న్యాయ వ్యవస్థపై నాకు అపార గౌరవం ఉంది
సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కాంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ రావడంపై తాను చేసినట్టుగా చెబుతున్న వ్యాఖ్యలకు సంబంధించి పత్రికల్లో వచి్చన కథనాలపై బేషరతుగా విచారం వ్యక్తం చేస్తున్నానని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలపై సుప్రీంకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన నేపథ్యంలో ఆయన స్పందించారు. తనకు న్యాయ వ్యవస్థపై అపార గౌరవం ఉందని, కోర్టు భావనను అర్థం చేసుకోగలనని పేర్కొన్నారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఎక్స్‌లో పోస్టు చేశారు. ‘భారత న్యాయ వ్యవస్థపై నాకు పూర్తి విశ్వాసం ఉంది.
ఆగస్టు 29, 2024న పలు పత్రికల్లో నా పేరిట వచి్చన వార్తల ఆధారంగా గౌరవ న్యాయస్థానం విచక్షణను నేను ప్రశ్నించినట్టుగా కోర్టు భావించడాన్ని అర్థం చేసుకోగలను. న్యాయ ప్రక్రియ పట్ల నాకు పూర్తిస్థాయిలో నమ్మకం ఉందని మరోమారు తెలియజేస్తున్నాను. పత్రికల్లో ఆ వ్యాఖ్యలను అసందర్భంగా నాకు ఆపాదించారు. న్యాయవ్యవస్థ, ఆ వ్యవస్థకున్న స్వతంత్రతపై నాకు అపార గౌరవం ఉంది. రాజ్యాంగాన్ని సంపూర్ణంగా విశ్వసించే నేను న్యాయ వ్యవస్థ ఎప్పుడూ ఉన్నతంగా ఉండాలని కోరుకుంటాను..’ అని సీఎం పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment