జయహో
- పరప్పన అగ్రహార జైలు వద్ద జయలలిత అభిమానుల సందడి
- భద్రత నడుమ అంబరాన్నంటిన సంబరాలు
- జైలు వద్ద నిషేధాజ్ఞలు
- వర్షాన్ని సైతం లెక్కచేయకుండా వేచిచూసిన అనుచరులు
- తమిళనాడు సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేల పడిగాపులు
సాక్షి,బెంగళూరు : తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, అన్నా డీఎంకే అధినేత్రి జయలలిత శనివారం పరప్పన అగ్రహార జైలు నుంచి బెయిల్‌పై బయటకు రావడంతో ఆమె అభిమానులు, అన్నాడీఎంకే కార్యకర్తల సంబరాలు అంబరాన్నంటాయి. అభిమానుల కేరింతలు, అరుపులతో పరప్పన అగ్రహార కేంద్ర కారాగారం పరిసరాలు మార్మోగాయి. అక్రమ అస్తుల కేసుకు సంబంధించి సుప్రీం కోర్టు జయలలితకు శుక్రవారం మధ్యంతర బెయిల్‌ను మంజూరు చేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఆమె శనివారం మధ్యాహ్నం 3:20 గంటలకు పరప్పన అగ్రహార కేంద్ర కారాగారం నుంచి బయటకు వచ్చారు. 21 రోజుల తర్వాత తమ అభిమాన నాయకురాలిని ప్రత్యక్షంగా చూస్తున్నామన్న ఆనందంలో కార్యకర్తలతోపాటు అభిమానులు పార్టీ జెండాలు చేతపట్టి ‘పురిచ్చితలైవి...పురిచ్చితలైవి’ (ధీర వనిత) అంటూ నినాదాలు చేశారు. తమ అభిమాన నాయకురాలని చూడటానికి తెల్లవారుజాము నుంచే కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి జయలలిత అభిమానులు ఒక్కొక్కరుగా పరప్పన అగ్రహార జైలు వద్దకు చేరుకోవడం మొదలు పెట్టారు.
ఇక ఉదయం 11 గంటలకు తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం, పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలతో సహా వేలాది మంది కార్యకర్తలు జైలు వద్ద పోగయ్యారు. పరప్పన అగ్రహార జైలు వద్ద వర్షం కురుస్తున్నప్పటికీ వర్షాన్ని కూడా లెక్కచేయకుండా ‘అమ్మ’ను చూసేందుకు ఆమె అభిమానులు వేచి చూశారు. ఈ విషయాన్ని ముందుగానే అంచనా వేసిన పోలీసుశాఖ కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టింది. ఇదిలా ఉండగా అన్నాడీఎంకే పార్టీ కర్ణాటకశాఖ కార్యదర్శి పుహలేంది వివిధ ప్రాంతాల్లో మిఠాయిలు పంచుతూ సంబరాలు చేశారు. అదేవిధంగా నగరంలో తమిళులు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో శనివారం పండుగ వాతావరణం నెలకొంది.
1,500 మందితో భద్రత...
జయలలిత పరప్పన అగ్రహార జైలు నుంచి విడుదలవుతున్న నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండటానికి రాష్ట్ర పోలీసు యంత్రాంగం పటిష్ట భద్రతా చర్యలను చేపట్టింది. పరప్పన అగ్రహార జైలు చుట్టూ కిలోమీటరు పరిధిలో నిషేదాజ్ఞలు జారీ చేసింది. ఒక్క పరప్పన అగ్రహార కారాగారం వద్దే 500 మంది పోలీసు సిబ్బందిని మోహరించారు. నగర పోలీస్ కమిషనర్ ఎంఎన్ రెడ్డి స్వయంగా భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు.
పరప్పన అగ్రహార జైలు నుంచి హెచ్‌ఏఎల్ ఎయిర్‌పోర్టుకు వరకూ జయలలిత వెళ్లే దారిలోని హొసారోడ్డు జంక్షన్, బొమ్మనహళ్లి రోడ్, సిల్క్‌బోర్డ్, కోరమంగళ 80 ఫీట్ రోడ్, దొమ్మలూర్ ఫ్లైఓవర్‌ల వద్ద దాదాపు 1,200 మంది పోలీసు సిబ్బంది మోహరించారు. అదేవిధంగా హెచ్‌ఏఎల్ ఎయిర్‌పోర్టు వద్దకూడా అభిమానులు ఎక్కువగా ఉండటంతో పోలీసుశాఖ భద్రతను రెట్టింపు చేసింది. మొత్తంగా ఎటువంటి అవాంతరాలు లేకుండా జయలలిత కర్ణాటకను వీడటంతో రాష్ట్ర పోలీసు యంత్రాంగంతో పాటు ప్రభుత్వం కూడా ఊపిరి పీల్చుకుంది.
మీడియాలో మార్మోగిన వెంకటేష్
వెంకటేష్... ప్రత్యేక కోర్టు పోస్టల్ విభాగంలో ఒక సాధారణ ఉద్యోగి. అయితే ఇతని పేరు కర్ణాటక మీడియాలోనే కాక జాతీయ మీడియాలో శనివారం మార్మోగింది. సాధారణంగా బెయిల్ కాపీలను కోర్టులోని పోస్టల్ విభాగం ఉద్యోగులు జైలు అధికారులకు చేరుస్తుంటారు. అదేవిధంగా ప్రత్యేక న్యాయస్థానం న్యాయమూర్తి మైకెల్ డీ కున్హా జయలలిత విడుదలకు సంబంధించి జారీ చేసిన ఆదేశ పత్రాలను జైలుకు శనివారం వెంకటేష్ తీసుకువెళ్లాల్సి ఉంది. ముఖ్యమైన వ్యక్తికి సంబంధించిన విషయం కావడంతో వెంకటేష్‌ను పోలీసులు కట్టుదిట్టమైన భద్రత నడుమ పరప్పన అగ్రహార జైలుకు తీసుకు వెళ్లారు. ఈ నేపథ్యంలో జడ్జి ఆదేశాలు జారీ చేసినప్పటి నుంచి వెంకటేష్ జైలుకు వెళ్లి కారాగార సూపరింటెండెంట్ జయసింహాకు ఆదేశపత్రాలను అందించేవరకూ ప్రతి క్షణం మీడియాలో వెంకటేష్ పేరు మార్మోగింది.