‘స్వామి’ దయ
చెన్నై, సాక్షి ప్రతినిధి:అన్నాడీఎంకే అధినేత్రి జయలలితకు బెయిల్ అంశం అంతా ‘స్వామి’ దయగా తయారైంది. తన వాదన వినకుండాజయకు బెయిల్ మంజూరు చేయరాదంటూ భారతీయ జనతా పార్టీ నేత సుబ్రమణ్యస్వామి ఈ నెల 15వ తేదీన సుప్రీం కోర్టులో పిటిషన్ వేసి సంచలనం సృష్టించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయకు జైలు శిక్షపడి 20 రోజులవుతోంది. వీలైనంత త్వరలో బెయిల్‌పై బయటపడాలని జయ చేస్తున్న ప్రయత్నాలు విఫలమయ్యూయి. జయకు బెయిల్ మంజూరుకు బెంగళూరు కోర్టు తిరస్కరించడంతో సుప్రీం కోర్టులో దాఖలు చేశారు. అత్యవసర కేసుగా పరిగణించి విచారించాలని జయ చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి. తన వయసు, అనారోగ్య కారణాలను దృష్టిలో ఉంచుకుని బెయిల్ ఇవ్వాలని ఆమె తరపు న్యాయవాదులు కోరారు.
ఆస్తుల కేసులో అమ్మతోపాటూ జైలు శిక్ష పడిన శశికళ, ఇళవరసి, సుధాకరన్‌కు బెయిల్ మంజూరు చేయాలని సుప్రీం కోర్టును కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను జాబితాలో చేర్చారు. ఈ పిటిషన్ ఈనెల 14న విచారణకు వస్తుందని ఆశించి భంగపడ్డారు. కక్షిదారులు కోరుతున్నట్లుగా బెయిల్ మంజూరు పిటిషన్‌ను అత్యవసర కేసుగా పరిగణించేందుకు సరైన కారణాలు లేవని కోర్టు వ్యాఖ్యానించి 17 వ తేదీన విచారణకు ఆదేశించింది. అంటే నేడు సుప్రీం కోర్టులో విచారణ జరగనుంది. ఈనెల 18 వ తేదీ నుంచి 26వ తేదీ వరకు కోర్టుకు దీపావళి సెలవులు ప్రకటించారు. బెయిల్ మంజూరు కాకుంటే మరో వారం రోజులు బెయిల్ కోసం ఎదురుచూస్తూ జయ జైల్లోనే మగ్గాల్సి ఉంటుంది. జయ జైలుపాలు కాగానే రాష్ట్రంలో విధ్వంసాలకు పాల్పడిన అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ చట్టపంచాయత్ సమాఖ్య మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. చెన్నై ఎగ్మూరు కోర్టులో విచారణలో ఉన్న ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు కేసు నవంబరు 6వ తేదీకి వాయిదా పడింది.
స్వామి ప్రతీకారం
జయ బెయిల్ పిటిషన్ విచారించే క్రమంలో తన వాదన వినకుండా మంజూరు చేయరాదని సుబ్రమణ్య స్వామి ఈనెల 15వ తేదీన సుప్రీం కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేశారు. ముఖ్యమంత్రి పదవిని అడ్డంపెట్టుకుని జయ అక్రమ ఆస్తులు సంపాదించారని ఏసీబీకి ఫిర్యాదు చేయడం, ఈ కేసులో జయకు జైలు శిక్షపడటానికి స్వామే కారణమన్న సంగతి తెలిసిందే. తనపై కేసు పెట్టాడన్న ఆక్రోశంతో ప్రతీకారంతో సీఎం హోదాలో జయసైతం స్వామిపై రెండు నెలల క్రితమే వరుసగా మూడు పరువు నష్టం దావాలను వేశారు. ఆ తరువాత జైలుకెళ్లారు. ఇప్పుడు స్వామిది పైచేయిగా మారింది. స్వామి సైతం ప్రతీకారంగా జయ బెయిల్‌ను అడ్డుకుంటారని అన్నాడీఎంకే నేతలు భయపడుతున్నారు.
జయకు బెయిల్ మంజూరు చేసే ముందు రాష్ట్రంలో నెలకొన్న శాంతి భద్రతల సమస్యలను పరిశీలించాలని తాను కోర్టును కోరనున్నట్లు స్వామి ఒక ప్రకటనను గురువారం వెబ్‌సైట్‌లో పెట్టారు. అంతేగాక ఇప్పుడు అత్యవసరంగా జయకు బెయిల్ మంజూరు చేయాల్సిన అవసరం ఏమిటని కూడా తాను కోర్టును ప్రశ్నించనున్నట్లు ఆయన అన్నారు. చెన్నైకి వస్తే చంపేస్తామంటూ తనకు అన్నాడీఎంకే శ్రేణుల నుంచి బెదిరింపులు వచ్చాయని, అయినా ఇటీవల చెన్నై వెళ్లి వచ్చినట్లు కోర్టుకు చెప్పబోతున్నట్లు ఆయన తెలిపారు. మరో వైపు జయకు బెయిల్ మంజూరు కావాలని కోరుతూ మంత్రి టీకేఎమ్ చిన్నయ్య తదితరులు గత 20 రోజులుగా అనేక ఆలయాల్లో పూజలు నిర్వహిస్తూనే ఉన్నారు. పాలమలై బాలసుబ్రమణ్య స్వామి ఆలయంలో గురువారం బంగారు రథోత్సవం, గోదానాలు చేశారు.