
జైలు నుంచి జయలలిత విడుదల
బెంగళూరు : తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధ్యక్షురాలు జయలలిత శనివారం మధ్యాహ్నం జైలు నుంచి విడుదలయ్యారు. సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో ఆమె విడుదలకు మార్గం సుగమం అయ్యింది. బెంగళూరులోని పరప్పణ అగ్రహార జైలు అధికారులు ... జయలలితను విడుదల చేశారు. అంతకు ముందు జయ తరపు న్యాయవాది రూ.2 కోట్ల ష్యూరిటీ సమర్పించారు.
కాగా సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసినా.. శుక్రవారం రాత్రి జయలలిత జైల్లోనే ఉన్నారు. విడుదల కోసం లాంఛనాలు పూర్తి కాకపోవడంతో ఆమె శనివారం మధ్యాహ్నం వరకు విడుదల కాలేకపోయారు. 22 రోజుల తర్వాత జయలలిత బయట వాతావరణాన్ని చూశారు. అమ్మ విడుదలతో అన్నాడీఎంకే కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తూ నినాదాలు చేశారు. భారీ స్థాయిలో జైలు బయట నినాదాలు చేశారు. అత్యంత పటిష్ఠమైన భద్రత మధ్య జైలు నుంచి జయలలిత తన కాన్వాయ్ లో బయల్దేరారు.