అంతకుముందు విమానాశ్రయంవద్ద పార్టీ శ్రేణుల ఘనస్వాగతం
కేటీఆర్, భర్త, కుమారుడితో కలిసి హైదరాబాద్‌కు..
భారీ ర్యాలీతో బంజారాహిల్స్ నివాసానికి పయనం
హారతి పట్టిన తల్లి శోభమ్మ, వదిన శైలిమ
నేడు ఎర్రవల్లి నివాసంలో కేసీఆర్‌తో కవిత భేటీ
సాక్షి, హైదరాబాద్/ సాక్షి, న్యూఢిల్లీ/శంషాబాద్: ఢిల్లీ మద్యం పాలసీ కేసులో బెయిల్‌పై జైలు నుంచి విడుదలైన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బుధవారం హైదరాబాద్‌కు చేరుకున్నారు. మధ్యాహ్నం ఢిల్లీలో సోదరుడు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, భర్త అనిల్, కుమారుడితో పాటు పార్టీ కీలక నేతలతో కలిసి విమానంలో హైదరాబాద్‌కు బయలుదేరిన కవిత.. సాయంత్రం 5.30కు శంషాబాద్ విమానాశ్రయంలో దిగారు. ఎయిర్ పోర్టు వద్ద కవితకు బీఆర్‌ఎస్ శ్రేణులు భారీ స్వాగతం పలికాయి. సీఎం.. సీఎం అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు. అనంతరం విమానాశ్రయం నుంచి భారీ ర్యాలీగా బయలుదేరిన కవిత సాయంత్రం ఏడు గంటలకు బంజారాహిల్స్‌లోని తన నివాసానికి చేరుకున్నారు.
అమ్మకు పాదాభివందనం.. సోదరుడికి రాఖీ..
కవిత రాకకు మునుపే ఆమె నివాసానికి కేసీఆర్ సతీమణి శోభమ్మ, కేటీఆర్ సతీమణి శైలిమ ఇతర కుటుంబ సభ్యులు చేరుకున్నారు. కవితను కలిసేందుకు నేతలు, కార్యకర్తలు భారీ ఎత్తున తరలిరావడంతో సందడి నెలకొంది. డప్పు వాయిద్యాలు, గిరిజన నృత్యాల నడుమ ఇంటికి చేరుకున్న కవితకు శోభమ్మ, శైలిమతో పాటు ఇతర కుటుంబ సభ్యులు గుమ్మడి కాయతో దిష్టితీసి హారతి పట్టారు. తల్లి, వదినను కవిత ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు. శోభమ్మకు పాదాభివందనం చేశారు.
కేటీఆర్ సోదరి కవిత చేయిపట్టుకుని కార్యకర్తల నినాదాల నడుమ ఇంట్లోకి తోడ్కొని వెళ్లారు. సోదరుడు కేటీఆర్‌కు కవిత రాఖీ కట్టి మిఠాయి తినిపించారు. పార్టీ అధినేత, తన తండ్రి కేసీఆర్‌ను కలిసేందుకు కవిత గురువారం ఎర్రవల్లి నివాసానికి వెళ్లనున్నారు. సుమారు ఐదున్నర నెలల తర్వాత కేసీఆర్‌తో కవిత భేటీ కానుండటం ఆసక్తికరంగా మారింది. కాగా ఆమె రెండు రోజుల పాటు ఎర్రవల్లి నివాసంలో తన తల్లిదండ్రులతోనే ఉండనున్నారు. మరోవైపు గురువారం ఎర్రవల్లి నివాసంలో కేసీఆర్‌తో పార్టీ ముఖ్య నేతలు భేటీ కానున్నారు. ఈ సమావేశానికి హాజరయ్యే నేతలకు విందు ఏర్పాటు చేసినట్లు సమాచారం.
ప్రజాక్షేత్రంలో బలంగా పనిచేస్తా: కవిత
ప్రజాక్షేత్రంలో ఇంకా బలంగా పనిచేస్తానని ఎమ్మెల్సీ కవిత స్పష్టం చేశారు. తాను ఏ విషయంలోనూ, ఎలాంటి తప్పు చేయలేదని, అన్ని అపవాదుల నుంచి కడిగిన ముత్యంలా బయటకు వస్తానని ధీమా వ్యక్తం చేశారు. బుధవారం రాత్రి బంజారాహిల్స్‌లోని తన నివాసంలో ఆమె మీడియాతో మాట్లాడారు. న్యాయం, ధర్మం ఖచ్చితంగా గెలిచి తీరుతుందని, నిజం నిలకడ మీద ప్రజలకు తెలుస్తుందని అన్నారు. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాసమస్యలపై జరిగే పోరాటంలో పాల్గొంటానని చెప్పారు. తాను కేసీఆర్ బిడ్డనని వెనుకంజ వేసే ప్రసక్తే లేదన్నారు. తనకు వెన్నుదన్నుగా నిలిచిన వారికి కృతజ్ఞతలు తెలుపుతూ తనపై కుట్ర చేసిన వారికి వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తానని అన్నారు.
నా చెల్లెలు ఫైటర్
అంతకుముందు బుధవారం ఉదయం కవిత హస్తినలో బిజీబిజీగా గడిపారు. ఆమె విడుదల విషయాన్ని తెలుసుకున్న పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద ఎత్తున మంగళవారం రాత్రి ఢిల్లీకి చేరుకున్నారు. బుధవారం ఉదయం జిల్లాల నుంచి వచ్చిన నేతలు, కార్యకర్తలతో ఆమె కొద్దిసేపు ముచ్చటించారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఐదున్నర నెలల్లో చోటు చేసుకున్న రాజకీయ పరిణామాలపై ఆరా తీశారు.
కేటీఆర్, కవితలతో రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర భేటీ అయ్యారు. కవిత జైలు నుంచి విడుదల కావడంతో తనకెంతో ఆనందంగా ఉందని ఆయన చెప్పారు. ఇటీవలి పార్లమెంటు సమావేశాలకు సంబంధించిన విశేషాలను వివరించారు. హైదరాబాద్ బయలుదేరే ముందు సోదరుడు కేటీఆర్‌తో కవిత కొద్దిసేపు ముచ్చటించారు. మరోసారి కవితను ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్న కేటీఆర్ భావోద్వేగానికి గురయ్యారు. ‘నా చెల్లెలు ఫైటర్ .. పట్టు వదలని విక్రమార్కురాలు..’ అంటూ ఆశీర్వదించారు.
Comments
Please login to add a commentAdd a comment