జయలలితకు బెయిల్ నిరాకరణ
బెంగళూరు: తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు కర్ణాటక హైకోర్టులో చుక్కెదురైంది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయకు బెయిల్ మంజూరు చేసేందుకు కోర్టు నిరాకరించింది. కర్ణాటక హైకోర్టు ధర్మాసనం మంగళవారం మధ్యాహ్నం ఈ మేరకు నిర్ణయం వెలువరించింది. జయ తరపున ప్రముఖ న్యాయవాది రాం జెఠ్మలానీ వాదించారు.
కర్ణాటక హైకోర్టు ప్రాంగణంలో కాసేపు హై డ్రామా చోటు చేసుకుంది. తొలుత జయలలితకు బెయిల్ మంజూరైనట్టుగా వార్తలు వెలువడ్డాయి. తమిళ మీడియా అత్యుత్సాహం చూపడంతో నిజమేననుకుని జాతీయ మీడియా కూడా వార్తలు వెలువడ్డాయి. జయ మద్దతు దారులు సంబరాలు కూడా చేసుకున్నారు. అయితే న్యాయస్థానం జయకు బెయిల్ నిరాకరించడంతో కథ మారిపోయింది. జయలలితతో పాటు ఆమె మద్దతుదారులు తీవ్ర నిరాశకు గురయ్యారు.
జయలలిత అనారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని బెయిల్ మంజూరు చేయాలని అంతకుముందు రాం జెఠ్మలాని కోర్టుకు విన్నవించారు. ఆమె చట్టం, న్యాయాన్ని గౌరవించే వ్యక్తని చెప్పారు. జయలలిత దేశం వదలి పారిపోరని రాం జెఠ్మలాని కోర్టుకు తెలియజేశారు. అయితే సీబీఐ తరపు న్యాయవాది అభ్యంతర వ్యక్తం చేశారు. ఇరువురి వాదనలు విన్న అనంతరం న్యాయస్థానం బెయిల్ పిటీషన్ను కొట్టేసింది.
జయ మద్దతు దారులు పెద్ద ఎత్తున తరలిరావడంతో కోర్టు వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. కోర్టు ప్రాంగణంలో 144 సెక్షన్ విధించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో జయకు నాలుగేళ్ల జైలు శిక్ష, వంద కోట్ల జరిమానా విధించిన సంగతి తెలిసిందే.