కవిత బెయిల్ పిటిషన్‌పై నేడు సుప్రీంలో విచారణ
న్యాయవాదులతో కేటీఆర్, హరీశ్ భేటీ
దాదాపు రెండు గంటల పాటు చర్చలు
సాక్షి, న్యూఢిల్లీ: బీఆర్‌ఎస్ నాయకురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్ విషయంలో సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలను ఎదుర్కొంటూ దాదాపు 150 రోజులకు పైగా తీహార్ జైలులో ఉన్న ఆమె బెయి లు పిటిషన్‌పై మంగళవారం సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. కవిత బెయిల్ విషయంలో కౌంటర్లు దాఖలు చేసేందుకు ఆలస్యమెందుకంటూ ఈనెల 12న సుప్రీంకోర్టు ఈడీని ప్రశ్నించింది. దీనితో కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కావాలని కోర్టును ఈడీ అడగ్గా.. విచారణను ఈనెల 27కి వాయిదా వేసింది.
మంగళవారం కవిత బెయిల్ పిటిషన్‌పై వాదనలు జరగనున్న నేప థ్యంలో.. కేటీఆర్, హరీశ్ తదితరులు సోమవారం ఢిల్లీ లో న్యాయవాదులతో భేటీ అయ్యా రు. 2 గంటల పాటు సుప్రీం కోర్టులో వాదించబోయే అంశాలపై చర్చించారు. కాగా, కోర్టు నిర్ణయం అనంతరం సాయంత్రం ఎమ్మెల్యేల అనర్హత అంశంపై మరోమారు న్యాయబృందంతో చర్చించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. బెయిల్‌పై ఆశాభావంతో..: కవిత 154 రోజుల నుంచి తీహార్ జైలులోనే ఉన్నారు.
మంగళవారం సుప్రీంకోర్టులో ఆమె బెయిల్ పిటిషన్‌పై వాదనల నేపథ్యంలో ఢిల్లీకి చేరుకున్న కేటీఆర్, హరీశ్‌లు న్యాయవాది మోహిత్‌రావు బృందంతో సుదీర్ఘమైన చర్చలు జరిపారు. ‘బెయిల్ వస్తే ఓకే.. ఒకవేళ బెయిల్ రాని పక్షంలో తదుపరి కార్యాచరణ ఏమిటి? న్యాయ పోరాటం ఎలా చేయాలి’అనే అంశాలపై చర్చించారు. బెయిల్‌పై కౌంటర్ దాఖలు విషయంలో ఆలస్యం ఎందుకు చేస్తున్నారంటూ ఈడీని సుప్రీంకోర్టు ప్రశ్నించిన నేపథ్యంలో ఈ సారి కవితకు బెయిల్ వస్తుందని ఆమె కుటుంబ సభ్యులు, బీఆర్‌ఎస్ నేతలు ఆశాభావంతో ఉన్నారు.
మహిళగా కవితకు మినహాయింపు ఇవ్వండి
పీఎంఎల్‌ఏ సెక్షన్–45లోని కఠిన నిబంధనల నుంచి మహిళగా ఎమ్మెల్సీ కవితకు మినహాయింపు ఇవ్వాలని ఆమె తరఫు న్యాయవాది ముకుల్ రోహత్గీ్గ సుప్రీంకోర్టును కోరారు. ఇప్పటికే కవిత హైబీపీతో బాధ పడుతున్నారు. పదికేజీలకు పైగా బరువు తగ్గారు. మరోపక్క జ్వరంతో బాధపడుతూనే ఉన్నారు. వీటన్నింటికంటే ఆమె దీర్ఘకాలికంగా ఉన్న గైనిక్ సమస్యల వల్ల మరింత ఇబ్బంది పడుతున్నారన్న విషయాన్ని న్యాయబృందం సుప్రీంకోర్టుకు నివేదించనుంది.
పీఎంఎల్‌ఏ సెక్షన్–45లోని కఠిన నిబంధనల నుంచి కవితకు మినహాయింపు ఇచ్చి బెయిల్ మంజూరు చేయాలని సర్వోన్నత న్యాయస్థానానికి విన్నవించేందుకు ఆమె తరఫు న్యాయవాదులు సిద్ధమయ్యారు. ఇదిలా ఉండగా కవితకు ఉన్న అనారోగ్య సమస్యలపై ఢిల్లీ ఎయిమ్స్ ఇచ్చిన రిపోర్టులను ఈడీ అధికారులు న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టనున్నారు. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని న్యాయస్థానం బెయిలు మంజూరు చేస్తుందా లేక వాయిదా వేస్తుందా అన్న అంశంపై బీఆర్‌ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment