉజ్జల్ భూయాన్‌లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది. బెయిల్ దరఖాస్తులను ట్రయల్ కోర్టులు అనవసరంగా తిరస్కరించడం వల్ల సుప్రీంకోర్టు మీద అనవసర భారం పడుతోందని, ట్రయల్ కోర్టు స్థాయిలో పరిష్కరించాల్సిన కేసులకు సంబంధించిన బెయిల్ పిటీషన్లను సుప్రీంకోర్టు పరిష్కరించవలసి రావడం మీద జస్టిస్ ఓకా దిగ్భ్రాంతిని వ్యక్త పరిచారు.
దర్యాప్తు పూర్తి అయిపోయి చార్జిషీట్ దాఖలైన కేసుల్లో ముద్దాయి రెండు సంవత్సరాలకు పైగా నిర్బంధంలో ఉన్నప్పటికీ ట్రయల్ కోర్టు బెయిల్ మంజూరు చేయకపోవడాన్ని సుప్రీంకోర్టు ధర్మాసనం తప్పుపట్టింది. అది ఓ చీటింగ్ కేసు. ఆ కేసులో బెయిల్ కోసం సుప్రీంకోర్టు దాకా వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది. 20 సంవత్స రాల క్రితం ఇలాంటి కేసుల్లో బెయిల్ పిటిషన్లు హైకోర్టులకు కూడా చేరేవి కావనీ, కానీ ఇప్పుడు సుప్రీంకోర్టు కూడా అలాంటి పిటీషన్లతో నిండి పోతోందనీ అత్యున్నత న్యాయస్థాన ధర్మాసనం పేర్కొంది.
ప్రజాస్వామ్య దేశంలో దర్యాప్తు సంస్థలు అనవసరంగా అరెస్టు చేయడానికి వీల్లేదనీ, పోలీసు రాజ్యంగా మార్చకూడదనీ సుప్రీంకోర్టు ధర్మాసనం తీవ్ర పదజా
లంతో తన ఉత్తర్వులలో పేర్కొంది. కస్టడీ అవసరం లేని కేసుల్లో వ్యక్తులను అరెస్టు చేయకుండా సుప్రీంకోర్టు 2022లో జారీ చేసిన ఉత్తర్వులను కూడా ధర్మాసనం గుర్తు చేసింది. ప్రజల స్వేచ్ఛను కాపాడాల్సిన బాధ్యత కోర్టుల మీద ఉంది. అందుకని బెయిల్ మంజూరు చేసే విషయంలో కోర్టులు ఉదారంగా ఉండాలి.
‘బెయిల్ అనేది నియమం. జైలు అనేది దానికి మినహాయింపు’. ఈ ప్రాథమిక చట్టపరమైన సూత్రాన్ని కోర్టులు పదేపదే విస్మరిస్తున్నాయి. దీనికి ఉదాహరణగా సుప్రీంకోర్టు ముందుకు వచ్చిన ఈ కేసుని పేర్కొనవచ్చు. ఈ కేసులో ముద్దాయి మోసం కేసులో నిందితుడు. రెండు సంవత్సరాలకు పైబడి కస్టడీలో ఉన్నాడు. పోలీసులు తమ దర్యాప్తును పూర్తి చేశారు. చార్జిషీట్‌ను కూడా దాఖలు చేశారు. అయినప్పటికీ అతని బెయిల్ పిటీషన్‌ను ట్రయల్ కోర్టు – గుజరాత్ హైకోర్టులు తిరస్కరించాయి. చివరికి అతనికి బెయిల్‌ని సుప్రీంకోర్టు ఇవ్వాల్సి వచ్చింది.
బెయిల్ మంజూరు చేయడం గతంలో సరళంగా ఉండేది. ఇప్పుడు సంక్లిష్టంగా మారిపోయింది. జవాబు, రిజాయిండర్ (ప్రతి జవాబు); సర్రిజాయిండర్ లాంటి సంస్కృతి పెరిగిపోతోంది. ఎన్.డి. పి.ఎస్., మనీలాండ రింగ్ లాంటి చట్టాలు నిరూపణా భారాన్ని ముద్దాయిపైనే మోపుతున్నాయి. దీనివల్ల రెగ్యులర్ బెయిల్ దరఖాస్తులు వెనకబడి పోతున్నాయి.
క్రిమినల్ ప్రొసీజర్ కోడ్‌లోని సెక్షన్ 437(4) ప్రకారం, అదే విధంగా భారతీయ నాగరిక్ సురక్షా సంహితలోని సెక్షన్ 480(4) ప్రకారం... బెయిల్ మంజూరు చేసినప్పుడు తగు కారణాలను రాయాల్సి ఉంటుంది. బెయిల్ తిరస్కరించినప్పుడు ఎలాంటి కార ణాలూ రాయాలని చట్టం నిర్దేశించలేదు. ఇప్పుడు కొత్త చట్టాలు వచ్చాయి. ఈ చట్టాల ప్రకారం తగు కారణాలు మాత్రమే కాదు, ఎందుకు బెయిల్ మంజూరు చేయాల్సి వస్తుందో కూడా వివరంగా రాయాల్సి ఉంటుంది.
ఇది రాయడం కొంత కష్టమైన పని. తగు సమయం అవసర మవుతుంది. ఐ.పి.సి. కేసుల్లో అంత వివరమైన కారణాలు అవసరం లేదు. అయినా కోర్టులు బెయిళ్లను తిరస్కరించ డానికే ఎక్కువ మొగ్గు చూపుతున్నాయి. బెయిల్ అనేది నియమం– జైలు అనేది మినహాయింపు అనే సూత్రాన్నే కోర్టులు పాటించాలి. మనీ లాండరింగ్, ‘ఉపా’ లాంటి కేసుల్లో ఈ సూత్రాన్ని కొన్ని మార్పులతో వర్తింప చేయాల్సి ఉంటుంది.
గత సంవత్సరం ప్రతి సుప్రీంకోర్టు బెంచ్ ప్రతిరోజూ కనీసం 15 నుంచి 20 బెయిల్ దరఖాస్తులను విచారిస్తోందని సుప్రీంకోర్టు న్యాయమూర్తి గవాయ్ అన్నారు. సుప్రీంకోర్టు గత నాలుగైదు సంవత్సరాల నుంచి బెయిల్ దర ఖాస్తుల పరిష్కారానికే ఎక్కువ సమయాన్ని కేటాయించాల్సి వచ్చింది. దీనివల్ల రాజ్యాంగపరమైన వివాదాలను పరిష్కరించాల్సిన సమయాన్ని సుప్రీంకోర్టు ఈ కేసుల వివాదాలను పరిష్కరించడానికి వినియోగించాల్సి వస్తోంది.
చాలా బెయిల్ దరఖాస్తులను జిల్లా న్యాయ వ్యవస్థ పరిష్కరించవచ్చు. బెయిల్ అనేది ఒక నియమం అన్న విషయం జిల్లా న్యాయవ్యవస్థకు తెలియని విషయం కాదు. కానీ వారు రకరకాల కారణాల వల్ల బెయిల్స్‌ను మంజూరు చేయడానికి వెనకాడుతున్నారు. అందులో ముఖ్యమైనది – బెయిల్ మంజూరు చేస్తే మోటివ్స్‌ని న్యాయమూర్తులకు అంటగడుతారనీ, అదే విధంగా హైకోర్టు పాలనాపరమైన చర్యలు తీసుకుంటుందన్న భయం కూడా న్యాయమూర్తులను వెంటాడుతోంది.
హైకోర్టు, సుప్రీంకోర్టులు కూడా బెయిల్స్ విషయంలో రకరకాలైన అభిప్రాయాలు, ఉత్తర్వులను జారీ చేశాయి. అది కూడా మరో కారణం. అందుచేత ఈ మధ్యన బెయిల్ విషయంలో సుప్రీంకోర్టు తీర్పులు నిలకడగా ఉన్నాయి. ‘బెయిల్ అనేది నియమం. తిరస్కరించడమ నేది మినహాయింపు’ అనే సూత్రానికి అనుగుణంగానే సుప్రీంకోర్టులు తీర్పులు ఉన్నాయి. జిల్లా న్యాయ వ్యవస్థ ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని బెయిల్స్‌ను ఉదారంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. రాజకీయ ప్రేరేపిత కేసుల సంఖ్య పెరుగుతున్న కాలంలో సుప్రీంకోర్టు, హైకోర్టులపై పని భారం పెంచకుండా చూడాల్సిన బాధ్యత జిల్లా న్యాయ వ్యవస్థపై ఉంది.
డా‘‘ మంగారి రాజేందర్
వ్యాసకర్త తెలంగాణ స్టేట్ జ్యుడీషియల్ అకాడమీ మాజీ డైరెక్టర్, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ మాజీ సభ్యుడు