అమ్మ కోసం పరుగులు
అన్నాడీఎంకే అధినేత్రి జయలలితను కలుసుకునేందుకు పలువురు మంత్రులు బెంగళూరుకు పరుగులు తీశారు. వారికి అనుమతి నిరాకరించడడంతో నిరాశతో వెనుదిరగాల్సి వచ్చింది. జయలలితకు బెయిల్ రావాలని వేడుకుంటూ కావళ్లు, పాల బిందెలతో కార్యకర్తలు ఆలయాల్లో పూజలు నిర్వహించారు. తిరుపతికి కొందరు పాదయాత్రగా బయలుదేరారు.
సాక్షి, చెన్నై:అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత బెంగళూరు పరప్పన అగ్రహార జైలులో కారాగార వాసాన్ని అనుభవిస్తున్న విషయం తెలిసిందే. ఆమెను బెయిల్‌పై బయటకు తీసుకొచ్చేందుకు అన్నాడీఎంకే నాయకులు, రాష్ట్ర ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం నేతృత్వంలోని మంత్రులు, న్యాయవాదులు తీవ్రంగానే ప్రయత్నాలు చేస్తున్నారు. ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలు నిరసన బాట వీడి ఆలయూల బాట చేపట్టారు. దేవుళ్లను వేడుకుంటూ గుండు గీయించుకుని మొక్కులు తీర్చుకునే పనిలో పడ్డారు. ఆదివారం రాష్ట్రంలో పలుచోట్ల ఆలయాలు అన్నాడీఎంకే వర్గాలతో కిక్కిరిశాయి. సుబ్రమణ్యస్వామి ఆలయాలు, అమ్మవారి సన్నిధుల్లో ప్రత్యేక పూజలు చేశారు.
ఆడి మాసంలో జరిగే ఉత్సవాల్ని తలపించే రీతిలో కావళ్లతో, శూలాలను శరీరానికి గుచ్చుకుని, రథాలను లాగుతూ భక్తి శ్రద్ధలతో మొక్కులు తీర్చుకున్నారు. మదురైలో అన్నాడీఎంకే మహిళా కౌన్సిలర్లు భారీ ర్యాలీ చేపట్టారు. వందలాది మంది పాల బిందెలను నెత్తిన పెట్టుకుని అక్కడి సుబ్రమణ్యస్వామి ఆలయానికి ఊరేగింపుగా వచ్చారు. కార్యకర్తలు, నాయకులు కావళ్లు మోస్తూ, శరీరానికి శూలాలు గుచ్చుకుని ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్నారు. ఈ ఊరేగింపునకు మంత్రి సెల్లూరు కే రాజు, ఎంపీ గోపాలకృష్ణన్ తదితరులు నేతృత్వం వహించారు. చెన్నై శివారుల్లోని నీలాంక రై నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో హోమం చేశారు. ముట్టుకాడుకు చెందిన పలువురు అన్నాడీఎంకే నాయకులు, కార్యకర్తలు తిరుపతికి పాదయాత్రగా బయలుదేరారు.
బిజీబిజీగా మంత్రులు: రాష్ట్రంలో పాలన గాడి తప్పడంతో మంత్రులందరూ సచివాలయంలో అందుబాటులో ఉండాలని సీఎం పన్నీరు సెల్వం ఆదేశాలు ఇచ్చారు. దీంతో మంగళవారం నుంచి మంత్రులు సమీక్షల్లో బిజీ బిజీగా గడుపుతున్నారు. శనివారం వరకు ప్రభుత్వ కార్యాక్రమాల్లో నిమగ్నమైన మంత్రులు ఆదివారం సెలవు దినం కావడంతో బెంగళూరుకు చెక్కేశారు. మంత్రి వలర్మతి, పళనియప్పన్ తదితరులు ఇందులో ఉన్నారు. వీరితో పాటు మరో ఐదు వందల మంది పార్టీ నాయకులు ఉదయాన్నే పరప్పన అగ్రహార జైలు వద్దకు చేరుకుని పడిగాపులు కాశారు. ఆదివారం సెలవు దినమైనా తమకు అనుమతి లభిస్తుందని ఆశతో గంటల తరబడి ఎదురు చూసిన మంత్రులు చివరకు నిరాశతో చెన్నైకు తిరుగు పయనం కావాల్సి వచ్చింది.