కేసీఆర్‌ బిడ్డను.. తప్పు చేయను: కవిత | BRS Leader Kavitha released on bail | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌ బిడ్డను.. తప్పు చేయను: కవిత

Published Wed, Aug 28 2024 4:03 AM | Last Updated on Wed, Aug 28 2024 6:49 AM

అన్నను హత్తుకుని.. కంటతడి పెడుతూ..  చిత్రంలో హరీశ్‌ రావు, కవిత కుమారుడు

బెయిల్‌పై విడుదలైన కవిత

ఎమ్మెల్సీ కవిత భావోద్వేగం

ఐదున్నర నెలలు నన్ను అక్రమంగా జైలులో పెట్టారు 

అలా చేసిన వారికి వడ్డీతో సహా సమాధానం చెబుతా.. 

అసలే మొండిదానిని.. నన్ను జగమొండిని చేశారని వ్యాఖ్య

మంగళవారం రాత్రి 9.11 గంటలు.. తిహార్‌ జైలు ప్రాంగణం.. అంతటా ఉద్వేగపూరిత వాతావరణం.. సుమారు ఐదున్నర నెలల తర్వాత  ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బెయిల్‌పై విడుదలై.. జైలు నుంచి బయటకు వచ్చారు. ఎన్నడూ ఇంతకాలం పిల్లలను, కుటుంబాన్ని వదిలి ఉండలేదంటూ.. కుమారుడిని, భర్తను, అన్న కేటీఆర్‌ను హత్తుకుని కన్నీటి పర్యంతమయ్యారు. ‘నేను కేసీఆర్‌ బిడ్డను. తప్పు చేసే ప్రసక్తే లేదు. ఐదున్నర నెలలు అక్రమంగా జైలులో పెట్టారు. వారికి వడ్డీతో సహా చెల్లిస్తా’నంటూ భావోద్వేగానికి లోనయ్యారు. కన్నీటితోనే పిడికిలి బిగించి ‘జై తెలంగాణ’ అంటూ నినదించారు..

కవితకు బెయిల్‌పై సుప్రీంకోర్టులో సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. ఈడీ, సీబీఐల దర్యాప్తు పూర్తయి, చార్జిïÙట్లు దాఖలైనా ఆమెకు బెయిల్‌ ఇవ్వడానికి ఢిల్లీ హైకోర్టు నిరాకరించడాన్ని తప్పుపడుతూ.. సుప్రీంకోర్టు కవితకు బెయిల్‌ మంజూరు చేసింది. అప్పటి నుంచి మాజీ సీఎం కేసీఆర్‌ పది నిమిషాలకోసారి కేటీఆర్, హరీశ్‌రావులకు ఫోన్‌ చేస్తూ.. ఆమె బయటికి ఎంతసేపట్లో వస్తుంది, వెంట ఎవరెవరు ఉన్నారంటూ ఆరా తీస్తూనే ఉన్నారు. 

జైలు బయట భర్తతో కలసి అభివాదం చేస్తున్న కవిత 

బీఆర్‌ఎస్‌ నేతలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తిహార్‌ జైలు వద్దకు చేరుకుని.. ‘డాటర్‌ ఆఫ్‌ ఫైటర్‌.. కవితమ్మా.. మేమంతా నీకు అండగా ఉన్నాం’ అంటూ ప్లకార్డులతో స్వాగతం పలికారు.  జైలు నుంచి విడుదలైన తర్వాత కవిత ఢిల్లీ వసంత్‌ విహార్‌లోని బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయానికి వెళ్లి పార్టీ నేతలతో భేటీ అయ్యారు. నేడు (బుధవారం) మధ్యాహ్నం 2.45 గంటలకు కవిత ఢిల్లీ నుంచి హైదరాబాద్‌కు బయలుదేరనున్నారు. ఆమెకు శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి 500 కార్లతో భారీ ర్యాలీగా స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు బీఆర్‌ఎస్‌ నేతలు తెలిపారు.   

సాక్షి, న్యూఢిల్లీ: ‘‘నేను 18 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నా.. ఎన్నో ఎత్తు పల్లాలు చూశా. ఇన్ని రోజులు ఒక తల్లిగా పిల్లలకు ఏనాడూ దూరంగా ఉండలేదు. నన్ను ఈ పరిస్థితికి తెచ్చిన వారికి కచ్చితంగా వడ్డీతో సహా సమాధానం చెబుతాను’’ అంటూ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర భావోద్వేగంతో అన్నారు. ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆరోపణలను ఎదుర్కొంటూ 166 రోజులపాటు ఢిల్లీ తీహార్‌ జైలులో జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్న కవితకు సుప్రీంకోర్టు మంగళవారం బెయిల్‌ మంజూరుచేసింది. 

రాత్రి సరిగ్గా 9.11 గంటలకు తీహార్‌ జైలు నుంచి పిడికిలి బిగించి, జై తెలంగాణ అంటూ బయటకు వచ్చిన కవితకు బీఆర్‌ఎస్‌ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి. గేటు బయటకు రాగానే పెద్ద కుమారుడు ఆదిత్యను చూసిన కవిత భావోద్వేగానికి గురై ఆలింగనం చేసుకున్నారు. పక్కనే ఉన్న సోదరుడు కేటీఆర్‌ను ఆత్మీయ ఆలింగనం చేసుకోగా, కేటీఆర్‌ కవిత నుదిటిపై ముద్దుపెట్టారు. 

భర్త అనిల్, హరీశ్‌రావులతో ఆలింగనం అనంతరం అక్కడున్న బీఆర్‌ఎస్‌ నేతలు సునీత లక్ష్మారెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, ప్రశాంత్‌రెడ్డి, మాలోతు కవిత తదితరులను ఆప్యాయంగా పలకరించారు. కవిత విడుదల అవుతున్నారని తెలుసుకున్న ఢిల్లీలోని తెలంగాణ ప్రజలు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. ‘డాటర్‌ ఆఫ్‌ ఫైటర్, కవిత కడిగిన ముత్యం, కవితమ్మా.. మేమంతా నీకు అండగా ఉన్నాం’ అనే ప్లకార్డులతో స్వాగతం పలికారు.  



నన్ను జగమొండిని చేశారు 
కవిత జైలు బయట ఉన్న మీడియా, కార్యకర్తలనుద్దేశించి రెండు నిమిషాలు ప్రసంగించారు. ‘ఐదున్నర నెలల తర్వాత కుటుంబ సభ్యులను, కార్యకర్తల్ని, మీడియాను కలవడం ఎంతో సంతోషంగా ఉంది. ఒక తల్లిగా పిల్లల్ని వదిలేసి ఐదున్నర నెలలు ఏనాడూ ఉండలేదు. ఇది చాలా ఇబ్బందికరమైన విషయం. నన్ను, నా కుటుంబాన్ని ఇబ్బందులకు గురి చేసిన వారికి తప్పకుండా వడ్డీతో సహా చెల్లిస్తాం, సరైన సమయానికి సరైన సమాధానం చెబుతాను. కష్టకాలంలో తోడుగా నిలిచిన ప్రతి ఒక్క కార్యకర్తకూ నా కృతజ్ఞతలు. 

ఎవరి గురించి చెప్పాల్సిన అవసరం లేదు. నేను కేసీఆర్‌ బిడ్డను. తెలంగాణ బిడ్డను. కమిట్‌మెంట్‌తో పనిచేస్తాను, న్యాయపరంగా ఎదుర్కొంటాను, రాజకీయంగా కొట్లాడతాను. నేను మాములుగా కాస్త మొండిదానిని, మంచిదానిని, నన్ను అనవసరంగా జైలుకు పంపి ఇప్పుడు జగమొండిని చేశారు’ అంటూ వ్యాఖ్యానించారు. తనను అక్రమంగా జైలుకు పంపారని, బీఆర్‌ఎస్, కేసీఆర్‌ను విచ్ఛిన్నం చేయడానికే ఇలా చేశారని మండిపడ్డారు.  

నేడు 500 కార్లతో భారీ ర్యాలీ 
కవిత బుధవారం మధ్యాహ్నం 2.45 గంటలకు ఢిల్లీ నుంచి హైదరాబాద్‌ వెళ్లనున్నారు. జైలు నుంచి విడుదలై రాష్ట్రానికి వస్తున్న కవితకు బీఆర్‌ఎస్‌ నేతలు ఘన స్వాగతం పలకనున్నారు. శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి సుమారు 500 కార్లతో భారీ ర్యాలీ ఏర్పాటు చేస్తున్నట్లు బీఆర్‌ఎస్‌ వర్గాలు వెల్లడించాయి.  

ఆటోలో కేటీఆర్‌: కవితకు సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేసిన వెంటనే బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్‌రావులు కోర్టు బయటకు వచ్చారు. అప్పటికే అక్కడ భారీ సంఖ్యలో మీడియా ప్రతినిధులు వేచి ఉన్నారు. తమతో మాట్లాడాలని మీడియా ప్రతినిధులు వెంటపడుతున్న సమయంలో.. అందరికీ అభివాదం చేస్తూ బయటకు వచ్చారు. ఆ సమయంలో కారు అందుబాటులో లేకపోవడంతో ఓ ఆటో మాట్లాడుకుని దీన్‌దయాల్‌ మార్గంలోని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఇంటికి చేరుకున్నారు.  

పది నిమిషాలకోసారి కేసీఆర్‌ ఫోన్‌ 
బెయిల్‌ మంజూరు అని తెలిసినప్పటి నుంచి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రతి పది నిమిషాలకోసారి కేటీఆర్, హరీశ్, కవిత భర్త అనిల్‌లకు ఫోన్‌ చేస్తూనే ఉన్నారు. ఎప్పటిలోగా బయటకు తెస్తారు, కవితమ్మ వెంట ఎవరెవరు ఉంటారు, జైలు వద్దకు ఎప్పుడు వెళతారంటూ కేసీఆర్‌ ఆరా తీస్తూనే ఉన్నారు. 
 
అక్రమంగా జైలులో పెట్టారు 
కవిత జైలు నుంచి నేరుగా వసంత్‌విహార్‌లోని బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయానికి వెళ్లారు. కవిత వెంట కారులో కేటీఆర్, కుమారుడు ఆదిత్య, భర్త అనిల్, పార్టీ నేతలు సునీత లక్ష్మారెడ్డి, మాలోతు కవిత ఉన్నారు. పార్టీ కార్యాలయానికి చేరుకున్న పది నిమిషాలకే పార్టీ నేతలతో కవిత సమావేశమయ్యారు. ఢిల్లీ లిక్కర్‌ కేసు బోగస్‌ అని, కేసీఆర్‌ను రాజకీయంగా ఎదుర్కోలేక తనను టార్గెట్‌ చేసుకుని జైలుకు పంపారంటూ ఆమె నేతలతో చర్చించారు.

నోటీసులు, అరెస్టు నుంచి విడుదల దాకా..
08–03–2023న ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) కవితకు సమన్లు జారీ చేసింది 
⇒ 11–03–2023న ఢిల్లీలో ఈడీ విచారణకు కవిత హాజరు ⇒ 15–03–2023న ఈడీ సమన్లపై సుప్రీంకోర్టును ఆశ్రయించిన కవిత 
⇒ 21–03–2023న తన ఫోన్లను ఈడీకి సమర్పించిన కవిత ⇒ 14–09–2023న కవితకు మళ్లీ నోటీసులు జారీ చేసిన ఈడీ 
⇒ 15–09–2023న సమన్ల జారీని పదిరోజులు వాయిదా వేసిన సుప్రీంకోర్టు 
⇒ 15–03–2024న లిక్కర్‌ స్కామ్‌లో కవితను అరెస్టు చేసిన ఈడీ 
⇒ 16–03–2024న ఢిల్లీలోని కోర్టులో హాజరు, రిమాండ్‌ 
⇒ 05–04–2024న కవి తను విచారించేందుకు సీబీఐ పిటిషన్‌ 
⇒ 08–04–2024న కవిత మధ్యంతర బెయిల్‌ పిటిషన్‌ను కొట్టివేసిన ట్రయల్‌ కోర్టు 
⇒ 11–04–2024న తీహార్‌ జైల్లో కవితను అరెస్టు చేసిన సీబీఐ 
⇒ 12–04–2024న సీబీఐ కోర్టును ఆశ్రయించిన కవిత.. ఆ పిటిషన్‌పై తీర్పు రిజర్వు 
⇒ 15–04–2024న కవితకు 9 రోజులు జ్యుడీషియల్‌ కస్టడీ 
⇒ 16–04–2024న బెయిల్‌ పిటిషన్‌పై విచారణ వాయిదా 
⇒ 23–04–2024న మే 7 వరకు జ్యుడీషియల్‌ కస్టడీ పొడిగింపు 
⇒ 14–05–2024న జ్యుడీషియల్‌ కస్టడీ మే 20 వరకు పొడిగింపు 
⇒ 03–06–2024న జూలై 3 వరకు రిమాండ్‌ కొనసాగింపునకు ఆదేశం 
⇒ 01–07–2024న కవిత బెయిల్‌ పిటిషన్‌ను కొట్టివేసిన ఢిల్లీ హైకోర్టు 
⇒ 03–07–2024న జ్యుడీషియల్‌ కస్టడీ జూలై 25 వరకు పొడిగింపు 
⇒ 22–07–2024న బెయిల్‌ పిటిషన్‌పై ట్రయల్‌ కోర్టు విచారణ వాయిదా 
⇒ 05–08–2024న బెయిల్‌ పిటిషన్‌పై ట్రయల్‌ కోర్టు విచారణ మళ్లీ వాయిదా 
⇒ 07–08–2024న సుప్రీంకోర్టును ఆశ్రయించిన కవిత 
⇒ 12–08–2024న బెయిల్‌ పిటిషన్‌పై సుప్రీంలో విచారణ వాయిదా 
⇒ 20–08–2024న బెయిల్‌ పిటిషన్‌ వి చారణ మళ్లీ వాయిదా 
⇒ 22–08–2024న కవితకు అస్వస్థత.. తీహార్‌ జైలు నుంచి ఆస్పత్రికి తరలింపు 
⇒ 27–08–2024న కవితకు బెయిల్‌ మంజూరు చేసిన సుప్రీంకోర్టు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement