కవితకు దక్కని ఊరట | Supreme Court denies relief to K Kavitha in Delhi Excise Policy case and asks her to move trial court for bail | Sakshi
Sakshi News home page

కవితకు దక్కని ఊరట

Published Sat, Mar 23 2024 5:14 AM | Last Updated on Sat, Mar 23 2024 5:15 AM

Supreme Court denies relief to K Kavitha in Delhi Excise Policy case and asks her to move trial court for bail - Sakshi

బెయిల్‌ కోసం ట్రయల్‌కోర్టుకు వెళ్లాలన్న సుప్రీంకోర్టు 

బెయిల్‌ పిటిషన్‌ త్వరితంగా విచారించాలని సూచన 

రాజకీయనేత ప్రమేయం కాబట్టి చట్టబద్ధ పరిష్కారాలు దాటవేయలేమన్న ధర్మాసనం  

సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ మద్యం విధానం కుంభకోణం కేసులో ఈడీ కస్టడీలో ఉన్న బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సుప్రీంకోర్టులో ఊరట దక్కలేదు. తన అరెస్టు అక్రమమంటూ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన సుప్రీంకోర్టు బెయిల్‌ కోసం కింది కోర్టుకు వెళ్లాలని సూచించింది. కేసులో రాజకీయ నేత ప్రమేయం ఉన్న కారణంగా చట్టబద్ధమైన పరిష్కారాలు దాటవేయలేమని వ్యాఖ్యానించింది. పిటిషన్‌లో లేవనెత్తిన రాజ్యాంగ ఉల్లంఘనలకు సంబంధించిన అంశాలు మాత్రమే విచారిస్తామని స్పష్టం చేసింది. కవిత పిటిషన్‌ శుక్రవారం జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ ఎంఎం సుందరేశ్, జస్టిస్‌ బేలా ఎం. త్రివేదిలతో కూడిన ధర్మాసనం ముందుకొచ్చింది.

పిటిషనర్‌ తరఫు సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ వాదనలు ప్రారంభిస్తూ.. హైకోర్టుకు వెళ్లాలని సూచించొద్దని, అనుకూలమైనా, ప్రతికూలమైనా సుప్రీంకోర్టు నిర్ణయించాలని విజ్ఞప్తి చేశారు. దేశంలో ఏం జరుగుతోందో గమనించాలని, కవితకు వ్యతిరేకంగా ఒక్క ఆధారం కూడా లేదని, ఒక అప్రూవర్‌ ఇచ్చిన స్టేట్‌మెంట్‌ కారణంగా అరెస్టు చేశారని, ఇలా చేయడం కోర్టు ఉత్తర్వులకు వ్యతిరేకమని చెప్పారు. అయితే, బెయిల్‌ కోసం ట్రయల్‌ కోర్టుకు వెళ్లాలని జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా సూచించారు. దీంతో, హేమంత్‌ సోరెన్‌ కేసులో ట్రయల్‌ కోర్టులో ఏమైందో చూశామని, ఇది జరిగే పని కాదని సిబల్‌ పేర్కొన్నారు. రాజకీయ వ్యక్తి ప్రమేయం ఉన్నందున చట్టబద్ధమైన పరిష్కారాలు దాటవేయలేమని «బెంచ్‌ అభిప్రాయపడిందని జస్టిస్‌ సంజీవ్‌ఖన్నా తెలిపారు.

ఒకసారి సాక్షిగా, మరోసారి నిందితురాలిగా కవితకు సమన్లు జారీ చేశారని సిబల్‌ చెప్పగా, అయినప్పటికీ ఆర్టీకల్‌ 32 ప్రకారం బెయిల్‌ ఇవ్వలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. రాజ్యాంగ ఉల్లంఘనకు సంబంధించిన అంశాలు లేవనెత్తిన కారణంగా ఇప్పటికే విచారణలో ఉన్న విజయ్‌ మదన్‌లాల్‌ కేసుకు జత చేస్తామని పేర్కొంది. దీనిపై ఈడీకి నోటీసులు జారీ చేస్తూ ఆరు వారాల్లో సమాధానం చెప్పాలని ఆదేశించింది. ఆ తర్వాత రెండు వారాల్లో రిజాయిండర్‌ దాఖలు చేయాలని పేర్కొంది. ‘నోటీసులు జారీ చేస్తున్నాం. ట్రయల్‌ కోర్టు లేదా ఇతర మార్గాల ద్వారా పరిష్కారానికి పిటిషనర్‌కు స్వేచ్ఛ కల్పింస్తున్నాం.

బెయిల్‌ అప్లికేషన్‌ను ట్రయల్‌ కోర్టు త్వరితంగా పరిష్కరించాలి’అని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది. విచారణ సందర్భంగా సిబల్‌ వ్యాఖ్యల్ని గమనించిన జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా భావోద్వేగాలకు గురికావొద్దని సూచించారు. కోర్టు ఆదేశాల అనంతరం ఇది స్వర్ణయుగం కాదన్న సిబల్‌ వ్యాఖ్యలకు జస్టిస్‌ ఖన్నా స్పందిస్తూ.. వేచి చూద్దామని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు విజయ్‌ మదన్‌లాల్‌ కేసు విచారణను జూలైలో చేపట్టనుంది. ఈ నేపథ్యలో ఇదే కేసుకు కవిత పిటిషన్‌ జత చేయడంతో తదుపరి విచారణ జూలైలోనే జరగనుంది.  

నేటితో ముగియనున్న కస్టడీ 
కవితకు రౌజ్‌ అవెన్యూ కోర్టు ఇచ్చిన ఈడీ కస్టడీ ఆదేశాలు శనివారంతో ముగియనున్నా యి. ఈ నేపథ్యంలో శనివారం మధ్యాహ్నం 2 గంటలకు కవితను కోర్టులో ప్రవేశపెట్టనున్నా రు. కాగా, ఈడీ కస్టడీలో ఉన్న కవితతో శుక్రవారం సాయంత్రం ఆమె కుమారుడు ఆర్య, మరదలు అఖిల, స్నేహితురాలు వినూత ములాఖత్‌ అయ్యారు. మరోవైపు, ఈడీ      అధికారులు ఆరో రోజూ కవితను సుదీర్ఘంగా విచారించారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement